బాబుకు.. పలకరింపే బంగారం!

169

పాతతరం నేతలకు మోదీ, వెంకయ్య, దత్తాత్రేయ ఫోన్లు
తెలంగాణ నేతలకు దత్తన్న ఎప్పటికప్పుడు పరామర్శలు
ఉభయకుశలోపరితో పెద్దల సంతోషం
చంద్రబాబుకు ఆ అలవాటేదీ?
పార్టీలో లోపిస్తున్న ఆత్మీయ వాతావరణం
తెలుగు తమ్ముళ్ల నిట్టూర్పు
                (మార్తి సుబ్రహ్మణ్యం)

కరోనా కల్లోల సమయంలో వృద్ధులంతా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నేతలు, వయసుమీదపడుతున్నప్పటికీ,  ఇప్పటితరం నేతలతో పోటీ పడుతూ ఇప్పటికీ పనిచేస్తున్న ఆనాటి తరం నేతలను.. అప్పటి సహచరులు ‘ఫోన్‌లో ఎలా ఉన్నావని’ పలకరిస్తే.. ఆ పిలుపు, ఆ అనుభూతి, ఆ ఆత్మీయత  మాటలకు అందదు. తమతో కలసి పనిచేసిన వారు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నా, గుర్తు పెట్టుకుని మరీ ఫోన్ చేసి, యోగక్షేమాలు విచారిస్తే పులకరించని వారెవరుండరు? ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇప్పుడు అదే చేస్తున్నారు. తమ తరం నేతలు, తమతో అనుబంధం పెంచుకున్న నాయకులు..కరోనా సమయంలో ఎలా ఉన్నారని, ఫోన్ చేసి మరీ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఒక్క… చంద్రబాబునాయుడు తప్ప!

దేశంలో ఇప్పుడున్న అతికొద్దిమంది సీనియర్ నాయకులలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒకరు. ఆయనతో కలసి పనిచేసిన వారిలో చాలామంది, ఇప్పటికే వివిధ కారణాలతో రాజకీయాల నుంచి వైదొలగారు. మరికొంతమంది ఉండీలేనట్లు ఉన్నారు. అయితే ఆయనకు స్నేహితులంటూ పెద్దగా ఉన్నట్లు లేరు. ఉన్నప్పటికీ, ఆ విషయాన్ని వారు ఎవరికైనా అంతర్గతంగా చెప్పడమే తప్ప, బాబు నా మిత్రుడని ఇప్పటి వరకూ చెప్పినవారెవరూ లేరు.

ప్రతి ఏటా జరిగే స్నేహితుల దినోత్సవ సందర్భంలో, అన్ని పత్రికలు రాజకీయ నాయకుల స్నేహాల గురించి రాస్తుంటాయి. అందులో ప్రతిసారీ వైఎస్ గురించి వ్యాసాలు తప్పనిసరిగా కనిపిస్తాయి. కానీ చంద్రబాబు స్నేహితులెవరన్నదీ ఇంతవరకూ ఎవరూ పంచుకోలేక పోవడం, ఏ పత్రికలోనూ రాకపోవడం ప్రస్తావనార్హం. అయితే బాబు మాత్రం, కొద్దినెలల క్రితం అసెంబ్లీలో ఓ సందర్భంలో..  ‘వైఎస్ నేను మంచి మిత్రులం’ అని మాత్రం చెప్పారు.


రెండు తెలుగురాష్ట్రాల్లో బాబుతో కలసి, ఆయన మంత్రివర్గంలో పనిచేసిన సీనియర్లు  చాలామంది ఉన్నారు. వారిలో ఇప్పుడు చాలామంది అనారోగ్యంతో ఇంటిపట్టునే ఉన్నారు.  కొడుకులకు వారసత్వ రాజకీయం అప్పగించి, విశ్రాంతి తీసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో కూడా బాబుతో కలసి చాలామంది పనిచేశారు. వారి వయసు ఇప్పుడు ఆరు నుంచి ఏడు పదుల పైమాటనే. వామపక్షాలు, జనతాదళ్ నేతలతో బాబుకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి.


అయితే.. మోదీ, వెంకయ్య, దత్తన్న తమ సహచరులు, అనుచరులకు ఫోన్లు చేసి, యోగక్షేమాలు అడిగిన నేపథ్యంలో.. తమ అధినేత చంద్రబాబునాయుడులో అలాంటి లక్షణాలు ఎందుకు కనిపించవని  తెలుగుతమ్ముళ్లు వాపోతున్నారు. తమ పార్టీకే చెందిన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేసి, ఆయన యోగక్షేమాలు విచారించారు. అలాంటిది తమ పార్టీ అధినేత ఆ విధంగా పరామర్శించకపోవడం తమ్ముళ్లు జీర్ణించుకోలేక పోతున్నారు. వెంకయ్య, పశ్చిమ గోదావరి జిల్లా గవరవరం గ్రామానికి చెందిన తన బాల్యమిత్రుడైన చింత ఉమ మహేశ్వరరావుకు ఫోన్ చేసి, ఆయన యోగక్షేమాలు అడిగితెలుసుకున్నారు. ఆయన వెంకయ్యతో కలసి ఆంధ్రా యూనివర్శిటీ, సంఘ్‌లో పనిచేశారు.

బండారు దత్తాత్రేయ సినీ నటి, బీజేపీ నేత కవిత సహా, హైదరాబాద్-తెలంగాణ నేతలకు ఫోన్లు చేసి, మనవాళ్లందరినీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా, సంఘ్‌లో తనతో పనిచేసిన సహచరులకు ఫోన్లు చేసి, వారి ఆరోగ్యం  గురించి వాకబు చేస్తున్న వైనాన్ని తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు. ఇటీవల తెలుగురాష్ట్రాలకు చెందిన ఇద్దరు నాయకులకు మోదీ ఫోన్లు చేశారు. అందులో మహరాజ్‌గంజ్ మాజీ ఎమ్మెల్యే గడ్డం రామస్వామి ఒకరు.  అందుకు వారంతా కృత్జజ్ఞతలు చెబుతుతున్నారు. ఈ సమయంలో తమను మర్చిపోకుండా, ఫోన్లు చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అలాంటి పని తమ నాయకుడు ఎందుకు చేయలేకపోతున్నారని, కనీసం అలాంటి ఆలోచన కూడా రాకపోవడంపై తెలుగుతమ్ముళ్లలో  ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. గతంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో ఉన్నప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్, ముందుగా వెళ్లి పరామర్శించిన విషయాన్ని తమ్ముళ్లు  గుర్తు చేస్తున్నారు. ఇలాంటివన్నీ మనుషులలో ఉన్న ఆత్మీయత, అనుబంధాన్ని గుర్తు చేస్తాయంటున్నారు.

ప్రతిరోజూ గంటలపాటు సమావేశాలు, టెలీ-వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించే చంద్రబాబునాయుడు.. పూర్వాశ్రమంలో తనతో కలసి పనిచేసిన సహచరులు-అనుచరులకు కాసేపు తీరిక చేసుకుని, యోగక్షేమాలు విచారించే సమయం లేకపోవడం ఏమిటని తమ్ముళ్లు వాపోతున్నారు. అసలు ఎన్టీఆర్ మృతి చెందిన తర్వాత పార్టీలో ఆత్మీయ వాతావరణం పోయిందని, అధినేతతో నేతలు, నేతలతో అధినేత మనసువిప్పి మాట్లాడుకునే రోజులు కూడా పోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు  పార్టీలో అధికారి-ఉద్యోగుల సంబంధం కొనసాగుతోందని.. ఎన్టీఆర్‌తో సుదీర్ఘకాలం పనిచేసిన, గోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు. బాబుగారూ.. మీకు అర్ధమవుతోందా….?