పత్రికాస్వేచ్ఛ దినోత్సవమట.. హ్హహ్హహ్హ!

931

‘ఎర్రన్న’ల మీడియాలోనే కనిపించని స్వేచ్ఛ
స్వేచ్ఛ జర్నలిస్టులకా? యాజమాన్యాలకా?
జర్నలిస్టు నేతల ‘జీహుజూరీతనం’తో హక్కులు హరీ
పాలకుల పల్లకీ సేవలో జర్నలిస్టు ‘ముసుగు’వీరులు
పత్రికాస్వేచ్ఛ నేతిబీర చందమే
(మార్తి సుబ్రహ్మణ్యం)

రాష్ట్రపతి నుంచి గవర్నర్ వరకూ అందరినోటా ఒకే మాట. పత్రికాస్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు! దేశంలో పత్రికాస్వేచ్ఛ మరింత పరిఢవిల్లాలన్న ఆకాంక్షలు!! మనుషులందరికీ పుట్టినరోజు ఒకటున్నట్లు, పత్రికలకూ స్వేచ్ఛ ఉందన్న విషయం, దానికీ ఓ ‘దినం’ ఉందన్న సృ్పహ, ఆ ప్రముఖుల సందేశాలు చూస్తే గానీ జర్నలిస్టులకు గుర్తుకురావడం లేదు. పైగా.. ఇప్పటికేదో దేశంలో పత్రికాస్వేచ్ఛ, దారం తెగిన పతంగిలా, పంజరం నుంచి బయటపడిన పావురం మాదిరిగా  స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు, అది ఇంకా పరిఢవిల్లాలన్న ఆకాంక్ష! ఇది మరీ అత్యాశ కదూ?!

పత్రికాస్వేచ్ఛ బాగా బతికున్న రోజుల్లో…

దేవతావస్త్రాల కథ తెలుసు కదా? లేనిది ఉన్నట్లుగా భ్రమించి, పిచ్చివాళ్లను చేసే ఆ కథ మాదిరిగానే ఉంటుంది మన దేశంలో పత్రికాస్వేచ్ఛ వ్యవహారం! దానికి కారణాలు అనేకం. జర్నలిజం, పత్రికాస్వేచ్ఛ బాగా బతికున్న రోజుల్లో.. ఒక గ్రామీణ విలేకరి, పట్టణాల్లో ఉండే కరస్పాండెంట్లకు ఎనలేని గౌరవం, విలువ ఉండేది. నిజాలను నిర్భయంగా రాసేవారు. ఇప్పటిమాదిరిగా ఆ సమాచారం మీకెలా వచ్చిందో చెప్పమని పోలీసులు అడిగేవారు కాదు. రాజకీయ నాయకులు వారిని మార్గదర్శకులుగా భావించేవారు. తమ మీద ఏదైనా ప్రతికూల వ్యాఖ్య చేస్తే కుమిలిపోయేవారు. కొందరయితే కొన్నిరోజులు సిగ్గుతో బయటకు వచ్చేవారు కాదు. అటు డెస్కుల్లో కూడా జర్నలిస్టులకు గౌరవం ఉండేది. ఇప్పటి మాదిరిగా కంట్రిబ్యూటర్లు కదా అన్న చిన్నచూపు ఉండేది కాదు.

జర్నలిస్టు కురువృద్ధుడైన ఏబీకే ప్రసాద్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. తమ సంస్థలో పనిచేసే జర్నలిస్టులు రాసే వార్తలకు బాధ్యత వహించేవారు. కోర్టు కేసులకూ భయపడేవారు కాదు. స్వయంగా కోర్టులకు హాజరయ్యేందుకు సిగ్గుపడేవారు కాదు. కానీ చాలామంది ఎడిటర్లు, యాజమాన్యాలు..తమ పత్రికల్లో వచ్చిన  ఏదైనా వార్త కోర్టు వరకూ వెళితే, ముందు ఆ వార్త రాసిన జర్నలిస్టును తొలగించే సంస్కృతి కూడా ఉంది.  దిద్దుబాటు కోసం ఎవరిమీదయితే వ్యతిరేకంగా రాశారో, అదే జర్నలిస్టును పంపి ఆయనకు బాకా ఊదుతూ వార్త రాయించి, వారితో కేసు ఉపసంహరించేసుకునే  సంస్కృతి కొనసాగుతోంది. కానీ మళ్లీ వారే పత్రికాస్వేచ్ఛ గురించి పెద్ద పెద్ద సంపాదకీయాలు రాస్తుండటం, మాట్లాడటం పెద్ద జోక్. ఆ రకంగా జర్నలిస్టుల గొంతు నులిమే సంస్కృతి సొంత సంస్థల నుంచే ఆరంభమయింది. మరి ప్రభుత్వాలు గొంతు నులమడంలో విచిత్రం ఏముంటుంది?

ప్చ్.. అవన్నీ ఆ పిచ్చిరోజుల్లో..

కాలంతోపాటు మీడియాలోనూ మార్పులు వచ్చిన తర్వాత.. రియల్టర్లు, పారిశ్రామికవేత్తలు మీడియా రంగంలో అడుగుపెట్టిన తర్వాతనే, జర్నలిజం రంగు-రుచి-వాసన మారిపోయింది. తమ ప్రయోజనాలు నెరవేరేందుకు జర్నలిజాన్ని, జర్నలిస్టులను వారికి తాకట్టు పెట్టే సంస్కృతికి తెరలేచింది. దానిని అడ్డుపెట్టుకుని రాజ్యసభ, లోక్‌సభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు సాధించేందుకు ఇది ఒక సాధనంగా మారింది. గతంలో నష్టాలు-కష్టాలు వచ్చినా, నమ్మిన సిద్ధాంతాలు, ప్రజాప్రయోజనాల కోసమే పత్రికలు నడిపిన పిచ్చిమారాజులుండేవారు.  ఇప్పుడు కష్టాలొచ్చినా-నష్టాలొచ్చినా ముందు జర్నలిస్టులకు జీతాలు నిలిపివేయడం, తర్వాత పత్రికలను మూసేసే మహారాజులను చూస్తున్నాం. దానికి.. తెల్లారిలేస్తే ప్రజాస్వామ్యం, పత్రికాస్వామ్యం, కార్మిక హక్కులంటూ గొంతు పగిలేలా నినదించే కమ్యూనిస్టులూ అతీతులు కాదు. ఇక మఖలో పుట్టి పుబ్బలో కలిసిన పత్రికలు బోలెడు. ఈకాలంలో దాని పక్కన చానెళ్లు కూడా చేరాయి.

 

అవసరం ఉన్నంతవరకే పత్రికలు..

తెలంగాణ ఉద్యమకాలంలో ఓ పత్రికను స్థాపించిన ఒక పెద్దాయనకు ఆశించిన రాజ్యసభ దక్కలేదు. కేసీఆర్ కూడా ఆ మేరకు హామీ ఇచ్చినా ఎందుకో నెరవేర్చలేదు. దానితో కేసీఆర్ సర్కారుపై తిరగబడితే, పత్రికపై ఉన్న యాజమాన్య హక్కులు వదులుకుని, కేసీఆర్ సంబంధీకులకు అప్పగించి వెళ్లారు. మరికొన్నాళ్ల తర్వాత మరొక పత్రికకు పురుడుపోశారు. ఇంకో జాతీయ పార్టీలో చేరినా అక్కడా వర్కవుట్ కాక, చివరకు ఆ పత్రికనూ మూసేశారు. తాను కాంట్రాక్టులు చేసే రాష్ట్రాల్లో పత్రికలు పెట్టి, అక్కడి అధికార పార్టీలను మెప్పిండచడం, కాంట్రాక్టులు అయిపోయి, మళ్లీ అవి రాదని తెలియగానే ఆ పత్రికలను మూసేయడం ఆ ఆసామికి వెన్నతోపెట్టిన విద్య. మధ్యలో ఆగమయ్యేది జర్నలిస్టులే!

ఎవరి దుకాణాలు వారివే!

గతంలో ప్రభుత్వాలు తమకు వ్యతిరేకంగా రాసినప్పటికీ, ప్రభుత్వాలు పత్రిలకు ప్రకటనలిచ్చేవి. రాను రాను ఆ పరిస్థితి మారి, భజన చేస్తేనే ప్రకటనలివ్వడం, గిట్టని వాటిని ప్రకటనలివ్వకుండా ఆర్ధికంగా దెబ్బతీసే ఫ్యాక్షన్ సంస్కృతి ప్రారంభమయింది. ఆ దశ కూడా దాటి.. పార్టీలు సొంతగా మీడి యా దుకాణాలు తెరవడం, తెలివైన పార్టీలేమో సొంతగా పెట్టకుండా.. ఉన్న వాటిని ప్రోత్సహించే నయా మీడియా నిర్వహణా విధానం ఆరంభమయి,  ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతోంది.

ఇది యాజమాన్య స్వేచ్ఛాయుగం!

ఇప్పుడు ప్రభుత్వాలిచ్చే ప్రకటనలతో, కోట్లాదిరూపాయలు సంపాదిస్తున్న యాజమాన్యాలు చెప్పిందే వేదం. జర్నలిస్టుకు స్వేచ్ఛ శూన్యం. ఓ పది పదిహేనేళ్ల నుంచి యాజమాన్యాలే, స్టోరీలు ఎలా రాయాలో హెడ్డింగులు కూడా చెబుతున్న వైచిత్రి. పోనీ, ప్రభుత్వ ప్రకటనలో కోట్ల రూపాయలు సంపాదిస్తున్న యాజమాన్యాలేమైనా, ఆ మేరకు జర్నలిస్టులకు జీతాలేమైనా పెంచుతున్నాయా అంటే లేదు. జీతాలు పెంచకపోయినా ఠంచనుగా జీతాలిస్తున్నాయా అంటే అదీ లేదు. ఇక పీఎఫ్, ఈఎస్‌ఐ సంగతి సరే. అవి కోరుకోవడం అత్యాశ కిందే లెక్క!  చాలా ఏళ్ల క్రితం ఉద్దండులతో ప్రారంభమైన హైదరాబాద్ ట్యాంక్‌బండ్ సమీపంలోని ఓ మార్వాడీ పత్రికలో, జీతాలిచ్చి చాలాకాలమవుతోంది. మరి ఆయన వైఎస్ జీవించి ఉండగా, చాలాచోట్ల ప్రభుత్వ స్థలాలు పొందారు. ఇక సికింద్రాబాద్ కేంద్రంగా కొన్ని దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఓ తెలుగు-ఇంగ్లీషు పత్రికలలో, జీతాలిచ్చి దాదాపు ఆరేడు నెలలవుతోంది. ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసిన పీఎఫ్‌లకే ఇంతవరకూ దిక్కులేదు.

‘ఎర్రన్న’ల పత్రికల్లోనూ పెట్టుబడిదారీ విధానమే

శకునాలు చెప్పే కుడితిలో పడినట్లు.. పొద్దున లేస్తే,  కార్మికుల హక్కులంటూ తెగ హడావిడి చేసే కమ్యూనిస్టు పార్టీలకు చెందిన ప్రజాశక్తి-విశాలాంధ్ర పత్రికలలో,  ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించేశారట. దానికి సంబంధించి ‘ఎర్రన్న’లు చెప్పే మాటలు నేతిబీరచందమేనంటూ, ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్టు, కమ్యూనిస్టుల అసలు రంగును బట్టబయలు చేసింది. అంతకుముందు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజల నుంచి షేర్ల రూపంలో సేకరించి ప్రారంభించిన చానెల్‌ను అమ్మేసుకున్నారు. కానీ షేర్లు కొన్న వారి సం‘గేతేమిటో’ తెలియదు. ఇక తెలంగాణలో ఓ విప్లవ జర్నలిస్టు నేత నడిపే పత్రికలో పనిచేసే వారిని, ఇక రావద్దని చెప్పేశారట. మిగిలిన పత్రికల్లో జర్నలిస్టులు, జీతాలు తీసుకుని నాలుగునెలలయిపోయిందట. ఇక కంట్రిబ్యూటర్ల సంగతి సరేసరి!

సాక్షి రూటే వేరు…

ఏపీలో అధికారంలో ఉన్న సాక్షి యాజమాన్యం, తన సంస్థలో లక్షలు తీసుకునే పెద్దతలకాయలను వ దిలించుకుని, వారికి ప్రభుత్వ పదవులిచ్చి పోషిస్తోంది. మాజీ ఎడిటర్లు, ఎడిటర్ల తమ్ముళ్లు, చర్చలు జరిపే యాంకర్లు, పులివెందులతో బాదరాయణ సంబంధాలున్న జర్నలిస్టులకు ఎంచక్కా సంస్థ డబ్బులివ్వకుండా సర్కారు ఖజానా నుంచి జీతాలు చెల్లించే తెలివికి తెరలేపింది. ఏపీలో ప్రభుత్వ ప్రకటనల్లో సింహభాగం ఇప్పుడు సాక్షికే ఇస్తున్నారు. అంటే అంతకుముందు ఆంధ్రజ్యోతి స్థానం భర్తీ చేసిందన్న మాట! ఇంత కరోనా కల్లోలంలోనూ, ఒక్కో శాఖ తన విజయాల పేరిట ఒక్క సాక్షి పత్రికకే ప్రకటనలివ్వడం విశేషం. ఈవిధంగా ఆర్ధికంగా ఏమాత్రం ఇబ్బందిలేని ‘సాక్షి’ కూడా, సిబ్బందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. స్టాఫ్ రిపోర్టర్ల సంఖ్యను వీలయినంత కుదించాలన్నది మరో ప్రయత్నమట. మొత్తంగా ఇకపై పత్రికలు అతి తక్కువమందితో నడిచేందుకు రంగం సిద్ధమవుతోంది. జిల్లా టాబ్లాయిడ్లు కూడా ఎత్తివేయడం ద్వారా, సబ్‌ఎడిటర్ల ఖర్చు తగ్గించుకోనున్నాయి. ఇక నియోజకవర్గానికో కంట్రిబ్యూటర్ ఉంటాడో, ఆ వ్యవస్థను కూడా ఎత్తేస్తారో చూడాలి. ఇప్పటికే టాబ్లాయిడ్లు ఎత్తేశారు.

చితికిపోయిన చిన్న పత్రికలు

ఇక తెలుగు రాష్ట్రాల పాలకులకు దిశానిర్దేశం చేసే ఈనాడు-ఆంధ్రజ్యోతి పత్రికలో ఏం జరుగుతోందన్నది సోషల్ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఆ రెండు సంస్థలు సిబ్బందిని తగ్గించేస్తున్నాయట. మిగిలిన చిన్నా చితకా పత్రికలంటే, వాటికి ప్రకటనలు పెద్దగా రావు. కంట్రిబ్యూటర్లు తెచ్చే ప్రైవేటు ప్రకటనలే ఆధారం కాబట్టి, చిన్న పత్రికలు జీతాలివ్వడం లేదంటే అర్ధం చేసుకోవచ్చు.  రెండు తెలుగు ప్రభుత్వాలు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయాయి. సమాచార శాఖకు పెద్దగా బడ్జెట్‌కూడా లేదు. కాబట్టి ప్రభుత్వాల నుంచి ప్రకటనలు ఆశించడం అత్యాశే! పైగా ఏపీలో రూపొందించిన సవాలక్ష నిబంధనలతో,  చిన్న పత్రికల గొంతు నొక్కింది. దానితో  ఇక అక్కడ దాని బతుకు దుర్లభం. పత్రికలు అమ్మేసుకుందామన్న కొనేవాడు దొరకని దుస్థితి.

ఈనాడు-ఆంధ్రజ్యోతి కూడానా?


కానీ ఈనాడు-ఆంధ్రజ్యోతి సంస్థలు కూడా వారిని అనుసరించడమే విచిత్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ సీఎం కాకముందు వరకూ ఆ రెండు పత్రికలు, ప్రభుత్వ ప్రకటనలతో ఆర్ధికంగా బాగానే బలపడ్డాయి. గత ఐదేళ్లు, అంతకుముందు బాబు పాలనలో అయితే సమాచారశాఖ బడ్జెట్‌లో సింహభాగం ఆ రెండు పత్రికలదే. అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల నుంచి సీఎం కార్యక్రమాల లైవ్‌టెలికాస్టునూ హక్కుభుక్తం చేసుకున్నాయి. అసలు బాబు జమానాలో, ఏబీఎన్ సంస్థ సమాచారశాఖ డబ్బులతోనే నడిచిందన్న వ్యాఖ్యలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అంతకుముందు సమైక్యరాష్ట్రంలో అలాంటి అవకాశం ఈటీవీకి దక్కింది. అలాంటి బలమైన ఆర్ధిక సంస్థలు కూడా జర్నలిస్టులపై ఉచ్చు బిగించేందుకు సిద్ధమవుతుండటం ఆశ్చర్యం.

జర్నలిస్టు వీరవిప్లవ యోధులెక్కడ?

సరే.. యాజమాన్యాల ధోరణి లాభనష్టాలకు అనుగుణంగానే ఉంటుందనుకున్నాం. మరి జర్నలిస్టుల ఈతిబాధలపై గళమెత్తాల్సిన జర్నలిస్టు సంఘాలు, ఆ సంఘాల వీరవిప్లవ నేతాశ్రీలు ఏం చేస్తున్నారన్నది ప్రశ్న. నెలల తరబడి జీతాలివ్వని సంస్థలు, ఈఎస్‌ఐ, పీఎఫ్ ఎగ్గొడుతున్న యాజమాన్యాలపై పోరాటాన్ని అటకెక్కించి.. ప్రభుత్వాలపై పోరాడటం ఎందుకో ఎవరికీ అర్ధం కాదు. యాజమాన్యాల నుంచి కనీస హక్కులు కల్పించలేని సంఘాలకు, ప్రభుత్వాల నుంచి అవి కావాలి. ఇవి కావాలని డిమాండ్ చేసే నైతిక హక్కు ఎక్కడిది? సొంత సంస్థలనే నిలదీయలేని సంఘాలకు, ప్రభుత్వాలను డిమాండ్ చేసే హక్కు ఉందా? జర్నలిస్టు సంఘాల నేతలుగా చెలామణి అవుతున్న ఆసాములంతా, పాలకుల పల్లకీలెత్తే బోయీల అవతారమెత్తుతుండటమే అసలు సమస్య. తొండముదిరి ఊసరివెల్లి అయినట్లు, ఈమధ్య కాలంలో జర్నలిస్టు సంఘాల నేతలు ప్రభుత్వ పదవుల్లో చేరి, భట్రాజులు కూడా ఈర్ష్యపడేలా వ్యవహరిస్తుండటం మరో ఆసక్తికర పరిణామం. కాబట్టి ఇన్ని ఈతిబాధలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు స్వేచ్ఛా శుభాకాంక్షలు చెప్పడం వెటకారం కదూ?!ఇది కూడా చదవండి: అడిగితే.. అరెస్టేనా?