కమిషనర్లపై వేటు సరే.. కలెక్టర్ల మాటేమిటి?

468

(మార్తి సుబ్రహ్మణ్యం)

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో విఫలమయినందుకు ఎలాంటి అధికారాలు లేని, మునిిసిపల్ కమిషనర్లపై బదిలీ వేటు వేస్తున్న ఏపీ సర్కారు.. సంపూర్ణ అధికారాలున్న కలెక్టర్లపై మాత్రం కరుణ చూపడం విమర్శల గురవుతోంది. ఇటీవల కర్నూలు, నర్సరావుపేట మునిసిపల్ కమిషనర్లను బదిలీ చేసిన వైనం చూస్తే, ప్రభుత్వం తనకు కావలసిన కలెక్టర్లను కాపాడుతోందన్న అనుమానాలకు తావిస్తోంది.

విజయవాడ, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా చెలరేగుతోంది. అవి ప్రస్తుతం రెడ్‌జోన్లలో ఉన్నాయి. గుంటూరు జిల్లాలో గుంటూరు కార్పొరేషన్, నర్సరావుపేట పట్టణం, కృష్ణా జిల్లాలో విజయవాడ నగరం, కర్నూలు జిల్లాలో కర్నూలు నగరంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. కర్నూలు ఎంపీ కుటుంబానికే పాజిటివ్ లక్షణాలు బయటపడగా, అధికారపార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే, గుంటూరు, బెజవాడ నగర పాలక సంస్థ క మిషనర్ జోలికి వెళ్లని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. నరసరావుపేట, కర్నూలు కమిషనర్లపై మాత్రం బదిలీ వేటు వేయడం విస్మయపరిచింది. ఇంతకుముందు ప్రభుత్వానికి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు నగరి కమిషనర్‌పై వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ విధంగా ఇప్పటివరకూ, కరోనా సమయంలో సేవలందిస్తున్న మునిసిపల్  కమిషనర్లను బదిలీ చేసింది.

నిజానికి పట్టణాల్లోని మునిసిపల్ కమిషనర్లకు ఉండే అధికారులు, స్వేచ్ఛ, పరిమితి అతి తక్కువ. అక్కడ అంతా అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిందే చెల్లుబాటవుతుంది. సున్నాలు కొనే కాంట్రాక్టు కూడా ఎమ్మెల్యే చెప్పిన వారికి ఇవ్వాల్సిందే. కరోనా వల్ల లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచీ, రాష్ట్రంలోని ఏ ఒక్క మునిసిపల్ కమిషనర్ ఖాళీగా లేరు. శానిటైజేషన్‌పై అంతా సీరియస్‌గా దృష్టి సారిస్తూనే ఉన్నారు. పట్టణాల్లో ఉండే ప్రభుత్వ ఆసుపత్రులపై, కమినషర్ల పాత్ర శూన్యం. కరోనా తర్వాత అన్ని పట్టణాల్లో హోటళ్లు మూసివేశారు. అన్ని వార్డుల్లో స్ప్రే కొడుతూనే ఉన్నారు. నిజానికి రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు నిధులు లేక అల్లాడుతున్నాయి. కమిషనర్లు తమ స్థాయిలో, ఇంతకు మించి చేసేదేమీ ఉండదు.  పాతపనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో, కొత్త పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అయినా కాంట్రాక్టర్లను బ్రతిమిలాడుకుని, కమిషనర్లే ఏదో ఒక విధంగా పనులు చేయించుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో, నియోజకవర్గ స్థాయిలో జరిగే ఉన్నతస్ధాయి సమావేశాలకు కమిషనర్లు హాజరవుతూనే ఉన్నారు. అయినా ఇలాంటి  క్లిష్ట సమయంలో మునిసిపల్ కమిషనర్లపై వైఫల్యం ముద్ర వేసి బదిలీ చేయడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది.

అయితే.. నర్సరావుపేటలో కరోనాను అరికట్టడంలో విఫలమయిన అదే అధికారి, కావలి మునిసిపాలిటీలో దానిని ఎలా అరికడతారని ప్రభుత్వం ఏవిధంగా భావించిందో అర్ధం కాని ప్రశ్న. కర్నూలులో కమిషనర్‌ను బదిలీ చేసి, సమర్ధుడైన ఐఏఎస్‌ను ఆ స్ధానంలో నియమించామని ప్రభుత్వం చెప్పింది. మరి ఐఏఎస్ వచ్చిన తర్వాత కూడా కరోనా కేసులు తగ్గకపోగా, పెరుగుతూనే ఉండటం ప్రస్తావనార్హం. తాజాగా కోడుమూరులో పెరిగిన కేసులే దానికి నిదర్శనం. గుంటూరు నగరంలో కరోనా అంతకంతకూ పెరుగుతున్నా, కమిషనర్‌పై మాత్రం ఎలాంటి చర్య తీసుకోలేదు. విజయవాడలో కరోనా కేసులు పెరుగుతున్నాయని స్వయంగా కలెక్టరే వెల్లడించారు. మరి ఆయనపై ఎలాంటి చర్యలు లేవు. అధికారులను మారిస్తే, కేసులు తగ్గుతాయనుకోవడం అవివేకమే అవుతుంది.

అసలు సర్వాధికాలున్న జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్‌లున్న నగర పాలక సంస్థ కమిషనర్ల జోలికివెళ్లకుండా, కిందిస్ధాయి అధికారులపై వేటు వేయడం అధికారవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. నిధుల కేటాయింపు, నిర్వహణాధికారం సంపూర్ణంగా ఉన్న జిల్లా కలెక్టర్లను మాటమాత్రం మందలించకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాజధాని దృష్ట్యా కృష్ణా, గుంటూరు జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించ కుండా.. రిటైరయ్యేవారిని, అధికార కేంద్రానికి దగ్గరగా ఉన్న వారిని నియమించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒకవేళ అలాంటి నియామకాలు పాత ప్రభుత్వం చేసినా, దానిని సరిదిద్దాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వానిదేనంటున్నారు.