అడిగితే.. అరెస్టేనా?

421

ఎట్టకేలకు తెరపైకొచ్చిన టీవీ5 మూర్తి
మరికొందరిపై కేసుల పుకార్లు
బాబుకు చేతకానిది జగన్ చేస్తున్నారు
ఏపీలో పత్రికాస్వేచ్ఛకు కత్తెర
మూర్తికి అమిత్‌షా అండ?
                 (మార్తి సుబ్రహ్మణ్యం)

అతి సర్వత్రా వర్జయేత్.. మన పెద్దలు బహుశా దీనిని,  ఏపీలో ఇప్పుడు జరుగుతున్న అరాచకాలను ముందుగానే ఊహించి చెప్పి ఉంటారు! సర్కారు వైఫల్యాలు, అవినీతిని ప్రశ్నించిన కలాల గళాలకు సంకెళ్లు వేయడం ద్వారా, మిగిలిన వారిని భయపెట్టే పాలకుల మైండ్‌గేమ్‌తో జర్నలిస్టులు భయపడతారనుకోవడం భ్రమ. ప్రభుత్వాలు కేసులు మాత్రమే పెట్టగలవు. కానీ అందులో నిజం ఉందా అని తేల్చేది కోర్టులే! ఇది కూడా చదవండి… ప్రశ్నిస్తే.. మీడియా గొంతు నొక్కుతారా?

మూర్తి అరెస్టుపై ఎందుకీ హడావిడి?

టీవీ5 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దేవగుప్తాపు సత్యనారాయణ మూర్తి.. అదేనండీ.. ‘టీవీ5 మూరి’్తని అరెస్టు చేసేందుకు, ఏపీ సీఐడి పోలీసులు హైదరాబాద్ వస్తున్నారన్న వార్త, రెండురోజుల పాటు హల్‌చల్ చేసింది. అయితే, దానికి సంబంధించి అరెస్ట్ వారంట్లన్నీ గుంటూరు జిల్లా నర్సరావుపేటలో పుట్టాయన్నది వినిపించిన మరొక వార్త. ఇక నిమ్మగడ్డ రమేష్ కేంద్రానికి రాసిన లేఖ, టీవీ5కి ఎలా చేరిందో పోలీసులు ఆరా తీస్తున్నారన్నది ఇంకో వార్త. కరోనా కేసులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసారం చేస్తుందన్నది అతనిపై  అభియోగమట. ఆరోగ్య శాఖ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూర్తిని, మరో ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేసేందుకు.. రంగం సిద్ధమయిందన్న మరో  వార్త వైరల్ అవుతోంది. దానికి తగినట్లే మూర్తి రెండురోజుల నుంచి మాయం కావడం, మైరా టీవీ అధినేత ఆచూకీ కోసం వెతుకులాట జరుగుతోంది. అందులో భాగంగా..  వారి బంధువులు, డ్రైవర్లు మాయం కావడం, దానిపై చంద్రబాబు నాయుడు స్పందించి, పోలీసులే వారిని కిడ్నాప్ చేశారని ఆరోపించడం చూస్తే నిప్పు లేనిదే పొగ రాదనిపిస్తుంది.

‘మూర్తీ’భవించిన జర్నలిస్టుపై..

మూర్తి రెండు దశాబ్దాల నుంచీ జర్నలిజంలో ఉన్నాడు. ఈనాడు జర్నలిజం స్కూలు విద్యార్ధి కాకముందు నుంచే, ఏదైనా అంశం మీద అవగాహన-పరిశోధన- విషయ పరిజ్ఞానం దండిగా ఉన్న కుర్రాడు. మూర్తి సోదరుడు  సాంబశివరావు-నేను 28 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లోనే కలసి పనిచేశాం. ఆ సమయంలోనే  సత్తిబాబు అనే మూర్తి, ఈనాడు జర్నలిజం స్కూలుకోసం హైదరాబాద్ వచ్చాడు. తర్వాత ఈటీవీలో చేరినప్పటి నుంచీ ఇప్పటి టీవీ5 వరకూ..  అతని మీద చాలామంది జర్నలిస్టులపై వచ్చే ‘ఎర్నలిసు’్ట అనే ముద్ర లేదంటే, మూర్తి ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. మూర్తితోపాటు జర్నలిజం లోకి వ చ్చిన చాలామంది జర్నలిస్టులు, టీవీ చానెళ్లలో పెట్టుబడి పెట్టేస్థాయికి, సొంత పత్రికలు పెట్టుకునేంత స్థితికి ఎదిగారు.  మూర్తి మాత్రం.. తనకు స్వేచ్ఛ ఉన్న చానెళ్ల కోసం అన్వేషణలోనే ఉండటం బట్టి, అతని తత్వమేమిటన్నది అర్ధమవుతుంది.

ఏ జర్నలిస్టుకయినా తప్పదు..

ఏ జర్నలిస్టయినా యాజమాన్య విధానాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందే. లేకపోతే తన దారి తాను చూసుకోక తప్పదు. వృత్తిపరమైన సంతృప్తి-స్వేచ్ఛ దక్కనప్పుడు ఏ జర్నలిస్టయినా, మరొక చోటకు వెళతాడు. ఇప్పటివరకూ మూర్తి చేసింది కూడా అదే. కాకపోతే ఈ సోషల్‌మీడియా యుగంలో.. తమకు తాము ప్రచారం చేసుకోవడం, ఒక సొంత ఇమేజ్ కోరుకోవడం, సెల్ఫ్ ప్రమోషన్,  ఇప్పటి జర్నలిస్టులు సృష్టించుకుంటున్న కొత్త ట్రెండ్. దానికి మూర్తి సహా ఎవరూ అతీతులు కాదు. ఎవరేమనుకున్నా.. ఇప్పుడున్న టీవీ జర్నలిస్టులలో డొక్క శుద్ధి, విషయజ్ఞానం, రాజకీయ పరిజ్ఞానంతోపాటు లౌక్యనీతి ఉన్న, అతి తక్కువమందిలో మూర్తి ఒకడన్నది నిర్వివాదం.

సరకు లేని టీవీ జర్నలిస్టులంటే మిన్న..

చర్చావేదిక నిర్వహించే చాలామంది టీవీ జర్నలిస్టుల దగ్గర సరుకు లేకపోయినా..  ఎదుటివారిపై నోరుపారేసుకోవడం, తమ చానెల్ పాలిసీ ప్రకారం వారిని అడ్డుకోవడం, చర్చకు వచ్చిన వ్యక్తులను ‘నువ్వు’ ‘నీ నుంచి’ ‘నీ పార్టీ’ అని ఏకవచనంతో పిలిచే జర్నలిస్టులను చూస్తున్నాం. మొన్నామధ్య వైద్యులకు, సర్కారు కిట్లు ఇవ్వడం లేదని ఆరోపించిన ఒక డాక్టర్‌ను చర్చకు పిలిచిన ఓ జర్నలిస్టు, ఆయనను పూర్తిగా ఏకవచనంతోనే పిలవ డం చూశాం. మూర్తి మాత్రం, తన వద్ద ఆధారాలు పెట్టుకునే చర్చించే పద్ధతి చూస్తున్నాం. ఇటీవల ఏపీ సర్కారు కిట్ల కొనుగోలుపై, అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణ సంచలనం సృష్టించింది. దానిపై చర్చించిన మూర్తి, తన వద్ద ఉన్న ఆధారాలు ప్రదర్శించిన మాట విస్మరించలేం.  అమరావతి నుంచి రాజధాని తరలింపు, కరోనా లెక్కలు, తన మీడియా సంస్థపై అధికారపార్టీ నేతల దాడిని తిప్పికొట్టే క్రమంలో.. ఎదురుదాడి చేయడం ద్వారా మూర్తి తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్నాడు.

మూర్తి చేసిన తప్పేమిటి?

సరే.. ఇంత కూ మూర్తిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అతగాడు చేసిన అంత ఘోరమైన నేరమేమిటి? కొంపదీసి ఏదైనా హత్య, లూటీలేమైనా చేశాడా? మావోయిస్టులు, ఐఎస్‌ఐ ఉగ్రవాదులకు మంత్రి వెంకటరమణ భాషలో చెప్పాలంటే స్లీపర్‌సెల్‌గా పనిచేస్తున్నాడా? లేకపోతే అదేదో సినిమాలో కృష్ణంరాజు మాదిరిగా ముందే హత్య చేసి, ఆ వార్తను అందరికంటే ముందు తానే చూపించాడా? అని  అనుకుంటే అదేమీ కాదట! ఆంధ్రా సర్కారు తీసుకునే నిర్ణయాలు, కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం, త దితరాల గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తూ, జగనన్న సర్కారును భ్రష్ఠుపట్టిస్తున్నాడట. ముఖ్యంగా కరోనా కట్టడిలో జరుగుతున్న వైఫల్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు.. ఆరోగ్యశాఖ ముఖ్య అధికారి పోలీసు శాఖకు ఫిర్యాదు చేస్తే, దానిని సీఐడీకి ఇచ్చారన్నది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. దానిని అటు పోలీసులు కూడా ఇప్పటివరకూ ఖండించలేదంటే, మౌనం పూర్ణాంగీకారమే.

సర్కారుకు జర్నలిస్టులు సాగిలపడాలా?

మూర్తి కాదు. మరో ఆర్తి, ఇంకో కీర్తి అనుకోండి. ఏం? ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పకూడదా? కలం గర్జించకూడదా? పాలకులకు నిరంతర భజన సేవాకార్యక్రమాలు చేసే సొంత మీడియా మాదిరిగానే, మిగిలిన మీడియా సంస్థలు కూడా ఆ భజన సేవాస్రవంతితో సహజీవనం చేసి, గళం కలపాలా? ఆ భజన బృందంలో చేరి అరమోడ్పుకన్నులతో, ‘ప్రభు’భక్తి గీతాలు ఆలపించాలా? అలా చేయకపోతే, వారికి ముద్రలు వేసి జైళ్లకు పంపుతారా? సీఐడీని ఎగదోస్తారా? మరి ఇదే పాలకుల సొంత మీడియా సంస్థ గత పదేళ్ల నుంచీ.. సోనియాగాంధీ- చంద్రబాబునాయుడు- కిరణ్‌కుమార్‌రెడ్డి- కేసీఆర్‌పై అవిశ్రాంతంగా నిప్పుల వర్షమే కురిపించింది కదా? వైఎస్ జీవించినప్పుడు కేసీఆర్-ఆయన పార్టీపై విరుచుకుపడలేదా?  వైసీపీ మీడియా సంస్థ కార్యాలయంపై  ఈడీ దాడి చేస్తే, పత్రికాస్వామ్యం మైలపడి, మంటకలిసిపోయినట్లు ‘ఆస్థాన జర్నలిస్టు నాయకుడి’ ఆధ్వర్యంలో రోడ్డెక్కి,  కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు కదా? ఐదేళ్ల బాబు సర్కారు, అంతకుముందు సమైక్యరాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఇదే వైసీపీ సొంత మీడియా ఒంటికాలితో లేచి, ఇష్టానుసారం కలం నిప్పులు కక్కింది కదా? మైకుల గళాలు గర్జించాయి కదా? ఇవన్నీ మర్చిపోతే ఎలా స్వామీ?

బాబుకు చేతకాలేదు పాపం..

మరి అప్పటి పాలకులు, ఇప్పటి ప్రభువుల మాదిరిగా.. కేసులు, గట్రాల హడవిడి చేయలేదే? పదేళ్ల పాటు ఇప్పటి పాలకపక్ష సోషల్‌మీడియా.. చంద్రబాబు-లోకేష్-పవన్‌కల్యాణ్‌ను గబ్బు పట్టించినప్పుడు, నాటి సర్కారు కూడా, ఇలాగే కేసుల కొరడా ఝళిపించలేదే? అంటే చంద్రబాబునాయుడుకు చేతకానిది, చేయలేనిది జగనన్నకు చేతనయిందన్న మాట! బాబు భయస్తుడు, పిరికివాడు కాబట్టి.. జర్నలిస్టులు, సోషల్ మీడియా జోలికి పోలేదు. జగనన్న మొనగాడు కాబట్టి,  ఏదైనా అనుకున్నది చేసేస్తారు కాబట్టి ఆ పనిచేస్తున్నాడు. అంతే కదా? అదే కదా బుద్ధిజీవులు అర్ధం చేసుకోవలసింది?!

ఏపీలో జరుగుతోంది ఇదే ..


కరోనా కేంద్రంగా  ఆంధ్రాలో అధికార-ప్రతిపక్షాల మధ్య మీడియా వారథిగా  రాజకీయ సమరం సాగుతోంది. అది చివరకు మైండ్‌గేమ్ దిశగా సాగుతోంది. ఏపీలో ఏ పార్టీకి అనుకూలంగా, కులాల వారీగా విడిపోయి చానెళ్లు నడుస్తున్నాయన్నది.. మనం మనుషులం అన్నం నిజం. దానితో సర్కారు అనుకూల మీడియా మినహా, దానిని వ్యతిరేకించే మీడియా సంస్థలు, సహజంగానే క్షేత్రస్థాయి వాస్తవాలు బయటపెడుతున్నాయి. దానిని అధికారంలో ఉన్న వారు జీర్ణించుకోలేకపోతున్నారన్నది నిజం! పోనీ నిజమేమిటో.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిరిగా, స్వయంగా సీఎం జగన్ గారినే అడిగి తెలుసుకోవాలనుకుంటే.. ఆయనేమో చేయవలసిన ప్రసంగం చేసేసి, స్టెనోకు చెప్పినట్లు.. చెప్పాల్సింది చెప్పేసి, కుర్చీ వెనక్కి నెట్టి వెళ్లిపోతారాయె! పోనీ రికార్డు చేసిన ఆ వీడియో ప్రసంగంలోనయినా స్పష్టత ఉందా అంటే, అందులోనూ నిమిషాలకు నిమిషాలు ఎడిట్ చేస్తున్నారాయె!! మరి నిజం చెప్పేదెవరు? వీటికి జవాబు క్షేత్ర స్థాయిలోనే కదా వచ్చేది? అదే పనిచేస్తున్న జర్నలిస్టులపై, ఈ కేసుల బనాయింపు ఎందుకన్నది మెడపై తల ఉన్న ఎవరికైనా వచ్చే ప్రశ్న! ఇది కూడా చదవండి.. మీడియా పై మరకలు మామూలే!

నిమ్మగడ్డ లేఖ.. అంతర్జాతీయ సమస్య మరి!

నిమ్మగడ్డ రమేష్ అనే మాజీ అధికారి కే ంద్ర హోం శాఖకు రాసిన లేఖ మీడియాకు ఎలా లీకయిందన్నది ఇప్పుడు ఆంధ్రా పాలకులకు ఓ అంతర్జాతీయ సమస్య. దానిని ఎవరు లీక్ చేశారన్న సమాచారాన్ని, అది బయట ప్రపంచానికి చూపిన జర్నలిస్టులు పోలీసులకు ఇవ్వాలట. అదీ ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సమస్య. లేఖ వచ్చినమాట నిజమేనని, దానిని అందుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గారు బహిరంగంగానే చెప్పారు. హైదరాబాద్‌లోనే ఉండి విధులు నిర్వహిస్తానన్న నిమ్మగడ్డ కోరికకు అనుగుణంగానే.. ఏపీ డీజీపీ, తెలంగాణ డీజీపీతో మాట్లాడి, నిమ్మగడ్డ రక్షణ సంగతి చూడమని కోరారు. ఆ లేఖపై హైకోర్టులో కూడా పంచాయతీ నడుస్తోంది.

ఆ పదేళ్ల వార్తలపైనా గద్దించాల్సిందే!

ఇంతజరిగిన తర్వాత ఏ మూర్తినో పట్టుకుని, అది మీకెలా వచ్చిందని ప్రశ్నించడం అవివేకం. అయినా, తనకు సమాచారం వచ్చిన మార్గాలను పాత్రికేయులు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా చెప్పాలని గద్దిస్తే.. గత పదేళ్ల నుంచి జగన్మోహన్‌రెడ్డికి చెందిన మీడియా సంస్థలు, పాత ప్రభుత్వాలపై రాసిన కథనాలకు సైతం, ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చాయని గద్దించి తీరాలి. ఏదైనా న్యాయం తన ఇంటి నుంచే కదా మొదలుపెట్టాలి?

ఉల్లం‘ఘునుల’ వార్తలు అబద్ధమా?

కరోనా సమయంలో మంత్రులు, ఎంపీలు, వీవీఐపీలు  లాక్‌డౌన్ నిబంధన  ఉల్లంఘించి చేస్తున్న పర్యటనలు అబద్ధమా? కనగరాజ్ అనే పెద్దమనిషి  తమిళనాడు నుంచి వచ్చి, ఎన్నికల కమిషనర్‌గా చార్జి తీసుకోవడం అవాస్తవమా? మేఘా కృష్ణారెడ్డి అనే ఆసామి, హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చి సీఎం గారికి చెక్కు ఇవ్వడం అబద్ధమా? మంత్రి సురేష్ హైదరాబాద్‌కు వచ్చి వెళ్లలేదా?  వీరంతా 14 రోజుల క్వారంటైన్‌కు వెళ్లకుండానే, నేషనల్ పర్మిట్ లారీల మాదిరిగా తిరుగుతున్నారని రాయడం, చూపించడం తప్పా? నిజంగా వాటిపై జర్నలిస్టుల రాతలు-కోతలు తప్పయితే.. ఆ విషయాన్ని సీఎం నుంచి మంత్రుల వరకూ ఇప్పటివరకూ ఎందుకు ఖండించలేదు? పరువునష్టం దావాలు ఎందుకు వేయలేదు? తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిరిగా జర్నలిస్టులకు ఎందుకు శాపాలు పెట్టలేదు? నిజం సహించలేని నేతాశ్రీలు, పాలకులకు అది చెప్పిన జర్నలిస్టులపై, దొడ్డిదారి కేసులుపెట్టే నైతిక అర్హత ఉందా? అన్నది ప్రశ్న.

అమిత్‌షా దృష్టికి మూర్తి వ్యవహారం?

కాగా టీవీ5 మూర్తిని అరెస్ట్ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను, బీజేపీకి చెందిన కొందరు కేంద్రహోం మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. జీవీఆర్ శాస్త్రి అనే విశ్లేషకుడు ఈ వ్యవహారాన్ని అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.

1 COMMENT

  1. […] సరే.. యాజమాన్యాల ధోరణి లాభనష్టాలకు అనుగుణంగానే ఉంటుందనుకున్నాం. మరి జర్నలిస్టుల ఈతిబాధలపై గళమెత్తాల్సిన జర్నలిస్టు సంఘాలు, ఆ సంఘాల వీరవిప్లవ నేతాశ్రీలు ఏం చేస్తున్నారన్నది ప్రశ్న. నెలల తరబడి జీతాలివ్వని సంస్థలు, ఈఎస్‌ఐ, పీఎఫ్ ఎగ్గొడుతున్న యాజమాన్యాలపై పోరాటాన్ని అటకెక్కించి.. ప్రభుత్వాలపై పోరాడటం ఎందుకో ఎవరికీ అర్ధం కాదు. యాజమాన్యాల నుంచి కనీస హక్కులు కల్పించలేని సంఘాలకు, ప్రభుత్వాల నుంచి అవి కావాలి. ఇవి కావాలని డిమాండ్ చేసే నైతిక హక్కు ఎక్కడిది? సొంత సంస్థలనే నిలదీయలేని సంఘాలకు, ప్రభుత్వాలను డిమాండ్ చేసే హక్కు ఉందా? జర్నలిస్టు సంఘాల నేతలుగా చెలామణి అవుతున్న ఆసాములంతా, పాలకుల పల్లకీలెత్తే బోయీల అవతారమెత్తుతుండటమే అసలు సమస్య. తొండముదిరి ఊసరివెల్లి అయినట్లు, ఈమధ్య కాలంలో జర్నలిస్టు సంఘాల నేతలు ప్రభుత్వ పదవుల్లో చేరి, భట్రాజులు కూడా ఈర్ష్యపడేలా వ్యవహరిస్తుండటం మరో ఆసక్తికర పరిణామం. కాబట్టి ఇన్ని ఈతిబాధలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు స్వేచ్ఛా శుభాకాంక్షలు చెప్పడం వెటకారం కదూ?!ఇది కూడా చదవండి: అడిగితే.. అరెస్టేనా? […]