నెరవేరిన తలసాని రైళ్ల డిమాండ్

363

మంచి సూచన అని  కిషన్‌రెడ్డి ప్రశంస
వలస ప్రజలకు రైళ్లు పంపిస్తున్నామని తలసానికి ఫోన్
ప్రజాప్రయోజనాలపై స్పందించిన ఇద్దరు మంత్రులు
          (మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏదైనా ముందుచూపుతో మాట్లాడుతుంటారు. అది వ్యక్తం చేసే ధోరణి ఎలా ఉన్నా, చెప్పాల్సింది సూటిగా చెబుతుంటారు. ఎవరూ ఆలోచించని దారిలో వెళతుంటారు.  హైదరాబాద్‌లో ఒక భాగమైన సికింద్రాబాద్ ప్రజలు, ఒలిఫెంటా  సింగిల్‌వే వద్ద కొన్ని దశాబ్దాలు ఇబ్బందులు పడ్డారు. దానిని రెండు మార్గాలు చేయాలని డిమాండ్ చేయడమే కాదు. తర్వాత తాను మంత్రయి దానిని నెరవేర్చిన ఘనత ఆయనదే. తర్వాత ఇప్పుడు తెలంగాణలోనే అతి పెద్ద, సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నిర్మాణం కూడా తలసాని చొరవతో  ఏర్పాటయినదే. నాటి సీఎం చంద్రబాబుపై ఆయన ఒత్తిడి తెచ్చి మరీ కొత్త ఆసుపత్రి నిర్మాణానికి కారణమయ్యారు. ఇది కూడా చదవండి.. కేంద్ర-రాష్ట్రాల మధ్య ‘వలస’లసల!

తాజాగా కరోనా వల్ల ఏర్పడిన లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన వలస కూలీలను, వారి ప్రాంతాలకు పంపించేందుకు కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను తలసాని వేతెత్తిచూపారు. అది ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. కేంద్రమే ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేసి, వారిని తరలించాలి తప్ప.. ఆ భారం రాష్ట్రాలపై వేసి చేతులు దులిపేసుకోవడం ఏమిటని నిలదీశారు. ఆరకంగా, దేశంలోనే తొలిసారిగా కేంద్ర మార్గదర్శకాలను బహిరంగంగా వ్యతిరేకించిన, తలసాని వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇది జాతీయ మీడియాలో కూడా చర్చకు వచ్చింది. దానిపై రంగంలోకి దిగిన కేంద్ర మంత్రివర్గ సభ్యుల బృందం, రైళ్ల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను చర్చించింది.

చివరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు-విద్యార్ధులు-పర్యాటకులను రైలుమార్గం ద్వారానే, వారి ప్రాంతాలను తరలించాలని నిర్ణయించింది. అన్నట్లుగానే శుక్రవారం నుంచి రైళ్ల ద్వారా తరలింపు ప్రారంభించింది.  సహజంగా ఒక రాష్ట్ర మంత్రి చేసిన డిమాండ్‌కు, ఈ స్థాయిలో కేంద్రం ఎప్పుడూ స్పందించిన దాఖలాలు లేవు. చివరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఇదే తరహాలో కేంద్రానికి లేఖ రాసినా కేంద్రం తిరస్కరించింది.

అలాంటిది.. తెలంగాణ మంత్రి తలసాని చేసిన ఒక్క డిమాండ్‌కే కేంద్రం స్పందించడం విశేషం. నిజానికి జనతా కర్ఫ్యూ తర్వాత, లాక్‌డౌన్ కొనసాగిన సమయంలో, మున్సిపల్-రైల్వే-పోలీసు-హెల్త్  శాఖలతో ఒక సమన్వయ సమావేశం నిర్వహించారు. అందులో మాట్లాడిన తలసాని… రైళ్ల సర్వీసులు నిరవధికంగా నిలిపివేసినందున, వాటిని కరోనా పాజిటివ్ కేసుల వారికి, క్వారంటైన్ కేంద్రాలుగా మార్చాలని సూచించారు. అయితే, అప్పుడు అది ఆచరణ సాధ్యం కాదని అధికారులు చెప్పారు. కానీ అదే రైల్వే శాఖ, రైళ్లను క్వారంటైన్ సెంటర్లుగా మార్పుచేయడం విశేషం. ఇది కూడా చదవండి.. తెలంగాణలో తలసాని టాప్!

తలసానికి కిషన్‌రెడ్డి ఫోన్..

కాగా రైళ్ల ఏర్పాటుపై తలసాని చేసిన డిమాండ్‌పై  స్పందించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. గురువారం అర్ధరాత్రి తర్వాత,  తలసానికి ఫోన్ చేశారు. మీ డిమాండ్ బాగుంది.  దానిపై మంత్రివర్గ సభ్యులు, కార్యదర్శులతో చర్చించాం. దాని ప్రకారం వలస కార్మికులను వారి ప్రాంతాలకు తీసుకువెళ్లే బాధ్యతను కేంద్రమే తీసుకుంటుంది. అందుకోసం శుక్రవారం నుంచే ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేస్తున్నామని చెప్పడం.. అందుకు తలసాని కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగిపోయింది. ‘‘ తెలంగాణలో చిక్కుకుపోయిన వలస కూలీలతో నేను స్వయంగా మాట్లాడా. శ్రీకాకుళం వెళ్లేందుకు రోడ్డుమార్గంలో బయలుదేరిన వారితో కూడా మాట్లాడా.  ఈ పరిస్థితిలో వెళ్లడం మంచిదికాదని నచ్చచెప్పి, వారికి ఇక్కడే భోజన సౌకర్యం కల్పించాం. అన్ని లక్షలమందిని బస్సుల ద్వారా వారి ప్రాంతాలకు తరలించడం ఆచరణ సాధ్యం కాదన్న దృష్టితోనే, రైళ్లు ఏర్పాటుచేయాలని సూచించా. అధికారులతో మాట్లాడి వివరాలు తీసుకున్న తర్వాతే నేను ఆ డిమాండ్ చేశా. అందుకు కేంద్రం కూడా ప్రతిష్ఠకు వెళ్లకుండా స్పందించి, రైళ్లు ఏర్పాటుచేయడం అభినందనీయం’’ అని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ‘సూర్య’తో అన్నారు. ఇది కూడా చదవండి.. దటీజ్.. తలసాని!

రాజకీయాలలో ఇలాంటి  సామరస్యం-సుహృద్భావం- సానుకూల స్పందన వాతావరణం కనిపించడం అభినందనీయం. ప్రతిపక్షం చెప్పింది కాబట్టి ఎందుకు చేయాలన్న ప్రతిష్ఠకు పోకుండా, ప్రజాప్రయోజనాల దృష్టిలో స్పందించినందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..  సాధ్యాసాధ్యాలపై వాస్తవాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లిన రాష్ట్ర మంత్రి తలసాని.. ఇద్దరూ అభినందనీయులే. ఈ నిర్ణయం వల్ల లక్షలాదిమంది వలస ప్రజలు వారి స్వస్థలాలకు వెళితే అందరికీ సంతోషమే కదా?  ఇది కూడా చదవండి… కరోనాపై యుద్ధంలో తెలుగు రాష్ట్రాల మంత్రులు