కేంద్ర-రాష్ట్రాల మధ్య ‘వలస’లసల!

1
37

వలస కూలీల తరలింపుపై విబేధాలు
అనుమతించి చేతులు దులిపేసుకున్న కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వాలపైనే భారం మోపిన వైనం
తెలంగాణలోనే 62 వేల బస్సుల అవసరం
ఇక మీరు చేసిందేమిటని తలసాని ఫైర్
కేంద్రానికే బాధ్యత అని స్పష్టీకరణ
రైళ్లలో పంపించాలని డిమాండ్
కొత్త వివాదానికి తెరలేపిన తలసాని
(మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘ తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల మంది వలస కూలీలున్నారు. వారిని వారి ప్రాంతాలకు తరలించాలంటే బస్సులు కావాలి. ఒక బస్సులో 48 సీట్లుంటాయి. సామాజిక దూరం ప్రకారం ఒక సీటుకు ఒకరికి మాత్రమే కేటాయించినా అందులో 24 మంది మాత్రమే కూర్చుంటారు. తెలంగాణలో ఉత్తరప్రదేశ్- ఉత్తరాంచల్‌కు చెందిన కూలీలు వేలల్లో ఉంటారు. అక్కడికి వెళ్లాలంటే బస్సుల్లో అయితే 4,5 రోజులు పడుతుంది? మరి 15 లక్షల మందికి ఎన్ని బస్సులు కావాలి? వారందరూ మార్గమధ్యంలో తిండి కోసం ఆగితే ఎన్ని హోటళ్లు, దాబాలు కావాలి?’’
– ఇది ఎవరైనా లెక్కమాస్టారు బడిపిల్లలకు వేసిన ప్రశ్న అనుకుంటే తప్పులో కాలేసినట్లే. వలస కూలీలను, రాష్ట్రాల సొంత ఖర్చులతో వారి ప్రాంతాలకు తరలించుకోవాలన్న  కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలపై.. తెలంగాణ సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సీరియస్‌గా వేసిన ప్రశ్న. మరి ఈ కామన్‌సెన్స్ క్వశ్చన్‌కు.. కేంద్రం వద్ద జవాబు ఉందా?
‘తాంబూలమిచ్చాం తన్నుకుచావండ’న్నట్లు.. వలస కూలీలు-విద్యార్ధులు-పర్యాటకులను సొంత రాష్ట్రాలకు పంపించే వ్యవహారం కేంద్ర-రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. ఈ అంశంలో భారమంతా రాష్ట్రాలపై నెట్టేసిన కేంద్రం తీరును, దేశంలో తొలిసారి తెలంగాణ సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రశ్నించడం ద్వారా, కొత్త వివాదానికి తెరలేపడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకూ దీనిపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే మాత్రమే లేఖ రూపంలో స్పందించారు. కేంద్రమే రైళ్ల ద్వారా వారిని పంపించాలన్న ఆయన విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. ఆ మరుసటి రోజునే తెలంగాణ ఫైర్ బ్రాండ్ తలసాని శ్రీనివాసయాదవ్,  అదే సమస్యపై గళం విప్పడం ప్రస్తావనార్హం.

ఇవీ మార్గదర్శకాలు.. ఇలా చేయాలట!

లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా, వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులు-విద్యార్ధులు-పర్యాటకులను వారి సొంత ప్రాంతాలకు వెళ్లేలా అనుమతిస్తూ, కేంద్ర హోం శాఖ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు, వివాదంగా మారుతున్నాయి. దీనికోసం ఆయా రాష్ట్రాలు, తమ స్థాయిలో ఒక ప్రత్యేక నోడల్ యంత్రాంగాన్ని ఏర్పాటుచేసుకోవలసి ఉంటుంది. తమ ప్రాంతాల్లో ఎంతమంది వలస కార్మికులు చిక్కుకుపోయారో వాటి వివరాలు, ఈ యంత్రాగమే నమోదు చేయాలి. ఆ మేరకు ఆయా రాష్ట్రాలు మాట్లాడుకుని, ఒకరి రాష్ట్రంలో చిక్కుకుపోయిన మరొక రాష్ట్రాల వారిని, రోడ్డు మార్గం ద్వారా పంపించుకోవాలి. ఇందులో కేంద్రప్రభుత్వ బాధ్యత, ప్రమేయం ఏమీ ఉండదు.

అయితే ఈ మార్గదర్శకాలపై రాష్ట్రాలు మండిపడుతున్నాయి. కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకునేందుకు, తమపై భారం మోపడం సరైందికాదంటున్నాయి. దీనిపై తొలిసారి తెలంగాణ రాష్ట్రం బహిరంగంగా స్పందించింది. సీనియర్ మంత్రి  తలసాని శ్రీనివాసయాదవ్ దీనిపై విరుచుకుపడిన తీరు పరిశీలిస్తే.. కేంద్ర మార్గదర్శకాలు, రాష్ట్రాలకు రుచించడం లేదని స్పష్టమవుతోంది. అనేక మొహమాటాల కారణంగా, బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు సైతం దీనిపై ఇప్పటివరకూ స్పందించకపోయినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం తన వాదనను కుండబద్దలు కొట్టడం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ వలసల లెక్క..

లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు, విద్యార్ధులు, పర్యాటకులను వారి ప్రాంతాలకు పంపించడమంటే మహాయజ్ఞం కంటే ఎక్కువే. ఒక్క తెలంగాణ రాష్ట్రాన్నే తీసుకుంటే… తెలంగాణ రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 15 లక్షల మంది వలస కూలీలు ఉన్నారు. వీరుకాకుండా, విద్యార్ధులు, పర్యాటకులు అదనం. అంతా కలిపి సుమారు 20 లక్షల మంది వరకూ ఉంటారు. వీరిలో ఏపీ, మహారాష్ట్ర, ఝార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారున్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర  సమీప రాష్ట్రాలయినప్పటికీ, వలస ప్రజలు ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండేవారు కావడం గమనార్హం. ఉదాహరణకు,  ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వలస కూలీలే హైదరాబాద్‌లో ఎక్కువమంది ఉంటారు. అది కూడా పలాస, టెక్కలి, ఇచ్చాపురం వంటి ఒడిషా రాష్ట్ర సరిహద్దులకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు చెందిన వారే. అసలు ఆంధ్రప్రదేశ్‌కే  శ్రీకాకుళం జిల్లా సుదూర, చివరి  ప్రాంతం. ఇక హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం అంటే, ఎన్ని వందల కిలోమీటర్ల దూరమో.. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్,  పశ్చిమబెంగాల్, మహారాష్ట్రకు ఎన్ని వేల కిలోమీటర్లు దూరం ఉంటుందో ఊహించుకోవచ్చు.

తరలింపు ఎలా?

ఆ ప్రకారంగా అన్ని లక్షల మందిని వారి ప్రాంతాలకు పంపేందుకు..  మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పినట్లు, ఎన్ని వేల బస్సులు కావాలన్నది ప్రశ్న. ఒక్క శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే హైదరాబాద్‌లో సుమారు లక్షా 75 వేల మందివరకూ పనిచేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా కంది వద్ద  జరిగిన ఘర్షణకు.. సమీపంలో  ఉన్న ఐఐటి రెండవ దశ నిర్మాణపనుల్లో  బీహార్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్,  రాష్ట్రాలకు చెందిన వారే 2500 మంది ఉన్నారు. ఇక వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మిర్చిపంటల పనుల కోసం వచ్చి వెళ్లే వారి సంఖ్య కూడా పెద్దదే.

ఒక్క తెలంగాణ రాష్ట్రాన్నే తీసుకుంటే.. వీరందిరనీ వారి వారి ప్రాంతాలకు పంపించాలంటే, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉన్న బస్సులు ఏమాత్రం సరిపోవు. ఎందుకంటే.. ఒక్కో బస్సుకు 48 సీట్లు ఉంటాయి. కరోనా వైరస్ వల్ల సామాజికదూరం విధిగా పాటించాలి. ఆ ప్రకారంగా ఒక్కొక్కరికి ఒక్కో సీటు కేటాయించినా ఒక్కో బస్సులో 24మందికి మాత్రమే అవకాశం ఉంటుంది.

బస్సులు, భోజన సౌకర్యమే సమస్య

తాజాగా గుజరాత్‌లో చిక్కుకున్న 4500 మంది జాలర్లను శ్రీకాకుళం తీసుకువచ్చేందుకు, 61 బస్సులు ఏర్పాటుచేశారు. అంటే ఒక్కో బస్సులో 74 మందిని కూర్చోబెట్టినట్లు స్పష్టమవుతోంది. దీనిని బట్టి వారిని లోపల కుక్కినట్లే భావించక తప్పదు.  సామాజికదూరం పాటిస్తే 1464 మందినే తర లించాల్సి ఉంది. అదే 48 సీట్ల ప్రకారం కూర్చోబెడితే, 2928 మంది మాత్రమే కూర్చోగలరు. నిజానికి  వారందనీ సామాజికదూరం పాటిస్తూ, ఒక్కో బస్సులో 24 మందిని మాత్రమే కూర్చోబెట్టాలంటే, అందుకు 188 బస్సులు కావాలి.  ఆ లెక్కన తెలంగాణలో  ఉన్న 15 లక్షలమంది వలస ప్రజలను వారి ప్రాంతాలకు తరలించాలంటే… 62,500 బస్సులు అవసరం ఉంటుంది. పోనీ బస్సుకు 48 మందిని కూర్చోబె ట్టినా, అందుకు 31,250 బస్సులు ఏర్పాటుచేయవలసి ఉంటుంది.   పోనీ వారిని చచ్చీ చెడి తీసుకువెళ్లినా..  మార్గమధ్యంలో వారి ఆహార సమస్య ఎలా పరిష్కరిస్తారన్నది మరో ప్రశ్న. మార్గమధ్యంలో ఎక్కడా హోటళ్లు, దాబాలు లేనందున, దాదాపు మూడు రోజుల పట్టే వారి ప్రయాణంలో వలస ప్రజల ఆకలిదప్పుల సంగతేమిటన్నది కేంద్రం ఎక్కడా ప్రస్తావించలేదు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్రాంచల్, ఝార్ఖండ్‌కు మూడు రోజులు కంటే ఎక్కువే సమయం పడుతుంది. మరి వారికి భోజన సౌకర్యం కల్పించడం కత్తిమీద సాము కదా?

దేశం మొత్తం..  ఇదే సమస్య

ఇదంతా ఒక్క  తెలంగాణకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఇదే సమస్య. అసలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సుమారు 12 కోట్ల మంది వలస ప్రజలు, వివిధ రంగాల్లో పనిచేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక అంచనా. మన తెలుగు రాష్ట్రాలే తీసుకుంటే.. ఏపీ నుంచి శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు; తెలంగాణ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వలసలు ఎక్కువగా ఉంటాయి. ఇటీవలి కాలంలో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వలసలు తగ్గుముఖం పట్టడం కొంత ఊరట. అసలు దేశంలోనే తెలంగాణ-కేరళ రాష్ట్రాలే వలస ప్రజల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏపీలో ఎక్కువమంది హైదరాబాద్, బెంగళూరు, చైన్నెకు వలస వెళుతున్నారు. భవన నిర్మాణ రంగం, ఇరిగేషన్ పనుల కోసం వారంతా ఆయా ప్రాంతాలకు వెళుతున్నారు. రాయలసీమకు చెందిన వారంతా ఎక్కువగా, బెంగళూరు-చెన్నైకు పనుల కోసం వెళుతుంటారు. వారందరినీ సొంత ప్రాంతాలకు తీసుకురావాలంటే, ఏపీ సర్కారు కూడా వేల సంఖ్యలో బస్సులు ఏర్పాటుచేయవలసి ఉంటుంది. ఒకవేళ కష్టపడి చేసినా, వారికి మార్గమధ్యంలో ఆహారం ఏర్పాటుచేయడం అసాధ్యం.

చేతులు దులిపేసుకుంటే ఎలా?

అంటే కేంద్ర మార్గదర్శకాలు.. ఇలాంటి సమస్యలను అంచనా వేయకుండానే, ‘మేం అనుమతి ఇచ్చాం. మీ చావు మీరు చావండ’ని తెలివిగా తప్పించుకోవడంగానే కనిపిస్తోంది. పేరుకుమాత్రం తాము వలస కూలీలను  వారి ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతించామని ప్రచారం చేసుకునేందుకే తప్ప, ఆ మార్గదర్శకాలు ఎందుకూ పనికిరావన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిని మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, కేరళ, బీహార్, పంజాబ్ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేయాలని ప్రధాని మోదీని డిమాండ్ చేస్తున్నాయి.

రైళ్ల ఏర్పాటే సమస్యకు పరిష్కారం: తలసాని

ఈ సమస్యకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేయడమే పరిష్కారమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు. వలస ప్రజలను వారి ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నామని, గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన సరిపోదని ఆయన వ్యాఖ్యానించారు. లక్షలాదిమందిని పంపించాలంటే బస్సుల సంఖ్య సరిపోదని, వారికి మార్గమధ్యంలో ఆహార విషయం ఏమిటని ప్రశ్నించారు. అదే రైల్వే శాఖ అయితే.. దానికి సొంతంగా క్యాటరింగ్ వ్యవస్థ ఉన్నందున, భోజన సమస్య తలెత్తదన్నారు. పైగా రైళ్లలో బస్సుల కంటే ఎక్కువమంది ప్రయాణించవచ్చని సూచించారు. ైరె ల్వే శాఖ వలస కూలీలను  తీసుకువస్తే, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారి సొంత గ్రామాలకు, రవాణా సౌకర్యం ఏర్పాటుచేయడం సులభమవుతుందని వివరించారు. వలస కూలీల కోసం కేంద్రం ఇస్తున్నదేమీ లేదని, తెలంగాణ ప్రభుత్వమే సొంత ఖర్చులతో వారికి భోజన సౌకర్యం కల్పిస్తోందని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పిన లెక్కలన్నీ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చినవేమీ కాదని, అందులో కొన్ని రొటీన్‌గా రావలసివేనని వ్యాఖ్యానించారు. అన్నపూర్ణ సంచార కేంద్రాల ద్వారా ప్రతిరోజూ కొన్ని వేలమందికి భోజన సౌకర్యం కల్పిస్తున్నామని, జీహెచ్‌ఎంసీ- అక్షయపాత్ర కూడా వలస కూలీలను ఆదుకుంటున్నాయని తలసాని వివరించారు.

రైళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చిన కేంద్రం వలస కూలీలను, అదే రైళ్ల ద్వారా ఎందుకు తీసుకువెళ్లదని ప్రశ్నించారు. ఏదో చేశామని చెప్పి చేతులు దులిపేసుకోవడం కాకుండా, ఆచరణలో తలెత్తే సమస్యల గురించి ఆలోచించి, దాని పరిష్కారానికి కూడా కృషి చేయాలని తలసాని కేంద్రానికి చురకలు అంటించారు. కాగా, రైళ్లు నిలిపివేసిన నేపథ్యంలో ఖాళీగా ఉన్న రైళ్లను క్వారంటైన్ సెంటర్లుగా మార్చాలని, నెల క్రితం జరిగిన సమీక్ష సమావేశంలో తలసాని చేసిన సూచనను రైల్వే శాఖ అంగీకరించలేదు. ఇప్పుడు అందులోనే క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటుచేయడం ప్రస్తావనార్హం.

1 COMMENT

  1. […] తెలంగాణ సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏదైనా ముందుచూపుతో మాట్లాడుతుంటారు. అది వ్యక్తం చేసే ధోరణి ఎలా ఉన్నా, చెప్పాల్సింది సూటిగా చెబుతుంటారు. ఎవరూ ఆలోచించని దారిలో వెళతుంటారు.  హైదరాబాద్‌లో ఒక భాగమైన సికింద్రాబాద్ ప్రజలు, ఒలిఫెంటా  సింగిల్‌వే వద్ద కొన్ని దశాబ్దాలు ఇబ్బందులు పడ్డారు. దానిని రెండు మార్గాలు చేయాలని డిమాండ్ చేయడమే కాదు. తర్వాత తాను మంత్రయి దానిని నెరవేర్చిన ఘనత ఆయనదే. తర్వాత ఇప్పుడు తెలంగాణలోనే అతి పెద్ద, సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నిర్మాణం కూడా తలసాని చొరవతో  ఏర్పాటయినదే. నాటి సీఎం చంద్రబాబుపై ఆయన ఒత్తిడి తెచ్చి మరీ కొత్త ఆసుపత్రి నిర్మాణానికి కారణమయ్యారు. ఇది కూడా చదవండి.. కేంద్ర-రాష్ట్రాల మధ్య ‘వలస’లసల! […]