కేంద్ర సాయంతో కోలుకున్న ఖజానా

451

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నిధుల వర్షం
రాజకీయాలు పక్కకుపెట్టిన మోదీ సర్కార్
ఏపీలో దారిమళ్లిన ఉపాథి నిధులు
కిషన్‌రెడ్డి బయటపెట్టిన లెక్కల వివరాలు
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఒకవైపు ఆశించిన మేరకు రాని వసూళ్లు.. మరోవైపు కరోనా దెబ్బకు కుదేలయిన ఖజానా.. దానితో ఉద్యోగుల జీతాలకూ కోతవిధించిన దయనీయం! దీనికితోడు సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించాల్సిన అవసరం. కరోనాతో అల్లాడుతున్న పేదలకు సాయం అందించాల్సిన పరిస్థితి. అటుచూస్తే బక్కచిక్కిన ఖజానా. ఇటు చూస్తే పెరుగుతున్న ఆర్ధికావసరాలు..ఇదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో చితికిన ఆర్ధిక ముఖచిత్రం.

సహజంగా అయితే, ఇలాంటి క్లిష్ట పరిస్థితిని కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా.. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై తన రాజకీయ కోణం ప్రదర్శిస్తుంది. సత్వర నిధులతోపాటు, ఇవ్వవలసిన నిధులు కూడా విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతుంటుంది. కానీ, నరేంద్ర మోదీ సర్కారు మాత్రం.. రాజకీయాలను పక్కనపెట్టి, క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఖజానాకు నిధులతో ఆక్సిజన్ ఇచ్చింది. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో, యుద్ధ ప్రాతిపదికన నిధులు విడుదల చేసింది.

కిషన్‌రెడ్డి లెక్కలతో బయటపడ్డ సాయం

ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ.. కనీసం ప్రధాన ప్రతిపక్షం కూడా కాకపోయినప్పటికీ, రాజకీయ కోణాన్ని పక్కనపెట్టి.. అక్కడ నెలకొన్న ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకుని, నిధుల వరద పారించింది. ఫలితంగా బక్కచిక్కిన రాష్ట్రాల ఖజానా కోలుకుంది. కేంద్రం ఇచ్చిన దన్నుతో సంక్షేమ కార్యక్రమాలతో పాటు, కోవిడ్ సహాయ చర్యలు ముమ్మరం చేశాయి. ఆంధ్రాలో స్థానిక సంస్థలు నిర్వహించకపోతే, కేంద్రం నిధులివ్వదని వాదించిన జగన్మోహన్‌రెడ్డి సర్కారు మాటల్లో నిజం లేదని నిరూపిస్తూ, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

అయితే, కేంద్రం నుంచి సకాలంలో రావలసిన నిధులు, గ్రాంట్లు రావడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ చేస్తున్న ప్రకటనలు అబద్ధమని నిరూపిస్తూ, కేంద్ర హోం శాఖ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి.. రెండు రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసిన నిధుల వివరాలు బయటపెట్టడం ద్వారా, కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తోందన్న సంకేతాలిచ్చారు.

ఇదీ తెలంగాణ లెక్క..

ఆ ప్రకారంగా.. తెలంగాణ రాష్ట్రానికి పన్నుల వాటా కింద 982 కోట్లు విడుదల చేయగా, 2020-21 ఆర్ధిక సంవత్సరానికి 450 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రైతులకు 2 వేల రూపాయల ఆర్ధిక సాయం కింద బ్యాంకులలో 659 కోట్లు, జన్‌ధన్‌యోజన కింద మహిళలకు 263 కోట్లు, భవన నిర్మాణ కార్మికులకు 126 కోట్లు, ఉద్యోగుల ఈపీఎఫ్ కింద 207 కోట్లు, విపత్తునిధి కింద 224 కోట్లు, వైద్య పరికరాలు, కోవిడ్ ఆసుపత్రులకు 215 కోట్లు జమ చేసింది. ఇక ఇప్పటిదాకా తెలంగాణలో 95,810 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా ఇవ్వగా, రెండోదశలో కూడా బియ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం ఇస్తున్న 12 కిలోల బియ్యంలో, కేంద్రం వాటా 5 కిలోలు ఉండటం గమనార్హం.

ఆంధ్రకు ఇచ్చింది ఇవే..

ఇక ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఖాతాలలో 208 కోట్ల రూపాయలు జమ చేసింది. కోవిడ్ ఆసుపత్రులకు 215 కోట్లు, మహిళల ఖాతాలో 300 కోట్లు, పెన్షన్లకు 46 కోట్లు, భవన నిర్మాణ కార్మికులకు 196 కోట్లు, ఈపీఎఫ్ ఉద్యోగులకు 71 కోట్లు, విపత్తుల నిర్వహణ కోసం 550 కోట్లు, కోవిడ్ -19 సాయం కింద 179 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

ఉపాథి కూలీలకు బిల్లులు ఇవ్వని ఏపీ సర్కార్

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించనట్లు… జాతీయ ఉపాథి హామీ పథకం కి ంద, పెండింగ్ బిల్లులను కేంద్రం మంజూరు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని చెల్లించని వైనం విమర్శలకు దారితీస్తోంది. 2018-19 సంవత్సరానికి ఉపాథి హామీ పథకం కింద, 2500 కోట్ల రూపాయల బకాయిలను ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. వాటి విడుదల కోసం టీడీపీ ఎంపీలు, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్  కేంద్రానికి లేఖ రాశారు. దానికి స్పందించిన కేంద్రం, ఏప్రిల్ 20న 1900 కోట్లు విడుదల చేసింది. 2018-19లో పనిచేసిన బకాయిదారులకు మాత్రమే, ఆ నిధులు చెల్లించాలని కేంద్రం స్పష్టంగా పేర్కొంది. అయితే, కేంద్ర ఆదేశాలను ధిక్కరించిన జగన్మోహన్‌రెడ్డి సర్కారు, దానిని పక్కకుపెట్టి.. ఈ ఏడాది జనవరి నుంచి వరసగా మూడు నెలలపాటు చేసిన, కొత్త పనులకు సంబంధించిన  బిల్లులు చెల్లించడం వివాదాస్పదమవుతోంది.