ఆర్. ఎస్. ఎస్. అంటే ”రెడీ ఫర్ సోషల్ సర్వీస్ ”

747

ప్రజాస్వామ్యం కేవలం అధికారిక నిర్మాణాలు, పాలనా వ్యవస్థలతో మాత్రమే మనుగడ సాగింపలేదని వర్తమాన రాజకీయ సైద్ధాంతిక ఆలోచనలు స్ఫష్టం చేస్తున్నాయి. పౌర సమాజపు పాత్రం, అనధికారిక వ్యవస్థల సమాలోచనలు సహితం అంతే ముఖ్యమైనవని గుర్తిస్తున్నాయి.  ముఖ్యంగా ప్రస్తుతపు కరోనా మహమ్మారి సందర్భంగా పౌరుల కార్యాచరణ, భాగస్వామ్యం, పరస్పర సహకారం ప్రాధాన్యత సంతరింప చేసుకొంటున్నాయి. `అభివృద్ధి చెందిన ప్రపంచం’తో సహా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రంగం మాత్రమే సరిపోదని నేడు స్పష్టంగా వెల్లడి అవుతున్నది.

ఈ పూర్వరంగంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) అధినేత డా. మోహన్ భగవత్ ఇచ్చిన `సమ్మిళిత, సేవ, సౌహార్ధ్ర  భావన, సామూహిక చర్య’ సందేశం కీలకమని చెప్పవచ్చు. ఈ మధ్య ఆయన స్వయంసేవక్ లను ఉద్దేశించి  ఇచ్చిన సందేశం ఆర్ ఎస్ ఎస్ స్వరూపాన్ని మరోసారి   పరిశీలించే అవకాశం కలిగిస్తుంది. ఈ సందర్భంగా ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు చేబడుతున్న సేవా కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు.

`ఏకాంత్ మెయిన్ ఆత్మసాధన ఆర్ లోకేన్త మెయిన్ పరోపకార్”సందేశంతో ఆయన ప్రసంగం ప్రారంభించారు. లాక్ డౌన్ కారణంగా శాఖలు, సాధారణ కార్యక్రమాలను నిలిపివేసిన సమయంలో దృష్టి అంతా సేవా కార్యక్రమాల పట్ల సారించాలని ఆయన హితవు చెప్పారు. సేవకు స్ఫూర్తి సొంత ప్రయోజనాలు గాని లేదా ప్రచారం గాని కారాదని స్పష్టం చేశారు.

ఈ సమాజం మనకు చెందినదనే భావన, సానుకూలత అవసరమని హితవు చెప్పారు. నిరంతర నిస్వార్థ సేవ,  ప్రేమ, అనుబంధంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

కొద్దిమంది  వ్యక్తుల బాధ్యతరహిత చర్యల కారణంగా మొత్తం సమూహాన్ని అపరాధ భావనతో చూడరాదని మోహన్ భగవత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సహాయం కోరిన వారందరికీ సహాయం అందించాలని, కలసి వచ్చే వారందరిని కలుపుకు వెళ్లాలని ఉద్భోధించారు.

అసాధారణ పరిస్థితుల్లో, ముఖ్యంగా ప్రస్తుతం నెలకొన్న విషమ పరిస్థితులలో ప్రభుత్వం గాని లేదా ప్రజలు గాని ఏ విధమైన అహంకార ధోరణి ప్రదర్శించడం ప్రమాదకరమని హెచ్చరించారు. మొత్తం 130 కోట్ల మంది ప్రజలు ఒక్కేటే అని, అందరు మనవారే అనే భావనతో చూడాలని హితవు చెప్పారు.

భాగిని నివేదిత, డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ లను ప్రస్తావిస్తూ పౌరసమాజం పాత్రను; ప్రభుత్వం, పాలనా యంత్రాంగం, పౌర సమాజం మధ్య ఉండవలసిన సంబంధాలను డా.  మోహన్ భగవత్ ఉదహరించారు. ఒక స్వతంత్ర దేశంలో బాధ్యతాయుత, చట్టబద్ధంగా నడిచే పౌర సమాజం దేశభక్తికి నిదర్శనమని చెప్పారు.

ఆర్ ఎస్ ఎస్ ప్రపంచంలోనే అత్యధికంగా కార్యకర్తలు గల సంస్థ. మద్దతుదారులు, విమర్శకుల భిన్నమైన అభిప్రాయాల మధ్య నిష్పక్షపాతమైంది. విశ్లేషణ  జరిపితే ఈ సంస్థ చాలా అరుదైన స్వరూపం కలిగిన్నట్లు అర్ధం అవుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న మానవతా సంక్షోభం దృష్ట్యా అతిపెద్ద స్వచ్ఛంద సేవకులు గల ఈ సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో, దాని వెనుక ఉన్న సూత్రాలు ఏమితో తెలుసుకోవలసి ఉంది.

స్వీయ క్రమశిక్షణ అలవరించు కొనేటట్లు చేయడం, సమాజం పట్ల భావోద్వేగ అనుబంధం కలిగేటట్లు చేయడం, సమతౌల్య దృక్పధాన్ని కలిగించడం, ఐక్యత, స్నేహం, సామజిక బాధ్యత అనే భావనలు కలిగించడం ఆర్ ఎస్ ఎస్ మౌలిక ఉద్దేశ్యాలు.

ఆర్ ఎస్ ఎస్ నిత్యం జరిపే శాఖలకు ఆరు అర్ధాలను ఈ సంస్థ మూడవ సర్ సంఘచాలకే బాలాసాహెబ్ దేవదాస్ ఒకసారి తెలిపారు. వాటిల్లో ఒక అర్ధం శాఖ అంటే సమాజం త్వరితగతిన  స్వీకరించే ప్రదేశం. ఆపదలు, విపత్తుల సమయంలో నిరపేక్షంగా సేవలు అందించే స్థలం. అనూహ్యమైన విపత్తుగా ముందుకొచ్చిన కరోనా సందర్భంగా ఆర్ ఎస్ ఎస్ లోని ఈ స్వరూపం పూర్తిగా వికసించి ప్రత్యక్షం అవుతున్నది.

ప్రస్తుత సవాల్ సమయంలో దేశం అంతటా ప్రజలను సేవించడంలో స్వయం సేవక్ లు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. సమాజపు అవసరాలు తీర్చడం కోసం ముందుకు వస్తూ, వేలాది మంది కార్యకర్తలు ప్రజల బాధలను పంచుకొంటున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడం కోసం ఆర్ ఎస్ ఎస్ కృషి చేస్తున్నది. దేశంలో వివిధ ప్రాంతాలలో ఆర్ ఎస్ ఎస్ తో పాటు దాని సేవా విభాగం సేవ భారతి కూడా అవసరమైన వారికి సహాయ సామాగ్రి అందిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను ఆదుకోవడం కోసం ఆర్ ఎస్ ఎస్ బ్రహత్తరమైన సేవా కార్యక్రమాలలో నిమగ్నమై ఉంది. దేశ వ్యాప్తంగా మూడు లక్షల మందికి పైగా ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు 55,000 కు పైగా ప్రదేశాలలో అంకితభావంతో కృషి చేస్తున్నారు.  ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా 33 లక్షల మందికి రేషన్ కిట్ లను అందించారు. రెండు కోట్ల మందికి ఆహార ప్యాకెట్ లను అందించారు. 3.51 లక్షల మంది వలస కార్మికులకు వివిధ మార్గాలలో సహాయం అందిస్తున్నారు. అవసరం ఉన్నవారికి 11,740 మంది స్వయం సేవక్ లు రక్తదానం అందించారు. ఎటువంటి ప్రతిఫలం, పేరు ప్రఖ్యాతులు ఆశించ కుండా సేవా కార్యక్రమాలు అమలు జరుపుతున్నారు.

ఆర్ ఎస్ ఎస్ కు సంబంధించిన పలు సామాజిక సంస్థలు, ఇతర సంస్థలు పట్టణ ప్రాంతాలతో పాటు గిరిజన, గ్రామీణ ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు అమలు జరుపుతున్నారు. ప్రతి స్థాయిలో ఈ సంస్థల పట్ల గల విశ్వసనీయత కారణంగా ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక ప్రజలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు.

ఆర్ ఎస్ ఎస్ కు అనుబంధంగా ఉన్న విశ్వ హిందూ పరిషద్ దేశ వ్యాప్తంగా గల తమ యంత్రాంగం ద్వారా కరోనా మహమ్మారి తీవ్రతరమైన మార్చ్ 26 నుండి పలు సేవాకార్యక్రమాలు అమలు జరుపుతున్నది. ఇప్పటి వరకు 36.66 లక్షల మంది ప్రజలకు వండిన ఆహార పొట్లాలు అందించింది. ప్రతి రోజూ 2.75 లక్షల మందికి పైగా వండిన ఆహారం అందిస్తున్నది. 3.79 లక్షల కుటుంబాలకు రేషన్ అందించారు.ఇప్పటి వరకు 3.38 లక్షల మందికి మాస్క్ లను పంపిణి చేయగా, 1.86 లక్షల మందికి శానిటైజర్లను, మందులను పంపిణి చేశారు.

ఆర్ ఎస్ ఎస్ తన సేవా కార్యక్రమాల సందర్భంగా ప్రచార, ఆర్భాటాలకు ప్రాముఖ్యత ఇవ్వదు. సమాజం పట్ల ఒక బాధ్యతగా అమలు పరుస్తుంది. 1977లో దివిసీమలో ఉప్పెన సందర్భంగా సందర్శించిన సర్వోదయ నేత ప్రభాకర్ జీ స్వయం సేవక్ ల సేవా ధృక్పధంను చూసి ప్రశంసగా  ఆర్ ఎస్ ఎస్ అంటే `రెడీ ఫర్ సోషల్ సర్వీస్’ అనే కొత్త అర్ధాన్ని చెప్పారు.  ఆ సమయంలోనే దివిసీమలో పర్యటించిన నాటి ప్రతిపక్ష నేత ఇందిరా గాంధీ తనకు ఎక్కడకు వెళ్లినా అక్కడ ఆర్ ఎస్ ఎస్ వారే కనిపించారని అంటూ ప్రభుత్వ యంత్రాంగం విఫలమైనది అన్నట్లు చెప్పారు. ఆర్ ఎస్ ఎస్ పట్ల ప్రతికూల భావనలు గల లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ బీహార్ వరదల సందర్భంగా స్వయం సేవకుల సేవా కార్యక్రమాలను చూసి తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నారు. “ఆర్ ఎస్ ఎస్ ఫాసిస్ట్ సంస్థ అయితే నేను కూడా పాసిస్టు నే” అంటూ తర్వాత చెప్పుకొచ్చారు.

-చిత్తర్వు రఘు,

 హైకోర్టు న్యాయవాది,

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా

craghuadvocate@gmail.com

 

 

Attachments area