కేసీఆర్ చర్యలు భలే.. జగన్ తీరు బాగోలే!

328

తెలుగుదేశం నేతల తీరిది
తెలంగాణలో కేసీఆర్ సర్కారుపై విపక్షాల విమర్శలు
తెలంగాణలో ఎన్ని టెస్టులు చేస్తున్నారన్న రోజా
ఏపీ కంటే తెలంగాణ చర్యలే భేషంటున్న చంద్రబాబు
కేసీఆర్‌ను చూసి జగన్ నేర్చుకోవాలంటున్న సోమిరెడ్డి
హైదరాబాద్‌లోని ఆంధ్రుల తీరూ ఇదే
ఇదో కరోనా రాజకీయ వైచిత్రి
(మార్తి సుబ్రహ్మణ్యం)

కరోనా కాలంలో చిత్ర విచిత్ర రాజకీయాలు దర్శనమిస్తున్నాయి. తెలంగాణలో కరోనా వైరస్ నివారణ, రైతులు పండించిన ధాన్యానికి మార్కెటింగ్ అంశాలపై.. కేసీఆర్ సర్కారు విఫలమయిందని, కాంగ్రెస్-భాజపా విరుచుకుపడుతున్నాయి. కానీ, అదే కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను టీఆర్‌ఎస్ రాజకీయ ప్రత్యర్ధి.. తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రశంసిస్తోంది. అంతే కాదు. కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సలహా ఇస్తున్న వైచిత్రి ఇది.

కదం తొక్కుతున్న కమలం

కరోనా కట్టడిలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమయిందని, కేంద్రం రోజుకు 2వేల మందికి పరీక్ష చేయమని పంపించిన కిట్లను వాడటం లేదని, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ తాజాగా ధ్వజమెత్తారు. పరీక్షలను తక్కువ చేస్తూ, కేసుల సంఖ్యను కూడా తక్కువగా చూపిస్తున్నారని, పాతబస్తీలో లాక్ డౌన్ నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో కేసీఆర్ సర్కారు విఫలమయిందని, ఐకెపి సెంటర్లలో కనీస సౌకర్యాలు లేవంటూ ఇటీవల ఆయన, రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఉపవాస దీక్ష కూడా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 12 కిలోల బియ్యంలో కేంద్రమే 5 కిలోలు ఇస్తోందని, అయితే మొత్తం తానే ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రచారం చేసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రిలో సౌకర్యాలపై, మజ్లిస్ నేత ఓవైసీ కూడా ప్రతికూల వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ విమర్శల హోరు

అటు కాంగ్రెస్ కూడా, కరోనా సమయంలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను తూర్పారపడుతోంది. ధాన్యం కొనుగోలు, కరోనా పరీక్షలలో ప్రభుత్వం విఫలమయిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విరుచుకు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసి, పండ్ల అమ్మకాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చే స్తున్నారు. లాక్‌డౌన్‌తో నష్టపోతున్న పేదలకు 10 వేల సాయం అందించాలని డిమాండ్ చేశారు.

బాబుకు నచ్చిన కేసీఆర్ నిర్ణయాలు

అయితే, తెలంగాణ-ఆంధ్రాలో విపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం, ఇందుకు భిన్నంగా గళం విప్పడం విశేషం. తెలంగాణలో విపక్షాలు కేసీఆర్ నిర్ణయాలను విమర్శిస్తుంటే, టీడీపీ మాత్రం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని చెబుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. కరోనా వైరస్ సోకిన వారికి సరైన పరీక్షలు చేయడం లేదని, కేసుల సంఖ్యను దాచిపెడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నుంచి, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుల వరకూ ప్రతిరోజూ విమర్శలు కురిపిస్తున్నారు. ఈ విషయంలో జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తుండటం విశేషం. ‘నేను సీఎంగా ఉన్నప్పుడు నిర్మించిన గచ్చిబౌలి స్టేడియాన్ని, కేసీఆర్ 1500 పడకల కోవిడ్ ఆసుపత్రిగా మార్చి స్పూర్తి ప్రదర్శించారని స్వయంగా చంద్రబాబు నాయుడే ప్రశంసించారు. మరో సందర్భంలో కూడా కరోనాపై తెలంగాణ సర్కారు వేగవంతమైన చర్యలు తీసుకుంటోందని కొనియాడుతూ, ఆ విషయంలో జగన్మోహన్‌రెడ్డి సర్కారు విఫలమయిందని దుయ్యబట్టారు.

కేసీఆర్‌కు సోమిరెడ్డి కితాబు

ఇక మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అయితే, నేరుగా కేసీఆర్ పాలనాతీరుకే కితాబు ఇచ్చారు. ‘మాపార్టీలు వేరైనా, రాజకీయ ప్రత్యర్థి అయినా నిజాలు మాట్లాడుకోవాలి. కేసీఆర్ పాలన చూసి జగన్మోహన్‌రెడ్డి నేర్చుకోవాలి. కరోనాను కేసీఆర్ ముందు తేలికగా తీసుకున్నా, తర్వాత చాలా సీరియస్‌గా దానిపై యుద్ధం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా తేలికగా తీసుకుంటున్నారు. నేను, నావల్లే జరగాలనుకునే ఇగోయిస్టులకు కేసీఆర్ తీరు కనువిప్పు కావాలి. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే పరిస్థితులను బట్టి సడలింపులు, పట్టవిడుపుల్లో ముందుంటారు. ప్రజల క్షేమం కోరుకునే ఏ నాయకుడికయినా ఈ లక్షణాలు ఉండాల్సిందే. కేసీఆర్ రాజకీయంగా ప్రత్యరి ్థఅయినా, ఈ మాటలు చెప్పకతప్పడం లేద’ని సోమిరెడ్డి ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు.

కేసీఆర్ నిర్ణయాలు కాపీపేస్ట్ చేసుకోవాలని సలహా

మరోసారి.. ‘తెలంగాణ సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా క్యాబినెట్ మీటింగ్ నిర్వహించి, సడలింపు లేని లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. పేదలకు సాయంలో ప్రత్యేక శ్రద్ధతోపాటు, పంటల సేకరణకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. కానీ ఏపీలోనే అర్ధం కాని పరిస్థితి ఉంది. కనీసం కేసీఆర్ నిర్ణయాలనయినా  కాపీపేస్ట్ చేసుకోండ’ని ఏపీ సర్కారుకు సలహా ఇచ్చారు. ఈవిధంగా కేసీఆర్-జగన్ తన రాజకీయ ప్రత్యర్ధులే అయినప్పటికీ, అందులో కేసీఆర్‌ని ప్రశంసిస్తూ, జగన్‌ను విమర్శించడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.

సీమాంధ్రులదీ అదే ధోరణి


అటు హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రుల మనోభావన కూడా దాదాపు అదే రకంగా కనిపిస్తుండటం మరో  ఆశ్చర్యం. కరోనా కాలంలో కేసీఆర్ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని, ఈ విషయంలో జగన్మోహన్‌రెడ్డి విఫలమయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు జగన్ సర్కారు, కరోనాను సీరియస్‌గా తీసుకోవడం లేదని బలంగా నమ్ముతున్నారు. దానికి.. కేసీఆర్ తరచూ రికార్డుచేసి వీడియోల ద్వారా కాకుండా, నేరుగా మీడియా ప్రతినిధులతో ప్రెస్‌మీట్లు నిర్వహస్తుండటం, మంత్రులు మార్కెట్లు, మార్కెట్ యార్డులు సందర్శిస్తుండటమే వారి అభిప్రాయానికి కారణంగా కనిపిస్తోంది.

గ్రేటర్ ఎన్నికలపై ప్రభావం?

ఏపీకి భిన్నంగా.. తెలంగాణలో నిత్యావసర వస్తువులు, సూపర్‌మార్కెట్లు ప్రజలకు అందుబాటులోనే ఉండటం కూడా,  సంతృప్తికి ఒక కారణమని వారి మాటలు బట్టి అర్ధమవుతోంది. పైగా, కరోనా సీజన్‌లో కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా దానికి మరో కారణమంటున్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రులలో నెలకొన్న ఈ తరహా అభిప్రాయం, త్వరలో జరగనున్న బల్దియా ఎన్నికలపైనా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

మోదీ-కేసీఆర్‌పై రోజా విమర్శల మర్మమేమిటో?

ప్రతిఘటన’ సినిమాలో కోట శ్రీనివాసరావు.. ‘వీడు తిడతాండా పొగడ్తాండా’ అన్నట్లు.. వైసీపీ ఎమ్మెల్యే రోజా సవాళ్ల తీరు, మోదీ-కేసీఆర్‌ను ఆమె పొగుడుతున్నారా? విమర్శించమని రెచ్చగొడుతున్నారా అన్నది అర్ధం కాకుండా మారింది.  కరోనా విమర్శల దాడి-ప్రతిదాడి వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు.. చంద్రబాబు భుజం మీద తుపాకీ పెట్టి మోదీ-కేసీఆర్‌ను గురిపెట్టినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో వస్తున్న కేసుల గురించి, తెలుగుదేశం ఎందుకు మాట్లాడటం లేదని రోజా, టీడీపీని ప్రశ్శించారు. ఆ క్రమంలో ఆమె ‘తెలంగాణలో చంద్రబాబును మాట్లాడమనండి. ఎన్ని టెస్టులు చేస్తున్నారండి? అక్కడ తెలుగుదేశం పార్టీ లేదా? ఓటుకునోటు కేసులో దొంగలా పట్టుబడి, పార్టీని కేసీఆర్‌కు తాకట్టు పెట్టి వచ్చిన దొంగ చంద్రబాబు’ అని రోజా దుయ్యబట్టారు.

అంతేకాదు, ఆమె ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌నూ విడిచిపెట్టలేదు. ‘కరోనా కేసులు గుజరాత్‌లో పెరుగుతున్నాయి. దానికి మోదీ కారణమని చెప్పే ధైర్యం చంద్రబాబునాయుడుకు ఉందా’ అని బాబుకు సవాల్ చేశారు. దీన్నిబట్టి.. అటు మోదీ-ఇటు కేసీఆర్ సొంత రాష్ట్రాలను విమర్శిస్తూనే, మరోవైపు దానిపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించడం ద్వారా, వైసీపీ.. వారిని వ్యతిరేకిస్తుందా? సమర్ధిస్తుందా? వారిపైనా తమ మాదిరిగా  విమర్శలు రావాలని కోరుకుంటోందా? అన్న సందేహానికి తెరలేపారు.