సంజయుడి ‘బండి’కి సీనియర్లు సహకరిస్తారా?

ఏళ్ల తరబడి వారే ఆస్థాన నాయకులు
పడకేసిన ఆర్గనైజేషన్ ను పరుగులు పెట్టిస్తారా?
‘హైదరాబాద్ పార్టీ’ ముద్ర చెరిపేస్తారా?
మీడియాలో తప్ప క్షేత్రస్థాయి పోరాటమేదీ?
ద్వితీయ శ్రేణి నేతలకు ఏదీ ప్రోత్సాహం?
కొత్త నేతలకు కనిపించని గౌరవం
రాష్ట్ర కమిటీ ఉండగా కోర్‌కమిటీలతో పనేమిటి?
అనుభవజ్ఞులను అందలమెక్కిస్తారా?
తెలంగాణ కమల దళపతి సంజయ్‌కు కత్తిమీద సామే
(మార్తి సుబ్రహ్మణ్యం)

బండి సంజయ్‌కుమార్.. కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడుతున్న కొత్త కెరటం. అధ్యక్షుడిగా కాకముందే, తెరాస సర్కారుపై ఒంటికాలితో లేచి పోరాడిన యువనేత. అధ్యక్షుడయ్యాక, ధాన్యం కొనుగోలులో రైతు సమస్యల స్వరాలను రాష్ట్ర పార్టీ ఆఫీసులో ఉపవాసదీక్ష నిర్వహించడం  ద్వారా.. సర్కారుకు వినిపించిన జన నేత. సంఘ్ బలంతో పార్టీ ‘సదర్’గా మారిన ‘బండి’ భవిష్యత్తుకు, ఇప్పుడు సీనియర్లే పెద్ద సవాలు. ఏళ్ల తరబడి తిష్టవేసి, కొత్త వారిని ఎదగనీయకుండా, తెలంగాణలో పార్టీని ‘లిమిటెడ్’ కంపెనీగా మార్చిన ‘ఆస్ధాన రాజకీయాలను’ మార్చడం సంజయుడికి కత్తిమీద సామే కాదు, సవాలు కూడా!  క్షేత్రస్థాయి పోరాటాలు మరిపోయి, మీడియాలో ప్రచారానికి ఆరాటపడుతున్న సంస్కృతికి తెరదించడంలోనే.. సంజయ్ సామర్థ్యమేమిటన్నది తేలుతుంది. తనలాంటి యువశక్తులు, దూకుడుగా వెళ్లే కొత్తతరంతోపాటు.. ఏళ్ల తరబడి ఆస్థాన రాజకీయాలతో విరక్తి చెంది, నిరాశతో  పార్టీలో  అంటీముట్టనట్లు ఉండిపోయిన అనుభవజ్ఞులను అందిపుచ్చుకుంటారా? లేక అదే అరడజనుమంది  ‘ఆస్థాన నేతలు’ చెప్పినట్లు నడుచుకుంటారా?  దిశలేని మూస రాజకీయాలకు తెరదించి, పడకేసిన ఆర్గనైజేషన్‌ను దివంగత నేత వి.రామారావు హయాం మాదిరిగా పరుగులు పెట్టిస్తారా? అన్నది తేల్చుకోవడంలోనే, సంజయ్ సత్తా ఏమిటన్నది తేలనుంది.

హైదరాబాదీయుల నుంచి జారిన పార్టీ పగ్గాలు

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలంగాణ భాజపా అధ్యక్షుడిగా నేటి నుంచి పగ్గాలు అందుకున్నారు. ఫైర్, జోష్ , సంఘ్ సిద్ధాంతాలు కలగలసిన సంజయ్.. తన రాజకీయ కేంద్రాన్ని ఇకపై హైదరాబాద్ నుంచి నడిపించనున్నారు. ఇప్పటివరకూ హైదరాబాదీయులకే పరిమితమైన అధ్యక్ష పదవి, తొలిసారిగా గ్రామీణ ప్రాంతాలకు దక్కడం అద్భుతమే. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్, జిల్లా నేతలతో వర్గాలు కట్టడంలో ఘనాపాఠీలయిన హైదరాబాద్ నేతల చేతుల నుంచి పగ్గాలు ఓ జిల్లా నేతకు, అదీ.. జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేయని ఓ యువ కెరటానికి దక్కడం అద్భుతమే మరి. ఇది పార్టీకి సంబంధించి పెనుమార్పే! అయితే, సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా తన ముద్ర వేసే ముందు.. పార్టీలో పాతుకుపోయిన సీనియర్ల సహకారం ఎంతమేరకు అందుకుంటారో చూడాలి. ఎక్కడ ఉన్నా.. పార్టీలో ఉన్న ఆ ఐదారుగురే పార్టీని శాసిస్తున్న సంస్కృతి, సంజయ్ హయాంలోనూ కొనసాగుతుందా? లేక తెరపడుతుందా అన్నది, ఆయన పనితీరుపైనే ఆధారపడి ఉంది.

ఏళ్ల నుంచీ అవే ముఖాలు..

గత నాలుగైదు పర్యాయాల నుంచీ.. వరసగా రాష్ట్ర కమిటీలలో పదవులు పట్టుకుని వేళ్లాడుతున్న వారిని కదిలించాలన్నది కార్యకర్తల కల. ఇప్పటివరకూ మీడియా ద్వారా పోరాడుతున్న పార్టీ, ఇకపై క్షేత్రస్థాయిలో పోరాడాలన్నది మరో స్వప్నం. నిజానికి భాజపాలో చాలామంది  ‘ఆస్థాన నాయకులుగా’ చలామణి అవుతున్నారు. జిల్లాలవారీగా చూసినా.. వారు తప్ప, ద్వితీయ శ్రేణి నేతలు తెరపైకి కనిపించరు. వారిని రానివ్వవన్న అపవాదు కొన్నేళ్ల నుంచి కమలదళాల్లో ఉంది. దశాబ్దాల నుంచి అదే ఆరేడుమంది అగ్రనేతలు తప్ప, మరో కొత్త ముఖం కనిపించిన దాఖలాలు లేవు. నియోజకవర్గాల్లో పాతుకుపోయిన సీనియర్ల ఆదేశాలు కాదని, డివిజన్ల స్థాయి నేతలు సొంతంగా కార్యక్రమాలు కూడా చేయలేని దయనీయం. ‘హైదరాబాద్ పార్టీ’గా ముద్ర పడిన భాజపా,  ఇప్పుడు అక్కడా బలం లేని పరిస్ధితి. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో, పెద్దగా ఖాతాలు తెరవని దయనీయం ఇన్నేళ్ల జాతీయ పార్టీకి సొంతం కావడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఉనికి లేని రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చిన బీజేపీ.. తెలంగాణలో మాత్రం కనీసం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష స్థానానికీ ఎదగకపోవడం విచిత్రమే.  నాలుగుసార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక జాతీయ పార్టీకి పట్టిన ఈ దుస్థితికి ఆర్గనైజేషన్ సరిగా లేకపోవడం, నాయకత్వ ఆలోచనా విధానమే దానికి కారణంగా కనిపిస్తోంది.

దారితప్పిన ఆర్గనైజేషన్..

దీనికి ఆర్గనైజేషన్ పటిష్టంగా లేకపోవడమే కారణమన్నది కమలనాధుల వాదన. దివంగత వి.రామారావు అధ్యక్షుడిగా పనిచేసిన నాటికీ, ఇప్పటికీ పార్టీ అన్ని రంగాల్లో విస్తరించింది. కానీ నాడు ఆర్గనైజేషన్ బలంగా ఉంటే, నేడు అన్ని హంగులు, వనరులూ దండిగా ఉండి కూడా బలహీనంగా ఉందన్న వ్యాఖ్యలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఇబ్రహీంపట్నం మున్సిపల్, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా జిల్లా నాయకత్వం ఒకచోట తెరాసకు, మరొక చోట కాంగ్రెస్‌కు మద్దతునిచ్చిన వైనం, పార్టీలో తగ్గిన క్రమశిక్ష ణకు నిదర్శనమంటున్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, డబెల్‌బెడ్‌రూములు, మూడెకరాల భూమి  వంటి అనేక అంశాలపై కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడుతుంటే.. భాజపా మాత్రం తమ పోరాటాన్ని మీడియాకు పరిమితం చేసిందన్న విమర్శలు లేకపోలేదు. ప్రధానంగా ఇరిగేషన్-డబుల్ బెడ్‌రూమ్ సమస్య అంశంపై కాంగ్రెస్ చేసిన ఆందోళన సర్కారుకు ఇబ్బంది కలిగించింది.

ఆరోజులే నయమంటున్న క్యాడర్..

ఆర్గనైజేషన్ పటిష్ఠంగా ఉన్నప్పుడు ఈ సమస్యలు రావని, సంఖ్యాపరంగా చ ట్టసభలో బలం లేకుండా, కార్యకర్తల సంఖ్య అంతంతమాత్రంగా ఉన్న ఆ  రోజుల్లోనే బంగారు లక్ష్మణ్ హయాంలో ‘సస్యశ్యామల యాత్ర’తో ప్రభుత్వంలో గుబులు పుట్టించిన సందర్భాలను విస్మరించకూడదంటున్నారు. సంస్థాగత ఎన్నికల సమయంలో ఏకాభిప్రాయం ద్వారా కాకుండా, ఎవరో ఆదేశించిన వారికి పదవులిస్తున్న సంప్రదాయం మార్చాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. గతంలో జిల్లా ఇన్చార్జిలుగా ఉన్న రాష్ట్ర నేతలు, రోజుల తరబడి ఆయా జిల్లాల్లోనే ఉండి పార్టీ నేతలను సమన్వయ పరిచేవారు. జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం, ఆయా జిల్లా నేతలను ముందుంచి ధర్నాలు నిర్వహించేవారు. గత కొన్నేళ్ల నుంచి జిల్లా ఇన్చార్జుల పర్యటనలు, మొక్కుబడిగా మారుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
చివరకు రాష్ట్ర ఇన్చార్జిగా ఉన్న కృష్ణదాస్ కూడా రాష్ట్రానికి అతిథిగా వస్తున్నారే తప్ప, ఆయన చేస్తున్న దిశానిర్దేశం కూడా ఏమీ లేదని పెదవి విరుస్తున్నారు. సంఘ్‌పరివారంలో పనిచేస్తున్న వారు, పార్టీకి పనిచేయడానికి ముందుకురాని పరిస్థితి నెలకొందని గుర్తు చేస్తున్నారు. విద్యార్థి ఉద్యమాలకు-ప్రజా జీవితంలో ఉండే రోజువారీ రాజకీయాలకు తేడా తెలియకుండా.. విద్యార్ధి సంఘాల నేతలకు కీలకమైన పదవులివ్వడం ద్వారా, యువమోర్చా నిర్వీర్యమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

రాజకీయాలపై అవగాహన లేని సంఘ్ నేతలు

కాగా ఆంధ్రా-తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రెండు రాష్ట్రాల నాయకత్వాలకు సంఘ్ నుంచి ఆర్గనైజేషన్‌కు వచ్చిన నేతలు.. సరైన దిశానిర్దేశం చేయడం లేదన్న విమర్శలు చాలాకాలం నుంచీ వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఇన్చార్జిలుగా ఉన్న వారికి కేవలం సంఘ్ సిద్ధాంతాలు తప్ప, ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాలు- స్థానిక రాజకీయాలుైె-కులమత సమీకరణపై అవగాహన లేకపోవడమే దానికి కారణమంటున్నారు. ప్రధానంగా సంఘ్ నుంచి వచ్చిన వారికి, స్థానిక రాజకీయాలపై అవగాహన లేకపోవడం వల్లనే, సత్వర నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారంటున్నారు. సతీష్‌జీ రెండు తెలుగు రాష్ట్రాలకు, జాతీయ స్థాయిలో ఇన్చార్జిగా కొన్నేళ్ల నుంచి నిర్నిరోధంగా కొనసాగుతున్నారు. అయినా రెండు రాష్ట్రాల్లో పార్టీ, కనీసం పట్టుమని పదిసీట్లు కూడా సాధించలేకపోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు చేయాలి. సేవా సంస్థల్లో ఉంటే సేవాకార్యక్రమాలు చేయాలి. క్రికెట్ గ్రౌండ్‌లో పుట్‌బాల్ ఆడుతున్న మా సంఘ్ నేతల తీరు ఇప్పటికయినా మారాలి’ అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి..

హైదరాబాద్‌నే తీసుకుంటే.. ఇప్పటివరకూ కొన్నేళ్ల నుంచి నియోజకవర్గ ప్రముఖుగా ఉన్న వారు తప్ప, ద్వితీయ శ్రేణి నేతలు నియోజకవర్గ నేతలుగా ఎదగలేకపోతున్నారు.  వారికి సీనియర్లు అక్కడే బ్రే కులు వేస్తున్న సంస్కృతికి, కొత్త అధ్యక్షుడు పాతర వేయాలంటున్నారు. హైదరాబాద్‌లో టీడీపీతో పొత్తులో భాగంగా,  ఐదుగురు ఎమ్మెల్యేలు, సంతృప్తికరమైన సంఖ్యలో కార్పొరేటర్లు, డిప్యూటీ మేయరు కూడా సాధించిన భాజపా.. ఇప్పటివరకూ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లైబ్రరీ, వాటర్‌వర్క్, హెచ్‌ఎండీఏలకు బకాయి పడ్డ వ ందల కోట్ల రూపాయల నిధులను ఇప్పించాలని,  ఒక్క ఉద్యమం కూడా చేయలేకపోవడాన్ని పలువురు నేతలు గుర్తు చేస్తున్నారు. గతంలో కార్యకర్తల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ చేసిన ఆందోళన కార్యక్రమాలు, ప్రభుత్వాలు- అధికారులను కదిలించేవి. ఇప్పుడు కార్యకర్తలు-నేతల సంఖ్య, సాంకేతిక పరిజ్ఞానం, సంపద పెరిగినా పార్టీ విస్తృతికి అవి అక్కరకు రావడం లేదు.

సమస్యలపై అవగాహన ఉన్న వారేరీ?

అసలు ఇలాంటి సమస్యలను గుర్తించగలిగే స్థాయి నేతలను ఇంతవరకూ తయారుచేయడంలో, పార్టీ నాయకత్వం విఫలమయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు, తెలుగుదేశం పార్టీల మాదిరిగా.. గ్రామీణ ప్రాంతాల సమస్యలపై అవగాహన, ప్రభుత్వ పథకాల సమాచారం గురించి తెలిసిన వారు..తమ పార్టీలో అతి తక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందంటున్నారు. ఇటీవల ధాన్యం, పండ్ల ఉత్పత్తుల గురించి మాట్లాడిన తమ పార్టీ నేతలంతా జిల్లాలకు చెందిన వారేనని గుర్తు చేస్తున్నారు. బండి సంజయ్, డికె అరుణ, సంకినేని వెంకటేశ్వరరావు వంటిఅతి కొద్దిమంది నేతలు తప్ప, ఆ సమస్యలపై గళం విప్పిన దాఖలాలు లేవు. అయినప్పటికీ, ప్రభుత్వం ఆ సమస్యపై  స్పందించాల్సి వచ్చింది.

ముందు ఆర్గనైజేషన్‌పై దృష్టి సారిస్తేనే.. తెలంగాణలో జెండా ఎగురవేస్తామన్న సంజయ్ లక్ష్యం నెరవేరుతుందంటున్నారు. ఇప్పటివరకూ వచ్చిన నాయకత్వాల చర్యలు, నిర్ణయాలు, ఒంటెత్తు పోకడతో విసిగిపోయి, స్తబ్దుగా ఉన్న కరుణాకర్, నాగూరావు, సుగుణాకర్, రామకృష్ణ, శ్యాంసుందర్‌రావు, భీంరావు వంటి సీనియర్ నేతల అనుభవాన్ని వినియోగించుకుంటే మంచిదన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి.

వారికి.. గౌరవం, గుర్తింపు ఏదీ?

ఇక ఇతర పార్టీల నుంచి చేరుతున్న ఇతర పార్టీ నేతలకు, బీజేపీ నేతలు  సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వరన్న అపవాదుకు  కొత్త అధ్యక్షుడు తెరదించాల్సి ఉంది. గతంలో టీడీపీలో కీలకనేత, అనేకసార్లు మంత్రిగా పనిచేసిన ఫైర్‌బ్రాండ్ నాగం జనార్దన్‌రెడ్డి భాజపాలో చేరినా, ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వలేదన్న వ్యాఖ్యలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. కేసీఆర్‌ను విమర్శించేందుకు  ధైర్యం లేని రోజుల్లోనే, ఆయనపై ఒంటికాలితో లేచిన నాగం జనార్దన్‌రెడ్డి, చివరకు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశాలు నిర్వహించుకోవలసిన దుస్థితిని గుర్తు చేస్తున్నారు. చివరకు విసిగిపోయిన ఆయన, కాంగ్రెస్‌లో చేరాల్సి వచ్చింది. సహజంగా.. పార్టీలో కొత్తగా వచ్చిన వారిని ఎప్పటినుంచో పాతుకుపోయిన సీనియర్లు ఎదగనీయరని, దానితో వారంతట వారే, వచ్చిన దారిన బలవంతంగా వెనక్కి  పంపించే ప్రత్యేక సంస్కృతి, కొన్నేళ్లుగా పార్టీలో నాటుకుపోయిందన్న విమర్శలున్నాయి. చివరకు నియోజకవర్గాల్లో దూకుడుగా పనిచేసే సొంత పార్టీ నేతలను, నగర స్థాయికీ ఎదగనీయరన్న విమర్శలు చాలాకాలం నుంచీ ఉన్నవే.

కొత్త నేతలకు దన్ను ఏదీ?

తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి గత కొద్ది నెలల క్రితం ఎంపి గరికపాటి మోహన్‌రావు నేతృత్వంలో.. మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలు వేలసంఖ్యలో భాజపాలో చేరారు. తెలంగాణ పార్టీ చరిత్రలో ఒకేసారి అంత సంఖ్యలో భారీ బహిరంగసభ, కార్యకర్తలు రావటం ఇదే తొలిసారి.  సహజంగా బీజేపీకి భిన్నంగా..నిత్యం జనం మధ్య ఉండే అలవాటున్న టీడీపీ నేతలు, రోజువారీ రాజకీయ కార్యకలాపాలతో హడావిడి చేస్తుంటారు. విలేకరుల సమావేశాలు, ధర్నాలు, పాదయాత్రలు, అధికార పార్టీపై పోరాటాలతో బిజీగా గడిపిన టీడీపీ నేతలకు.. ఇప్పుడు బీజేపీలో చేరిన తర్వాత పని చెప్పేవారు లేరు. గుర్తించేవారు లేరు. పదవులిచ్చే వారు లేరు. కేవలం తెలంగాణలో టీడీపీ లేదన్న కారణం,  జాతీయ పార్టీలో చేరితే గుర్తింపు ఉంటుందన్న భావనతో భాజపాలో చేరిన అనేక మంది టీడీపీ మాజీ నేతలు.. పార్టీలో ఎందుకు చేరామా అని తలపట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కొందరు పార్టీలో చేరదామని వచ్చి వెనక్కి వెళ్లి, మళ్లీ టీడీపీలోనే కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది.

పార్టీ మారినా దక్కని ఫలితం..

పెద్దిరెడ్డి, మోత్కుపల్లి, చాడ సురేష్‌రెడ్డి, ఎర్రశేఖర్, కోనేరు చిన్ని, మేకల సారంగపాణి, శోభారాణి, ఈగమల్లేశం, మండూరి సాంబశివరావు, వనం రమేష్ వంటి నేతలు టీడీపీ నుంచి చేరగా, డికె అరుణ, జితేంద్రరెడ్డి వంటి సీనియర్లు కాంగ్రెస్, తెరాస నుంచి బీజేపీలో చేరారు. హైదరాబాద్‌లో టీడీపీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన మేకల సారంగపాణి, మాజీ కార్పొరేటర్ వనం రమేష్ , మండూరి సాంబశివరావు వంటి నేతలు కిషన్‌రెడ్డి ఎన్నికల ముందు పార్టీలో చేరి, ఏడాదయినా ఇప్పటికీ గుర్తింపు కరవే. వీరిలో ఈ విధానానికి తెరదించి, కొత్తగా వచ్చిన వారికి పార్టీ గౌరవం, గుర్తింపు ఇస్తుందన్న సంకేతం ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ విషయంలో, గత అధ్యక్షుడు లక్ష్మణ్ కొంతమేరకు సఫలమయ్యారు. కొన్ని జిల్లాలో అధ్యక్షులుగా కొత్తవారికి అవకాశం కల్పించారంటున్నారు. మరి కొత్త అధ్యక్షుడు సంజయ్ దీనిపై ఎలాంటి వైఖరి అవలంబిస్తారో చూడాలి.

కోర్‌కమిటీ అవసరమా?

కాగా పార్టీలో రాష్ట్ర కమిటీ ఉండగా, మళ్లీ కోర్‌కమిటీ అవసరం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. అసలు కోర్ కమిటీ పార్టీ రాజ్యాంగంలోనే లేదని, పలువురు సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. చాలాకాలం నుంచి కొనసాగుతున్న వివిధ స్థాయి కోర్‌కమిటీలలో, చర్చలు-మేధోమథనం ఉండదని, సీనియర్లు చెప్పినవే ఖరారవుతున్న సంప్రదాయం కనిపిస్తోందంటున్నారు. ‘ఫలానా నేత చెప్పిన దానికి కోర్‌కమిటీ  మమ అనిపిస్తే, ఇక దాని వల్ల ఏం ప్రయోజనమ’ని ఓ నేత ప్రశ్నించారు.  ఒకవైపు రాష్ట్ర కమిటీ ఉండగా, మళ్లీ దానిని శాసించడానికి కోర్‌కమిటీ ఎందుకన్న చర్చ చాలా కాలం నుంచీ వినిపిస్తోంది.

సొంతంగా ఆలోచనలు.. అడుగులేస్తేనే

సంజయ్ పార్టీ పగ్గాలందుకున్న నేపథ్యంలో.. సీనియర్లు, ఆయన దూకుడుకు కళ్లెం వేసే ప్రమాదం లేకపోలేదని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అధ్యయనం-పరిశీలన-అవగాహన-సమిష్టి ఆలోచనలు-పోరాటం-సొంత నిర్ణయాలపై అడుగులు వేస్తేనే ఆయన సారధ్యం విజయవంతమవుతుందంటున్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా, ఆ ఐదారుగురు నేతల అభిప్రాయాలకే పరిమితం కాకుండా.. అందరి సూచనలు తీసుకోవాలంటున్నారు. తాను ‘ఆ ఐదారుగురు నేతల ప్రతినిధిని’ కాదని సంకేతాలివ్వడంలోనే..  ఆయన నాయకత్వ ప్రతిభ, పార్టీ విస్తరణ ఏమిటన్నది తేలిపోతుందన్నది సీనియర్ల మనోగతం.

You may also like...

1 Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami