బాబు బెజవాడకు బయలుదేరరా?

554

రావాలని వైసీపీ నేతల సవాళ్లు
హైదరాబాద్‌లో ఉండి మాట్లాడుతున్నారని విమర్శ
గతంలో జగన్‌పై ఇలాంటి ఆరోపణలు చేసిన టీడీపీ
వస్తేనే మంచిదంటున్న తమ్ముళ్లు
సీపీఐ నేత రామకృష్ణదీ అదేమాట
(మార్తి సుబ్రహ్మణ్యం)

కరోనా నేపథ్యంలో హైదరాబాద్ లోని తన నివాసానికే పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బెజవాడకు వెళతారా? లేదా? అన్న అంశంపై అధికార ప్రతిపక్ష పార్టీల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

హైదరాబాద్ నుంచే బాబు ఆపరేషన్

కరోనా వైరస్ విజృంభించకముందే హైదరాబాద్‌కు వెళ్లిన చంద్రబాబు నాయుడు, అప్పటినుంచీ అక్కడే ఉండిపోయారు. లాక్‌డౌన్ విధించడం, రాష్ట్ర సరిహద్దులు మూసివేయడమే దానికి కారణం. అయితే, ఆయన ఏపీలో కరోనా వైరస్ నేపథ్యంలో.. ప్రజల కష్టాలు, రైతాంగ సమస్యలు, వైద్యుల ఇబ్బందులు, ఆర్ధిక పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకు  లేఖలు రాస్తున్నారు. కీలకమైన అంశాలపై జూమ్ టెక్నాలజీ ద్వారా, నిరంతరం ప్రెస్‌మీట్లు నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రధాని మంత్రి మోదీ కూడా ఆయనకు ఫోన్ చేశారు. అదే పద్ధతిలో పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ, కరోనా పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

బాబుపై వైసీపీ నేతల ఎదురుదాడి

అయితే, కరోనా కిట్ల కొనుగోలులో అవకతవకలు, ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ను తొలగించి కనగరాజ్‌ను నియమించడం, వైసీపీ నేతలు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతుండటం, కనగరాజ్‌ను తమిళనాడు నుంచి తీసుకురావడం, వాలంటీర్ల అక్రమాలపై తరచూ విమర్శలు కురిపిస్తుండటం మంత్రులు, వైసీపీ నేతలకు ఆగ్రహం కలిగిస్తోంది. దానితో వారు చంద్రబాబుపై మూకుమ్మడి విమర్శల దాడికి దిగుతున్నారు.

చంద్రబాబు హైదరాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉండి, ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని ఎంపి విజయసాయిరెడ్డి, అంబటి, మల్లాది విష్ణు, రోజా, దాడి వీరభద్రరావు సహా మంత్రులంతా ఎదురుదాడి చే స్తున్నారు. కొడాలి నాని, మోపిదేవి, కన్నబాబు వంటి మంత్రులయితే.. ఒకవేళ బాబు విజయవాడకు వస్తే, ఆయనను క్వారంటైన్‌లో ఉంచుతామని హెచ్చరించే వరకూ వెళ్లారు.

నాడు తుపాను సమయంలో జగన్‌పై ‘దేశం’ విమర్శలు

గతంలో బాబు సీఎంగా ఉన్నప్పుడు విపక్ష నేతగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రానికి రాకుండా, హైదరాబాద్‌లోనే ఉండి బాబు సర్కారు విధానాలను విమర్శించేవారు. దానితో మంత్రులు, టీడీపీ నేతలు.. జగన్ రాష్ట్రానికి రాకుండా హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో కూర్చుని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తేవారు. తిత్లీ, హుద్‌హుద్ తుపాన్ల సమయంలో, పక్క జిల్లాలోనే పాదయాత్రలో ఉన్న జగన్.. తుపాను బాధితులను పరామర్శించకపోవడంపైనా టీడీపీ నేతలు విమర్శించారు. అయితే, దీనిపై నాడు జగన్.. ‘ఈ పెద్ద మనిషి అంటాడూ.. నేను తుపాను బాధితులను ఎందుకు పరామర్శించడం లేదంటాడు. నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు. అధికారం మీ చేతుల్లో ఉంది. ఖజానా మీ చేతుల్లో ఉంది’ అని ఎదురుదాడి చేశారు.

నాడు జగన్.. నేడు బాబు

ఇప్పుడు కరోనా నేపథ్యంలో.. వైసీపీ నేతలు కూడా, హైదరాబాద్‌లో ఉండి విమర్శలు చేస్తున్న చంద్రబాబుపై,  అదే తరహాలో ఎదురుదాడి ప్రారంభించడం ఆసక్తికలిగిస్తోంది. రాష్ట్ర ప్రజలపై అంత అభిమానం ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఎందుకు రావడం లేదని కొందరు.. వస్తే 14 రోజులు క్వారంటైన్‌లో పెడతామని మరికొందరు విమర్శల వ ర్షం కురిపిస్తున్నారు. ఈవిధంగా, గతంలో విపక్ష నేతగా ఉన్న జగన్‌పై విమర్శలకు హుదహుద్-తిత్లీ తుపాన్లు కారణమయితే, ఇప్పుడు అదే విపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు కరోనా కారణమవుతోందన్న మాట.

బాబు రావచ్చన్న శ్రీకాంత్‌రెడ్డి..

అయితే, ఇటీవల ఎన్ టీవీలో జరిగిన ఒక చర్చలో మాట్లాడిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి… మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి వస్తే, ఆయనను హోం క్వారంటైన్ చేస్తామని స్పష్టం చేశారు. దీనికి స్పందించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.. హైదరాబాద్ నుంచి చంద్రబాబునాయుడు బెజవాడకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. తాను డీజీపీ అనుమతితో, హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చానని, చంద్రబాబు కూడా అలాగే అనుమతి తీసుకుని.. బెజవాడకు రావచ్చుకదా అని ప్రశ్నించడం చర్చనీయాంశమయింది. ఇటీవలి కాలంలో టీడీపీతో కలసి పనిచేస్తున్న సీపీఐ కూడా, చంద్రబాబు బెజవాడకు వస్తేనే మంచిదని చెప్పడం ప్రస్తావనార్హం.

బాబు వస్తేనే బాగుంటుందన్న తమ్ముళ్లు

అటు  తెలుగుదేశం నాయకులు కూడా ఈ విషయంలో సీపీఐ రామకృష్ణ వ్యక్తీకరించిన అభిప్రాయాన్నే బలపరుస్తున్నారు. పరాయి రాష్ట్రంలో ఉంటూ విమర్శలు చేయడమేమిటని, గతంలో తాము జగన్‌ను విమర్శించినట్లే.. ఇప్పుడు వైసీపీ కూడా, హైదరాబాద్‌లో ఉండి విమర్శించడమేమిటని బాబుపై విమర్శలు చేయడం సహజమేనంటున్నారు. దీనిని రాజకీయకోణంలోనే చూడక తప్పదని వ్యాఖ్యానిస్తున్నారు. కాకపోతే అలాంటి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ఉంటే సరిపోతుందని చెబుతున్నారు.  అయితే, వారు విమర్శలు చేశారని కాకుండా, బాబు బెజవాడ వస్తేనే మంచిదంటున్నారు.

రామకృష్ణనే అనుమతించిన డీజీపీ బాబుకు ఇవ్వరా..

‘బాబుగారు  బెజవాడ వచ్చినప్పటికీ పక్కనే ఉన్న మంగళగిరి పార్టీ ఆఫీసుకు వెళ్లడానికీ కుదరదు. కాకపోతే, ఈ సమయంలో ప్రభుత్వ వైఫల్యంపై పోరాడుతున్న మా పార్టీ నేతలకు ఆత్మస్థైర్యం ఇచ్చినట్టవుతుంది. మా సార్ బయట రాష్ట్రంలో ఉండటానికి, ఇక్కడ ఉండటానికీ తేడా ఉంటుంది. అప్పుడు వైసీపీ నేతల నోళ్లు కూడా పడతాయి. బాబుగారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే అప్పుడు వాళ్లు కూడా ఏం మాట్లాడలేర’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల విమర్శలు, ట్వీట్ల నుంచి తప్పించుకోవాలంటే అదొక్కటే మార్గమంటున్నారు. సీపీఐ రామకృష్ణ లాంటి నేతకే హైదరాబాద్ నుంచి బెజవాడ రావడానికి అనుమతించిన డీజీపీ, ప్రతిపక్ష నేతయిన చంద్రబాబు నాయుడుకు సులభంగానే అనుమతి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి, దానిని వినియోగించుకోవడమే మంచిదని సూచిస్తున్నారు