ఏపీకి కేంద్రబృందాలు వస్తున్నాయ్!

212

నిజమేనన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
టెస్టుల సంఖ్యపై అనుమానాలు
విశాఖపైనే ఎక్కువ దృష్టి?
వద్దంటున్నా ర్యాపిడ్ టెస్టుల నిర్వహణ
బీజేపీ ఫిర్యాదు ఫలితమేనా?
(మార్తి సుబ్రహ్మణ్యం)

కరోనా కల్లోలాన్ని అంచనా వేసేందుకు.. ఇప్పటికే తెలంగాణ సహా ఆరు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం, త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనుంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలో వెల్లడించడం విశేషం. నిజానికి గత వారం రోజుల నుంచి దీనిపై వార్తలు వెలువడుతున్నప్పటికీ, అది నిర్ధారణ కాలేదు. కిషన్‌రెడ్డి తాజా వ్యాఖ్యలతో అది నిజం కానుంది.
కేంద్ర హోం, ఆరోగ్యశాఖ అధికారులు ఈ బృందంలో ఉండనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరీక్షలు, క్వారంటైన్లలో వసతి సౌకర్యాలు, కిట్ల వాడకం, ఆసుపత్రులలో సౌకర్యాలు, కేంద్రం పంపిస్తున్న కిట్లు, మాస్కుల వినియోగం వంటి అంశాలను ఈ బృందం తనిఖీ చేస్తుంది. పశ్చిమ బెంగాల్‌లో ఈ బృందానికి.. అక్కడి సీఎం మమతబెనర్జీ తొలుత సహాయ నిరాకరణ చేయడంతో, కేంద్ర హోం శాఖ కన్నెర చేసింది. దానితో మమత సర్కారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దానితో కేంద్రబృందాల పని సుగమమం అయింది. ప్రస్తుతం తెలంగాణలో కూడా కేంద్రబృందాలు పర్యటిస్తున్నాయి.

అయితే, ఆంధ్రప్రదేశ్‌లో  జగన్మోహన్‌రెడ్డి  ప్రభుత్వం మొదటి నుంచీ.. కరోనా వైరస్‌ను తక్కువ చేసి చూపించడంతోపాటు, కేసులు-మరణాల సంఖ్యను కావాలనే దాచిపెడుతోందని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచీ ఆరోపిస్తోంది. అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీనిపై అందరికంటే ముందుగానే అనుమానం వ్యక్తం చే శారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని ఆయన అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాతనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అలాంటి సందేహాలనే వ్యక్తం చేశారు.

పైగా… వైసీపీ ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా జిల్లా సరిహద్దులు దాటి.. లాక్‌డౌన్ నిబంధన ఉల్లంఘిస్తున్నారని  బీజేపీ-టీడీపీ,  ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేశాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మరో అడుగుముందుకేసి.. రాష్ట్రంలో జరుగుతున్న ఈ వ్యవహారంపై కేంద్ర బృందాలతో విచారణ జరిపించాలని లేఖ రాసింది. దాని ఫలితంగానే  కేంద్ర బృందాలు రాష్ట్రానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రకారంగా.. కేంద్ర బృందాలు ప్రధానంగా విశాఖ, కర్నూలు, గుంటూరు, విజయవాడ నగరాలపై ఎక్కువ దృష్టి సారించనున్నట్లు సమాచారం.

రాజధానిని తరలించాలని సర్కారు పట్టుదలతో ఉన్నందుకే..  విశాఖలో ఎక్కువ కేసులు వస్తున్నా, వాటిని తక్కువ చూపించే ప్రయత్నం జరుగుతోందని బీజేపీ-టీడీపీ ఇప్పటికే ఆరోపణ చేస్తున్నాయి. విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ యధేచ్చగా విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం జిల్లాలకు తిరుగుతున్నారని, ఆయనతోపాటు వైసీపీ కార్యకర్తలు సామాజిక దూరం పాటించకుండా, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఫిర్యాదు చేశాయి. విశాఖలో ఎయిర్‌పోర్టు, నౌకాయానకేంద్రం ఉన్నందున, విదేశాల నుంచి ఎక్కువమంది వస్తుంటారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

పైగా విశాఖకు చెందిన కొందరు ముస్లింలు మర్కజ్‌కు వెళ్లి వచ్చినప్పటికీ, అక్కడ ఎక్కువ కేసులు నమోదు కాకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. అసలు కరోనా కేసులు లేని శ్రీకాకుళం జిల్లాలో కూడా కేసులు నమోదు కావడం బట్టి, ఉత్తరాంధ్ర విషయంలో ప్రభుత్వం నిజాలు దాచిపెడుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్రబృందాలు వస్తే తప్ప నిజాలు బయటపడవని భావించిన బీజేపీ నాయకత్వం, ఆ మేరకు కేంద్రానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.

అటు పార్టీపరంగా కూడా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, తమ జిల్లా నేతలతో రోజూ టెలీకాన్ఫరెన్సు నిర్వహిస్తూ, కరోనా కేసులపై ఆరా తీస్తున్నారు. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా కేసులు పెరగడానికి వైసీపీ ప్రజాప్రతినిధులే కారణమని ఇప్పటికే ఆ రెండు పార్టీలు ధ్వజమెత్తాయి. శ్రీకాళహస్తిలో వైసీపీ ఎమ్మెల్యే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన తర్వాతనే, కరోనా కేసులు పెరిగాయని బీజేపీ ఇప్పటికే ట్వీట్ చేసింది. ఇదే విషయాన్ని అటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా  ఆరోపించిన విషయం తెలిసిందే. కర్నూలు ఎంపీ కుటుంబసభ్యులకూ వైరస్ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

కాగా కరోనా నేపథ్యంలో.. ర్యాపిడ్ టెస్టు కిట్లతో చేస్తున్న పరీక్షలు ప్రామాణికం కాదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. వాటి నిర్ధరణకు ప్రామాణికం లేనందున, ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు మాత్రమే చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఎందుకంటే.. వాటితో శరీరంలో రోగనిరోధక శక్తి ఎంతవరకూ ఉంటుందనేది మాత్రమే తెలుస్తుంది. అందుకే వైరస్‌ను నిర్ధారించేందుకు, ఆర్‌టీపీసీఆర్ పరీక్ష లు మాత్రమే చేయాలన్నది ఐసీఎంఆర్ వాదన. అయినా సరే.. దానిని లెక్కచేయకుండా, దేశంలోనే ఎక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ప్రచారం చేసుకునేందుకు.. ర్యాపిడ్ టెస్టు కిట్లతో పరీక్షలు చేస్తున్న విషయాన్ని బీజేపీ కేంద్ర దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. త్వరలో రానున్న కేంద్రబృందం దానిపై కూడా దృష్టి సారించనుంది. కేంద్రానికి రానున్న బృందం విశాఖపైనే ఎక్కువ దృష్టి సారించే అవకాశాలున్నట్లు బీజేపీ నేతల మాటల బట్టి స్పష్టమవుతోంది.