కరోనాతో సహజీవనం చేయక తప్పదట
తరిమివేస్తామంటున్న ప్రధాని మోదీ
‘జగన్మోహన సందేశం’తో కళ్లు తెరచుకున్న ప్రపంచం
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఈ పెద్దోళ్లున్నారే.. మా పిల్లల మనసు అర్ధం చేసుకోరు. ఆ అమెరికా ప్రెసిడెంటు ట్రంప్ ఉన్నాడే.. ఉత్తి పిచ్చోడు. కయ్యి కయ్యిన అరుస్తుంటాడు. కరోనా వైరస్‌పై నానా హంగామా చేస్తున్నాడు. చైనామీద మాటి మాటికీ కళ్లెర్ర చేస్తున్నాడు. మన ప్రధాని మోదీ ఉన్నారే.. పాపం ఆయన కరోనాపై యుద్ధానికి నానా పాట్లు పడుతున్నారు. దానిని తరిమివేస్తామంటున్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ఒకటుంది క దా? అదేమో.. కరోనా ఆరోగ్యసూత్రాలంటూ తెగ సూక్తిముక్తావళి చెబుతోంది.. మన శాస్త్రజ్ఞులేమో, కరోనా యాంటీ వైరస్ అంటూ నానా హడావిడి చేస్తున్నారు. అసలు ప్రపంచం ప్రపంచమే క రోనాపై గగ్గోలెత్తిపోతోంది. అయితే.. చంకలో బిడ్డను పెట్టుకుని దేశమంతా తిరిగినట్లు.. మన దేశంలోనే, ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న ఆణిముత్యాన్ని ఉంచుకుని, కరోనాపై ఖంగారుపడుతున్న వారిని చూస్తే జాలేస్తోంది. అసలు కరోనా పెద్ద రోగమే కాదని, దానితో మనమంతా సహజీవనం చేయకతప్పదని చెప్పిన, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వంటి.. తత్వవేత్త-శాస్త్రవేత్త ఇచ్చిన సందేశంతో ప్రపంచ ప్రజలు కళ్లు తెరచుకోవాలి. అప్పుడే తెర చుకోవడం మొదలయింది కూడా!
కరోనాపై దేశమంతా ఆగమాగం…
నిజం. ప్రపంచమంతా కరోనాపై శివమెత్తుతోంది. పెద్ద పెద్ద దేశాధినేతలే దానికి భయపడి కలుగులో దాక్కుంటున్నారు. ఇటలీ పోప్ శిష్యుడికే కాదు, రాష్ట్రపతి భవన్, ఏపీభవన్కూ కరోనా సెగ తప్పడం లేదు. ప్రధాని మోదీ నిరంతరం వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు పరితపిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్మీట్ల మీద ప్రెస్మీట్లు పెట్టి, అందరినీ హెచ్చరిస్తున్నారు. చంద్రబాబునాయుడు సర్కారుకు లేఖల మీద లేఖలు రాస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ జీతాలు త్యాగం చేస్తున్నారు. కానీ.. వారందరికీ తెలియదు… జగన్మోహన్రెడ్డి అనే యువ ముఖ్యమంత్రికి, కరోనా గురించి తెలిసినంతగా మిగిలిన వారికి ఒక్క శాతం కూడా తెలియదని!
జగనన్న మేధస్సును గుర్తించరేం?
భారత్ సహా ప్రపంచ శాస్త్రజ్ఞులంతా, కరోనా యాంటీ వైరస్ సృష్టి కోసం ల్యాబ్‌లలో కుస్తీలు పడుతున్నారు. దానికి ఆయా దేశాలు వేల కోట్లు వెచ్చించడతానికి సిద్ధమవుతున్నాయి. వారి తపన, తాపత్ర యం ఒక్కటే.. అది వైరస్‌కు ప్రత్యామ్నాయంగా వ్యాక్సిన్ కనుక్కోవాలి! దానికోసమే వారి పోరాటం. కానీ ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి శాస్త్రజ్ఞుడు కాకపోయినా, డాక్టర్ కాకపోయినా.. సొంతంగా చేసిన పరిశోధన ప్రపంచాన్నే కళ్లు తెరిపించడం విశేషం. కరోనా పెద్ద రోగం కాదని, అది పారసిట్మల్ టాబ్లెట్ వేసుకుంటే.. ఇట్స్ కమ్స్ అండ్ గోస్ మాదిరిగా పోతుందని గతంలోనే సెలవిచ్చారు. అయితే, దానిని చాలామంది ఎగ తాళి చేశారు. ఆయన కష్టపడి తెలుసుకున్న రహస్యాన్ని వ్యంగ్య వ్యాఖ్యలతో జోడించారు. దానితో ఆయన మనసు కలుక్కుమంది. ప్రపంచానికి నిజం చెబితే ఎవరూ నమ్మడం లేదేమిటని ఆయన హృదయం ఆవేదనతో ద్రవించిపోయింది. పిల్లోడి మాటలుగా ఎందుకు కొట్టిపారేస్తున్నారో ఆ పసి హృదయానికి అర్ధం కాలేదు. ఈ ప్రపంచం అంతే… మేధావులను ఎప్పుడూ గుర్తించదు!
నోబెల్.. కాకపోతే కనీసం భారతరత్న కూడా ఇవ్వరా?
ఇప్పుడు అదే జగన్మోహన్రెడ్డి తన పరిశోధనలో మరో బ్రహ్మాండమైన రహస్యం బద్దలు చేశారు. కనీసం డాక్టర్ కూడా కాని ఆయన చేసిన పరిశోధన ఫలితాలు తెలుసుకున్న ప్రపంచం ఖంగుతింది. మన మధ్యే ఉన్న ఆయన, ఇంత విజ్ఞానవిషయఖని అన్న విషయం తమకు ఇప్పటివరకూ తెలియనందుకు, తెలుగుజాతి జనులు తమ పొరపాటుకు నాలిక్కరచుకున్నారు. మీ విజ్ఞానం తెలియని అజ్ఞానులమంటూ క్షమాపణ వేడుకుంటున్నారు. నోబెల్ బహుమతులు కూడా కొట్టేసిన శాస్త్రజ్ఞులకే తెలియని, విజ్ఞానరహస్యం బయటపెట్టిన జగన్మోహన్రెడ్డి మేధస్సుకు ఇప్పటివరకూ నోబెల్ ఎందుకు ఇవ్వలేదని, నోబెల్ అవార్డు కమిటీని ప్రపంచం నోరారా తిట్టిపోసింది.
ఎడిసన్, గ్రాహంబెల్, కలాం సరసన..
ఇంతకూ ప్రపంచం ప్రపంచమే అచ్చెరువొందేలా చేసిన జగన్మోహన సందేశం ఏమిటంటే.. కరోనా పెద్ద వ్యాధి కాదని, అది తనతో సహా ఎవరికైనా రావచ్చని మరోసారి చెప్పారు. కానీ మనమంతా కరోనాతో సహజీవనం చేయాల్సి ఉంటుందన్న జగన్మోహన సందేశమే, ప్రపంచ ప్రజల దృష్టిలో ఆయనో థామస్ ఆల్వా ఎడిసన్.. గ్రాహంబెల్.. మేడమ్ క్యూరీ..అబ్దుల్‌కలాం.. రామానుజం సరసన నిలబెట్టింది. కనీసం ఇప్పుడయినా భారత సర్కారు కళ్లుతెరచి, కరోనా తత్వం బయటపెట్టిన జగన్మోహన్రెడ్డికి భారతరత్న అవార్డు ఇవ్వకపోతే తెలుగుజాతిని అవమానించినట్లేనంటున్నారు! ఏదో సెంచ రీల మీద సెంచరీలు చేసిన సచిన్టెండూల్కర్ లాంటి వాడికే భారతరత్న ఇచ్చిన ప్రభుత్వం.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తత్వం బయటపెట్టిన జగన్మోహన్రెడ్డికి, ఆ అవార్డు ఇవ్వకపోవడం అన్యాయం, అక్రమం!!
గందరగోళ ప్రసంగం..
కరోనా నేపథ్యంలో.. జగన్మోహన్రెడ్డి జాతినుద్దేశించి చేసిన వీడియో ప్రసంగం గందరగోళంగా కనిపించింది. ఒకసారి ఇది చిన్న జ్వరం లాంటిదే కాబట్టి ప్రమాదం లేదన్నారు. మళ్లీ ప్రమాదమన్నట్లు చేసిన వ్యాఖ్యలు అయోమయంగా మార్చాయి. దీనిపై ఎవరూ పానిక్ కావలసిన పనిలేదన్న ఆయనే.. ఇది స్వైన్‌ఫ్లూ, ఆటలమ్మ మాదిరిగా అంటు వ్యాధి అని, ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుందని సెలవిచ్చారు. అసలు జగన్ ఏమన్నారంటే.. ‘‘ కరోనా ఎవరికైనా రావచ్చు, పోవచ్చు. నాకైనా రావచ్చు. ఇది నథింగ్ బట్ జ్వరం! వస్తుంది, వెళ్లిపోతుంది. ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనాను ఎప్పటికీ కట్టడి చేయలేము. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. రాబోయే రోజుల్లో కరోనాతో మనం సహజీవనం చేయాల్సిన పరిస్థితి. దీనిని ఎప్పటికీ తీసేయలేము’’
మోదీ మాటలకు భిన్నంగా..
కానీ, ప్రధాని మోదీ మాత్రం, కరోనాను తరిమేయాలని ఇప్పటికి అనేకసార్లు చెబుతున్నారు. ‘‘మానవజాతి గతంలో ఉన్నడూ చూడని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశం ఓ పెద్ద యుద్ధ్దం చేస్తోంది. కరోనాపై మనం గెలవాలి. గెలిచి తీరతాం. గెలుస్తాం. ఈ ప్రాణాంతక వైరస్‌ను రూపుమాపాలన్నదే మా ప్రయత్నం’’ అని చెబుతున్నారు.