వృద్ధులకు ఊరటనిచ్చిన సీఎస్ ఉత్తర్వు
మార్పు మంచిదే
(మార్తి సుబ్రహ్మణ్యం)
తప్పులు చేయడం మానవ సహజం. దానిని సరిదిద్దుకునే వారే గొప్పవారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా అందుకు మినహాయింపు కాదు. కరోనా దెబ్బకు కుదేలయిన ఆర్ధిక పరిస్థితికి ఖజానా డొల్లగా మారింది. దానితో పక్కనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే… జగన్మోహన్‌రెడ్డి కూడా ఉద్యోగుల వేతనాల్లో వాయిదా పేరుతో కోత విధించారు. ఇది ఉద్యోగులకు మనస్తాపం కలిగించినా, ఇప్పటి పరిస్థితిలో అది తప్పలేదన్నది ప్రభుత్వ వాదన. చివరకు కేంద్రం కూడా 2021 వరకూ  పెంచిన డీఏ చెల్లింపులు నిలిపివేసింది. దీనివల్ల 50 లక్షల మంది ఉద్యోగులతోపాటు, 61 లక్షల మంది పెన్షనర్లకు నష్టం వాటిల్లింది. పార్లమెంటు సభ్యుల వేతనాల్లోనూ కోతవిధించింది.

అయితే, ఏపీలో ప్రభుత్వం వద్ద 36 వేల కోట్ల నగదు నిల్వలు ఉన్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే పించనులో కోత విధించడం ఏపీలో విమర్శలకు దారితీసింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పుడు, 6 వేల కోట్ల రూపాయల బిల్లులు తనకు కావలసిన కాంట్రాక్టర్లకు ఎలా చెల్లించారన్న రచ్చ కూడా జరిగింది. కమిషన్ల కోసమే జగన్మోహన్‌రెడ్డి సర్కారు ఆ బిల్లులు చెల్లించిందని ఆరోపించాయి.  ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివరిస్తూ ప్రజలకు ఓ లేఖ రాశారు. పెన్షనర్లకూ కోత విధించడాన్ని విపక్షాలు తప్పు పట్టాయి. పెన్షనర్లకు పూర్తి పించన్ చెల్లించాలని లేఖ కూడా రాశారు.

దీనితో తాజాగా దిద్దుబాటుకు దిగిన జగన్మోహన్‌రెడ్డి సర్కారు.. అన్ని రకాల పెన్షనర్లకూ ఏప్రిలో పూర్తి పెన్షన్ చెల్లించాలని నిర్ణయం తీసుకుని, వారి అభినందనలు అందుకుంది.  ఆ మేరకు సీఎస్ ఇచ్చిన ఉత్తర్వు వారికి ఊరటనిచ్చింది. ఈ విషయంలో తొలుత విమర్శలకు గురైన జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం, తర్వాత దిద్దుబాటు చేసుకోవడమే దానికి కారణం. ఇలాంటి విధానాలే మిగిలిన అంశాల్లోనూ అనుసరిస్తే, ఆయన సర్కారుకు ప్రజామోదం లభిస్తుంది. ఎన్టీరామారావు వంటి ప్రజాకర్షణ ఉన్న నేతలే తమ విధానాలు, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మార్చుకున్నారు. నిజానికి పెన్షనర్ల పించన్లలో కోత విధించిన కేసీఆర్-జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలు తీవ్ర ఆగ్రహానికి, విమర్శలకు గురయ్యాయి. వృద్ధాప్యంలో చికిత్స, మందుల కొనుగోలు, ఇతర కుటుంబ అవసరాలు ఎక్కువగా ఉండే పెన్షనర్ల పించన్లలో కోత విధించడం.. సమాజంలోని ఏ వర్గానికీ నచ్చలేదు. పైగా వితంతు, వృద్ధాప్య పించన్లు ఇచ్చేదే తక్కువ. వారితోపాటు, ఉద్యోగుల పించన్లకు మినహాయింపు ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనూ వినిపించింది.

అయితే, ఇప్పుడు ఈనెల రాష్ట్ర ఆదాయం ఇంకా దారుణంగా దెబ్బతిన్నప్పటికీ, కేంద్రనిధులు రాష్ట్రాన్ని ఆదుకున్నాయి. దానితో అన్ని రకాల పెన్షన్లు అందుకునే పెన్షనర్లపై కరుణ చూపిన జగన్మోహన్‌రెడ్డి వారినుంచి సహజంగానే  కృతజ్ఞతలు అందుకున్నారు.  నిజానికి ఆ పనేదో ముందే చేసి ఉంటే విమర్శలు తప్పి ఉండేవి. ఏదైనా  అనుభవమైతే గానీ తత్వం బోధపడదన్నది జగన్మోహన్‌రెడ్డి విషయంలో రుజువయింది. ఇక లక్షల్లో నెలవారీ వేతనం, ఇతర మార్గాల ద్వారా డబ్బు సంపాదించుకునే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ల  వేతనాలు వాయిదా వేయడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు.  అఖిల భారత సర్వీసులకు చెందిన అధికారులకు 60 శాతం కోత విధించడాన్ని కూడా ఎవరూ తప్పుపట్టడం లేదు.

కానీ అతి తక్కువ వేతనాలు ఉండే నాలుగో తరగతి, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు  గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులకూ పెన్షనర్ల మాదిరిగానే, పూర్తి వేతనం చెల్లిస్తే బాగుండేది. వారికి పది శాతం మినహాయించి ఇవ్వడం వల్ల ఖజానాకు పెద్దగా మిగుల్చుకునేది కూడా ఉండదన్నది ఆర్ధిక నిపుణుల అభిప్రాయం. కాంట్రాక్టు-అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నందున, వారికి పూర్తి స్థాయి వేతనాలు ఇస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదైనా.. మార్పు మంచిదే!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner