టీడీపీ.. ఏమైనా పాకిస్తాన్ ఐఎస్‌ఐ సంస్థనా?

241

బాబు మరో వూహాన్ సృష్టించారా ఏంటి?
టీడీపీ స్లీపర్‌సెల్స్‌తో కరోనా వ్యాప్తి చేస్తుందన్న మోపిదేవి
వైరస్ వ్యాప్తిలో టీడీపీ కుట్ర ఉందన్న మంత్రి
ఇంకా స్లీపర్‌సెల్స్ ఆధారాలు పోలీసులకు ఇవ్వలేదేం?
మరి నిఘా దళం, పోలీసులు ఏం చేస్తున్నట్లు?
స్లీపర్‌సెల్స్ ఆరోపణపై మంత్రిని విచారిస్తారా?
దిగజారుతున్న ఏపీ రాజకీయాలు
                      (మార్తి సుబ్రహ్మణ్యం)

ఆంధ్రప్రదేశ్  రాజకీయాలు అసహ్యస్థాయిని దాటి, పేరు పెట్టలేని నీచ స్థితికి దిగజారుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్-చంద్రబాబు-కేసీఆర్ మధ్య ఎన్ని విబేధాలు, వైరుధ్యాలు, బేధాభిప్రాయాలున్నా.. అవి మోతాదుకు మించకపోగా, జనంలో ఆసక్తి కలిగించేవి. అవన్నీ ఎత్తుపైఎత్తు రాజకీయాలు, అంశాలకు లోబడి ఉండేవి. ప్రత్యక్షప్రసారం ద్వారా అసెంబ్లీ సమావేశాలు  చూసే ప్రజలు వాటికి అతుక్కుపోయేవారు. బాబు-వైఎస్-కేసీఆర్-రోశయ్య  వాద-సంవాదాలు ఆద్యంతం ఉత్కంతభరితం, ఆసక్తికరంగా సాగేవి.

వైఎస్-బాబు-కేసీఆర్-రోశయ్య.. ఆరోజులే వేరు!

 వైఎస్ ఉన్న సమయంలో చంద్రబాబునుద్దేశించి, ఒకే ఒక్కసారి నోరుజారి దానిని వెనక్కితీసుకున్న  సందర్భం తప్ప, మిగిలిన సమయాల్లో ఏరోజూ ఆయన అదుపుతప్పిన దాఖలాలు లేవు. పైగా చంద్రబాబునుద్దేశించి వైఎస్ ‘ఆయనగారు’ అనే సంబోధించేవారు. మిగిలినవారిని ‘కూర్చోవయ్యా’ అని మాత్రమే పిలిచేవారు. కాంగ్రెస్-టీడీపీ-టీఆర్‌ఎస్ మధ్య పార్టీలపరంగా రాజకీయ సవాళ్లు-ప్రతిసవాళ్లు తప్ప, వ్యక్తిత్వహనన రాజకీయాలు కనిపించలేదు. ఒక విపక్ష నేతను వాడు, వీడు, చెత్త నాకొడుకు అనే దిగజారుడు భాష వాడిన ఒక్క మంత్రి కూడా కాంగ్రెస్-టీడీపీ-టీఆర్‌ఎస్‌లో కనిపించలేదు. ఆ అదృష్టాన్ని మనకు ఏపీలో జగన్మోహన్‌రెడ్డి.. మంత్రి కొడాలి రూపంలో ప్రసాదించినందుకు, ప్రజాస్వామ్యప్రియులు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే!

తెలంగాణ రాజకీయాల్లో హుందాతనం


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఇన్నేళ్లలో కూడా ఇలాంటి అవాంఛ నీయ, పరువు-స్ధాయి తక్కువ రాజకీయాలు ఎప్పుడూ చూడనందుకు తెలంగాణ ప్రజలు ధన్యులు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహజ తిట్ల దండకం, సభలో సంఖ్యాపరంగా ఉన్న వెసులుబాటుతో విపక్షాలపై ఎదురుదాడి, తలసాని శ్రీనివాసయాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు వంటి ఫైర్‌బ్రాండ్ మంత్రుల ఎదురుదాడి.. రేవంత్‌రెడ్డి, సంజయ్,కోమటిరెడ్డి వంటి ఒకరిద్దరు విపక్షనేతల సవాళ్లు తప్ప,  తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రశాంతంగానే కనిపిస్తుంది. ఇప్పటివరకూ ఏ ఒక్క తెలంగాణ మంత్రి కూడా, విపక్ష నేతలను వాడు వీడు అని సంబోధించిన దాఖలాలు లేవు. గతంలో జానారెడ్డి విపక్ష నేతగా ఉన్నప్పుడు కేసీఆర్ ఆయనను ‘పెద్దలు, గౌరవనీయులు జానారెడ్డి గారు చెప్పినట్లు’ అని పిలిచేవారు.కానీ, తెలంగాణకు భిన్నమైన క్షుద్ర రాజకీయం ఏపీలో కొనసాగుతుండటం ఆందోళనకరం.

గబ్బుపట్టిన ఆంధ్రా రాజకీయాలు


ఒక విపక్ష పార్టీ స్లీపర్‌సెల్‌గా మారిందని స్వయంగా మంత్రి ఆరోపించడం చూస్తే, ఆంధ్రా రాజకీయాలు ఎంత గబ్బుపట్టిపోయాయో, ఎంత నీచస్థాయికి దిగజారిపోయాయో స్పష్టమవుతుంది. కరోనా వైరస్‌ను  తెలుగుదేశం పార్టీనే కావాలని కుట్రతో వ్యాప్తి చేస్తోందని, దానికోసం స్లీపర్‌సెల్స్‌ను సృష్టించిదని  మంత్రి మోపిదేవి వెంకట రమణ చేసిన ఆరోపణలు వెగటు, అసహ్యం పుట్టించేవే. అంటే ప్రకృతి ప్రళయాలు వచ్చినా, ఇప్పుడు బయోవార్ వచ్చినా  అవి ప్రతిపక్షాలు సృష్టించినవేనని మాననీయ మంత్రివర్యుల మాటల బట్టి అర్ధం చేసుకోవాలేమో?! ఆ ప్రకారంగా.. ఒక ప్రతిపక్ష పార్టీ కరోనా వైరస్ వచ్చినవారందరినీ ఒక జట్టుగా ఏర్పరచి, వారిని అన్ని ప్రాంతాలకు పంపించి, వారి ద్వారా వైరస్‌ను విస్తృతి చేస్తుందని భావించాల్సి ఉంది.

స్లీపర్‌సెల్స్‌ను బాబు సృష్టించారేమో?..

మంత్రి మోపిదేవి ఆరోపణల ప్రకారం.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే కూర్చుని, చైనా వాణిజ్య రాజధాని వూహాన్ మాదిరిగా ఒక ప్రత్యేక నగరాన్ని సృష్టించి, అక్కడి నుంచి వైరస్‌ను వ్యాప్తి చేసి, తన పార్టీ కార్యకర్తలనే స్లీపర్‌సెల్స్‌గా మార్చి, వారి  ద్వారా విస్తరింపచేస్తున్నారన్న మాట! ఇది వినడానికి, చదవడానికి, చూడ్డానికి అసహ్యంగా లేదూ? ఏహ్యంగా లేదూ? రాజకీయాలంటేనే జుగుస్పాకరంగా లేదూ..? ఆ లెక్కన రాజభవన్‌కూ కరోనా రావడం వెనుక టీడీపీ ప్రయోగించిన స్లీపర్‌సెల్స్ హస్తం ఉందేమో మరి? అంటే  ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమితులైన కనగరాజ్‌ను కూడా.. చంద్రబాబునాయుడే తమిళనాడు నుంచి ఆంధ్రా సరిహద్దులు రహస్యంగా దాటించి, ఆయనను గవర్నర్‌తో భేటీ వేయించేలా పథకం పన్నారన్న మాట! మంత్రి గారి మాటలు చూస్తే, తెలంగాణలో కూడా వైరస్ పెరిగేందుకు సైతం, టీడీపీ స్లీపర్‌సెల్స్ కారణమని అనుకోవలసి వస్తుందేమో!? ఎందుకంటే స్లీపర్‌సెల్స్ ఒకచోట ఉండరు కాబట్టి!

అదో ఉగ్రభాష..!

అసలు స్లీపర్‌సెల్స్ అనే ఉగ్రవాద భాషను వాడిన తొలి రాజకీయ పార్టీ వైసీపీనే అనుకోవాలి.  భారత్‌ను అస్తిరపరిచేందుకు పాకిస్తాన్ తన ఐఎస్‌ఐ ముష్కరమూకలతో, భారత్‌లోనే స్లీపర్‌సెల్స్ ఏర్పాటు చేస్తోంది. వాటిని పోలీసులు, భద్రతా-నిఘాదళాలు ఎప్పటికప్పుడు కనిపెట్టి మట్టుపెడుతూనే ఉన్నాయి.  ఆ ప్రకారంగా.. మంత్రిగారి ఉగ్రభాషలో, తెలుగుదేశం అనే రాజకీయ పార్టీ కూడా పాకిస్తాన్ ఐఎస్‌ఐ అనుబంధసంస్థగా మారి,  వైరస్ వ్యాప్తితో ప్రజల ప్రాణాలు  తీసేందుకు స్లీపర్‌సెల్స్ ఏర్పాటుచేసిందేమో మరి?

మరి.. నిఘా వర్గాలు నిద్రపోతున్నాయా?

నిజంగా మంత్రి గారు చెప్పినట్లు.. ఒక రాజకీయ పార్టీ వైరస్ విస్తరణకు స్లీపర్‌సెల్స్ సృష్టించి ఉంటే, అది ప్రజాద్రోహం మాత్రమే కాదు, దేశద్రోహం కూడా. అలాంటప్పుడు.. అధికారంలో ఉన్న ఆయన ప్రభుత్వం, పోలీసులు, ముఖ్యంగా ఇంటలిజెన్స్, కౌంటర్ ఇంటలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి? సహజంగా ఇలాంటి సంఘ వ్యతిరేక-ఉగ్రవాద-తీవ్రవాద కార్యకలాపాలపై, కౌంటర్ ఇంటలిజెన్స్(సీఐ) విభాగం నిరంతరం అప్రమత్తం అవుతుంది. వేగులు ఒళ్లంతా కళ్లు చేసుకుని మరీ పనిచేస్తుంటారు. మరి ఆ ప్రకారం ఆ విభాగం దానిని ఎందుకు కనిపెట్టలేకపోయింది? పోనీ పని ఒత్తిళ్ల వల్ల నిఘా విభాగం ఆ పని చేయలేకపోయినా, బాధ్యత గల మంత్రి గారు.. తన వద్ద ఉన్న ఆ సమాచారాన్ని, ఆధారాలను ఇప్పటివరకూ పోలీసు బాసుకు ఎందుకు ఫిర్యాదు చేసి, ఆధారాలను ఎందుకు అందించలేదు?

మరి స్పెషల్ బ్రాంచ్ మోపిదేవిని సమాచారం అడిగిందా?

రెండు రోజుల క్రితం ఓ వార్తా కథనం రాసిన నాకు.. విజయవాడ స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ ఒకరు ఫోన్ చేసి, ఓ కథనం మీకు ఎలా వచ్చిందని ఆరా తీసి, అడ్రస్ తీసుకున్నారు. అది ఆయన ఉద్యోగ ధర్మమనే అనుకుందాం.  మరి అదే ఉద్యోగ ధర్మం ప్రకారంగా.. టీడీపీ కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు స్లీపర్‌సెల్స్‌ను సృష్టించిందని ఆరోపించిన, మంత్రి రమణకూ సదరు ఎస్‌ఐ అలాగే ఫోన్ చేసి, ఆ సమాచారం మీకు ఎవరిచ్చారని ఆరా తీయాలి కదా? మరి ఆ  స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ.. ఆయన పై అధికారి,  ఆ పని ఎందుకు చేయలేదన్నది ప్రశ్న.  అసలు ప్రజల ప్రాణాలకు సంబంధించి మంత్రి చేసిన ఇంత పెద్ద ఆరోపణల నిగ్గు తేల్చేందుకు,  ఇప్పటికే సుమోటోగా కేసు నమోదు చేసుకుని, రంగంలోకి దిగాల్సిన పోలీసు శాఖ ఆ పని ఎందుకు చేయలేదు చెప్మా?

స్లీపర్‌సెల్స్‌పై సీఐడీతో విచారణ జరిపిస్తారా?

నిమ్మగడ్డ రమేష్ లేఖ కంటే ఇదే పెద్ద తీవ్రమైన అంశమైనప్పుడు యుద్ధ ప్రాతిపదికన విచారణ ఎందుకు ప్రారంభించలేదు? వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ప్రభుత్వాలు ఇప్పటికే వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి. పోలీసులు-వైద్యులు తమ ప్రాణాలు పణంగా పెట్టి, కరోనా యుద్ధరంగంలో ముందునిలబడి పోరాడుతున్నారు. మరి మంత్రి మోపిదేవి ఆరోపించినట్లు టీడీపీనే వైరస్ వ్యాప్తికి స్లీపర్‌సెల్స్ సృష్టించి ఉంటే.. ఆ సెల్స్‌ను పట్టుకుని, బోనెక్కించాల్సిన ప్రభుత్వం ఇంకా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నట్లు? అలా చేసి ఉంటే, ఏపీలో కరోనా కేసులు, మృతుల సంఖ్యకు ఫుల్‌స్టాప్ పడేది కదా? నిమ్మగడ్డ రమేష్ అనే అధికారి రాసిన  లేఖలో, కుట్ర ఉందన్న విజయసాయిరెడ్డి లేఖ ఆధారంగా ఆగమేఘాలపై సీఐడీ విచారణ ప్రారంభించిన ప్రభుత్వం.. కరోనా వ్యాప్తిలో టీడీపీ కుట్ర ఉందన్న మంత్రి ఆరోపణపైనా సీఐడీతో విచారణ జరిపించాలి కదా?.. రేపు ఎవరైనా బుర్ర ఉన్న న్యాయవాది దీనిపై కోర్టుకెక్కి, మంత్రి ఆరోపణలపై విచారణ జరిపించాలని కేసు వేస్తే.. అప్పుడయినా స్లీపర్‌సెల్స్ చిరునామా చెప్పాల్సి ఉంటుంది కదా?…

ఇలాంటి ప్రశ్న ‘మంత్రిగారిని మినహాయిస్తే’, మెదడున్న ప్రతి వాడికీ వస్తుంది. మరి మంత్రి ఆరోపణలపై పోలీసు శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి. అసలు అలాంటి స్లీపర్‌సెల్ అనేది ఒకటుందని తమకు తెలుసని చెబుతుందా? లేక తమకు సమాచారం లేదని చెబుతుందా? ఒక తెలిసి ఉంటే.. ఆ మేరకు దానిని అడ్డుకునేందుకు ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలేమిటో చెప్పాల్సి ఉంటుంది. లేక తమకు తెలియదని చెబితే, మంత్రి గారి ఆరోపణలనే సుమోటోగా తీసుకుని, కేసు పెట్టి దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ముందు మంత్రిగారి వద్ద సమచారం-దానికి ఆధారాలేమిటో చూడాలి. ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఈ వ్యవహారాన్ని రాజకీయ అంశంగా చూడకూడదు. ఒకవేళ అది రాజకీయపరమైన ఆరోపణ అని మంత్రిగారు చెబితే.. ప్రజలను-ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినందుకు ఆయనపై చర్య తీసుకోవాల్సి ఉంటుంది. మరి దీనిపై  ఏం జరుగుతుందో.. పోలీసు బాసులు ఎలా స్పందిస్తారో చూడాలి!

అసలు రాజ్‌భవన్‌కు ఎలా అంటింది?

ఇక రాజ్‌భవన్‌కు కరోనా రాకుండా డ్రోన్ల ద్వారా స్ప్రే చల్లుతున్న వీడియోలు, రాజభవన్‌లో పనిచేసే నలుగురికి కరోనా పాజిటివ్ లక్షణాలున్నాయన్న వార్తలు ఆందోళన కలిగించేవే. ఎనిమిదిపదుల వయసున్న వృద్ధుడైన ప్రధమ పౌరుడి ఆరోగ్యం కాపాడటం అందరి కర్తవ్యం. అందులోనూ ఇది  వృద్ధులను జాగ్రత్తగా కాపాడవలసిన సమయం. ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వృద్ధులు, చిన్నారులకు కరోనా వైరస్ వెంటనే సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.

అసలు రాజ్‌భవన్‌లో పనిచేసే వారికి, కరోనా ఎలా వచ్చిందన్న అంశంపై ఆశ్చర్యకరమైన చర్చ జరుగుతోంది. దానిపై రాజకీయ పార్టీలు కూడా రాజ్‌భవన్‌లో ఏం జరిగి ఉంటుందని ఆరా తీస్తున్నాయి. ఆయనను ఎవరెవరు కలసి ఉంటారని వాకబు చేస్తున్నాయి.

ఇదీ గవర్నర్ షెడ్యూల్..

ఆ ప్రకారంగా.. నిమ్మగడ్డ రమేష్‌పై ఫిర్యాదు చేసేందుకు సీఎం జగన్ గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిశారు. ఆ తర్వాత నిమ్మగడ్డ రమేష్‌ను తొలగించేలా ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. ఆ స్థానంలో చెన్నైకి చెందిన కనగరాజ్ అనే మాజీ న్యాయమూర్తిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత చెన్నైలో ఉన్న కనగరాజ్ లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి, తమిళనాడు నుంచి ఏపీ సరిహద్దుల ద్వారా, మధ్యలో ఉన్న చెక్‌పోస్టులను దాటి వచ్చారు. లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం ఆయన 14 రోజుల క్వారంటైన్‌లో ఉండకుండానే, వచ్చి పదవీబాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిసినట్లు మీడియాలో ఫొటోలు, వీడియోలు కూడా వచ్చాయి.  ఆ తర్వాత కనగరాజ్ కొందరు అధికారులతో ఎన్నికల సమీక్ష కూడా నిర్వహించినట్లు మీడియాలో ఫొటోలు, వార్తలు వె లువడ్డాయి. ఇంతకూ కనగరాజ్ కూడా దాదాపు ఎనిమిదిపదుల వయసున్న వారే కావడం ప్రస్తావనార్హం. ఆ తర్వాత అంబేద్కర్ జయంతి సందర్భంగా, రాజ్‌భవన్‌లోనే ఆయన చిత్రపటానికి గవర్నర్ పూలమాల వేసి నివాళి అర్పించినట్లు ,మీడియాలో ఫొటోలు వచ్చాయి. ఇవి తప్ప.. ఈనెలలో గవర్నర్ ఎవరినీ కలిసిన దాఖలాలు లేవని మీడియాలో వచ్చిన వార్తలు, ఆయన షెడ్యూల్ స్పష్టం చేస్తోంది. బీజేపీ నేతలు కూడా ఆయనకు ఫ్యాక్స్ ద్వారానే ఫిర్యాదులు చేస్తున్నారు.

మరి ఎలా వచ్చిందో?..

మరి రాజ్‌భవన్ సిబ్బందికి కరోనా ఎలా వచ్చిందన్నది సస్పెన్స్‌గా మారింది. ఇంతకూ.. లాక్‌డౌన్ నిబంధన ఉల్లంఘించి, 14 రోజుల క్వారంటైన్‌లో ఉండకుండానే పదవీ బాధ్యతలు స్వీకరించిన, కనగరాజ్ నిర్వహించిన సమావేశానికి హాజరయిన అధికారులు.. ముందుజాగ్రత్తగా ఓసారి పరీక్షలు చేయించుకుంటే మంచిదేమో ఆలోచించాలి! ఎందుకంటే, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వల్ల.. వైరస్ విస్తరిస్తుందన్న ముందుజాగ్రత్తతోనే కదా, వారిని క్వారంటైన్‌లో ఉంచుతుంది?