ప్రశ్నిస్తే.. మీడియా గొంతు నొక్కుతారా?

557
Kiev, Ukraine - January 11, 2016: Background of famous social media icons such as: Facebook, Twitter, Blogger, Linkedin, Tumblr, Myspace and others, printed on paper.

సోషల్ మీడియాపై సుప్రీం ఆదేశాలు బేఖాతర్
వార్తలకు ఆధారాలు చూపాలనడం అర్ధరహితం
ఏపీలో నయా నిబంధనలు
జర్నలిస్టు సంఘాల ఆగ్రహం
             (మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రజాస్వామ్యం పక్కదారి పట్టకుండా, పాలకుల తప్పటడుగులను హెచ్చరిస్తున్న మీడియా గొంతుపై పాలకుల పక్షాన వేళ్లాడుతున్న కత్తులు ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదంగా పరిణమించాయి. ప్రశ్నించడాన్ని భరించ లేని పాలపక్షాలు, ప్రశ్నిస్తున్న మీడియా, సోషల్ మీడియాను ఆధారాలు అడుగుతున్న కొత్త సంస్కృతికి ఏపీ ప్రభుత్వం తెరలేపినట్లు కనిపిస్తోంది. దీనిపై జర్నలిస్టు సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మీడియా సంస్థల పగ్గాలు  పార్టీల చేతిలోకి వెళ్లిన నేపథ్యంలో, కళ్లు తెరిచిన సోషల్‌మీడియా గొంతు నులిమేందుకు చేస్తున్న ప్రయత్నాలు సుప్రీంకోర్టు ఆదేశాలనూ వెక్కిరించేలా ఉండటం ఆందోళనకరం.

దేశ భద్రత, రక్షణ వ్యవహారాలు, అంతర్గత రహస్యాలు, న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులపై వ్యాఖ్యలు మాత్రమే శిక్షార్హమైనవని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, దీనిని ఏపీలో పాలకులు పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన వార్తా కథనాలకు సంబంధించిన సమాచారం మీకు ఎలా వచ్చిందని, జర్నలిస్టులకే నేరుగా ఫోన్లు చేసే కొత్త సంస్కృతికి తెరలేవడం ఆందోళన కలిగిస్తోంది. మీడియాకు దేశంలో ప్రత్యేకమైన హక్కులేమీ లేవు. అది చట్టానికి అతీతమైనమేదీ కాదు. నేరం రుజవయితే శిక్ష అనుభవించాల్సిందే. అయితే, అది చట్టానికి, కోర్టు తీర్పులకూ లోబడి ఉండాలి. ఇటీవల ‘సూర్య’ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనానికి సంబంధించి, ఆ కథనమేదో చెప్పకుండా,  సమాచారం మీకు ఎలా వచ్చిందంటూ విజయవాడ స్పెషల్‌బ్రాంచ్ ఎస్‌ఐ ఒకరు.. ‘పైవారి’ ఆదేశాల ప్రకారం అడుగుతున్నామని ఫోన్ చేసి మరీ ప్రశ్నించడం ఆశ్చర్యపరిచింది. నయా సర్కారు పాలనలో ఇదో నయా విధానం అనుకుంటా!

కోర్టులు చెప్పినా వినరా?

ఏ పరిపాలనయినా రాజ్యాంగానికి లోబడి జరగాలి. అధికారం ఉందన్న ధీమాతో..  ఆదేశికసూత్రాల పేరుతో పౌరహక్కులు ప్రసాదించిన న్యాయవ్యవ స్థ ఆదేశాలకు భిన్నంగా వ్యవహరించిన ప్రతిసారీ కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.  ఇప్పుడు జరుగుతోంది కూడా అదే. 2000లో సమాచార సాంకేతిక విజ్ఞాన చట్టం (ఐటి చట్టం 2000)లో సెక్షన్ 66-ఏను  సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇది పౌర-మానవ హక్కులకు భంగమని స్పష్టం చేసింది. సోషల్‌మీడియా పోస్టుల మీద చేసే అక్రమ అరెస్టులు రాజ్యాంగవిరుద్ధమే కాకుండా, పౌరహక్కుల్లో భాగంగా ఉన్న, ఆర్టికల్ 19 భావప్రకటనా స్వేచ్ఛ- వాక్-భావ వ్యక్తీరకణ స్వాతంత్య్రహక్కులకు పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేసింది.  ఒకవేళ సెక్షన్ 67 ప్రకారం కేసు నమోదుచేసినా.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి సోషల్ మీడియాలో పోస్టుల కోసం అరెస్టు చేసి కొట్టినట్టయితే,  సెక్షన్29 ప్రకారం 3 నెలలు జైలు శిక్ష విధించవచ్చు. దీనికి భిన్నంగా జరిగితే మానవహక్కుల కమిషన్/కోర్టులను ఆశ్రయించవచ్చు.  అసలు సెక్షన్ 41ఏ ప్రకారం.. హైకోర్టు కూడా సోషల్ మీడియా పోస్టింగులలో అరెస్టులు ఉండకూడదని ఇటీవలే ఆదేశించడాన్ని విస్మరించ కూడదు.

జయలలితకు ఎదురుదెబ్బ

గతంలో తమిళనాడు సీఎం దివంగత జయలలిత అవినీతిపై ఒకరు పోస్టింగు పెట్టారు. దానిపై కోర్టుకు వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురయింది. ‘ఇది ప్రజల హక్కు. అవినీతి జరగలేదని మీరు నిరూపించుకోండి. లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోండి. రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేసింది. అయితే ఇలాంటి గత తీర్పులు, చట్టాలను పరిశీలించి అడుగులు వేయాల్సిన పోలీసులు.. ప్రభుత్వం చెప్పినట్లు నడచుకోవడం వల్ల నష్టం మాత్రమే కాదు, పరువు పోయేది పోలీసు వ్యవస్థకే అన్న విషయం విస్మరించడం విచారకరం.

ఎలాంటి వార్తలు  నేరమంటే…

నిజానికి.. దేశ సమగ్రత, భద్రత, సమాఖ్యకు భంగం కలిగించే వార్తలు, పోస్టింగులు మాత్రమే సైబర్‌క్రైమ్ కిందకు వస్తాయి. మహిళల మానాభిమానాలకు వ్యతిరేకంగా పౌరుల ఆత్మహత్యలకు ప్రేరణ కలిగించే వార్తలు, పోస్టులు.. కోర్టులు ఇచ్చే తీర్పులు, చట్టాలను గౌరవించకుండా వ్యాఖ్యానించడం మాత్రమే నేరంగా పరిగణించవచ్చు. నిరాధారమైన అనుచిత వ్యాఖ్యలతో, వ్యక్తుల వ్యక్తిగత విషయాలపైన వ్యాఖ్యలు చేస్తేనే సైబర్ క్రైమ్ ఐటి చట్టాలు వర్తిస్తాయి. మిగిలిన సందర్భాల్లో ఎలాంటి కేసులు వర్తించవు. చట్టం ముందు అంతా సమానులే.  ఒకవేళ అందుకు భిన్నంగా కేసులు పెడితే పరువునష్టం కేసు వేయవచ్చని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనిని పోలీసులు గమనంలోకి తీసుకోకుండా, ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీ ప్రభుత్వం వేలు చూపిస్తే, ఆ వ్యక్తులపై కేసులు పెట్టడమే విమర్శలకు తావిస్తోంది.

వినుకొండలో ఇదో విచిత్రం..

గుంటూరు జిల్లా వినుకొండలో లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలపై ఓ జర్నలిస్టు వార్త రాశాడు. బాధితులకు సాయం అందక ఆకలికేకలు పెడుతున్నారన్నది వార్త సారాంశం. దానిపై పోలీసులు కేసు పెడితే, జర్నలిస్టులు వారితో చర్చించారు. మునిసిపవ్ కమిషనర్ ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేస్తే కేసు పెట్టామని సెలవిచ్చి, మీ వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కోరారు. స్థానికులు మాట్లాడిన వాయిస్, వీడియో రికార్డులను చూపిన తర్వాత.. మీరూ మీరూ సర్దుబాటు చేసుకోమని సలహా ఇచ్చి పంపించారట. కర్నూలులో పెరిగిపోతున్న కరోనా కేసులు, ప్రభుత్వ ఆసుపత్రిలో కష్టాలపై ఆంధ్రజ్యోతిలో వార్త రాసిన జర్నలిస్టుపైనా స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు  కేసు పెడతామని బెదిరించారట. ఇలా చెప్పుకుంటూ పోతే బెదిరింపుల కథ చాంతాడవుతుంది.

గతం మరచిపోతే ఎలా?..

చట్టం ఇలా ఉంటే.. ఏపీలో కొత్తగా పోలీసులు సొంతగా వ్యవహరిస్తున్న తీరు జర్నలిస్టులను బెదిరించేలా కనిపిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా.. వ్యక్తిగతంగా ఆయన, ఆయన కుమారుడు లోకేష్, వ్యవస్థాగతంగా తెలుగుదేశం పార్టీపై వైసీపీ సోషల్ మీడియా విభాగం లెక్కలేనన్ని వ్యతిరేక పోస్టులు, వ్యాఖ్యలు చేసింది. ఇక వైసీపీ అధికార మీడియా సాక్షిలో కూడా, నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుంఖానుపుంఖాల వ్యతిరేక కథనాలు రాసింది. ఆర్ధికశాఖ, ఐటి, పంచాయతీరాజ్, హోం శాఖలపై అనేక వ్యతిరేక కథనాలు రాసింది. అప్పుడు పోలీసులెవరూ ఆ వార్తలు రాసిన సాక్షి ప్రతినిధులను ఆ సమాచారం మీకు ఎలా వచ్చిందని ప్రశ్నించలేదు.

అయితే వాటిని జనం విశ్వసించినా, లేకపోయినా ప్రజల్లో గందరగోళం, బాబు పాలనపై వ్యతిరేకత పోగు చేయడంలో మాత్రం సక్సెస్ అయింది. చివరకు మంత్రివర్గ సమావేశ వివరాలు, చంద్రబాబుతో పార్టీ నేతల అంతర్గత సమావేశ వివరాలు, కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండే బాబు నివాసంలోని ఫొటోలు కూడా ప్రచురించింది.
బాబు హయాంలో హుద్‌హుద్ హుద్- తిత్లీ తుపాన్లు వచ్చిన సందర్భంలో బాధితులకు సాయం అందడం లేదని వైసీపీ అధికార మీడియా లెక్కలేనన్ని కథనాలు రాసింది. ఉపాథి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై పుంఖానుపుంఖాల కథనాలు రాసింది. పోలీసు పోస్టింగులలో ఒకే కులం వారికి పోస్టింగులు, ప్రమోషన్లు ఇచ్చిందని విరుచుకుపడింది. బాబు బహిరంగసభలకు, డ్వాక్రా సభ్యులను బస్సుల్లో తీసుకువచ్చారని అనేకసార్లు రాసింది.  లోకేష్ వైజాగ్ ఎయిర్‌పోర్టులో తిన్న తిండికి అయిన ఖర్చుపైనా కథనం రాస్తే.. అసలు ఆ సమయంలో తాను విజయవాడలో ఉన్నానంటూ, లోకేష్ ఆ ఫొటోలు విడుదల చేయాల్సి వచ్చింది.మరి అప్పుడు పోలీసులకు గుర్తుకు రాని నిబంధనలు, చట్టాలు.. ఇప్పుడు అదే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర మీడియా, జర్నలిస్టుల విషయంలోనే గుర్తుకు రావడం వింతలో వింత.

వారి ఫిర్యాదులకు దిక్కేదీ?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, అధికార ప్రతినిధి అనూరాధతోపాటు, గతంలో టీడీపీలో పనిచేసిన సాదినేని యామినీపై సోషల్‌మీడియాలో పెట్టిన వ్యతిరేక పోస్టింగులకు సంబంధించి ఇచ్చిన ఫిర్యాదులకు ఇప్పటిదాకా దిక్కు లేదు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇచ్చిన ఫిర్యాదులపై అతీగతీ లేదు. చివరకు అయితే ఇటీవల టీడీపీ కార్యకర్త ఒకరు వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టింగుపై మాత్రం వాయువేగంతో స్పందించి అరెస్టు చేయడం ప్రస్తావనార్హం. దీనిపై లోకేష్ తదితర నేతలు పోలీసులతో వాదించినా ఫలితం కనిపించలేదు.

కోర్టు-జడ్జిలనూ అవమానించినా…

ఇటీవల ఒక హైకోర్టు న్యాయమూర్తి ఇంగ్లీషు విద్యపై ఇచ్చిన తీర్పుపై, వైసీపీ అభిమాని ఒకరు చే సిన పోస్టు న్యాయవ్యవస్ధనే కించపరించింది. దానిపై న్యాయవాదులు సైతం ఆగ్రహం, నిరసన వ్యక్తం చేశారు. అలాంటి న్యాయమూర్తి, చెప్పుదెబ్బలు తినే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటూ ఆ వ్యక్తి చేసిన పోస్టింగ్‌పై, పోలీసులు వెంటనే స్పందించకపోవడాన్ని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘420 బ్యాచ్ ఆఖరికి కోర్టు, జడ్జిలనే  బెదిరించే స్థాయికి వెళ్లారు. వీళ్లపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదం పడుతుంద’ని ట్వీట్ చేయాల్సి వచ్చింది. అధికారం అనేది దీపంలో నూనె లాంటిది. నూనె ఉన్నంత కాలమే ఆ వెలుగు ఉంటుంది. ఆ తాత్కాలిక వెలుగు చూసి, గద్దెనెక్కిన వారు గజ్జెకట్టి ఆడమన్నట్లు ఆడితే.. పోయేది వ్యవస్థల పరువే!