నిరంతర సేవా స్రవంతి.. కిషన్‌రెడ్డి!

కరోనా కాలంలో నిరంతర సేవలు
కంట్రోల్‌రూమ్‌లోనే కిషన్‌రెడ్డి
వైఎస్ ఆరోగ్యశ్రీకి కిషన్‌రెడ్డి ధర్నానే ప్రేరణ
(మార్తి సుబ్రహ్మణ్యం)

గంగాపురం కిషన్‌రెడ్డి.. తొలి ప్రయత్నంలోనే పార్లమెంటు సభ్యుడిగా గెలిచి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేసే అరుదైన అవకాశం దక్కించుకున్న కిషన్‌రెడ్డి.. కరోనా సమయంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరి అభినందలు అందుకుంటున్నాయి. దివంగత  వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో కలసి.. చిన్నారులకు గుండె చికిత్సలు ప్రభుత్వమే ఉచితంగా నిర్వహించాలని కోరుతూ, ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమం వైఎస్ సర్కారును కదిలించింది. ఫలితంగా ఏర్పాటయినదే ఆరోగ్యశ్రీ పథకం. అయితే, ఆ సమయంలో విదేశాల్లో ఉన్న వైఎస్.. ఫోన్‌లో మందకృష్ణ మాదిగను హెచ్చరించిన వైనం వివాదంగా మారింది.

కంట్రోల్‌రూమ్‌లోనే కిషన్‌రెడ్డి..

తాజా కరోనా సమయంలో హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి, ఢిల్లీలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌రూమ్‌లోనే ఉండి,  నిరంతర సేవలు అందిస్తున్నారు. ఆయన ఎక్కువ సమయం అక్కడే గడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇన్చార్జిగా ఉన్న కిషన్‌రెడ్డి కరోనా సాయంపై అటు అధికారులు, ఇటు పార్టీ నాయకులతో వీడియో, టెలీకాన్ఫరెన్సు నిర్వహిస్తూ, సహాయ కార్యక్రమాలు సమీక్షిస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఎక్కడికయినా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. తన తల్లి సంవత్సరీకాన్ని హైదరాబాద్‌లో కాకుండా, ఢిల్లీలోనే నిర్వహించి లాక్‌డౌన్ నిబంధన పాటించడం ద్వారా, మిగిలిన వారికి ఆదర్శంగా నిలిచారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి కూడా తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లకుండా లాక్‌డౌన్ నిబంధన పాటించారు.  నల్లగొండలో బత్తాయి రైతుల సమస్యలను.. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు ఇటీవల కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దానితో రంగంలోకి దిగిన కిషన్‌రెడ్డి.. ఢిల్లీలో ఉన్న ఆసియాలోనే అతి పెద్ద ఆజాద్‌పూర్  మండిని  సందర్శించారు. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రత్యేక అనుమతి తీసుకుని మరీ, ఆ మార్కెట్‌ను నిరంతరం తెరచివుంచే ఏర్పాటు చేశారు. ఫలితంగా, దేశవ్యాప్తంగా రైతులు పండించిన పండ్ల ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం లభించింది. రైతులకు అవసరమైత రవాణా సౌకర్యాలతోపాటు, ప్రత్యేక గూడ్సును ఏర్పాటుచేసేందుకు ఏర్పాట్లు చేశారు.

వలస కూలీలకు ఆపన్నహస్తం


కరోనా లాక్‌డౌన్‌తో  చిక్కుకుపోయిన వేలాది వలస కూలీలలపై ఆయన దృష్టి సారిస్తున్నారు. దానికోసం ఢిల్లీలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌రూమ్‌తోపాటు, తన ఇద్దరు కార్యదర్శుల ఫోన్‌నెంబర్లు కూడా ఇవ్వడం ద్వారా, వలస కూలీలకు ఆహారం అందించేలా చూస్తుండటం అభినందనీయం. వీటికి అదనంగా, బీజేపీ నియోజకవర్గ నాయకులు వలస కూలీలపై అందించిన సమాచారాన్ని కూడా తీసుకుని, వారి వద్దకు ఆహారపొట్లాలు పంపిస్తున్నారు. ఇటీవల.. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిథిలోని మెట్టుగూడలో,  దాదాపు 170 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు చిక్కుకుపోయారు. ఆ విషయం తెలిసిన స్థానిక ఇన్‌స్పెక్టర్ గంగిరెడ్డి వారికి భోజన సౌకర్యం సమకూర్చారు. ఆయన స్పూర్తితో, స్థానిక బీజేపీ నేతలు కూడా వారికి సహాయం అందించారు. ఈ విషయాన్ని పీఐబీ ద్వారా తెలుసుకున్న పీఐబీ డైరక్టర్ జనరల్ వెంకటేశ్వర్, కేంద్రానికి సమాచారం అందించారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న కిషన్‌రెడ్డి.. అధికారులతోపాటు, పార్టీ కార్యకర్తలను కూడా రంగంలోకి దించి,  వారికి బియ్యం, కందిపప్పు, నగదు కూడా అందించారు. ఆ వలస కార్మికులను ముందుగా గుర్తించి, వారిని ఆదుకున్న చిలకలగూడ సీఐ గంగిరెడ్డిని అభినందించాల్సిందే.

టెలీమెడిసిన్ ద్వారా రోగులకు బాసట


ఇక కిషన్‌రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్ని పోలీసుస్టేషన్లు, శానిటరీ సిబ్బందికి ఎనర్జీడ్రింక్, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు. గత వారం క్రితమే తన సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిథిలో,  ప్రతి డివిజన్‌లో  100 మంది నిరుపేద కార్యకర్తలకు  బియ్యం, కందిపప్పు, ఆయిల్, పసుపు, కారంతోపాటు శానిటైజర్, వృద్ధులకు పెయిన్‌కిల్లర్ స్ప్రే కిట్లను పంపిణీ చేయడం ద్వారా తన దాతృత్వం చాటుకున్నారు.  తాజాగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిథిలోనే కరోనా లాక్‌డౌన్ వల్ల ఇబ్బందిపడుతున్న రోగులకు, వీడియో, ఆన్‌లైన్, ఫోన్ ద్వారా వైద్యసేవలందించే సరికొత్త కార్యక్రమానికి కిషన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మొత్తం ఏడు నియోజక వర్గాలకు టెలీ మెడిసిన్ సెంటర్లు ఏర్పాటుచేశారు. 9959261273 నెంబరు లేదా జికిషన్‌రెడ్డిడాట్‌కామ్ ద్వారా ఉచితసేవలు అందించనున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటివద్దకే వచ్చి, మందులు అందించే వినూత్న సేవలందిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి అంబులెన్స్ సేవలు కూడా అందించడం ద్వారా, రోగులకు సేవ చేయడమే ఈ టెలీ మెడిసిన్ సెంటర్ల లక్ష్యమని బీజేపీ నగర డాక్టర్స్ సెల్ కన్వీనర్ డాక్టర్ సురేష్‌గౌడ్ తెలిపారు. దీనికోసం నియోజకవర్గానికి ఒక సమన్వయకర్తను నియమించారని వివరించారు. దీనిని కిషన్‌రెడ్డి ఢిల్లీ నుంచే వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీనివల్ల లాక్‌డౌన్ కారణంగా ఆసుపత్రులకు వెళ్లలేని రోగులకు ఇది ఉపయోగపడనుంది. ఆపద సమయంలో ఆన్‌లైన్ ద్వారా వైద్య సేవలందిస్తున్న కిషన్‌రెడ్డిని అభినందించాల్సిందే.

You may also like...

1 Response

  1. July 21, 2020

    […] డాక్టర్ లక్ష్మణ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, తెలుగుదేశం-కాంగ్రెస్ నుంచి చాలామంది నేతలు బీజేపీలో చేరారు. వారిలో మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు,మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గఇన్చార్జుల స్థాయి నాయకులున్నారు. దీనితో పార్టీ బాగా బలపడుతోందన్న భావన కలిగించింది. కానీ, వారికి ఇప్పటిదాకా ఎలాంటి ప్రోత్సాహం లేదు. ఉదాహరణకు డికె అరుణను తీసుకుంటే.. కాంగ్రెస్‌ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడంతోపాటు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను శాసించారు. అదే జిల్లాలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌కు బలమైన అనుచర వర్గం ఉంది. ఆయనకు మాత్రం ఇటీవల జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, ఉమ్మడి రాష్ట్ర యూత్ కాంగ్రెస్‌గా ఒక ఊపు ఊపిన పొంగులేటి సుధాకర్‌రెడ్డి కూడా బీజేపీలో చేరారు. ఆయనకూ పెద్దగా గుర్తింపు లేదు. ఇది కూడా చదవండి.. నిరంతర సేవా స్రవంతి.. కిషన్‌రెడ్డి! […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami