తెలంగాణలోనే హింస ఎక్కువన్న జగన్ సర్కారు

588

దానికంటే ఏపీలోనే తక్కువని వాదన
నిమ్మగడ్డ కేసులో కొత్త తర్కం
ఏకగ్రీవాలపై మాత్రం దాటవేత
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏం శివం అంటే ఎగ్గొట్టే శివమన్నట్లు.. సాకుల కోసం ఏపీ సర్కారు తెగ పాకులాడుతున్నట్లుంది. అవసరమైతే నెపాన్ని, పోలికను ఇతర రాష్ట్రాలవైపు చూపించేందుకు సైతం సిద్ధమవుతోంది. ఏపీ ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహారంలో, తమ రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే ముందస్తు ఎన్నికల హింస జరిగిందని స్వయంగా కోర్టులోనే  వాదించటం ఆశ్చర్యపరిచింది.

కేసీఆర్ అడుగులో నడుస్తూ.. తెలంగాణ పైనే నింద!

తెలంగాణ సర్కారు, సీఎం కేసీఆర్‌తో జగన్మోహన్‌రెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయి. ఒకరకంగా, కేసీఆర్ వేసిన అడుగులే ఆంధ్రాలో జగన్మోహన్‌రెడ్డి కూడా వేస్తున్నారు. విధానాలు, వ్యూహాలు కూడా కేసీఆర్ దారిలోనే కనిపిస్తుంటాయి. ఒకరి కాలిలో ముళ్లు గుచ్చుకుంటే, మరొకరు పంటితో తీసేంత బంధం కొనసాగుతోంది. అయితే, జగన్మోహన్‌రెడ్డి సర్కారు.. ఒక అంశంలో తాను తప్పించుకునేందుకు, ఎన్నికల హింస విషయంలో తెలంగాణ సర్కారును అప్రతిష్ఠపాలుచేసే విధంగా వాదించడం ఆశ్చర్యపరుస్తోంది. తమ రాష్ట్రంలో కంటే, తెలంగాణలోనే ఎన్నికల హింస ఎక్కువని చెప్పడమే దానికి కారణం. తన వాదనను బలంగా వినిపించుకోవడంలో తప్పు లేదు. కానీ, అందుకు పక్క రాష్ట్రాన్ని చూపించి తన తప్పును చిన్నది చేసి చూపడంపైనే విస్మయం వ్యక్తమవుతోంది. అంటే దీన్నిబట్టి.. జగన్మోహన్‌రెడ్డి సర్కారు ఎవరితో ఎలాంటి సంబంధాలున్నా, అంతిమంగా తనకు తన ప్రయోజనమే ముఖ్యమని స్పష్టం చేసినట్టయింది.

నిమ్మగడ్డ రమేష్‌ను తొలగించిన వైనంపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. దానికి సంబంధించి జగన్ ప్రభుత్వం వాదించిన తీరు ఆశ్చర్యపరిచింది. స్థానిక సంస్థల ముందుస్తు ఎన్నికల్లో ఘర్షణలు జరిగాయని, ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులతోపాటు, కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలు వాయిదా వేసినట్లు రమేష్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్న విషయం తెలిసిందే.
అయితే ఏపీ సర్కారు మాత్రం గతంలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఎన్నికల హింసను, పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోల్చడం ఆశ్చర్యపరిచింది. 2014లో 261 ఘర్షణలు జరగగా, ఈసారి 88 మాత్రమే జరిగాయని పేర్కొంది. పైగా తెలంగాణ రాష్ట్రంలో, ముందస్తు ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘర్షణలతో పోలిస్తే, ఆంధ్రా ఎన్నికల్లో జరిగిన ఘర్షణలు చాలా తక్కువని వాదించింది.

తెలంగాణతో పోలికనా?

ఎన్నికల సంఘంలో సంస్కరణల కోసమే,  ఆర్డినెన్స్ తీసుకువచ్చామన్న వాదన వరకూ సహేతుకంగా ఉంది. కానీ ఎన్నికల ఘర్షణలో, తెలంగాణ రాష్ట్రంతో పోల్చడమే ఆశ్చర్యంగా ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. శాంతిభద్రతల అంశం ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటుందంటున్నారు. జమ్ము-కశ్మీర్‌లో ఒకవిధంగా ఉంటే, బీహార్‌లో ఇంకోవిధంగా, ఉత్తరప్రదేశ్‌లో మరో విధంగా ఉంటుందని ఉదహరిస్తున్నారు. కానీ, తెలంగాణలో ఇప్పటివరకూ శాంతిభద్రతలు ఎప్పుడూ అదుపుతప్పిన దాఖలాలు గానీ, ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు తీవ్రస్థాయిలో జరిగిన దాఖలాలు గానీ గడచిన ఆరేడేళ్లలో ఎప్పుడూ జరగలేదు.

తెలంగాణలో శాంతిభద్రతలు పీస్ ‘ఫుల్’

మహేందర్‌రెడ్డి డీజీపీగా వచ్చిన తర్వాత, అంతకుముందు కూడా తెలంగాణలో శాంతిభద్రతల గురించి ప్రతిపక్షాలు కూడా అంత తీవ్రంగా విమర్శించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం మహేందర్‌రెడ్డి హయాంలో శాంతిభద్రతలపై ఎలాంటి ఫిర్యాదులు గానీ, విమర్శలు గానీ లేవు. చిన్న ఘటనలను కూడా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఫ్యాక్షన్ జిల్లాలుగా పేరున్న చోట వారిపై ఉక్కుపాదం మోపడంతో ఇప్పుడు ఆ సమస్య కూడా లేదు. మావోయిస్టులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారు. రాజకీయపరమైన ఆరోపణలు మినహా.. ఎన్నికల సమయంలో, తెలంగాణలో ఏపీ సర్కారు హైకోర్టుకు చెప్పినంత స్థాయిలో, హింసాత్మక ఘటనలు జరగలేదు. తాజాగా ఫ్రేం ఇండియా పీఎస్‌యు వాచ్ ఆసియా పోస్టల్ ఆధ్వర్యంలో, 200 మంది ఐపిఎస్ అధికారుల పనితీరుపై సర్వే  చేశారు. అందులో టాప్ 25లో మహేందర్‌రెడ్డి ఉండటం విశేషం. శాంతిభద్రతల నిర్వహణ, ప్రజలతో సంబంధాలు వంటి పలు అంశాల ప్రాతిపదికగా.. ఆ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో, మహేందర్‌రెడ్డి టాప్ 25లో ఉండటం బట్టి, ఆయన పనితీరు ఏమిటన్నది స్పష్టమవుతోంది.

ఏకగ్రీవాలపై వివరణ ఏదీ?

అయినా.. ఏపీలో విపక్షాలు ఏకగ్రీవ ఎన్నికలపైనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. తమ అభ్యర్ధులను బెదిరించి ఏకగ్రీవం చేసుకుంటున్నందున, మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఎప్పుడూ అంత భారీ సంఖ్యలో  ఏకగ్రీవాలు జరగలేదన్నది ఏపీ విపక్షాల వాదన. పోలీసులు కూడా వైసీపీ నేతలకు సహకరించారన్నది మరో ఆరోపణ. దానిని వారంతా గవర్నర్‌కూ ఫిర్యాదు చేశారు.  అయితే, వారి ఆరోపణలకు వివరణ ఇవ్వకుండా, దానిని పక్కదారి పట్టించేందుకు.. ఎన్నికల హింసకు-తెలంగాణకు లింకు పెట్టడంపై న్యాయనిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.