మరి.. ఆ ముగ్గురినీ అరెస్టు చేస్తారా?

168

బాబు-కన్నా-సుజనాకు ఏసీబీ వర్తిస్తుందా?
ప్రజాప్రతినిధుల చట్టంలో బాబు-సుజనా
20 కోట్ల ఆరోపణలు నిరూపిస్తే మంచిదంటున్న వైసీపీ నేతలు
విజయసాయి వద్ద ఆధారాలు ఏసీబీకి ఇవ్వాలంటున్న సీనియర్లు
ఆయన ఊరికే ఆరోపణలు చేయరంటున్న మంత్రులు
మరి విజయసాయి ఏసీబీకి ఆధారాలిస్తారా?
(మార్తి సుబ్రహ్మణ్యం)

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరి ద్వారా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు 20 కోట్ల రూపాయలు ఇచ్చారన్న వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఆరోపణపై, ఇప్పుడు వైసీపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆడిటర్‌గా కీర్తి ప్రతిష్ఠలు, ప్రభుత్వంలో నెంబర్‌టూగా ఉన్న విజయసాయిరెడ్డి వంటి ఎంపి.. ఇలాంటి ఆరోపణలు ఆధారాలు లేకుండా చేయరన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.  ఆ ప్రకారంగా ఆయన తన వద్ద ఉన్న ఆధారాలను, ఏసీబీకి  ఇస్తేనే విజయసాయి  విశ్వసనీయతకు విలువ ఉంటుందని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.

నిమ్మగడ్డ లేఖపై దూకుడు

ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ , కేంద్రానికి రాసిన లేఖపై విచారించాలని విజయసాయిరెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. దానితో డిజిపి ఆ లేఖను సీఐడికి పంపి, విచారణకు ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన సీఐడి చీఫ్ సునీల్‌కుమార్..  నిమ్మగడ్డ కార్యదర్శిని విచారించి, కొన్ని ఆధారాలు సేకరించారు. అంటే విజయసాయి తన వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా, నిమ్మగడ్డ లేఖపై ఆరోపణలు చేయలేదన్న విషయం దీనితో స్పష్టమయిందని వైసీపీ నేతలు ఉదహరిస్తున్నారు.

ఏసీబీకి ఫిర్యాదు చేస్తేనే వైసీపీకి లాభం

అదే తరహాలో.. బీజేపీ చీఫ్ కన్నాపై చేసిన 20 కోట్ల ఆరోపణలు కూడా,  కేవలం రాజకీయపరమైన ఆరోపణగా కాకుండా, నిర్దిష్టంగా చేసినవే అని నిరూపించుకునే అవకాశాన్ని.. విజయసాయి ఎందుకు వినియోగించుకోవడం లేదని కొందరు మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గాలిపోగేసి మాట్లాడే విజయసాయి లాంటి వారి ఆరోపణలు అబద్ధాలని, బీజేపీ నేతలు ఇప్పటికే ఎదురుదాడి చేసిన విషయాన్ని మంత్రులు గుర్తు చేస్తున్నారు. కాబట్టి, ఆ ఆరోపణలు బీజేపీ నేతలు అన్నట్లుగా.. గాలిపోగేసి చేసినవి కాదని నిరూపించాల్సిన అవసరం.. విజయసాయిపైనే ఉందని మరికొందరు సీనియర్లు చెబుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తేనే పార్టీకి లాభమని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆ ఆరోపణలు ప్రజలు నమ్మాలంటే…

ఆడిటర్‌గా సుదీర్ఘ అనుభవం, పరిపాలనలో భాగస్వామిగా ఉన్నందున, ఆయనకున్న పరిచయాలను బట్టి.. విజయసాయి చేసిన ఆరోపణలు నిజమేనని పార్టీపరంగా తాము నమ్ముతున్నప్పటికీ, ప్రజలు ఎందుకు నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. నిజంగా ప్రజలు కూడా వాటిని  నమ్మాలంటే, నిమ్మగడ్డ లేఖ మాదిరిగా ఈ ఆరోపణపైనా.. విజయసాయి ఏసీబీ చీఫ్‌కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.    చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా, తనను ఇబ్బందిపెడుతున్న  కన్నా లక్ష్మీనారాయణను ఇరికించేందుకు, బాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా రాజకీయ ప్రత్యర్ధి రాయపాటి సాంబశివరావు కూడా కన్నాపై ఆరోపణలు చేశారు. అయితే దానిపై కన్నా పరువునష్టం దావా వేశారు. తాజాగా విజయసాయి ఆరోపణలపైనా పరువునష్టం దావా వేయనున్నట్లు వెల్లడించారు.

నిమ్మగడ్డ లేఖ మాదిరిగా డీజీపీకి ఫిర్యాదు చేయలేదేం?

‘‘నేను చాలా ఏళ్లు కాంగ్రెస్‌లో పనిచేశా. వైఎస్‌తో కలసి ఉన్నా. కన్నా తత్వం బాగా తెలిసిన వాడిగా చెబుతున్నా. గాలిపోగేసి చేసి ఆరోపణలపై, కన్నా ఊరకనే అందరిలా కూర్చోరు. మౌనంగా ఉండరు. దాని సంగతి తేల్చేవరకూ నిద్రపోరు. అందుకే ఆయన ఇన్నేళ్లు రాజకీయ ప్రత్యర్ధులతో ధైర్యంగా పోరాడుతున్నారు. ఇప్పుడు విజయసాయి చేతిలో అధికారం ఉన్నందున ఆయన ఆరోపించినట్లు, ఆ 20 కోట్లు ఎలా వచ్చాయన్న ఆధారాలు ఏసీబీకి ఇస్తేనే విజయసాయి ఆరోపణకు విశ్వసనీయత, విలువ ఉంటుంది. లేకపోతే విజయసాయి కూడా, రాయపాటి మాదిరిగా ఉత్తుత్తి  ఆరోపణలు చేసినట్లు భావించే అవకాశం ఉంద’ని.. గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన,  ఓ వైసీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అసలు వరసగా మూడు రోజుల పాటు అవినీతి ఆరోపణలు చేసి, దానికి కట్టుబడి ఉన్నానన్న విజయసాయి.. నిమ్మగడ్డ లేఖ మాదిరిగా, ఈ విషయంలో కూడా డీజీపీకి లేఖ రాయకపోవడం ఆశ్చర్యంగా ఉందన్న వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

అరెస్టు చేసే అవకాశాన్ని వదులుకుంటారేం?

కాగా.. విజయసాయి చేసిన ఆరోపణలు నిజమయి,  ఆ ఆధారాలు ఏసీబీకి ఇచ్చినట్టయితే… మాజీ సీఎం చంద్రబాబునాయుడు, ఎంపి సుజనాచౌదరిని అరెస్టు చేసే అవకాశం లభిస్తుందని మరికొందరు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎందుకంటే ప్రజాప్రతినిధులయిన వారిద్దరూ అవినీతి నిరోధక చట్టం కిందకే వస్తారని గుర్తు చేస్తున్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే కాబట్టి.. లంచం ఇచ్చినందుకు పీసీ యాక్ట్ సెక్షన్ 8 ప్రకారం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయవచ్చని చె బుతున్నారు. ప్రజాప్రతినిధి కానందున, ఈ చట్టం కన్నాకు వర్తించనప్పటికీ.. రాజకీయ ప్రత్యర్ధి అయిన బాబును, ఇరికించే అవకాశాన్ని వదులుకోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. ఈ విధంగా బాబును అరెస్ట్ చేసే అవకాశం లభించినప్పటికీ, విజయసాయిరెడ్డి ఆ పని ఎందుకు చేయడం లేదంటున్నారు.
లంచం తీసుకున్న వారిపై ఆరోపణలు రుజువైతే,  సెక్షన్ 7 కింద అరెస్టు చేసి ఏడేళ్లు శిక్ష విధించే అవకాశం ఉందని, మధ్యవర్తిగా వ్యవహరించిన వారిపైనా సెక్షన్ 10 ప్రకారం కేసు పెట్టి, ఐదేళ్ల వరకూ శిక్ష విధించే అవకాశం ఉంటుందని వివరించారు.  ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రజా ప్రతినిధులు కూడా అవినీతి నిరోధక చట్టం పరిథిలోకి వస్తారు కాబట్టి, వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని గుర్తు చేస్తున్నారు. మరి.. ప్రజాప్రతినిధులయిన బాబుతోపాటు, సుజనాచౌదరిని అరెస్టు చేసే అవకాశం వచ్చినప్పుడు.. విజయసాయిరెడ్డి దానిని ఎందుకు ఉపయోగించడం లేదో అర్ధం కావడం లేదంటున్నారు.

ఆరోపణలు..  నిరూపించాల్సిందే

ఎవరైనా ఏసీబీకి ఫిర్యాదు చేయాలంటే, దానికి నిర్దిష్టమైన ఆధారాలు ఉండాలని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక అధికారి తనను లంచం కోసం పీడిస్తున్నారని ఫిర్యాదు చేస్తే, దానిని నిరూపించాల్సి ఉంటుంది. ఒకవేళ పిర్యాదుదారుడు ముందుగా ఏసీబీని సంప్రదిస్తే, వారే నోట్లపై పౌడర్ లాంటివి చల్లి ఇస్తుంటారు. తర్వాత సదరు లంచం అడిగిన అధికారికి డబ్బులు ఇస్తుండగా రెడ్‌స్యాండెడ్‌గా పట్టుకుంటారు. అయితే, నిబంధనల ప్రకారం లంచం ఇవ్వడం నేరం అయినప్పటికీ, అలాంటి వారిపై కేసులు పెట్టే అవకాశాలు తక్కువ అన్నారు. తమకు వచ్చిన ఫిర్యాదులో ఉన్న ఆరోపణల ప్రకారం కేసు నమోదు చేస్తామని చెబుతున్నారు.

ఏసీబీలో కూడా నిలవదు: పివి కృష్ణయ్య

అయితే దీనిపై న్యాయనిపుణుల వాదన భిన్నంగా ఉంది. అసలు ఈ ఆరోపణ, దానిపై విచారణ రెండూ ఏసీబీ పరిథిలోకి రాదని స్పష్టం చేస్తున్నారు. ప్రముఖ న్యాయవాది పివి కృష్ణయ్య దీనిపై మాట్లాడుతూ.. పబ్లిక్ సర్వెంట్లకే ఏసీబీ కేసు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇది కేవలం రాజకీయపరమైన ఆరోపణ తప్ప, ఏసీబీకి ఇస్తే నిలవదన్నారు. ‘ డబ్బులు తీసుకున్నారని విజయసాయి చెబుతున్న కన్నా లక్ష్మీనారాయణపై.. డబ్బులు ఇచ్చారని ఆరోపణ ఎదుర్కొంటున్న చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేయాలంటే కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వంలో ఏదో ఒక పదవిలో ఉండి, చంద్రబాబునాయుడుకు ఒక ప్రయోజం చేకూర్చిపెట్టాలి. లేదా తనకు డబ్బులిస్తేనే ఆ పనిచేసి పెడతానని కన్నా స్పష్టం చేయాలి. అందుకు ప్రతిఫలంగా కన్నాకు డబ్బులు ఇచ్చేముందు, చంద్రబాబు అనే వ్యక్తి ముందస్తుగా ఏసీబీకి సమాచారం ఇవ్వాలి. వాళ్లు వచ్చి రెడ్‌స్యాండెండ్‌గా ఆ 20 కోట్లు స్వాధీనం చేసుకుంటేనే కేసు బలంగా ఉంటుంది, కానీ ఇవేమీ లేకుండా, అసలు డబ్బులిచ్చిన వ్యక్తే ఏసీబీకి ముందస్తు ఫిర్యాదు చేయకుండా, మరొకరిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కుదరదు. ప్రజాప్రతినిధులు ఏసీబీ పరిథిలోకి వస్తున్నప్పటికీ, కన్నా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ప్రజాప్రతినిధి కాదు. డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఫిర్యాదు చేయకుండా, కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధం. అయినా విజయసాయిరెడ్డికి ఈ వ్యవహారంలో సంబంధం లేదు. ఆయన ఏవిధంగానూ బాధితుడు కాదు. ప్రభుత్వం కూడా తనంతట తాను ఎవరూ ఎలాంటి ఫిర్యాదు లేకుండా, ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్ నమోదు కాకుండా విచారణకు ఆదేశించలేదు. కాబట్టి ఇదంతా ఒక వ్యక్తిపై చేసే రాజకీయ ఆరోపణగానే మిగిలిపోతుంది. దానివల్ల ఆరోపణలు చేసే వారికి మీడియాలో ప్రచారమైతే వస్తుంద’ని కృష్ణయ్య వివరించారు.

ఆరోపణలపై మౌనవ్రతంలో మతలబేమిటో?

ఇదిలాఉండగా.. కన్నాపై విజయసాయి మూడురోజుల పాటు వరసగా తీవ్రమైన ఆరోపణలు కొనసాగించారు. చివరకు బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దియోధర్ వాటిని ఖండించిన తర్వాత కూడా ‘కన్నా, కాణిపాకం ఎప్పుడొస్తున్నావ్. నా ఆరోపణలకు కట్టుబడి ఉన్నా’నని విజయసాయి ట్వీట్ చేశారు. వైసీపీ నేతలు కూడా కన్నాపై ఆరోపణలు అందుకున్నారు.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా, బీజేపీ నేతలతో వీడియో కాన్ఫెరెన్స్ సమావేశం నిర్వహించి, ప్రతిపక్షంగా పనిచేసేందుకు మొహమాటపడవద్దని ఆదేశించారు. బీజేపీ నేతల స్వరాలన్నీ ఒకేలా ఉండాలని స్పష్టం చేశారు. కరోనా కిట్ల కొనుగోలుమాల్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. అప్పటి నుంచీ విచిత్రంగా విజయసాయిరెడ్డితోపాటు, వైసీపీ నేతల విమర్శల దాడి హటాత్తుగా ఆగిపోవడం అన్ని వర్గాలను విస్మయపరుస్తోంది. అంటే బీజేపీ నాయకత్వ సంకేతాలేమిటన్నది వైసీపీ నాయకత్వానికి అర్ధమైపోయిందని, అందుకే ఆ ఆరోపణలపై చడీ చప్పుడు లేకుండా ఉన్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజం సాయినాధుడికెరుక?