‘తరుగు’ పాలవుతున్న తెలంగాణ రైతు

871

సెంటర్లలో రోజుల తరబడి కాంటాలు
ధాన్యం పండించిన రైతుల కొను‘గోల’
తరగు, తేమ పేరుతో నిండా మోసం
మంత్రి జగదీష్ గ్రామంలోనే కాంటాల సమస్య
ధర లేక ‘పండ్లు’ రాలుతున్న వైనం
మిల్లర్లు-దళారులు-అధికారులదే రాజ్యం
సర్కారుపై కమలం సమరం
సంజయ్ దీక్షతో సర్కారు దిగివస్తుందా?
(మార్తి సుబ్రహ్మణ్యం)

రైతన్న కాయకష్టం చేసి పండించిన పంటను కొనేనాధుడు లేదు. పాలకులు ఇస్తున్న ఆదేశాలు అమలవుతున్న దాఖలాలు భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదు. కరోనా నిర్బంధాలను కూడా లెక్కచేయకుండా రైతన్న రోడ్డుమీద కొచ్చి, తాను పండించిన ధాన్యం తగులబెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. రవాణా-మార్కెట్  సౌకర్యం లేక, కూలీలు రాక రైతు కుదేలవుతున్నాడు. మార్కెట్ల వద్ద కావాలని చేస్తున్న కాలయాపన పేరుతో.. దళారులు- అధికారుల చేస్తున్న మోసానికి తెలంగాణ రైతు నిలువెల్లా మోసపోతున్నాడు. మిల్లర్లకు అదృశ్యహస్తాలు అభయమిస్తున్నాయి.  సర్కారు వారి హామీలేవీ వారిని బతికించలేకపోతున్నాయి. ఫలితం.. పండ్ల తోటలు పెంచుతున్న రైతులు వాటిని చెట్టుపాలు చేస్తుండగా, మరికొన్ని రాలిపోతున్న విషాద పరిస్థితి తెలంగాణ రైతుకే సొంతమయింది. మంత్రి జగదీష్‌రెడ్డి సొంత గ్రామంలోనే కాంటాలు ఆలస్యమవుతున్న లెక్కలేనన్ని వాస్తవ దృశ్యాలపై.. కేసీఆర్ సర్కారు స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

కర్షకుల కోసం కమలం సమరనాదం

పంటల ఉత్పత్తికి మార్కెట్ సౌకర్యం కల్పించలేని తెలంగాణ ప్రభుత్వ అసమర్ధతపై భారతీయ జనతా పార్టీ సమరం ప్రారంభించింది. మామిడి, బత్తాయి, ద్రాక్ష పండ్లతో పాటు, ధాన్యం కొనుగోలు, కాంటాల్లో రోజుల తరబడి జరుగుతున్న ఆలస్యానికి నిరసనగా.. తెలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉపవాసదీక్ష.. తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలను ప్రతిబింబించింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ నిర్వహించిన  దీక్షకు లాక్‌డౌన్ నేపథ్యంలో ఎంతమంది వచ్చారన్నది పక్కకుపెడితే.. ఆ పార్టీ నాయకత్వం ఎంచుకున్న సమస్య మాత్రం అభినందించదగ్గదే. ఆ పార్టీకి చెందిన కోర్ కమిటీ, రాష్ట్ర నేతలు, జిల్లా అధ్యక్షులు ఎక్కడికక్కడ తమ ఇళ్లలోనే ఉపవాస దీక్షలు చేయాలని సంజయ్ పిలుపునిచ్చారు.

తెలంగాణ రైతన్న లాక్..‘డౌన్’

తెలంగాణ రైతన్నకు లాక్‌డౌన్ శరాఘాతంగా పరిణమించింది. పండించిన పంట, పండ్లు అమ్ముకునే వీలులేకుండా పోయింది. ఎక్కడి ఉత్పత్తులకు అక్కడ మార్కెట్ సౌకర్యం కల్పిస్తామన్న సర్కారు హామీ అమలుకావడం లేదు. ఒకవేళ సర్కారు హామీ నమ్మి, అదనపు ఖర్చుతో రవాణా సౌకర్యం ఏర్పాటుచేసుకుని, దానిని హైదరాబాద్ మార్కెట్‌లో అమ్ముకునేందుకు తీసుకువచ్చిన రైతును.. దళారులు-అధికారులు జమిలిగా మోసం చేస్తున్న దయనీయం. వారిద్దరూ కలసి కావాలని చేస్తున్న ఆలస్యంతో సగానికి సగం రేటుకు అమ్ముకుని వెళుతున్న రైతులు నిలువునా మోసపోతున్నా, సర్కారుది ప్రేక్షకపాత్రనే.  ద్రాక్ష, మామిడి, బత్తాయి పండించిన రైతుల పరిస్థితి దారుణాతి దారుణం. పెట్టుబడి కూడా దక్కకపోవడంతో వాటిని ఉచితంగా పంచిపెడుతున్న  దయనీయం.

రైతుల.. కొను ‘గోల’గోల

బత్తాయి మార్కెట్‌పై  కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను, వ్యవసాయ మంత్రి గారే కుదరదని చెప్పిన వైనం రైతులను కుంగదీసింది. రైతు పండించిన ధాన్యంలో తరుగు, తేమ పేరుతో రెండుసార్లు చేస్తున్న మోసంతో రైతు కుంగిపోతున్నాడు. ఒకసారి మిల్లర్లు, మరోసారి కొనుగోలు కేంద్రాల వద్ద తరుగు పేరుతో ధాన్యం బరువు తగ్గిస్తూ, వాటిని కమిషన్ రూపంలో జేబుల్లో వేసుకుంటున్న అధికారులు-దళారులు-మిలర్లను అదుపుచేసే దిక్కులేకుండా పోయింది. నిజానికి 17 శాతం వరకూ తేమ, 4 శాతం తాలుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే, 15 శాతం తేమ ఉన్నా తీసుకోవడం లేదు. మళ్లీ తాలు శుభ్రం చేస్తేనే తూకం వేస్తామని మెలిక పెడుతున్నారు. అసలు తాలు పట్టడానికే వేలకు వేల ఖర్చవుతోంది. సహజంగా ఆరబెట్టిన కొద్దీ ధాన్యం తూకం తగ్గిపోతుంది. తాలు లేకుండా శుభ్రం చేసేందుకు 40 బస్తాల ధాన్యానికి, 8 వేల రూపాయల ఖర్చవుతుందని రైతులు మొత్తుకుంటున్నారు. అటు పెట్టిన పెట్టుబడి రాక, ఇటు సౌకర్యాలు లేక రైతు ఉభయభ్రష్టత్వం చెందుతున్న దయనీయం తెలంగాణలో కనిపిస్తోంది.

కేటీఆర్ ఇలాకాలోనే..


దీనికి నిరసనగా స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సిరిసిల్లలో, రైతులు ధాన్యం తగులబెట్టిన వైనం చూస్తే.. తరుగుపేరుతో మిల్లర్లు-అధికారులు ఏ స్థాయిలో మోసం చేస్తున్నారో స్పష్టమవుతోంది. అయినా ఈ వ్యవహారంలో అసలు మిల్లర్ల పాత్ర లేకపోయినా, వారు జోక్యం చేసుకోవడమే విమర్శలకు దారితీస్తోంది. తడిసిన ధాన్యం తదితర వ్యవహారాలన్నీ కేంద్రమే చూసుకుంటోందని, కేంద్రం వాటికి 75 శాతం నిధులు ఇస్తుంటే మిగిలినదే రాష్ట్రం ఇస్తోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయకుండా,  మిల్లర్లు- దళారులకు అప్పగించిందని బీజేపీ విరుచుకుపడుతోంది.

ఐకెపి సెంటర్లలో సౌకర్యాలు శూన్యం

ఇక ఐకెపి సెంటర్లలో కనీస సౌకర్యాలు లేక రైతు అల్లాడిపోతున్నాడు. ఎండాకాలం నేపధ్యంలో అక్కడ టెంట్లు, కుర్చీలు, మంచినీరు, చేతులు కడుక్కునేందుకు నీళ్లు కూడా ఏర్పాటుచేయాలి. మహిళా రైతులు కూడా వస్తున్నందున వారికి మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాల్సి ఉంది. అయితే, మెజారిటీ ఐకెపి సెంటర్లలో ఇవేమీ భూతద్దం వేసి వెతికినా కనిపించకపోవడమే విమర్శలకు దారితీసింది. ఐకెపి సెంటర్ల వద్ద సౌకర్యాలపై.. తొలుత గళం విప్పిన బీజేపీ అధ్యక్షుడదు సంజయ్, ఆ మేరకు నాలుగుసార్లు సర్కారుకు లేఖలు రాసినా ఫలితం కనిపించలేదు. కాంటాలు 15, 20 రోజులు ఆలస్యమవుతోంది. రవాణా సౌకర్యం కూలీల కొరతతోపాటు.. మిల్లుల దగ్గరే నాలుగురోజులు ఆలస్యమవుతోంది. దానితో రైతు చేసేదేమి లేక.. మిల్లర్లకే ధాన్యం ఇచ్చి, వాళ్లు ఇచ్చినంత తీసుకుని వెళుతున్న దారుణ పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇప్పుడు కురుస్తున్న అకాల వర్షాలు కూడా రైతును నిలువునా ముంచేస్తున్నాయి.

సమితి నేతలే దళారీలు: సంజయ్

రైతు సమన్వయ సమితి నేతలే దళారుల పాత్ర పోషిస్తున్నారని.. రైతు సమస్యల పరిష్కారం కోసం ఉపవాస దీక్ష చేస్తున్న, తెలంగాణ రాష్ట్ర తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. వాళ్లు రైస్ మిల్లర్లకు కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి కేటీఆర్ జిల్లాలోనే రైతులు ధాన్యం తగులబెట్టడం సర్కారుకు సిగ్గుచేటన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని, వారికి బీజేపీ బాసటగా నిలుస్తుందన్నారు. రైతు పంటలు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమయిందని, మంత్రుల పొగడ్తలతో కేసీఆర్ పొంగిపోతున్నారని, ఓసారి ఆయన ఐకెపి సెంటర్లకు వచ్చి చూడాలని సవాల్ చేశారు.

దళారులు-అధికారుల అవినీతి: సంకినేని

మిగులు ధాన్యాన్ని  డీసీఓ, ఐకెపి, పీఏసీఎస్ సెంటర్ నిర్వహకులు, సివిల్ సప్లయ్ అధికారులు పంచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఆరోపించారు. తొలుత రైతుల సమస్యలపై గళమెత్తినది తమ పార్టీయేనన్నారు. తమ రాష్ట్ర అధ్యక్షుడు వాటిపై నాలుగు లేఖలు రాసినా చలనం లేకపోవడం, రైతుల సమస్యలు పరిష్కారం కానందుకే తాము ఇప్పుడు ఉపవాస దీక్ష చేయవలసి వచ్చిందని వెల్లడించారు.   కాంటాల వద్ద కూడా రోజుల తరబడి ఆలస్యం జరుగుతోందని, మంత్రి జగదీష్‌రెడ్డి గ్రామమయిన  నాగారం ఐకెపి సెంటర్‌లోనే  రోజుల తరబడి కాంటాలు కావడం లేదంటే, ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఊహించుకోవచ్చన్నారు. వీటిని మరోసారి ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకే, తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ దీక్ష నిర్వహించారని చెప్పారు.

మిల్లరు-దళారులు-అధికారుల అవినీతికి తెరదించి, రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌లో పండించిన బత్తాయికి మార్కెట్ సౌకర్యం కల్పించడంలో కేసీఆర్ సర్కారు విఫలమైతే, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రంగంలోకి, ఢిల్లీ మార్కెటింగ్ అధికారులతో మాట్లాడవలసి వచ్చిందని గుర్తు చేశారు. రైతుకు పంట పెట్టుబడి కూడా ఇప్పించని ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనని  స్పష్టం చేశారు. కావాలనే ఆలస్యం చేయడం ద్వారా, ధాన్యాన్ని తక్కువ రేటుకు కొనేలా అధికారులు మిల్లర్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మంత్రుల బంధువులు మాత్రం తీసుకువచ్చిన ధాన్యం కాంటా అవుతున్నాయని సంకినేని ఆరోపించారు.

ధాన్య సేకరణ కేంద్రాలేవీ?: కాంగ్రెస్

రాష్ట్రంలో కావలసినన్ని ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటుచేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమయిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంటాల నుంచి కొనుగోలు వరకూ అన్నీ కావాలనే ఆలస జరుగుతున్నాయని ఆరోపించారు. 6900 కేంద్రాలు ఏర్పాటుచేస్తానని సర్కారు చెబితే,  కేవలం 2400 కేంద్రాలే పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. గోనె సంచులు, కూలీల కొరత, నిల్వ సౌకర్యం లేకపోవడమే ఆలస్యానికి కారణమని చెప్పారు. మక్కల కొనుగోళ్లలో 25 క్వింటాళ్ల పరిమితిని సవరించాలని డిమాండ్ చేశారు.