విష్ణుకు నోటీసు సరే.. మరి మంత్రుల మాటేమిటి సారూ?

588

జిల్లా దాటినందుకు విష్ణువర్దన్‌రెడ్డికి పోలీసుల నోటీసు
మరి మేఘా కృష్ణారెడ్డి, కనగరాజు, విజయసాయి, బొత్స అతీతులా?
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి తల్లి మృతి చెందారు. కానీ లాక్‌డౌన్ నిబంధన కారణంగా ఆయన అక్కడికి వెళ్లలేకపోయారు. ఎందుకంటే.. 18 రోజులు అక్కడే క్వారంటైన్‌లో ఉండాల్సివస్తుంది కాబట్టి.
 కేంద్ర హోం శాఖ సహాయమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి తన తల్లి సంవత్సరీకానికి హైదరాబాద్ వెళ్లలేకపోయారు. దానితో ఢిల్లీలోనే ఆ కార్యక్రమం కానిచ్చారు. అసలు.. ఎక్కడైనా తిరిగే అవకాశం ఉన్న దేశ ప్రధాని, కేంద్ర హోం శాఖ మంత్రి కూడా ఢిల్లీ నుంచి కాలు బయటపెట్టడం లేదు. కారణం లాక్‌డౌన్ నిబంధన. చట్టాన్ని తామే ఉల్లంఘిస్తే, ఇతరులు తమను వేలెత్తిచూపుతారన్న భయం! కానీ ఆంధ్రప్రదేశ్ మంత్రులు, అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, వీఐపీల దృష్టిలో లాక్ డౌనంటే.. బ్రేక్ డవునే!! ఎలాగో చూడండి!!!

పోలీసుల పనితీరు నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్

ఆంధ్రాలో పోలీసుల నిష్పాక్షిక పనితీరు.. నీతి.. నిజాయితీ.. నిబద్ధత.. అంకితభావం.. ఎవరి ‘ఒత్తిళ్లకు లొంగకుండా’చట్టం కఠినంగా అమలుచేస్తున్న తీరు నభూతోనభవిష్యత్! అంటే సినిమా భాషలో చెప్పాలంటే.. నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్నమాట!! ఎందుక ంటే, కేంద్ర సహాయమంత్రి హోదా ఉన్న ఒక నేతకు సైతం జిల్లా సరిహద్దు దాటినందుకు నోటీసులిచ్చారు కాబట్టి. మరి చట్టం అమలు విషయంలో అంత నిబద్ధత పాటించిన ఏపీ పోలీసులకు, సలాము కొట్టకపోతే పాపాత్ముల కిందే లెక్క. అందుకే పోలీసుల పనితీరు నెవ్వర్  బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అని పొగడాల్సి వచ్చింది.

విష్ణువర్దన్‌రెడ్డి విషయంలోనే ఉత్సాహమా?

నెహ్రు యువజన కేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర నేత విష్ణువర్దన్‌రెడ్డి ఇకపై 28రోజులు బయట తిరగడానికి వీల్లేదని, ఆ మేరకు ఆయన హోం క్వారంటైన్‌లో ఉండాలని, దీనిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అనంతపురం జిల్లా పోలీసులు ఆయన ఇంటికి నోటీసు అంటించారు. మంచిదే. ఉల్లంఘనకు పాల్పడిన వారికి నోటీసులిచ్చిన పోలీసులకు దండవేసి దండమెట్టాల్సిందే. ఇంతకూ విష్ణువర్దన్‌రెడ్డి ఏం చేశారంటే.. నెహ్రు యువజన కేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన, భారత క్రీడా మంత్రిత్వ శాఖ ద్వారా కరోనా సమయంలో చేయాల్సిన సేవా సహాయ కార్యక్రమాలపై, కర్నూలులో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ త ర్వాత మళ్లీ అనంతపురం జిల్లాలోని తన ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఆయన ఇంటికి నోటీసు అంటించారు. ఎందుకంటే ఆయన లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి, మరొక జిల్లాకు వెళ్లారు కాబట్టి! అయితే ఆయన తన విధి నిర్వహణలో భాగంగా జిల్లా దాటినా,  పోలీసుల దృష్టిలో లాక్‌డౌన్ ఉల్లంఘించినట్లే లెక్క.  ఈ విషయంలో పోలీసుల ఉత్సాహం, విధి నిర్వహణ మెచ్చదగిందే. దీనిని అత్యుత్సాహంగా భావించలేం.

వీరంతా ఉల్లం‘ఘనులే’గా మరి?

కానీ అదే ఉత్సాహం, అదే చిత్తశుద్ధి, అదే అంకితభావం, అదే నిర్మొహమాటం.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీవీఐపిల విషయంలో ఎందుకు చూపించరన్నది బుద్ధిజీవుల ప్రశ్న. ఇటీవలే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించడానికి మాజీ న్యాయమూర్తి కనగరాజ్ తమిళనాడు నుంచి విజయవాడకు వచ్చారు. ఆయన అంబులెన్స్‌లో విజయవాడకు వచ్చారని, చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సరే.. ఆయన ఆకాశమార్గం ద్వారా వచ్చినా, జలమార్గం ద్వారా వచ్చినా, భూమార్గం ద్వారా వచ్చినా.. విజయవాడ పోలీసులు ఇప్పుడు బయట అడ్డదిడ్డంగా లెక్కలేకుండా తిరుగుతున్న వారిని, లాక్‌డౌన్ నిబంధన ఉల్లంఘించినందుకు  కేసులు పెట్టి, వాహనాలు సీజ్ చేస్తున్నారు. మరి అదేమాదిరిగానే.. కనగరాజ్‌పై లాక్‌డౌన్ ఉల్లంఘన కింద కేసు పెట్టి, ఆయన ప్రయాణించిన వాహనాన్ని సీజ్ చేయాలి కదా? మరి అనంతపురం పోలీసులు చూపించిన ఉత్సాహాన్ని ముందు నెల్లూరు పోలీసులు, తర్వాత విజయవాడ పోలీసులయినా ఎందుకు చూపించలేదన్నది ప్రశ్న. ఇదికూడా చదవండి.. కనగరాజ్‌పై ఆరోపణలు అన్యాయం కదూ?!

ఈ ప్రశ్నకు బదులేదీ?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తరచూ విశాఖ-విజయనగరం-విశాఖకు షటిల్ సర్వీసులు చేస్తున్నారు. దానిపై విపక్షాలూ రోజూ విమర్శలు కురిపిస్తున్నాయి.  ఆయన వివిధ సేవాకార్యక్రమాల్లో పాల్గొని, బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ఆయన ట్రస్టు కూడా కరోనా సమయంలో విశేష సేవలందిస్తోంది. ఈ క్లిష్ట సమయంలో విజయసాయి సేవానిరతిని విమర్శించడం సరైనది కాదు. కానీ, లాక్‌డౌన్ సమయంలో ఎక్కడికీ వెళ్లకుండా, ఇంటిపట్టునే ఉండాలని ఓ వైపు ప్రభుత్వం, పోలీసులు చెబుతూనే ఉన్నారు. ఇంట్లోనే ఉండి కరోనాపై యుద్ధం చేయాలని మోదీ నుంచి జగనన్న వరకూ కొవ్వొత్తులు, చప్పట్లు, గంటలు కొట్టి మరీ పిలుపునిస్తూనే ఉన్నారు.  మరి విజయసాయిరెడ్డి, ఆయనతో తిరుగుతున్న మంత్రి అవంతి శ్రీనివాస్, ఆదిమూలం సురేష్ తదితరులు దానిని పాటించాలి కదా? సరే.. వాళ్లంటే మంత్రులు, ఎంపీలు కాబట్టి తమకు ప్రత్యేక హక్కులుంటాయని భావిస్తూ ఉండవచ్చు. కానీ, లాక్‌డౌన్ నిబంధనలు అమలుచేయాల్సిన పోలీసులకు ఏమైంది? జిల్లాలకు జిల్లాలకు దాటేస్తున్న వారిని క్వారంటైన్‌లో పెట్టాల్సిన బాధ్యత- విధి పోలీసులకు లేదా? ఆ పనిచేయడానికి భయపడుతున్నారనుకుందాం. కానీ విజయసాయిరెడ్డికి కనీసం నచ్చచెప్పే ధైర్యం కూడా పోలీసులకు లేదా? అన్నది ఇప్పుడు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. మేం చేస్తే అరదండాలు, వాళ్లు చేస్తే దండాలా? అన్న బుద్ధిజీవుల ప్రశ్నకు పోలీసులు సమాధానం ఇస్తారేమో చూడాలి! ఇదికూడా చదవండి.. సచివులు..సార్లకు ఓ రూలు! సామాన్యులకు.. ఓ రూలా సారూ?

ఉల్లంఘనులపై కేసులు పెట్టే ఉత్సాహమేదీ?

ఇటీవల శ్రీకాళహస్తిలో అధికార పార్టీ ఎమ్మెల్యే ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి నుంచి కరోనా కేసులు ప్రారంభమయి, ఇప్పుడు అవి తిరుమలకు పాకింది. కనిగిరి  వైసీపీ ఎమ్మెల్యే కర్నాటక సరిహద్దు నుంచి లాక్‌డౌన్ నిబంధన ఉల్లంఘించి వచ్చారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి సామాజిక దూరాన్ని చెరిపేసి, భారీ స్థాయిలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కర్నూలు ఎమ్మెల్యే వల్లనే అక్కడ వైరస్ వ్యాప్తి చెందిందన్న ఆరోపణలు రావడ ం, దానిని ఆయన ఖండించడం తెలిసిందే. అయినా వీరిపై పోలీసులు ఒక్క కేసు గానీ, ఒక నోటీసు గానీ ఇచ్చిన దాఖలాలు లేవంటే.. చట్టం ఎవరికి చుట్టమన్నది అర్ధం కాని వారికి సైతం అర్ధమవుతూనే ఉంది.

సరే.. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ తమిళనాడు వెళ్లినట్లు చెబుతున్నారు. అంటే ఆయన మళ్లీ ఇక్కడకు రావలసిందే. మరి రావాలంటే ఎలా? కనీసం ఈసారి వచ్చినప్పుడైనా ఆయనను క్వారంటైన్‌లో ఉంచుతారా? అనంతపురం పోలీసులు విష్ణువర్దన్‌రెడ్డి విషయంలో చూపిన ఉత్సాహం నెల్లూరు పోలీసులు చూపిస్తారా? అన్నది ప్రశ్న. ఎందుకంటే కనగరాజ్ నెల్లూరు సరిహద్దుల మీదుగానే విజయవాడకు రావాలి కాబట్టి! ఇది కూడా చదవండి.. రైతులకు నోటీసులు సరే.. ఆ ఉల్లం‘ఘనుల’ మాటేమిటి?