ప్రభుత్వానికీ ఓ’అధికార ప్రతినిధి’ఉండాలి!

520

విజయవాడ: ఈ రోజుల్లో సమాచార విప్లవం బహుముఖంగా విస్తరించింది. ఏ వ్యవస్థకు సంబంధించిన ఎటువంటి సమాచారం అయినా…క్షణాల వ్యవధిలో విశ్వం అంతా…..కుమారస్వామి లాగా బయలుదేరి…వినాయకుడు శివుని చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టు చేసేస్తోంది. దీనికి ‘యాంటీ సోషల్ మీడియా’అనే ముద్దుపేరు కూడా మెల్లగా స్థిరపడుతోంది. ప్రతి రాజకీయ పార్టీ కూడా’ఆత్మ స్తుతి–పరనింద’కు ఎంచుకున్న రాజమార్గం….’అధికార ప్రతినిధి’. వీరు లేకుండా…చాలా రాజకీయ పార్టీలకు పూటకూడా గడవడం లేదు. అందుకే…ఒక్కొక్క పార్టీ అరడజను మందికి తక్కువలేకుండా…’అధికార ప్రతినిధి’ అని వీపుల మీద రాజాంకితాలు వేసేసి…జనం మీదకు వదిలేస్తున్నాయి. అధికారం లో లేని పార్టీలు ఏమి మాట్లాడినా చెల్లిపోతుంది కనుక…వాటి తాలూకూ ‘అధికార ప్రతినిధులు’కూడా జనంతో ఆడుకుంటుంటారు. చాలా సందర్భాల్లో వీరు మాట్లాడే దానికి తలా… తోక ఉండదు. వాస్తవాలే చెపోయాలని లేదు. లొడలోడా చెప్పేసినా చెల్లి పోతుంది.
‘ఎందుకని…’ అంటే…’ఆ పార్టీ లైనే అంత…’అని సరి పెట్టుకోవడమే.

కానీ…అధికార పక్షానికి అంత వెసులుబాటు ఉండదు. ఎందుకంటే….ప్రభుత్వ ఆలోచనలు, నిర్ణయాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు ఒక క్రమ పద్ధతిలో చేరాల్సిన అవసరం ఉంది. ఎక్కువ తక్కువలు కుదరవు. కొంచెం తొట్రుపాటుకు లోనైనా…ప్రతిపక్షాల ‘అధికార ప్రతినిధులు’ఆవురావురుమంటూ మీదపడి రక్కేస్తారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది ఇదేనేమోనన్న అనుమానం చాలా మందికి కలుగుతున్నది.
టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ కి చెందిన ‘అధికార ప్రతినిధు’లు రోజూ జగన్ ప్రభుత్వ నిర్ణయాలను ఏదో ఒక రూపంలో విమర్శిస్తూనే ఉన్నారు. దీనిని ఎదుర్కోడానికో….లేదా…విమర్శల లోని అంశాలకు సంబంధించి ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయడానికో…, ప్రభుత్వానికి కూడా ‘అధికార ప్రతినిధి’ ఉండాల్సిన అవసరం కనపడుతున్నది. ప్రతిపక్షాల అధికార ప్రతినిధులు వాడే భాషకు అనుగుణమైన రీతిలో…. స్మూత్ గా ఉంటే, స్మూత్ గా..పరుషంగా ఉంటే పరుషంగా…సున్నితం గా ఉంటే…సున్నితగా…ప్రభుత్వ విధానాలను వివరించగలిగిన ఓ ‘గండర గండడు’లేని లోటు ఇప్పుడు చాలా స్పష్టంగా కనపడుతోందనే భావన అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అడపా దడపా మీడియా ముందుకు వస్తున్నారు కానీ…,’రాజకీయ ఖతర్నాక్’ కాకపోవడంవల్ల, ఒక తులసిరెడ్డి మాట్టాడినట్టో…ఒక వర్ల రామయ్య మాట్టాడినట్టో…వాచికాభినయం సజ్జలకు అంతగా కుదరడం లేదని కూడా ఆయన మీడియా సమావేశాలు చూసినవారు అంటున్నారు. స్వతహాగా పెద్ద మనిషి కావడం….,తెలుగు భాషకు అలంకారభూషితమైన బూతులలో ఆయనకు తొలినుంచీ ప్రవేశం లేకపోవడం వల్ల కూడా, ఆయన ప్రతిస్పందనల్లో..’పంచ్’కొరవడుతోందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
‘దిస్ ఈజ్ నాట్ హిజ్ కప్ ఆఫ్ టీ..’అని ఒక సీనియర్ జర్నలిస్ట్ మిత్రుడు వ్యాఖ్యానించారు.
ఫలితంగా…ఇటు ప్రభుత్వానికీ…,అటు ప్రతిపక్షాలకూ మధ్య రోజువారీ జరిగే ‘మాటల యుద్ధం’ లో ప్రభుత్వం వెనుకబడి పోతున్నదనే అభిప్రాయం కూడా జనం లో స్ప్రెడ్ అవుతున్నది.

175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాలు గెలిచి, ప్రభుత్వానికి సారధ్యం వహిస్తున్న పార్టీ కి…ఇటువంటి కొరత ఉండడం పై ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి.ప్రభుత్వ ఆలోచనా తీరుని వివరించడానికి మంత్రి బొత్స సత్యనారాయణ అప్పుడప్పుడూ రంగప్రవేశం చేస్తున్నారు గానీ….భాష, భావ వ్యక్తీకరణలో లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోందని ఆయన మీడియా సమావేశాలకు వెళ్లొస్తున్న మిత్రులు అభిప్రాయ పడుతున్నారు.

భాషలో’బొత్స కంటే ఎక్కువ….కొడాలి నాని కంటే బాగా బాగా తక్కువ’యిన నేతలను ‘అధికార ప్రతినిధి’గా రంగం లోకి దింపవలసిన అవసరం కనపడుతోంది.
ఇలా చూస్తే….సత్తెనపల్లి శాసన సభ్యుడు, అంబటి రాంబాబు…, తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి కనబడుతున్నారు. లయబద్దంగా చేతులతో అభినయిస్తూ…కళ్ళు, మోహకవళికలతోనే చెప్పవలసిన విషయాన్ని సూటిగా…స్పష్టంగా…అలవోకగా, విమర్శక ‘అధికార ప్రతునిధు’ల భాషలో చెప్పడంలో వీరిద్దరూ సిద్ధహస్తులు.
గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి పందెపు పుంజుల్ని బరిలోకి దింపినట్టు…ఈ రెండు పుంజుల్నీ …రాజకీయ బరి లోకి ‘అధికారికంగా’ దింపే విషయాన్ని, అవసరాన్ని ప్రభుత్వం పరిగణన లోకి తీసుకుంటుందేమో…చూడాలి.

—–భోగాది వేంకట రాయుడు.