ఢిల్లీ బీజేపీ ఒకటి బెజవాడ బీజేపీ వేరు కాదు
కిట్ల కోనుగోల్‌మాల్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయండి
వైసీపీ సర్కారును ఉపేక్షించవద్దు
వైసీపీ-టీడీపీ రెండిటితోనూ సమదూరం
అందరి గొంతులూ ఒకేలా ప్రతిధ్వనించాలి
కమలనాధులు కన్నాను అనుసరించండి
వైసీపీ బంధంపై తేల్చి చెప్పిన కమలదళపతి నద్దా
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో అధికార వైసీపీతో ఉన్న బంధంపై.. ఇప్పటివరకూ అయోమయంలో ఉన్న కమలనాధుల సందేహాలకు, కమలదళపతి నద్దా తెరదించారు. వైసీపీతో ఎలాంటి బాదరాయణ సంబంధాలు లేవని తేల్చారు. తెలుగుదేశంతో ఎంతో దూరంలో ఉండాలో,వైసీపీతోనూ అంతే దూరంలో ఉంటామని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా నాయకత్వాన్ని అనుసరించాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. ఒక రాజకీయ పార్టీగా వైసీపీ ప్రభుత్వంపై పోరాడాల్సిందేనని దిశానిర్దేశం చేశారు. వీటికి మించి.. నేతలందరిదీ ఒకే గొంతుక కావాలని నొక్కి చెప్పారు. దీనితో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ-వైసీపీ బంధంపై నేతల ఊగిసలాట, గందరగోళానికి తెరపడినట్టయింది.

బంధంపై నద్దా స్పష్టీకరణ..

వైసీపీలో నెంబర్‌టూ నేత విజయసాయిరెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపి సుజనాచౌదరి, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరిపై చేసిన తీవ్రమైన ఆరోపణల సెగ ఎట్టకేలకు ఢిల్లీకి తాకింది.  దానితో కమల దళపతి నద్దా స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. బీజేపీ నేతలతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన నద్దా.. వైసీపీతో బీజేపీకి ఎలాంటి బంధం-అనుబంధం లేదని, దానిని ఒక రాజకీయ ప్రత్యర్ధిగానే చూడాలని స్పష్టం చేశారు. దీనిపై ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు.  కొందరు నేతల గళాలు, తీరులో తేడాలున్న విషయాన్ని గమనించిన నద్దా.. వైసీపీ విషయంలో ఇకపై అందరిదీ ఒకే స్వరం కావాలని ఆదే శించారు. విజయసాయి బీజేపీ నేతలపై చేసిన ఆరోపణలను ఒకేతాటిపైకొచ్చి ఖండించాలన్నారు.

బీజేపీ రెండు కాదు.. ఒకటే

ఏపీ బీజేపీ-జాతీయ బీజేపీ నాయకత్వాలది వేర్వేరు దారులు, విధానాలన్న విమర్శలకు నద్దా తెరదించారు. ‘బెజవాడ బీజేపీ-ఢిల్లీ బీజేపీ వేర్వురు కాదు. రెండూ ఒకటే. దీనిపై మీకేమైనా అనుమానాలుంటే వాటిని తొలగించుకోండి. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాలే అంతిమ’మని నాయకులకు స్పష్టం చేశారు. ప్రధానంగా.. ఇంత వివాదానికి కారణమయిన కరోనా కిట్ల కోనుగోలుపై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను, గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాలని నద్దా ఆదేశించారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు గవర్నర్‌కు ఇవ్వండని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి జనసేన తప్ప ఎవరూ మిత్రపక్షం కాదని, వైసీపీ-టీడీపీలకు సమాన దూరంలో ఉండాలని స్పష్టం చేశారు. ఒక రాజకీయ పార్టీగా, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు మొహమాటపడాల్సిన పనిలేదని.. కొందరు వైసీపీ అనుకూల నేతలకు చురకలు అంటించినట్లు చెబుతున్నారు.

విభీషణులెవరో తెలిసిందా?

కాగా, ఈ పరిణామాల ద్వారా… బీజేపీలో  విభీషణులెవరో నాయకత్వానికి తెలిసినట్లు స్పష్టమవుతోంది. అందరి గళాలు ఒకేలా ఉండాలని, అంతా ఒకే తాటిపైకి రావాలని, వైసీపీ సర్కారుపై పోరాటంలో మొహమాటం వద్దని నద్దా, మధుకర్‌జీ వాడిన పదాలన్నీ.. విభీషణులనుద్దేశించేనంటున్నారు. కొందరు సీనియర్లు..  తొలి నుంచీ వైసీపీ నేతలు, ప్రధానంగా విజయసాయితో సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారని, ప్రభుత్వంలో పనులు కూడా చేయించుకుంటున్నారన్న వ్యాఖ్యలు, చాలాకాలం నుంచి పార్టీ వర్గాల్లో అంతర్గతంగా వినిపిస్తూనే ఉన్నాయి. అటు వైసీపీ కూడా బీజేపీ ఢిల్లీ ప్రముఖుడి ద్వారా, జాతీయ స్థాయిలో ఆ పార్టీలో ఏం జరుగుతోంది? ఏపీ విషయంలో పార్టీ వైఖరి ఎలా ఉందన్న అంశాలను కూడా సదరు నాయకుడే, వైసీపీ నాయకత్వానికి ఉప్పందిస్తున్నారన్న వ్యాఖ్యలు కూడా వినిపించకపోలేదు.

తెరపడని గుసగుసలు

ఆ నాయకుడు ఏపీకి వచ్చినప్పుడల్లా.. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు సకల సౌకర్యాలు కల్పిస్తోందని, మంత్రుల మాదిరిగా పైలెట్, ఎస్కార్టు కూడా ఇస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. పైగా ఒక హోటల్‌లో షేర్లు, పవర్‌ప్రాజెక్టు కూడా ఇచ్చారన్న గుసగుసలకు ఇంకా తెరపడలేదు. మరో నేతతో విజయసాయికి, విశాఖ పీఠం నుంచే అనుబంధం ఉందంటున్నారు. గతంలో వీరిద్దరూ టీడీపీ-బీజేపీ మిత్రపక్షంగా ఉన్నరోజుల్లోనే  ఆ ‘సర్వసంగ పరిత్యాగి’ సమక్షంలో చర్చలు జరిపారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏపీ, ఢిల్లీలో ఉన్న కొందరు బీజేపీ నేతలను వైసీపీ నాయకత్వం ‘బాగా చూసుకుంటోందని’ వారి అవసరాలు తీరుస్తున్నందుకే వారంతా టీడీపీకి వ్యతిరేకంగా,  వైసీపీ సర్కారు పట్ల సహజంగా  విశ్వాసం చూపిస్తున్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చాలాకాలం నుంచీ వినిపిస్తున్నాయి. అయితే.. తాజా కన్నా-విజయసాయి వ్యవహారం రచ్చకెక్కి, అది ఢిల్లీ వరకూ వెళ్లిన సందర్భంలోనే.. ఈ విభీషణుల వ్యవహారం బట్టబయలయిందని చెబుతున్నారు.

రాష్ట్రంలో రెండు బీజేపీలు

కాగా రాష్ట్ర బీజేపీలో ఒక వర్గం వైసీపీకి లోపాయికారీగా సహకరిస్తోంది. మరో వర్గం దానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఇటీవల టీడీపీ నుంచి చేరిన వారు కూడా ఈ వర్గంలో ఉండటంతో, సహజంగానే ఈ వర్గంపై టీడీపీ అనుకూల ముద్ర పడుతోంది. అయితే.. కొన్ని దశాబ్దాల నుంచి చంద్రబాబునాయుడు రాజకీయ ప్రత్యర్థి, ఆయనపై శాసనసభలో ఒంటికాలిపై లేచి విరుచుకుపడే కన్నా లక్ష్మీనారాయణ కూడా ఈ వర్గంలో ఉండటం వల్ల, సహజంగా ఆ  ముద్ర ఆయనపైనా పడేందుకు కారణమయింది. విజయసాయిరెడ్డి తన మైండ్‌గేమ్ పాలిటిక్స్‌ను దానితో ముడిపెట్టి, కన్నాను దెబ్బకొట్టే వ్యూహానికి తెరలేపారు. అయితే, కన్నా-బాబు వైరం గురించి తెలిసిన వారెవరూ దానిని నమ్మే అవకాశాలు తక్కువంటున్నారు. గత ఎన్నికల ముందు టీడీపీతో పొత్తు వద్దని చెప్పడంతోపాటు, మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, బాబు సర్కారును కన్నా బహిరంగంగా దుయ్యబట్టారు. అలాంటిది ఆయన, టీడీపీతో కుమ్మక్కయారంటే నమ్మడం కష్టమని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner