జగన్ కంటే రాజు గారే ‘పవర్’ఫుల్!

789

రాజుగారు తలచుకుంటే డెప్యుటేషన్ కొదువా?
స్టీఫెన్.. శ్రీలక్ష్మీ కంటే శ్రీనివాసరాజుగారే గ్రేటా?
తెలంగాణకు డెప్యుటేషన్ సాధించిన టీటీడీ రాజు
 ఢిల్లీ ఏపీభవన్ చుట్టూ తిరుగుతున్న శ్రీలక్ష్మి
              (మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ  ఐపిఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర, ఐఏఎస్ శ్రీలక్ష్మి.. వీరిద్దరినీ ఆంధ్రప్రదేశ్‌కు డెప్యుటేషన్‌పై తీసుకురావాలని, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చాలాకాలం నుంచీ ప్రయత్నిస్తోంది. స్టీఫెన్ రవీంద్రను నిఘా దళపతి చేయాలన్నది జగన్మోహన్‌రెడ్డి కోరిక. గతంలో ఆయనకు రాష్ట్రంలో పనిచేసిన అనుభవం ఉండటం, ముక్కుసూటి అధికారి కావడమే దానికి కారణం.దానికోసం జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు చెవినిల్లుకట్టుకుని చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ అవి వారికి వినిపించడం లేదు.  స్టీఫెన్ రవీంద్ర అయితే ఎక్కడా తెరపై కనిపించ లేదు. ఆయన తెలంగాణలో తన పని తాను చేసుకుంటున్నారు.

కానీ శ్రీలక్ష్మి ఉన్నారే.. అదేనండీ జగన్ అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయి జైలుశిక్ష కూడా అనుభవించి, ఇప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుల దగ్గర కనిపిస్తున్నారే.. ఆమె అన్నమాట!. ఆమె మాత్రం పట్టువదలని విక్రమార్కిణి మాదిరిగా,  ఢిల్లీలో ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఆమె హైదరాబాద్‌లో కంటే ఢిల్లీ ఏపీభవన్, తెలంగాణభవన్‌లోనే దర్శనమిస్తుంటారు. ఆమెను ఎలాగైనా ఏపీకి తీసుకురావాలని వైసీపీలో నెంబర్‌టూ నేత, ఎంపి విజయసాయిరెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. ఆమెను వెంటపెట్టుకుని హోంమంత్రి, పీఎంఓ కార్యాలయాలకు తీసుకువెళ్లిన ఫొటోలు మీడియాలో కూడా వచ్చాయి. కానీ డిఓపీటీ మాత్రం, వారిద్దరినీ ఏపీకి పంపించేందుకు ఇప్పటివరకూ సుముఖత చూపలే దు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించనట్లు.. వారిని ఏపీకి పంపించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధంగానే ఉన్నప్పటికీ, కేంద్రం మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం లేదు. జగన్మోహన్‌రెడ్డితో కావలసిన కార్యాలు సాగిస్తున్నప్పటికీ, మోదీ సర్కారు ఈ విషయంలో మాత్రం ‘ఆ ఒక్కటీ తప్ప’ అని మెలికపెడుతోంది.

సరే.. ఈలోగా ‘మన రాజు గారు’.. అదేనండీ, తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా, ముగ్గురు సీఎంలు మారినా ఏకబిగిన అదే స్థానంలో పనిచేశారే.. ఆ శ్రీనివాసరాజు అన్నమాట! ఆయన తాను తెలంగాణకు డెప్యుటేషన్‌పై వెళతానని దరఖాస్తు పెట్టుకోవడం, అందుకు తెలంగాణ- ఆంధ్రా ప్రభుత్వాలు, డీఓపీటీ కూడా మహదానందంగా అంగీకరించడం, ఆ ప్రకారంగా 2001 బ్యాచ్ అధికారి శ్రీనివాసరాజును, అఖిల భారత సర్వీసు నిబంధన 1954 సెక్షన్ 6(1) ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి మూడేళ్ల పాటు డెప్యుటేషన్ వెళ్లేందుకు చకచకా  ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిజానికి చాలామంది ఐఏఎస్,ఐపిఎస్ అధికారులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వెళ్లాలని ఉబలాటపడుతున్నారు. ముఖ్యంగా గత చంద్రబాబు సర్కారు హయాంలో ప్రాధాన్యం ఉన్న పోస్టులలో పనిచేసిన వారు, మరికొంత స్వేచ్ఛగా పనిచేసిన వారంతా ఇప్పుడు ఆంధ్రాలో గాలి రాక ‘ఊపిరాడని’ పరిస్థితిలో ఉన్నారు. కారణం.. ఒక జూనియర్ అధికారి వారిని  శాసిస్తుండటమే. ఆయన వద్ద చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి వచ్చినందుకు కుమిలిపోతున్నారట. ఇటీవల కమర్షియల్ టాక్స్ శాఖకు చెందిన ఓ అధికారిని రెండు వాహనాలు పంపమని ఆదేశిస్తే, సదరు అధికారి కుదరదన్నారట. పేషీ  అవసరాల గురించి ప్రస్తావించినా కుదరదని చెప్పారట. దానితో సదరు అధికారి కేవలం రెండున్నర గంటల్లో బదిలీ అయిపోయినట్లు సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  అంతేనా? ఎవరికేం పోస్టింగులు కావాలో కోరుకోమని అడక్కుండానే వరాలిచ్చేస్తున్నారట. ఫలితంగా, ఐఏఎస్ అధికారులంతా ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి కంటే సదరు అధికారి చుట్టూనే ప్రదక్షణలు చేస్తున్నారట. అన్నట్లు ఓ సలహాదారు ఈ తలనొప్పి భరించలేక, పేషీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. అది వేరే విషయం!


తాజాగా శ్రీనివాసరాజు డెప్యుటేషన్ వ్యవహారం పరిశీలిస్తే.. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి కంటే, తిరుమల వెంకటేశ్వరుడికి సుదీర్ఘకాలం రికార్డుస్థాయిలో ప్రతినిధిగా పనిచేసి.. ఆ కాలంలో దేశ, విదేశాల అధ్యక్షులు, ప్రధానుల వద్ద పరపతి పెంచుకుని, దానితోనే పక్క రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వెళ్లిన శ్రీనివాసరాజు పవర్‌ఫుల్లా? కాదా? దాదాపు ఏడాది నుంచి ఢిల్లీకి వచ్చినప్పుడల్లా స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మితోపాటు కొత్తగా.. కర్నాటకు చెందిన మరో అధికారి శ్రీవత్సను తీసుకురావాలని కోరుతున్న జగన్మోహన్‌రెడ్డికి, ఢిల్లీలో ఎందుకో వర్కవుట్ కావడం లేదు. కాగల కార్యం నెరవేర్చే గంధర్వుడు ఉన్నా ఎందుకో జగన్మోహన్‌రెడ్డి కోరిక మాత్రం కోరికగానే ఉండిపోయింది. కర్నాటక క్యాడర్‌కు చెందిన శ్రీవత్సను తీసుకువచ్చి, ఆయనకు టీటీడీ ఈఓ పదవి ఇవ్వాలన్న జగనన్న కోరిక కూడా నరేంద్ర భయ్యా నెరవేర్చడం లేదు. కానీ, ఓ  జెఈఓగా చేసిన అధికారికి సంబంధించి డిప్యుటేషన్ ఫైల్ మాత్రం.. పంచకల్యాణీ గుర్రం మాదిరిగా పరుగులు తీసి, ఆయనను అమాంతం కోరుకున్న రాష్ట్రంలో పడేలా చేసింది. మరి ఇప్పుడు చెప్పండి?.. రెడ్డి గారు గొప్పా? రాజు గారు గొప్పా?!

2 COMMENTS