కరోనా మహమ్మారి వల్ల రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఉదారంగా సాయం అందిస్తోంది. వివిధ పథకాల కింద ఇప్పటికి 10వేల 947 కోట్ల రూపాయల విలువైన సాయం అందించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడి గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. కరోనా నేపథ్యంలో గ్రామాలు, పట్టణాలలో కనీస సౌకర్యాలు, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు రూ.870 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.431 కోట్ల విడుదల చేసింది. రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.491.41 కోట్లు, విపత్తుల సహాయ నిధి అడ్వాన్సు కింద రూ.559.50 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.1892.64 కోట్లు ఇచ్చింది.

లాక్ డౌన్ వల్ల పనులు లేక ఇబ్బందులు పడే నిరుపేదలు, వలస కూలీల కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో ఒక లక్షా 70 వేల కోట్ల రూపాయల ప్యాకేజి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజి కింద రాష్ట్రంలో తెల్లకార్డుదారుల కుటుంబసభ్యులుకు మూడు నెలల పాటు ఉచితంగా నెలకు 5 కిలోల చొప్పున గోధుమలు లేదా బియ్యం, ఒక కిలో పప్పు ధాన్యాలు ఇప్పుడిస్తున్న రేషన్ కు అదనంగా ఇస్తారు. దీని విలువ రూ.3096 కోట్లు. పిఎం కిసాన్ యోజన లబ్ధిదారులైన రైతులకు ఖరీఫ్ సాయం కింద ఏప్రిల్ లోనే రూ.2 వేలు ఇవ్వనున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని 46 లక్షల మంది రైతులకు రూ.920 కోట్ల మేరకు లబ్ది కలుగుతోంది. జనధన్ ఖాతాలున్న మహిళలకు మూడు నెలల పాటు నెలకు రూ.500 చొప్పున మొత్తం 750 కోట్లు జమ చేయనున్నారు. ఉపాధి హామీ కూలీ రూ.202 నుంచి 227 కు పెంచింది. దీనికోసం రూ.1300 కోట్లు వెచ్చిస్తోంది. డ్వాక్రా మహిళల రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద రాష్ట్రంలో 3.90 లక్షల కుటుంబాలకు మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్ సిలెండర్లు సరఫరా చేయనుంది. దీని వల్ల ఒక్కో కుటుంబానికి రూ.2,500 రూపాయలు లబ్ధి కలుగుతోంది. దీని కోసం అయ్యే ఖర్చు రూ..100 కోట్లు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇప్పుడిస్తున్న పింఛన్లకు అదనంగా రెండు విడతల్లో వెయ్యి రూపాయలు ఇవ్వనుంది. మొత్తం 53.69 లక్షల మంది లబ్ధిదారులకు రూ.537 కోట్ల మేర లబ్ధి కలగనుంది.

ప్రధాని నరేంద్రమోడి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బిజెపి కట్టుబడి వుంది. భవిష్యత్తులో కూడా ఎపికి ఎలాంటి సాయం అందించడానికైనా కేంద్రప్రభుత్వం సిద్ధంగానే వుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన సాయాన్ని తామే ఇస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం విపత్తు సమయంలో రాజకీయం చేయడంగా భావించాలి. ప్రధానమంత్రి దగ్గర్నుంచి వైద్యనిపుణులందరూ హెచ్చరికలు చేస్తున్నప్పటికీ అధికారపార్టీ నేతలు లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘిస్తున్నారు. సహాయం పేరుతో వారు చేస్తున్న హంగామా, ర్యాలీల కారణంగా ఎపిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా కరోనా నియంత్రణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner