కరోనాపై సంఘ్ పరి‘వార్’!

413

లక్షల్లో సైనికులు, వేలల్లో బృందాలు
హెల్ప్‌లైన్‌కు అపూర్వ స్పందన
దివిసీమ ఉప్పెన నుంచి కరోనా వరకూ..
(మార్తి సుబ్రహ్మణ్యం)

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. ఈ పేరు సేవకు నిలువెత్తు చిరునామా. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తిన ప్రతిసారీ, మేమున్నామంటూ రంగంలోకి దిగి బాధితులకు బాసటగా నిలిచే మహోన్నత మానవీయ సంస్థ. కులం-మతం-ప్రాంతాలకు అతీతంగా బాధితులను పెద్ద మనసుతో హత్తుకుని సేవలందించడంలో దానికదే సాటి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సభ్యులున్న సేవాసంస్థగా పేరున్న ఆర్‌ఎస్‌ఎస్‌కు, సేవాతత్పరత  పుట్టుకతో వచ్చిన లక్షణం. దాని మతం మానవత్వం. దివిసీమ ఉప్పెన నుంచి కరోనా కల్లోలం వరకూ ప్రతి భారతీయుడూ దానిలో దర్శించిన తత్వం అదే! దివిసీమలో చెల్లాచెదురైన శవాలను వెలికితీసి, దహనసంస్కారాలు చేసిన గొప్ప సేవాసంస్థ అది. వందలమంది నిరాశ్రయులకు గూడు కల్పించిన మానవీయ ఘటనలు ఇంకా దేశప్రజలు మర్చిపోలేదు.

ఈ కరోనా కల్లోల సమయంలో కూడా సంఘ్‌పరివార్ తన అప్రతిహత సేవలను కొనసాగిస్తోంది. ఫలితంగా వారి సేవలతో ప్రజలు ఊరటచెందుతున్నారు. కొన్ని లక్షల మంది సంఘ్ సైనికులు దేశం నలుచెరులుగులా విస్తరించి, వేలల్లో బృందాలుగా ఏర్పడి సామాన్యులకు సేవలందిస్తున్నారు. కరోనాలో కష్టాలు పడుతున్న వారిని ఆదుకునేందుకు ఏర్పాటుచేసిన, హెల్ప్‌లైన్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. విశ్వహిందూపరిషత్, భజరంగ్‌దళ్, సేవాభారతి ఇలా.. లెక్కలేనన్ని సంఘ్ పరివారం సంస్థలు, సభ్యులు బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు.. పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సేవలు  దానికి అదనం. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ కార్యకర్తలు వెళ్లడానికి, సేవలందించేందుకు వీలు లేని ప్రాంతాల్లో ఉన్న బాధితుల వివరాలను, బీజేపీ కార్యకర్తలకు అందిస్తున్నారు. అక్కడ ఉన్న స్థానిక బీజేపీ కార్యకర్తలు వలస కుటుంబాలకు నిత్యావసర వస్తువులు సమకూరుస్తున్నారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి.. గత కొద్దిరోజుల నుంచీ, తెలంగాణలో చిక్కుకుపోయిన వలస కూలీల వివరాలను సేకరిస్తున్నారు. వాటిని స్ధానిక అధికారులతోపాటు, ఆయా నియోజకవర్గ భాజపా నాయకులకు అందించి వారికి సహాయ కార్యక్రమాలు అందించే పనిలో ఉన్నారు.

లాక్‌డౌన్ వల్ల ఎక్కడికక్కడ నిలిచిపోయి, తిండి లేక అల్లాడుతున్న వలసజీవులకు సంఘ్ పరివారం అండగా నిలుస్తోంది. బీహార్, యుపి, తమిళనాడు, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు కూడు-గూడు ఏర్పాటుచేయడం ద్వారా, వారిని ఆకలిచావులకు గురికాకుండా ఆదుకుంటోంది. ప్రధానంగా, ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల్లో సంఘ్‌పరివారం క్షేత్రస్థాయిలో తన సేవలందిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలో సంఘ్ పరివారం సేవాకార్యక్రమాలు కొనసాగిస్తోంది. బియ్యం, కూరలు, వంటసామాగ్రి, యాచకులకు దుప్పట్లు పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకూ 33 రెవిన్యూ జిల్లాలలో 1800 మంది కార్యకర్తలు కార్యక్షేత్రంలో ఉండి, వివిధ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయి ఉన్నారు. ఆవిధంగా దాదాపు 5 లక్షల మంది అన్నార్తులను ఆదుకుంది.  ఈ సందర్భంగా అశ్వనీ సుబ్బారావు అందించిన హోమియా మాత్రలను 35వేల మందికి పంపిణీ చేసింది. మొత్తం 500 క్వింటాల బియ్యం, 35 వేలమందికి ఆహారపొట్లాలు, 100 క్వింటాల కూరగాయలు పంపిణీ చేసింది.  ప్రత్యేకించి 27 వేల మంది భజరంగ్‌దళ్ కార్యకర్తలు మూడున్నర లక్షల మంది ప్రజలను కలసి, వారికి నిత్యావసరాలు కల్పించడం విశేషం. తెలంగాణలో విశ్వహిందూ పరిషత్ మతాలు-ప్రాంతాలకు అతీతంగా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న బాధితులను ఆదుకుంటోందని, పలువురు వదాన్యులు కూడా వారిని ఆదుకునేందుకు ముందుకువస్తున్నారని వీహెచ్‌పి ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి వెల్లడించారు.

కృష్ణాజిల్లాలో జనసంక్షేమ సమితి-సేవాభారతి-ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు సామాన్యులను ఆదుకుంటున్నాయి.  పోలీసు, పారిశుధ్య పనివారితోపాటు, రోడ్డుపైన జీవించే కడుపేదలకు శానిటైజర్లు, బియ్యం, మాస్కులు, ఆహారపొట్లాలు పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా దళిత, బడుగు బలహీన వర్గాలు నివసించే మురికివాడలకు స్వయంగా వెళ్లి సామాగ్రి అందిస్తున్నారు. జిల్లాలోని 90 ప్రాంతాల్లో దాదాపు 6 వేల కుటుంబాలు ఈ సేవాకార్యక్రమాలతో లబ్థిపొందాయి. గూడూరు, మార్కాపురం, గుడ్లూరు, తెనాలి, కడప, గాజువాక, అరిలొవ, రాజమండ్రి, బందరు, ముమ్ముడివరం, నెల్లూరు, నంద్యాల, బొబ్బిలి, పార్వతీపురం, ఏలూరు ప్రాంతాల్లో స్వయంసేవకులు నిబంధనల మేరకు, వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, మరెక్కడైనా ఇదే విధానం అనుసరించాలని జనసంక్షేమ సమితి అధ్యక్షుడు, ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత సంఘచాలక్ భూపతిరాజు శ్రీనివాసరాజు కోరారు.

ఇప్పటివరకూ ఏపీలో సంఘ్ పరివార్ లక్ష మాస్కులు, 5 వేల శానిటైజర్లు, గ్లౌజులు, 5700 ఆహారపొట్లాలు, 2 వేల రేషన్ కిట్లు, 500 టీ బ్యాగులు, 7500 హోమియా మాత్రలు పంపిణీ చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో సేవాభారతి 5 వేల మాస్కులు, 60 వేల ఫ్యామిలీ క్లిట్లు, 7 వేల శానిటైజర్లు, 1000 గ్లౌజులు, లక్ష ఆహారపొట్లాలు..  దాదాపు 2 లక్షల 75 వేల మందికి అందించింది.  ఇలా.. దేశం నలుచెరుగులా సంఘ్‌పరివారం లాక్‌డౌన్‌తో ఇక్కట్లు పడుతున్న బాధితులకు బాసటగా నిలుస్తోంది.

 

‘మైహోం’తో అన్నం పెట్టించిన వీహెచ్‌పీ

హైదరాబాద్‌లోని మైహోం సంస్థలో భవననిర్మాణ పనులు చేస్తున్న వలస కూలీలు ఆకలితో అలమిస్తున్నారు. ఆ  సమాచారంతో విశ్వహిందూపరిషత్ నేతలు అక్కడికి వెళ్లారు. అయితే, ముందు అక్కడి నిర్వహకులు వీహెచ్‌పీ నేత బాలస్వామిని అడ్డుకుని,  వాగ్వాదానికి దిగారు. కిషన్‌రెడ్డి తమకు తెలుసని, బీజేపీ నేతలు తమకు తెలుసని వారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. అయితే వారికి వెరవకపోవడంతో వెనక్కి తగ్గిన నిర్వహకులు, కూలీలల కోసం వీహెచ్‌పీ కార్యకర్తలు తెచ్చిన ఆహారప్యాకెట్లు ఇచ్చేందుకు అంగీక రించారు. దానికోసం నిర్వహకులే ఏర్పాట్లు చేశారు. తర్వాత మైహోం సంస్థ కూడా కళ్లు తెరచి, వలస కూలీలకు భోజన వసతి కల్పిస్తుండటం విశేషం.