వైసీపీ కోపం.. కన్నాపైనా? కమలంపైనా?

506

ఎన్నికల నిధుల దుర్వినియోగంలో వైసీపీ బాధేమిటి?
కన్నాను మారిస్తే వైసీపీకి లాభమేమిటో?
వైసీపీ దృష్టిలో ఆ ముగ్గురే మొనగాళ్లా?
‘కమలం’లో వైసీపీ విభీషణులున్నారా?
జీవీఎల్ మౌనంగా ఉన్నారెందుకో?
బీజేపీపై వైసీపీ నిఘా పెట్టిందని రావెల ఆరోపణ
కన్నా-పురంధీశ్వరిపై ఆరోపణలు ఖండించిన సునీల్ దియోథర్
సునీల్ ట్వీట్‌తో వైసీపీ గొంతులో వెలక్కాయ
ఏపీ బీజేపీలో విజయసాయి వ్యాఖ్యలపై చర్చ
(మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘ కేంద్రంతో రాష్ట్రానికి మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే కన్నా లక్ష్మీనారాయణ వంటి వ్యక్తులే  బీజేపీని తప్పుదోవ పట్టిస్తున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా వ్యవహరిస్తున్నారు. భాజపా నాయకత్వం ఆమోదం లేకుండానే కన్నా కూడా, బాబు మాదిరిగానే మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదగకపోవడానికి కన్నా లాంటివారే కారణం. మొదటినుంచీ పార్టీలో ఉన్న వారు కన్నా లాంటి వారిని వదిలించుకోవాలి.  కేంద్రం ఇచ్చిన  నిధులను గుంటూరులో కన్నా, పురంధీశ్వరి ఎంత దుర్వినియోగం చేశారో నేను లెక్కలు చెప్పగలను.  ఆ నిధులను ఎంతమంది అభ్యర్ధులకు ఇచ్చారు? అందులో ఎంత దుర్వినియోగం జరిగిందో నాకు తెలుసు. కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్లకు అమ్ముడుపోయారన్న ఆరోపణకు కట్టుబడి ఉంటా. ఆ డబ్బు ఏమైందో కూడా నేను వివరాలు చెప్పగలను. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారంతా బీజేపీకి నష్టం కలిగిస్తున్నారు. కొన్ని బ్యాంకులు ఆర్ధికంగా చితికిపోవడానికి సుజనా చౌదరి లాంటి వారే కారణం. సుజనా చౌదరి రింగ్ ఎంట్రీలు చేసి, ఎలా బోగస్ కంపెనీలు సృష్టించారో ఆధారాలతో సహా నిరూపిస్తా’’
– ఇవేవో ఒకే పార్టీలోని ఒక నేత, అదే పార్టీకి చెందిన మరో నేతపై చేసిన ఆరోపణలనుకుంటే కచ్చితంగా తప్పులో కాలేసినట్లే. కేంద్రంలో ఉన్న పార్టీకి చెందిన రాష్ట్ర శాఖ అధ్యక్షుడిపై, ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన కీలక నేత చేసిన ఆరోపణలివి. మరలాంటప్పుడు.. ఒక పార్టీలోని అంతర్గత విషయాలను, కీలక  రహస్యాలను, మరొక పార్టీ నేత ఎలా ప్రస్తావిస్తారు? ఒక పార్టీ అధ్యక్షుడిని మార్చేయమని మరో పార్టీ నేత ఎలా సలహా ఇస్తారు అనే కదా అందరి సందేహం?  మరి ఆ ప్రకారం.. నద్దాను బీజేపీ అధ్యక్షుడిగా తీసేయమని రాహుల్‌గాంధీ కూడా ఎందుకు డిమాండ్ చేయడం లేదు? జగన్ మార్చి మరొకరిని సీఎంగా పెట్టమని,  టీడీపీ వాళ్లు ఎందుకు డిమాండ్ చేయడం లేదనే కదా బుద్ధిజీవుల అనుమానం?! ఇప్పుడు ఆ సందేహాల కేంద్రంగానే  ఏపీ భారతీయ జనతా పార్టీలో చర్చ జరుగుతోంది.

బీజేపీపై విజయసాయికి ఎందుకంత ఆసక్తి?

భాజపా ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను తొలగించాలన్న వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి విజయసాయిరెడ్డి సూచన, గత ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం అభ్యర్ధులకు ఇచ్చిన నిధుల దుర్వినియోగంపై, విజయసాయి చేసిన ఆరోపణలు ఇప్పుడు భాజపా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తమ పార్టీ అంతర్గత వ్యవహారాలపై విజయసాయికి అంత ఆసక్తి ఎందుకన్న ప్రశ్నలు భాజపా నేతల నుంచి వినిపిస్తున్నాయి. అసలు కన్నా లక్ష్మీనారాయణ తమ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నా, లేకపోయినా  విజయసాయితో పాటు వైసీపీకి వచ్చిన ఇబ్బందేమిటో అర్ధం కావడం లేదని బీజేపీ రాష్ట్ర నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కన్నా స్థానంలో మరొకరు వస్తే వైసీపీకి గానీ, విజయసాయికి గానీ వచ్చే లాభమేమిటన్నది బోధపడటం లేదన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రాష్ట్ర బీజేపీలో ఉన్న వర్గ పోరు, ఇష్టా అయిష్టాల కారణంగా ఇప్పటివరకూ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రులు పురంధీశ్వరి, సుజనా చౌదరి తప్ప మరెవరూ నోరుమెదపడం లేదన్న వ్యాఖ్యలు చాలాకాలం నుంచి పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అటు మంత్రులు, వైసీపీ నేతలు కూడా కన్నా-సుజనా-పురంధీశ్వరిపైనే విమర్శలు గుప్పిస్తున్నందున, రాష్ట్ర బీజేపీలో ఆ ముగ్గురు తప్ప మరొక మొనగాళ్లు లేరని వైసీపీ నాయకత్వం కూడా భావిస్తున్నట్లు కనిపిస్తోంది.  అయితే, కన్నాపై విజయసాయి ఆరోపణల తర్వాత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాధవ్, మాజీ మంత్రి మాణిక్యాలరావు, విష్ణువర్దన్‌రెడ్డి స్పందించి, వాటిని ఖండించారు.

సునీల్ దియోథర్  ట్వీట్‌తో బీజేపీలో జోష్

అయితే, రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో తరచూ తలదూర్చే ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాత్రం, ఇప్పటిదాకా కన్నాపై విజయసాయి చేసిన ఆరోపణలను ఖండించకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. చివరకు రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దియోధర్ ఆలస్యంగానయినా  స్పందించి, రాష్ట్ర బీజేపీ నేతలకు దన్నుగా నిలవడం కమలదళాల్లో జోష్ నింపింది. ఇప్పటివరకూ ఈ వివాదంపై నాయకత్వం స్పందించలేదని అసంతృప్తితో ఉన్న నేతలకు ఆయన రంగంలోకి దిగడం ఊరటనిచ్చింది. ఎందుకంటే ఎన్నికల సమయంలో,  డబ్బులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణ మరొక పార్టీ ఎంపీ చేసినందున, ఆ సమయంలో ఇన్చార్జి సునీల్ దియోధర్ ఎన్నికల బాధ్యత నిర్వర్తించటం ప్రస్తావనార్హం. దానితో ఆయనే రంగంలోకి దిగి.. కన్నా, పురంధీశ్వరిపై నిరాధార ఆరోపణలు చేసిన విజయసాయి వ్యాఖ్యలను  ఖండించారు. అందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర పార్టీ నిధుల దుర్వినియోగంపై విజయసాయి చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవే కాకుండా, తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యంగానే భావిస్తున్నట్లు దియోథర్ స్పష్టం చేశారు. దీనితో ఇప్పటికి..  రాష్ట్ర  నాయకత్వానికి కేంద్రం దన్నుగా నిలిచినట్టయింది. ఒకరకంగా ఇది వైసీపీ గొంతులో వెలక్కాయగానే బీజేపీ నేతలు భావిస్తున్నారు.

అంటే.. బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారా?: రావెల

బీజేపీ నాయకత్వ ఆమోదం లేకుండానే కన్నా మాట్లాడుతున్నారన్న విజయసాయి వ్యాఖ్యలపైనా బీజేపీ నేతలు  విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీలో, వైసీపీ మాదిరిగా ఎవరో సొంత నిర్ణయాలు తీసుకోరన్న విషయం ఆయనకు తెలియకపోవడం ఆశ్చర్యమంటున్నారు. తమ పార్టీలో కోర్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలే ఫైనల్ అవుతాయి తప్ప, వ్యక్తుల ఇష్టాలతో సంబంధం ఉండదని గుర్తు చేస్తున్నారు. రాజధాని మార్పు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంశంపై కూడా కోర్ కమిటీ నిర్ణయాన్నే, కేంద్ర నాయకత్వం ఖరారు చేసిందని చెబుతున్నారు.
‘అసలు బీజేపీ ఏం నిర్ణయాలు తీసుకుంటుందో విజయసాయికి తెలుసా? బీజేపీ అభిప్రాయాలేమిటో ఆ పార్టీలో ఉండే మా పెద్దలకుమాత్రమే తెలుసు. దానిని వారు జిల్లా శాఖలకు  సమాచారం ఇస్తారు. ఢిల్లీ నేతలు కూడా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇన్చార్జి, కోర్‌కమిటీ సభ్యులతో మాత్రమే మాట్లాడతారు. అవి వారికి మాత్రమే తెలుస్తాయి. మరి మా పార్టీ సభ్యుడు కూడా కాని విజయసాయి, బీజేపీ విషయాలన్నీ తనకు తెలుసన్నట్లు మాట్లాడుతున్నారంటే.. మా పార్టీ అగ్రనేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నట్లుగా అనుమానించాల్సి వస్తోంద’ని మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిశోర్ సందేహం వ్యక్తం చేశారు. విజయసాయి సెల్ఫ్‌గోల్ చేసుకుని, దాని నుంచి బయటకు వచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారన్నారు. అవినీతి కేసులో జైలుకు వెళ్లిన విజయసాయి, వైసీపీ బ్యాచ్.. అందరూ తమ మాదిరిగానే అవినీతిపరులనుకుంటున్నారని, అందుకే వారి బురద మా అందరికీ అంటించి రాక్షసానందం పొందుతున్నారని రావెల విరుచుకుపడ్డారు.

కమలనాధుల్లో విభీషణులున్నారా?

కాగా, విజయసాయి ప్రస్తావించిన ఎన్నికల నిధులు, బిజెపి విధానాల అంశంపైనా పార్టీలో ఆరక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో తమ పార్టీ ఎలాంటి నిధులు పంపించలేదని, అది తమ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకమని తాజాగా కన్నా ప్రెస్‌మీట్‌లో స్పష్టం చేశారు. ఇంతకుముందు చెప్పినట్లు.. ఒకవేళ స్థానికంగానయినా సరే ఎలాంటి ఎన్నికల నిధుల సేకరణ, పంపిణీ జరిగినా అది కేవలం తీసుకున్న వారికి, ఇచ్చిన ఇద్దరికి మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ, ఆ విషయాన్ని విజయసాయి ప్రస్తావించారంటే… తమ పార్టీలోనే విజయసాయికి విభీషణులు ఉన్నట్లు అనుమానించాల్సి ఉంటుందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

ఇప్పటికే కొందరు నాయకులు వైసీపీ నాయకత్వంతో టచ్‌లో ఉన్నారన్న గుసగుసలు ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కొందరు పార్టీ అధ్యక్ష పదవి కోసం, మరికొందరు ప్రభుత్వంలో పనుల కోసం ఇంకా అనేక కారణాలతో విభీషణుల అవతారమెత్తుతున్నారన్న వ్యాఖ్యలు చాలాకాలం నుంచీ వినిపిస్తున్నాయి. ‘ఢిల్లీలో పెద్ద స్ధాయి నేతలనే మేనేజ్ చేసి, వైసీపీని బలోపేతం చేసిన విజయసాయి వంటి అనుభవజ్ఞులకు, మా రాష్ట్రంలో వాళ్లను మేనేజ్ చేయడం పెద్ద సమస్య కాదు. దానికీ ఎవరి కారణాలు వారికి ఉన్నాయి’ అని ఉత్తరాంధ్రకు చెందిన ఓ నేత వ్యాఖ్యానించారు.

బీజేపీపై వైసీపీ నిఘా పెట్టిందా?

అదే సమయంలో విజయసాయి, ఎన్నికల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపైనా పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సహజంగా ఎన్నికల సమయంలో జరిగే నిధుల పంపిణీ ప్రక్రియ చాలా రహస్యంగా కొనసాగుతుంటుంది. అది తీసుకున్న అభ్యర్ధులకు, ఇచ్చిన నాయకులకు తప్ప మరెవరికీ తెలియదు. అలాంటి రహస్య విషయాన్ని కూడా విజయసాయిరెడ్డి వెల్లడించారంటే, వైసీపీ నాయకత్వం మొదటి నుంచీ తమ పార్టీపై నిఘా పెడుతున్నట్లు భావించాల్సి ఉంటుందన్న కొత్త కోణాన్ని, బీజేపీ నేతలు బయటపెడుతున్నారు. అదే విషయాన్ని తాము ఢిల్లీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తామంటున్నారు.

బీజేపీ నేతల ఎదురుదాడి షురూ!

తమ పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలన్నది నాయకత్వ సమస్య అయినప్పుడు, విజయసాయికి ఎందుకు బాధగా ఉందో అర్ధం కావడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్, ఆర్.విల్సన్, మీడియా కో కన్వీనర్ గంగాధర్, పార్టీ నేతలు ఓ.వి. రమణ, సాదినేని యామిని శర్మ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విజయసాయి మాటల ప్రకారం.. బీజేపీలో ఏం జరుగుతోందన్న దానిపై, వైసీపీ నాయకత్వం నిఘా వేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఆ లెక్కన తమ నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారన్న అనుమానం వస్తోందన్న సందేహం వ్యక్తం చేశారు.

విజయసాయి ఏ పార్టీకి నాయకుడు?

‘మా పార్టీకి కూడా విజయసాయిరెడ్డి అధ్యక్షుడనుకుంటున్నారో ఏమో అర్ధం కావడం లేదు. ముందు ఆయన వైసీపీకి అధ్యక్షుడయితే మంచిది.  మాకు తెలిసి ఆయన వైసీపీ ప్రధాన కార్యదర్శిగానే ఉన్నట్లున్నారు. ఎన్నికల సమయంలో మరి ఆయనేమైనా మా పార్టీ పేరుతో  ఫార్మా కంపెనీల నుంచి నిధులు వసూలు చేసి, డబ్బు సంచులు తీసుకునివస్తే అవి ఎక్కడున్నాయో, ఎక్కడ దాచిపెట్టారో కూడా ఆయనే చెప్పాలి. అసలు జగన్‌ను చెడగొట్టి, ఆయనను తప్పుదోవపట్టిస్తున్న విజయసాయి వంటి వాళ్లను, జగన్ ఎంత త్వరగా వదిలించుకుంటే వైసీపీకి అంతమంచిది. కేంద్రమంత్రులు, అనేకసార్లు మంత్రులుగా చేసిన సీనియర్లు కూడా వైసీపీలో విజయసాయి పెత్తనాన్ని భరించలేకపోతున్నట్లు మాకు తెలుస్తోంది. అందువల్ల విజయసాయి వంటి జంబూకాలను, ఎంత త్వరగా వదిలించుకుంటే వైసీపీకి అంత క్షేమం. బీజేపీలో కన్నా నాయకత్వంపై, ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరిగే విజయసాయిలాంటి జైలుపక్షుల సర్టిఫికెట్ అవసరం లేద’ని వారు ఘాటుగా, వ్యంగ్యంగా స్పందించారు.