నిన్ను పుట్టించిన వాడికీ నన్ను కొనే దమ్ము లేదు

399

నీలాగా పవర్ బ్రోకర్‌ను కాదు
ఇలాంటి బ్రోకర్లు కొడుకు పక్కనున్నందుకు వైఎస్ ఆత్మ క్షోభిస్తుంది
మాకు చెప్పడానికి మా నాయకత్వం ఉంది
నీలాంటి వాళ్లను నా జీవితంలో చాలామందిని చూశా
కిట్ల కొనుగోలు ఒప్పందం బయటపెట్టవచ్చు కదా?
20 నిమిషాల తేడాకు 3 కోట్లు ఖర్చు పెడతారా?
 విమర్శించకూడదనుకుంటే నాడు మీరు చేసిందేమిటి?
మీ మైండ్ గేమ్ నా దగ్గర కాదు
 జైలుపక్షి కూడా నన్ను విమర్శిస్తాడా?
‘సూర్య’ ఇంటర్వ్యూలో విజయసాయిపై కన్నా ఫైర్
(మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘ఈ రాష్ట్రం జైలుకు వెళ్లిన  విజయసాయిరెడ్డి లాంటి ఆర్ధిక నేరగాళ్ల కనుసన్నలలో నడుస్తోంది. కొంతమంది పోలీసులు, కలెక్టర్లు వైసీపీ చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారు. ఉపరాష్ట్రపతి నియోజకవర్గంలో దళిత వర్గానికి చెందిన మా పార్టీ అభ్యర్ధి చేయ నరికితే అడిగే దిక్కు లేదు. ఒక పొలిటికల్ పవర్ బ్రోకర్, జైల్లో చిప్పకూడు తిని, బెయిల్‌పై బయటకు వచ్చి..  నేను ఎవరికో  డబ్బుకు అమ్ముడుపోయాయని ఆరోపించడం దారుణం. చంద్రబాబునాయుడే కాదు, విజయసాయిరెడ్డిని పుట్టించిన వాడు కూడా నన్ను కొనే దమ్ము లేదు. అలాంటివాడు పుట్టలేదు. నా రాజకీయ జీవితం తెరచిన పుస్తకం. అందులో విజయసాయి మాదిరిగా అడ్డదారులుతొక్కి, సీబీఐ ఆఫీసు ముందు పడిగాపులు పడి, 16 నెలలు జైలులో ఉండి చిప్పకూడు తిన్న చరిత్ర నాకులేదు. మేమేం చేయాలో చెప్పడతానికి మా పార్టీ నాయకత్వం ఉంది. విజయసాయి వంటి అద్దెమైకుతో చెప్పించుకోవలసిన ఖర్మ నాకు పట్టలేదు. ప్రతిపక్షాలు అధికారార్టీని, విమర్శించకూడదనుకుంటున్న వైసీపీ నాయకత్వం..  మరి గత పదేళ్లలో చేసిందేమిటి? కరోనా కిట్లలో కమిషన్లు కొట్టేశారని ఆరోపించినందుకే ఈ ఏడుపంతా. విజయసాయి అంత నిజాయితీపరుడైతే ఆ ఒప్పందాన్ని ముందుగానే బయటపెట్టవచ్చు కదా’ అని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ  అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు. విజయసాయిరెడ్డి మైండ్‌గేమ్ తన దగ్గర చెల్లదని, అలాంటి వారిని తన రాజకీయ జీవితంలో చాలామందిని చూశానన్నారు. విజయసాయిరెడ్డి తనపై చేసిన ఆరోపణలపై, కన్నా లక్ష్మీనారాయణతో ‘సూర్య’ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది. రాష్ట్రంలో జగన్ పాలన, హిందూ దేవాలయాలలో అపచారం, కరోనాపై వైఫల్యం వంటి అంశాలను కన్నా ప్రస్తావించారు.

అవన్నీ ఆయన మాటల్లోనే..

‘ నేను చంద్రబాబుకు 20 కోట్లకు అమ్ముడుపోయానని విజయసాయిరెడ్డి ఆరోపించాడు. నిజంగా ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే కాణిపాకం ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలి. లేకపోతే అవి అబద్ధమని అంగీకరించాలి. నన్ను కొనే దమ్మున్న వాళ్లు ఇంతవరకూ పుట్టలేదు. విజయసాయిరెడ్డి ఎంత? ఆయన బతుకెంత? అతగాడి పేరు వింటే అవినీతి కూడా సిగ్గుపడుతుంది. నేను ఎంతోమంది  ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశా. అధికారం శాశ్వతం కాదు. అలా అనుకున్న వాళ్లు అహంకారుల కిందే లెక్క. విజయసాయిలో అధికారమదం బాగా తలకెక్కింది’
‘నేను చంద్రబాబుకు అమ్ముడుపోయానన్న మాట ఇప్పుడు వైఎస్ బతికి ఉండి విని ఉంటే, విజయసాయిరెడ్డి నాలుక చీరేసేవారు. ఇలాంటి బ్రోకర్లు తన కుమారుడి పక్కన ఉండి, చెడగొన్నందుకు వైఎస్ ఆత్మ క్షోభిస్తుంది. ఇప్పుడు మీ మంత్రివర్గంలో ఉన్న వాళ్లను, కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన సీనియర్ ఎమ్మెల్యేలను అడగండి. నేనేమిటో చెబుతారు. దివంగత కోట్ల, నేదురుమల్లి, చెన్నారెడ్డి, వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు సభలో బాబుపై నేను చేసిన ఆరోపణలు మరెవరూ చేయలేదు. ఆ సమయంలో విజయసాయి ఏ సంస్థలోనో దొంగలెక్కలు రాస్తూ ఉండాలి. బాబు నాపై హత్యాయత్నం చేశారని బహిరంగంగా ఆరోపించిన వాడిని నేను. నా ఓటమికి పెదకూరపాడులో బైఠాయించిన చంద్రబాబును, ఒంటిచేత్తో ఎదుర్కొన్న చరిత్ర నాది. కన్నాది ప్రజాబలం. విజయసాయిది అధికారమదం’
‘మా పార్టీని సంప్రదించకుండానే నేను జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నానంటున్న విజయసాయిరెడ్డి, ఏ పార్టీలో ఉండి మాట్లాడుతున్నారు? ఆయనేమైనా బీజేపీలో చేరారా? మేం ఏం చేయాలో మా నాయకత్వం ఆదేశిస్తుంది. ఎవరికి నాయకత్వం ఎవరికి అప్పచెప్పాలన్నది నాయకత్వం చూసుకుంటుంది. జైలు పక్షుల చేత చెప్పించుకునేంత స్థాయికి మా పార్టీ దిగజారదలచుకోలేదు. అధికారం కోసం నానా గడ్డితిని, పైరవీలు, లాబీయింగ్ చేసే ఆ పవర్ బ్రోకర్‌కు ఒంటినిండా మచ్చలే. నా ఓటమి గురించి మాట్లాడిన ఆయన, అంత కుముందు ఎన్నికల్లో  వైసీపీ ఓటమిని, విజయమ్మ ఓడిన విషయాన్ని మర్చిపోతే ఎలా?’

‘విజయసాయి ఒక్కరే కాదు, ఆ పార్టీ నాయకులు, సొంత మీడియా నాపై చేస్తున్న ఆరోపణలన్నీ మైండ్‌గేమ్‌లో భాగమే. అందుకే ముందు పవన్ కల్యాణ్, తర్వాత నాపై ఆరోపణలు చేస్తున్నారు. మాపై ఎదురుదాడి చేస్తే మేం భయపడిపోయి, జగన్ పాలన గురించి మాట్లాడకుండా ఉంటామనుకుంటున్నారు. తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షం. ఆ పార్టీ విధానాలు ఆ పార్టీవి. జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు ప్రతిపక్షాలు. వాటి విధానాలు వాటివి. మేం జాతీయ పార్టీగా ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రజాసమస్యలను ప్రస్తావించాల్సిన బాధ్యత మాపై ఉంది. మా పార్టీకి రాష్ట్రంలో ఆదరణ పెరుగుతోంది. మోదీ విధానాలకు సానుకూలత పెరుగుతోంది. పెరిగిన మా పార్టీ సభ్యత్వ సంఖ్యనే దానికి నిదర్శనం.  జగన్ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడం మా హక్కు, ధర్మం. మేం అధికారంలో ఉన్నాము కాబట్టి, మీరెవరూ మమ్మల్ని విమర్శించకూడదు. అలా విమర్శిస్తే బట్టకాల్చి నెత్తినేస్తాం. మీరు ప్రధాన ప్రతిపక్షంతో కలసి కుమ్మక్కయారని మైండ్‌గేమ్‌కు దిగితే, మేం పారిపోతామనుకోవడం భ్రమ.   ఈ తాటాకు చప్పుళ్లు, ఈ మైండ్‌గేమ్‌లకు భయపడేవాడిని కాదు. అలాగైతే నలభై ఏళ్లు రాజకీయాల్లో ఉండేవాడిని కాదు. వంగవీటి రంగాతో కలసి కాపు ఉద్యమం నడిపినప్పటి నుంచే నేను చంద్రబాబు, టీడీపీ వారికి లక్ష్యంగా మారా. కమ్యూనిస్టుల నుంచి భౌతిక దాడులకు గురయినా తట్టుకుని నిలబడ్డా. ఈ విజయసాయి ఎంత? ఆయన బతుకెంత?’

‘ కరోనా కిట్ల కొనుగోల్‌మాల్ గురించి మాట్లాడినందుకే విజయసాయికి పొడుచుకొచ్చింది. చత్తీస్‌గఢ్ మాదిరిగా ముందుగానే కిట్ల కొనుగోలు గురించి ఎందుకు ప్రకటించలేదు? ఎన్నికల ముందు అన్ని కొనుగోళ్లు, పాలన పారదర్శకంగా ఉంటుందన్నారు కదా? ఇదేనా మీ పారదర్శకత? మేం ఆరోపించేంతవరకూ ఎందుకు మౌనంగా ఉన్నారు? విశాఖలో భూ కుంభకోణాల గురించి ప్రస్తావిస్తున్నందుకే, విజయసాయి మాపై బురద చల్లుతున్నారు. మేం రాజధానిని అడ్డుకుంటున్నామన్న కోపం వైసీపీలో ఉంది. నాకు అమరావతిలో భూమి ఉందని ఆరోపించి, దానిని నిరూపించలేక తోకముడిచారు. గ్రామ సచివాలయాలకు వైసీపీ గుర్తు రంగులు వేస్తున్నారని మేం గవర్నర్, ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులపై ఫిర్యాదు చేశాం. విశాఖలో కొన్నేళ్ల క్రితం నేను కొన్న భూమిని వైసీపీ నేతలు కబ్జా చేసే ప్రయత్నం చేశారు. నేను ప్రశ్నిస్తే, అది మీ స్థలం అని తెలియదని డొంక తిరుగుడు సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో దేవాలయ వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. మతమార్పిళ్లను ప్రోత్సహిస్తోంది. ఓ దేవాలయాన్ని క్వారంటైన్‌గా మార్చడంపై మేము ఆగ్రహించిన తర్వాతనే, దానిని మరొకచోటకు మార్చారు. కృష్ణమ్మ పవిత్ర హారతి ఎత్తివేత, ద్వారకా తిరుమల సహా రాష్ట్రంలో ఆలయ భూముల పంపిణీని అడ్డుకుంటున్నందుకే.. సంస్థాగతంగా ఆ పార్టీపై, వ్యక్తికతంగా నాపై వైసీపీ వాళ్లకు దుగ్ధ, ద్వేషం’

ఈ ప్రభుత్వం కరోనా నివారణలో విఫలమయింది. సీఎం నివాసానికి కూతవేటు దూరంలోనే ఓ వ్యక్తికి కరోనా సోకింది. అంటే పరిస్థితి ఎంత విషమంగాఉందో స్పష్టమవుతోంది. కేంద్రం ఇచ్చిన వెయ్యి రూపాయల సాయాన్ని కూడా వైసీపీ నేతలు జగన్ ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. గుంటూరులో ఎమ్మెల్యే క్వారంటైన్ నిబంధన ఉల్లంఘించారని మీడియాలోనే వచ్చింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ర్యాలీ నిర్వహిస్తే, అందులో పాల్గొన్న వారిని ఇప్పటివరకూ గుర్తించలేదు. ఎస్‌ఈసీ కనగరాజ్ తమిళనాడు వచ్చినా ఎందుకు క్వారంటైజ్ చేయలేదని అడిగితే జవాబు లేదు. మంత్రి ఆదిమూలం సురేష్ హైదరాబాద్ నుంచి వచ్చినా ఆయనను క్వారంటైన్ చేయరు.  రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు దాస్తున్నారు. అందరికీ పరీక్షలు చేయడం లేదు. లెక్కలన్నీ గందరగోళంగా ఉన్నాయి. ఇవి రాస్తున్న జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారు. వారిపై కాదు, పోలీసులకు దమ్ముంటే లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన కనగరాజ్, విజయసాయిరెడ్డి, మంత్రులపై కేసు పెట్టాలి. విశాఖలో కరోనా లెక్కలు తగ్గించి చూపడం వెనుక మర్మమేమిటో విజయసాయిరెడ్డి చెప్పాలి. ఆయన విశాఖ టు విజయవాడ తిరుగుతున్నారు. మరి ఆయనను క్వారంటైన్‌లో ఉంచనవసరం లేదా?’

‘కరోనా కిట్ల కొనుగోలు గురించి అడిగితే, విజయసాయి విచిత్ర సమాధానం ఇస్తున్నారు. చత్తీస్‌గఢ్ 337 రూపాయలకు కొంటే మీరు 700 రూపాయలు ఎలా పెడతారన్న ప్రశ్నకు.. విజయసాయి ఇచ్చిన జవాబే, కొనుగోళ్లలో అవినీతి జరిగిందని అర్ధమవుతుంది. జగన్ కొరియా నుంచి తెప్పించిన కిట్లతో 10 నిమిషాల్లో ఫలితాలు వస్తాయని, చత్తీస్‌గఢ్ తెచ్చిన కిట్లు 30 నిమిషాల్లో ఫలితం వస్తుందంటున్నారు. అంటే కేవలం 20 నిమిషాల తేడాకు, మీ ప్రభుత్వం 3 కోట్లు అదనంగా ఖర్చు పెడుతుందా? కిట్ల కొనుగోలులో జవహర్‌రెడ్డిది ఒకమాట. విజయసాయిరెడ్డిది ఇంకోమాట. ఎవరి మాట నమ్మాలి? అంటే దొంగలెక్కలు వే సి, సూట్‌కేస్ కంపెనీలు సృష్టించడంలో మొనగాడయిన విజయసాయి, చివరకు కరోనా కిట్లలోనూ దొంగలెక్కలు చెబుతున్నారని అర్ధం చేసుకోవాలా’