భయపెడుతున్నారా?..భయపడుతున్నారా?

626

జమాత్‌పై నిషేధం ఏదీ?ఎప్పుడు?
దాక్కుంటున్న వారిని బుజ్జగిస్తారేం?
కాన్పూర్‌లో పట్టిస్తే పదివేల బహుమానం
దాచిపెడితే కర్నాటకలో నేరుగా రిమాండే
సంతుష్ఠీకరణ ముందు సహనం తలదించుకుంటోందా?
          (మార్తి సుబ్రహ్మణ్యం)

మావోయిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకు దేశంలో గానీ, రాష్ట్రాల్లో గానీ ఆఫీసులు ఉండవు. వారివి అన్నీ రహస్య కార్యకలాపాలే. కానీ, తీవ్రవాద విధానాలు అవలంబిస్తూ హత్యలు చేస్తున్నందున, ఆ సంస్థను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. ఇంకా ఈరకంగా విదేశీ సంస్థలతో సంబంధం ఉందని అనుమానించే, పలు తీవ్రవాద సంస్థలను అవి నిషేధం విధించాయి.

పోలీసులపై ఎవరైనా రోడ్డుమీద వాగ్వాదానికి దిగితే, అలాంటి వారిని నిర్దాక్షిణ్యంగా స్టేషన్‌కు తీసుకువెళ్లడమో, భారీ చలానా విధించడమో చేస్తారు. పోలీసులకు వ్యతిరేకంగా ఎవరైనా హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే, ఆ పిటిషనర్  సంగతి చూసే దాకా నిద్రపోరు. దాన్ని అత్యంత ప్రతిష్ఠగా భావిస్తారు. ఎవరైనా పోలీసులపై దాడి చేస్తే, వారికి చుక్కలు చూపిస్తారు. ఇవన్నీ ఎందుకు? పోలీసులతో వాహనం దిగకుండా మాట్లాడితేనే సహించరు. ముందు బండి దిగి మాట్లాడమంటారు. తమకు వ్యతిరేక వార్తలు రాస్తే అస్సలు సహించలేరు. మామూలుగా అయితే పోలీసులు ఎవరితోనయినా సహజంగా తిట్లు, బూతులతో ప్రేమిస్తారు. ‘ల’కారం వారికి ఊతపదం కింద లెక్క. దానికి కారణం పని ఒత్తిళ్లు, అలసట, విశ్రాంతి లేకపోవడం వంటి అంశాలు కారణాలు కావచ్చు. అది వేరే విషయం! ఈ మధ్య బాగా ఉన్నత విద్యలు చదివిన వారు కూడా, పోలీసు శాఖలోకి వస్తున్నారు కాబట్టి ‘ఆ మర్యాద’ కాస్త తగ్గుతుందనుకోండి.

మావోలు సరే.. మర్కజ్ మాటేమిటి?

అంటే.. పోలీసుల చరిత్రలో బెదిరించడమే తప్ప, బెదిరిపోవడం, బుజ్జగించే దాఖలాలు, అలవాటుగానీ లేదని అర్ధమవుతుంది. మావోయిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అనే కనిపించని సంస్థను నిషేధించిన సర్కారు.. ఇప్పటికే కొన్ని వేలమందిని ఆసుపత్రులకు బలి చేసి, మృత్యువుకు సమీపంలో నెట్టేసిన కనిపించే సంస్థ అయిన..  తబ్లిగి జమాత్‌ను ఎందుకు నిషేధించలేదన్న ప్రశ్నలు దేశంపై భక్తి, విశ్వాసం ఉన్న వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తి వేరు, మతం వేరు, దేశమే ముఖ్యమన్న సూత్రాన్ని ప్రభుత్వమే విస్మరించిందా అన్నది వారి ప్రశ్న.

మర్కజ్ వివరాలు చెప్పని వారిని బుజ్జగిస్తారేం?

 

తమను ప్రశ్నిస్తేనే సహించలేని పోలీసులు.. కొందరు తమపైనే రాళ్లు, కర్రలతో దాడులు చేస్తుంటే అణిచివేయడం బదులు, వారిని క్వారంటైన్ కేంద్రాలకు రమ్మని ఎలా బుజ్జగిస్తున్నారన్న ఆశ్చర్యం నుంచి ఆ వర్గాలు తేరుకోలేకపోతున్నాయి. ఇటీవల ఒక ఏసీపీ కరోనా విధినిర్వహణలో పనిచేసి మృతి చెందారు. పంజాబ్‌లోనే ఒక పోలీసు అధికారి చేయి నరికివేసిన వార్తను చూశారు. ఆసుపత్రులలోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న తబ్లిగీ సభ్యులు.. పోలీసులు, వైద్యుల పట్ల అమానవీయంగా, అరాచకంగా వ్యవహరిస్తుంటే వారిని బెదిరించడం బదులు, విశాలహృదయంతో బుజ్జగిస్తున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నారు. మామూలు సందర్భాల్లో ఎవరిపైనయినా ఫిర్యాదు అందితే, పోలీసులు అక్కడికి వచ్చి, ఎవరిపైనయితే ఫిర్యాదుచేశారో వారిని వెంట తీసుకువెళతారు. మేం వచ్చేది లేదని మొండికేస్తే, ‘తమ భాషలో’ సమాధానం చెప్పి మరీ స్టేషన్‌కు తీసుకువెళతారు. మరి ఇదే మర్యాద మర్కజ్‌కు వెళ్లినా, దానిని  రహస్యంగా దాస్తున్న వారి విషయంలో ఎందుకు చూపించరన్న ప్రశ్నలు, సమాజం నుంచి శరపరంపరగా వెలువడుతున్నాయి.

పోలీసులకు చుక్కలు చూపిస్తున్నా అదే శాంతం

నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి వివరాలు సేకరించి, వారి ఇళ్లకు వెళ్లిన పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. బయటకు వచ్చే సమస్య లేదని తెగేసి చెబితే, మౌనంగా వెనక్కి వెళుతున్న పోలీసుల విశాల హృదయం.. మిగిలిన రోజుల్లో ఏమయిందో అర్ధం కాదు. చివరకు తమపైనే రాళ్లు వేసే పరిస్థితికి చేరినా, ఎంతో సహనంగా ఉండటం  పోలీసులకే చెల్లింది. కరోనా యుద్ధక్షేత్రంలో ముందు వరసలో నిలబడి యుద్ధం చేస్తున్న పోలీసు సైనికులు కూడా, కరోనా కాటుకు గురవుతున్నారు. వారు చేసిన పాపమంతా.. నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చిన వారిని ఆసుపత్రిలో చేరమని అభ్యర్థించడమే! శాంతినగర్ అనే ప్రాంతంలో ఓ కుర్రాడిని మాస్కు కట్టుకోమన్నందుకు, అతగాడు తన పోలీసు తండ్రికి ఫిర్యాదు చేసిన వీడియోలు చర్చనీయాంశమయ్యాయి. నిజామాబాద్‌లో, మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారి వివరాలు సేకరించేందుకు వెళ్లిన ఆశా కార్యకర్తలను తరిమికొడితే, వారు వెళ్లబోసుకున్న ఆవేదనను అవే వీడియోలలో చూశారు.  క్వారంటైన్‌కు వెళ్లమన్న ఓ తమిళ ఆసామి.. ముందు ప్రధానికి టెస్టు చేయమని చెప్పేంత మితిమీరిన స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యదేశంలో, అలాంటి తరహా వీడియోలు చూసిన వారు ధన్యులు!

లాఠీ బెదిరింపులలో తేడాలేమిటో?

హైదరాబాద్ పాతబస్తీలో ఒకే ఇంటిలో 9 మందికి, సికింద్రాబాద్‌లో ఒకే ఇంటిలో మరికొందరికి కరోనా పాజిటివ్ లక్షణాలను రెండురోజుల క్రితమే గుర్తించారట. అంటే జనతా కర్ఫ్యూ నుంచి ఇప్పటివరకూ సదరు కుటుంబసభ్యులు, ఇంకెంతమందికి వైరస్ దానం చేసి ఉంటారో తలచుకుంటేనే ఒళ్లు జలదరించక మానదు. అది కూడా పోలీసులు బలవంత పెడితేనే, సదరు కుటుంబం ఆసుపత్రికి వెళ్లేందుకు పెద్దమనసుతో అంగీకరించిందట. లేకపోతే ఆ ప్రాంతమంతా  నిత్యకల్యాణం-పచ్చ తోరణం మాదిరిగా వైరస్‌తో నిండిపోయేది. తబ్లిగీ సభ్యుల ఇళ్లకు వెళ్లి, కౌన్సిలింగ్ ఇచ్చి ఆసుపత్రులకు రమ్మని బుజ్జగిస్తున్న పోలీసులు.. ఈ పరిస్థితిలో ఇళ్లకు వెళితే, అది కుటుంబసభ్యులకూ హానికరమన్న భయంతో.. పోలీసుస్టేషన్లలోనే జీవిస్తున్న దయనీయం గురించి, బయట ప్రపంచానికి తెలిసింది కొందరికే. కలుగులో దాక్కున్న మర్కజ్ యాత్రికులను కనిపెట్టి.. వారిని సవరదీసి అంబులెన్సు పిలిపించి,  ఆసుపత్రికి పంపించి, మళ్లీ అక్కడి నుంచి వారు పారిపోకుండా బందోబస్తు చేసే సరికి, పాపం పోలీసుల పని అయిపోతోంది. ఈలోగా పైనుంచి ఒత్తిళ్లు, భోజనాల సర్దుబాట్ల వంటి సినిమా కష్టాలు  వీటికి అదనం! హైదరాబాద్ పాతబస్తీలో.. లాక్‌డౌన్ సమయంలో కూడా వాహనాలు, జనం విచ్చలవిడిగా తిరుగుతున్న దృశ్యాలు చానెళ్లలో కనిపిస్తూనే ఉన్నాయి.  అయినా పోలీసు లాఠీలెందుకో బెదిరిపోవడం, అదే మరొకచోట మాత్రం అదే లాఠీలు బెదిరిస్తుండటం ఏమిటో అర్ధం కావడం లేదన్నది బుద్ధిజీవుల ప్రశ్న.

ఆ దేశాల్లో తబ్లిగీపై నిషేధం.. మరి మన దేశం?

తబ్లిగీ జమాత్ సంస్థను రష్యాతో సహా కొన్ని దేశాలు నిషేధించాయి. గతంలో పాకిస్తాన్‌లోని ఓ పాఠశాలలో చిన్నారుల మారణకాండకు ఈ సంస్థనే కారణమయిందన్న వార్తలు తెలిసిందే. 2011లో ‘వికీలీక్స్’ ఈ సంస్థపై అనేక ఆరోపణలు చేసి, ఓ సంచలన కథనం వెలువరించింది. దానికి ఆల్‌ఖైదాతో సంబంధాలున్నాయని, ఉగ్రవాదులకు డబ్బు, వీసాలు దాని ద్వారానే అందుతున్నాయని పేర్కొంది. 2016లో హ ర్యానాలోని మేవాట్‌లో  అల్‌ఖైదాకు చెందిన ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అతగాడికి జమాత్‌తో సంబంధాలున్నట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. పాక్ ఉగ్రవాద సంస్థ జవాత్-ఉద్ దవా అధినేత హఫీజ్ సయీద్‌తో, సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి ఇచ్చిన నిధులతో అదే పట్వాల్‌లో జమాత్ సంస్థ మసీదు నిర్మాణం చే సిందని, స్వయంగా జాతీయ దర్యాప్తు సంస్థనే ఆరోపించింది.

కోలుకుంటున్న సమయంలో మర్కజ్ కల్లోలం

తాజాగా భారత్‌దేశంలో కరోనా కల్లోలం తగ్గుముఖం పట్టి, జనజీవనం మళ్లీ గాడిలో పడుతున్న సమయానికి.. అదే తబ్లిగీ జమాత్ సంస్థ ప్రధాన కార్యాలయమైన నిజాముద్దీన్‌కు వెళ్లివచ్చిన వారి వల్ల,  దేశం మళ్లీ ప్రమాదపు అంచుల్లోకి వెళ్లింది. దానితో కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించాల్సి వచ్చింది. ఫలితంగా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమయింది. బతికుంటే బలుసాకు తినవచ్చన్న తత్వానికి సగటు జీవి అలవాటుపడ్డాడు. అన్ని రాష్ట్రాల్లో మరణమృదంగం అవిశ్రాంతంగా మోగుతూనే ఉంది. జమాత్ సంస్థ చీఫ్ పోలీసుల కళ్లు గప్పి అదృశ్యమయ్యాడు. నిజాముద్దీన్‌కు వెళ్లిన సంస్ధ సభ్యులంతా, వివరాలు చెప్పకుండా నేలమాళిగల్లో దాక్కుంటున్నారు. వారి కోసం పోలీసులు కుటుంబసభ్యులకు దూరమై, తిండీ తిప్పలు మానుకుని, జల్లెడ వేస్తున్నారు. అయినా, ఇప్పటివరకూ జమాత్‌పై నిషేధం వేటు వేయకపోవడమే విచిత్రం!ఇది కూడా చదవండి:  మర్కజ్ మరణాల తర్వాతయినా మారరా? 

కాన్పూర్‌లో పదివేల రూపాయల బహుమతి

కాన్పూర్‌లో ఎస్పీ ఇటీవల చేసిన ప్రకటన, సంతుష్ఠీకర విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలు, వారి ఆదేశాల ప్రకారం నడుచుకునే పోలీసులకు కనువిప్పు కావాలి. మర్కజ్‌కు వెళ్లిన వారి వివరాలు చెబితే, 10 వేల రూపాయల బహుమానం ఇస్తామని కాన్పూర్ ఎస్పీ ప్రకటించారు. ఇదే విధానం అన్ని రాష్ట్రాల్లో అనుసరిస్తే, కలుగులో దాక్కున్న వారంతా బయటకు రావడం తధ్యం. కర్నాటకలో మర్కజ్ వివరాలు దాచి పెడితే, రిమాండ్‌కు పంపిస్తున్న పద్ధతి సత్ఫలితాలిస్తోంది. మరి సంతుష్ఠీకర విధానాలు, ఓటు రాజకీయాల కోణంలో కొన్ని వర్గాల మెరమెచ్చుల కోసం పరితపించే ప్రభుత్వాలకు అంత సాహసం చేసే దమ్ముందా?