తండ్రిని మించిన తనయుడు తలసాని సాయి

478

కరోనా సేవలకులకు కిట్లు, మాస్కులు పంపిణీ
తెలంగాణలో రక్తనిల్వల కొరతను తీర్చేందుకు రక్తదాన శిబిరాలు
(మార్తి సుబ్రహ్మణ్యం)

కరోనా సమయంలో తెలంగాణ  సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, హైదరాబాద్ నగరంలో అంతా తానయి పనిచేస్తున్నారు. మాస్కులు, బియ్యం, నిత్యావసర వస్తువుల పంపిణీతో పాటు, రోజువారీ ఆదాయంపై జీవించే సామాన్యులకు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రక్తనిల్వలను దృష్టిలో ఉంచుకుని, సామూహిక రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆప్రకారంగా.. కరోనా సమయంలో రక్తం కొరత ఉన్న తలసేమియా బాధితులకు అది దోహదపడనుంది.

రాజకీయపరమైన విమర్శలు, ఆరోపణలు పక్కకుపెడితే.. సేవాదృక్పథం, పరోపకారం, మానవతావాదం ప్రదర్శించే మంత్రి తలసాని బాటలోనే, ఇప్పుడు ఆయన తనయుడు సాయికిరణ్ కూడా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసి, తెరాస సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన సాయి తన తొలి ప్రయత్నంలో ఓడిపోయారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న ఆయన తండ్రి శ్రీనివాసయాదవ్ రాజకీయ ప్రస్థానం కూడా, ఓటమి నుంచే ప్రారంభం కావడం విశేషం.  ఆ తర్వాత నిలదొక్కుకుని ఎమ్మెల్యే, మంత్రిగా కొనసాగుతున్నారు. హైదరాబాద్‌లో దివంగత పి.జనార్దన్‌రెడ్డి తర్వాత, అన్ని పర్యాయాలు మంత్రిగా కొనసాగుతున్న రికార్డు సాధించారు. ఇప్పుడు ఆయన తనయుడు సాయికిరణ్ కూడా, సేవాగుణంలో తండ్రి బాటలో నడుస్తున్నారు. సాయి తన మిత్రులతో కలసి,  కరోనా సమయంలో సేవలందిస్తున్న వారికి చేయూతనివ్వాలని నిర్ణయించుకున్నారు. సహజంగా తండ్రితో సహా అందరూ పేదలు, జర్నలిస్టులకు బియ్యం, మాస్కులు అందిస్తున్నారు. కానీ, సాయి మాత్రం కరోనా సమయంలో అవిశ్రాంతంగా సేవలందిస్తున్న పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి మాస్కులు, కిట్లు అందిస్తున్నారు. తన మిత్రులు, వివిధ సంస్ధలను సమన్వయం చేసుకుని,  వాటిని సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందిస్తున్నారు. పసుర గ్రూప్ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల విలువైన 50 పోర్టబుల్ స్ప్రేయర్స్, వెయ్యి లీటర్ల శానిటైజర్‌ను జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ విశ్వజిత్‌కు,  తండ్రి శ్రీనివాసయాదవ్ ద్వారా అందించారు. దీనితో ఇరుకుగా ఉన్న గల్లీలలో కూడా పోర్టబుల్ స్ప్రేయర్స్ ద్వారా స్ప్రే చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఇది భారీ వాహనాలు వెళ్లలేని  బస్తీలకు వరం లాంటిదే.

ఇక నార్త్‌జోన్‌లోని అన్ని పోలీసుస్టేషన్ల సిబ్బందికి.. మెడికల్ కి ట్లు కూడా సాయి తన మిత్రబృందంతో కలసి, తండ్రి శ్రీనివాసయాదవ్ ద్వారా, నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌కు అందించారు. ఇవన్నీ ఆర్ధికంగా ఎంతన్నది పక్కనపెడితే.. ఈ క్లిష్ట సమయంలో, ప్రాణాలుపణంగా పెట్టి సేవలందిస్తున్న పోలీసులు, శానిటేషన్ సిబ్బంది అవసరాలు తీర్చడం గొప్ప విషయమే. ఇంతవరకూ ఇలాంటి కార్యక్రమం ఎవరూ చేపట్టకపోవడమే విశేషం.

రక్తం కొరత తీర్చేందుకు…

తెలంగాణలోని ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వల కొరత ప్రభుత్వాన్ని వేధిస్తోంది.  రాష్ట్రంలో మొత్తం 145 బ్లడ్‌బ్యాంకులు ఉండగా, వాటిలో 52 ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. తెలంగాణా రాష్ట్రంలో 35వేల యూనిట్ల రక్తం అవసరం ఉందని ఒక అంచనా. తలసేమియా బాధితులలో కొందరికి, నెలకు రెండుసార్లు కూడా రక్తమార్పిడి అవసరం అవుతుంది. వీరుకాకుండా రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర రక్తస్రావం అయినవారు, హీమోఫిలియా రోగులు, గర్భిణులకు రక్తం అవసరం అవుతుంది. సహజంగా చాలామంది తరచూ రక్తదానం చేస్తుంటారు. ఇటీవలి కాలంలో ఇలాంటి సేవాగుణం ఐటి ఉద్యోగులలో పెరుగుతోంది. ఇవికాకుండా లయన్స్‌క్లబ్, రోటరీ క్లబ్, వాసవి క్లబ్‌లు తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటాయి.

అయితే, కరోనా వల్ల రక్తదాతలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దానితో ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వ గణనీయంగా పడిపోయింది.  ప్రస్తుత సమాచారం ప్రకారం.. తెలంగాణలోని ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో కేవలం 700 యూనిట్ల బ్లడ్ మాత్రమే, అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితి గుర్తించిన తలసాని, ఆదివారం సనత్‌నియోజకవర్గం నుంచే, నిబంధనలను అనుసరించి మిత్రులతో కలసి రక్తదానశిబిరం నిర్వహించననున్నారు. రక్తదానం చేసిన తర్వాత, ఆ రక్తం మరొకరికి ఉపయోగపడుతుందా? లేదా? రక్తదాతలకు ఏమైనా రోగాలున్నాయా? లేవా అని తెలుసుకునేందుకు పరీక్షలు చేసిన తర్వాతనే, ఆ రక్తాన్ని మరొకరికి ఇస్తుంటారు. అలాంటి పరీక్షకే చాలా ఖర్చవుతుంది. ఈ క్లిష్ట సమయంలో ఎన్ని యూనిట్ల రక్తం సేకరించినా..  అది మరొకరి ప్రాణం నిలిపేందుకు దోహదపడినట్లే! అలాంటి ప్రాణాలు పోసే కార్యక్రమం చేపట్టిన వారు ఎవరైనా అభినందనీయులే.