గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ!

414

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బాసుల తీరు
ఏపీలో పార్టీ దళపతిపై వైసీపీ మాటల దాడులు
కన్నా 20 కోట్లకు అమ్ముడుపోయారన్న విజయసాయి
సాయిరెడ్డి ఆరోపణలపై స్పందించని జీవీఎల్
ట్రంప్‌తో విందుకు కేసీఆర్‌కు ఆహ్వానం
కేసీఆర్ సర్కారుపై కేంద్రమంత్రుల ప్రశంసలు
కమలదళాలకు  అర్ధం కాని అవసరార్ధ రాజకీయాలు
(మార్తి సుబ్రహ్మణ్యం)

కేసీఆర్, జగన్మోహన్‌రెడ్డి.. ఇద్దరూ రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు నాయకత్వం వహిస్తున్న అధినేతలు. ఇద్దరూ ప్రధాని మోదీని ప్రశంసిస్తారు. ఆయనను పల్లెత్తుమాట అనరు. వారికి ఆయన అపాయింట్‌మెంట్ కూడా పెద్ద కష్టం కాదు. కేంద్రమంత్రులు కూడా, వారి పాలనా విధానాలను మెచ్చుకుంటారు. కానీ, మోదీ నాయకత్వం వహిస్తున్న బీజేపీ రాష్ట్ర నేతలపై మాత్రం, ఆ ఇద్దరు సీఎంలు నాయకత్వం వహించే పార్టీలు లెక్క చేయవు. అసలు ఆ జాతీయ పార్టీని తమ రాష్ట్రాల్లో ఒక పార్టీగానే పరిగణించవు. పైగా ఎదురుదాడి చేస్తాయి. రాష్ట్ర అధ్యక్షులపై తీవ్రమైన ఆరోపణలతో భూకంపం పుట్టిస్తాయి. అయినా సరే, ఆ జాతీయ పార్టీలో చలనం ఉండదు. దేశంలో  ఇది ఎక్కడైనా సాధ్యమవుతుందా? ఇలాంటి సొంత పార్టీ నేతలనే గందగోళంలో నెట్టివేసే ద్వంద్వ విధానాలు అవలంబించడం ఎవరికైనా సాధ్యమవుతుందా?  అవుతుంది.. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. నిజంగా నిఝం! అదెలాగో చదవండి!!

ఇంతకూ ఆ రెండు  మిత్రపక్షమా? శత్రుపక్షమా?

కేంద్రంలో అధికాంలో ఉన్న ఏదైనా ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వంపై, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న మరొక పార్టీ ఆరోపణలు చేస్తే.. ఆ కేంద్రప్రభుత్వంలో ఉన్న పార్టీ సహించదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఒకచూపు చూస్తుంది. దానిని ఒక పట్టాన విడిచిపెట్టదు. కేంద్రం వివిధ మార్గాల్లో విశ్వరూపం ప్రదర్శిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇదే విధానం అవలంబించి, ఆయా రాష్ట్రాల్లోని తన పార్టీ నేతలకు రక్షణకవచంలా నిలిచింది. మరి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది.. రాజకీయ ప్రత్యర్ధుల సంగతి తేల్చి, నాలుగుచెరువుల నీళ్లు తాగించే, గుజరాతీ ద్వయం నాయకత్వం వహిస్తున్న  భారతీయ జనతా పార్టీ! వారి దెబ్బకు జాతీయ పార్టీలు, ప్రాంతీయ నేతలే చలి జ్వరం వచ్చిన వారిలా వణికిపోతున్నారు. అలాంటి పార్టీ నాయకత్వం.. తెలుగు రాష్ట్రాల విషయంలో మాత్రం అత్యంత లౌక్యంగా వ్యవహరిస్తోంది. తన పార్టీని ప్రాంతీయ పార్టీలు చెడుగుడు ఆడుకుంటున్నా, అసలేమీ కనిపించనట్లు ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తోంది. ఫలితం..  తాము రాష్ట్ర స్థాయిలో పోరాడుతున్న ఆ రెండు పార్టీలు తమకు మిత్రపక్షమా? శత్రుపక్షమా?.. ఆ రెండు పార్టీలు తమను దునుమాడుతున్నాయే గానీ, మోదీ-అమిత్‌షా-కేంద్రప్రభుత్వాన్ని పల్లెత్తుమాట అనడం లేదు.. ఆ రకంగా అవి తమకు అనుకూలమా? వ్యతిరేకమా?.. ఇవీ తెలుగురాష్ట్రాల్లో బీజేపీ జెండా మోస్తున్న కమలదళాలను కలవరపరుస్తున్న సందేహాలు.

మోదీతో వియ్యం.. కన్నాతో కయ్యం!

ఏపీలో బీజేపీ జాతీయ నాయకత్వం విధానం పరిశీలిస్తే.. అక్కడ తమ సొంత పార్టీ నాయకుల పరువు-ప్రతిష్ఠ కంటే, వైసీపీ ఎంపీల సంఖ్యనే తమకు ప్రధానమన్న వైఖరి.. బీజేపీ జాతీయ నాయకత్వంలో స్పష్టమవుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో,  సీఎం జగన్మోహన్‌రెడ్డి సర్కారుపై కమలదళాలు తీవ్రస్థాయిలో పోరాడుతున్నాయి. కొన్ని అంశాలపై అయితే, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం కంటే దూకుడుగా వెళుతోంది. ప్రధానంగా కీలక సమస్యలపై ఆయన సీఎంకు లేఖలు సంధిస్తున్నారు. ఇటీవల కరోనా కిట్ల కొనుగోలుకు సంబంధించిన అంశాన్ని తొలుత బీజేపీనే ప్రస్తావించింది. అమరావతి నుంచి రాజధాని తరలింపు, నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహారం, దేవాలయాలను క్వారంటైన్ సెంటర్లుగా మార్చిన అంశాలపై కమలదళం గట్టిగానే పోరాడుతోంది.

బీజేపీపై వైసీపీ ఎదురుదాడి..

అయితే, వైసీపీ తన ఎదురుదాడిలో భాగంగా తెలుగుదేశం పార్టీతోపాటు, కన్నా లక్ష్మీనారాయణను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని సంధిస్తున్న ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ అధికార మీడియా ‘సాక్షి’లో కూడా కన్నాను లక్ష్యంగా చేసుకుని వార్తా కథనాలు వస్తున్నాయి. సాక్షి చానెల్‌లో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే చర్చలో దాదాపు ప్రతిరోజూ చంద్రబాబునాయుడు-కన్నా లక్ష్మీనారాయణ లక్ష్యంగా ప్రశ్నలు సంధిస్తుండటం కనిపిస్తోంది. ఆ చర్చలో కాంగ్రెస్ నుంచి ఒకరిని, బీజేపీ నుంచి మరొకరిని, వైసీపీని సమర్ధించే ఆస్థాన జర్నలిస్టు ఒకరిని.. ఇలా పార్టీలు, సంస్థల నుంచి ఒకరిని ఎంపిక చేస్తుంటారు. అయితే విచిత్రంగా వారంతా.. వైసీపీకి ఏదో ఒక రూపంలో మద్దతుగా మాట్లాడి, చంద్రబాబును విమర్శించేలా చూడటం కొమ్మినేని చర్చ ప్రత్యేకతగా కనిపిస్తుంటుంది.  ప్రతి చర్చలోనూ కన్నాను లక్ష్యంగా చేసుకోవడం, ఆ పార్టీ నేతల వాదనను అడ్డుకోవడం కనిపిస్తూనేఉంది. అందుకే, బీజేపీ చర్చలకు వెళ్లే తమ ప్రతినిధులను మార్చి వేసి, ఎదురుదాడి చేసే నాయకులను మాత్రమే చానెళ్లకు పంపుతూ నిర్ణయం తీసుకుంది. జాతీయ పార్టీ నాయకత్వాన్ని మాత్రం పల్లెత్తుమాట అనని సాక్షి మీడియా.. రాష్ట్ర స్థాయిలో మాత్రం, బీజేపీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడంపై ఆ పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

కన్నాపై విజయసాయి కమిషన్ ఆరోపణలు

ఒకవైపు మోదీని పొగుడుతూ, అనేక అవసరాల కోసం అమిత్‌షా ప్రాపకం కోసం వెంపర్లాడుతూ, మరోవైపు అదే పార్టీకి నాయకత్వం వహిస్తోన్న కన్నా లక్ష్మీనారాయణ, ఇతర రాష్ట్ర నాయకులపై మాత్రం తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకత్వ తీరుపై.. జాతీయ నాయకత్వం కూడా మౌనంగా ఉండటం నేతలకు  విస్మయం కలిగిస్తోంది. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు కన్నాపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన తీవ్రమైన ఆరోపణలు సంచలనం సృష్టించింది. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మధ్యవర్తిగా కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు 20 కోట్లు కమిషన్ ఇచ్చారని, ఆరకంగా ఆయన బాబుకు 20 కోట్లకు అమ్ముడుపోయారని విజయసాయి ఆరోపించడం కలకలం రేపింది.

అయినా స్పందించని కేంద్ర నాయకత్వం..

ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై.. అందులో రోజూ వివిధ అంశాలపై, తాము లాబీయింగ్ చేసే పార్టీకి సంబంధించిన రాష్ట్ర పార్టీ నేతపై.. మరొక నేత ఆరోపణలు చేయడం విభ్రాంతికరమే. మామూలుగా అయితే, దానికి చాలా ధైర్యం కావాలి. కేంద్రంలో ఉన్న పెద్ద తలలతో ఎంతో సాన్నిహిత్యం, చనువు, పరస్పర అవసరాలు, ఇంకా చాలా ‘తెరచాటు బంధం’ ఉంటే తప్ప,  ఏ పార్టీ కూడా కేంద్రంలో ఉన్న రాష్ట్ర పార్టీ నాయకులపై ఆరోపణలు చేయవు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా 20 కోట్లకు అమ్ముడుపోయారని, కేంద్ర పెద్దలతో చనువుగా మెలిగే సాయిరెడ్డి ఆరోపించిన వైనం ఇప్పటికే జాతీయ చానెళ్లలోనూ ప్రముఖంగా వస్తోంది. అయినా రాష్ట్ర ఇన్చార్జి గానీ, రాష్ట్ర వ్యవహారాలు చూసే కేంద్రమంత్రి గానీ, పార్టీ వ్యవహారాలు చూసే సంఘ్ ప్రధాన కార్యదర్శి గానీ దీనిపై ఇప్పటివరకూ స్పందించపోవడమే నేతలను విస్మయానికి గురిచేస్తోంది. చివరకు రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా ఢిల్లీ నుంచి వాలిపోయి, మీడియా ముందు ప్రత్యక్షమయ్యే దక్షిణాది రాష్ట్రాల బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు కూడా, దీనిపై పెదవి విప్పకపోవడం మరో ఆశ్చర్యం. వైసీపీ నేతలు, మంత్రులు శరపరంపరగా తమ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఆరోపణలు, విమర్శలు సంధిస్తున్నా కేంద్ర నాయకత్వం నోరుమెదకపోవడం శ్రేణులను ఆశ్చర్యం, గందరగోళపరుస్తోంది. దానితో  ఈ పరిణామాలు గమనిస్తున్న భాజపా శ్రేణులు.. వైసీపీ తమకు మిత్రపక్షమా? శత్రుపక్షమా అన్న గందరగోళంలో పడ్డారు.

తెలంగాణలోనూ అదే తీరు..

కొంచెం అటు ఇటుగా  తెలంగాణలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ నేతలు, అధికార తెరాసపై నిప్పులు కురిపిస్తున్నారు. ఏపీలో కన్నా వంటి ఇద్దరు, ముగ్గురు నేతలు మాత్రమే అక్కడి అధికార పార్టీపై ఎదురుదాడి చేస్తున్నారు. కానీ తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడు సహా, రాష్ట్ర నేతలంతా కేసీఆర్ సర్కారు విధానాలపై విరుచుకుపడుతున్నారు. పేదలకు మోదీ సర్కారు 11 కిలోల బియ్యం ఇస్తే, కేసీఆర్ ప్రభుత్వం దానికి ఒక కిలో జోడించి, మొత్తం 12 కిలోలు తామే ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటోందని.. అధ్యక్షుడు సంజయ్, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపి అర్వింద్, రామచందర్‌రావు, సంకినేని వెంకటేశ్వరరావు, డి.కె. అరుణ వంటి నేతలతా విరుచుకుపడుతున్నారు. వలస కూలీలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపిస్తున్నారు. ఇటీవల ‘లాక్‌డౌన్ బ్రేక్’ పేరిట నమస్తే తెలంగాణలో వచ్చిన కథనంపై అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు కురిపించారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా పార్టీ పరంగా తెరాసపై ధ్వజమెత్తుతున్నారు. ఒకరకంగా ఏపీలో కంటే, తెలంగాణ  నేతలే అధికార పార్టీపై ఎదురుదాడిలో ముందున్నారు.

అయినా.. ట్రంప్ విందుకు కేసీఆర్‌కు ఆహ్వానం

ఈ పరిస్థితిలో గత నెల భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన విందులో తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ను చేర్చడం కమలదళాలను ఖంగుతినిపించింది. పైగా కేంద్రమంత్రులు కూడా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల తీరును, ప్రశంసించి వెళుతుండటాన్ని జీర్ణించుకోలే కపోతున్నారు. పక్క రాష్ట్రంలోనే ఉన్న జగన్‌ను పక్కకుపెట్టి, కేసీఆర్‌ను పిలవడంలో ఆంతర్యమేమిటని కమలదళాలు ఆశ్చర్యపోయాయి. ఓ వైపు రాష్ట్రంలో రాజకీయంగా తమను అణగదొక్కుతున్న కేసీఆర్‌తో తాము నిత్యం పోరాడుతుంటే, మరోవైపు అదే కేసీఆర్‌ను  ట్రంప్ విందుకు ఆహ్వానించిన జాతీయ నాయకత్వం.. కార్యకర్తలకు ఏం సంకేతం ఇస్తుందని వాపోయారు.

కమలదళపతుల వైఖరికి అసలు కారణం ఇదేనా?

బీజేపీ జాతీయ నాయకత్వ వైఖరికి కొన్ని కారణాలు బలంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రకారంగా..  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికిప్పుడు పార్టీ బలపడే పరిస్థితి లేనందుకే, బీజేపీ జాతీయ నాయకత్వం.. రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలతో, ‘అవసరార్ధ రాజకీయం’ కొనసాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పైగా ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు లోక్‌సభ-రాజ్యసభలో దండిగా మెజారిటీ ఉంది. మోదీ ప్రవేశపెడుతున్న కీలక బిల్లులను, ఆ రెండు పార్టీలూ ఆమోదిస్తూనే ఉన్నాయి. దానివల్ల కేంద్రానికి వెసులుబాటు తప్ప, సమస్యలు రావడం లేదు. పైగా, ఆ రెండు పార్టీలూ మోదీని గానీ, జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలను గానీ పల్లెత్తు మాట అనడం లేదు. వీలున్నప్పుడల్లా మోదీ విధానాలను ఆకాశానికెత్తునే ఉన్నారు. ఏపీలో తెలుగుదేశం తనకు శత్రువు. చంద్రబాబు పార్టీ ఎంత త్వరగా నిర్వీర్యమయితే, తనకు అంత లాభం. ఆ పనిలో జగన్ బిజీగా ఉన్నారు కాబట్టి, ఆయనతో సంబంధాలు చెడగొట్టుకోవడం తెలివితక్కువ పని. పైగా ఇప్పట్లో టీడీపీతో సంబంధాల పునరుద్ధరణ కష్టం. అసాధ్యం. ఇక తెలంగాణలో కాంగ్రెస్ తనకే కాదు, కేసీఆర్‌కూ రాజకీయ శత్రువు. కాబట్టి.. తెలుగుదేశం-కాంగ్రెస్‌పై జగన్-కేసీఆర్ పోరాడుతుండటం, బీజేపీ జాతీయ నాయకత్వానికి రాజకీయంగా అనుకూల అంశమే.

రెండు తెలుగురాష్ట్రాల్లో బీజేపీ కొద్దిగా బలంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలోనే.  అయినప్పటికీ, పార్టీ-ప్రభుత్వ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా,  కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాల్సిన అత్యవసర పరిస్థితి జాతీయ నాయకత్వానికి కనిపించడంలేదు. పైగా అది తన రాజకీయ శత్రువైన కాంగ్రెస్‌తో పోరాడుతోంది.  జరగవలసిన పనులు నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి,  ఓ వైపు పార్టీని సంస్థాగతంగా బలపడేలా చూసుకుంటూ, మరోవైపు పార్లమెంటులో  బిల్లుల మనుగడకు.. కేసీఆర్-జగన్ పార్టీల మద్దతు తీసుకునే వ్యూహమే బీజేపీ జాతీయ నాయకత్వ వ్యూహంగా అర్ధమవుతుంది.

బీజేపీ నేతలకంటే విజయసాయికే విలువెక్కువ

అందుకే ఏపీ వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డికి కేంద్రమంత్రులు, జాతీయ పార్టీ నేతలు అంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన తరచూ ప్రధాని కార్యాలయం, కేంద్రమంత్రుల ఛాంబర్లలో దర్శనమిస్తుంటారు. ఒకరకంగా చెప్పాలంటే, ఏపీ బీజేపీ నేతలకంటే ఢిల్లీ నాయకత్వం విజయసాయికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందన్నది నిజం. ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ తరఫున నిలబడి, ఆయనను విమర్శిస్తున్న వారిపై ఎదురుదాడి చేశారు. ఆయన మన ప్రధాని. ఆయనో సంస్థ. ఆయనను అందరూ గౌరవించాలి. సోషల్‌మీడియాలో ఎలాగంటే అలాగ ఆయనపై సెటైర్లు వేస్తారా? ఇలాంటి పనికిమాలిన పనులు మానుకోవాలని’ క్లాసు ఇచ్చారు. దీన్నిబట్టి.. తెరాస-వైసీపీ కేంద్రంలోని బీజేపీకి మిత్రపక్షమా? శత్రుపక్షమా అన్న ప్రశ్నకు.. మెడపై తల ఉన్న ఎవరికైనా ఇప్పడికే స్పష్టమైన సమాధానం వచ్చి తీరాలి!

కాంగ్రెస్ అలా.. కమలం ఇలా..

కొన్ని దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఈ విషయంలో కొంత మేరకు, రాష్ట్ర పార్టీ నాయకత్వాల వైపే నిలిచిందని చెప్పాలి. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. కాంగ్రెస్ నేతలపై చేసే విమర్శలకు, కొద్దిరోజుల్లోనే ఆయా ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకునేవి. ఇన్‌కంటాక్స్, ఈడీ, సీబీఐ, ఇంకా బ్యాంకు బకాయిల పేర్లతో సత్తా చూపించేది. ఫలితంగా.. తన పార్టీ జోలికొస్తే ఏం జరుగుతుందనే  పరోక్ష హెచ్చరికలు జారీచేసేది.

కానీ, బీజేపీ మాత్రం.. తాము అధికారంలో లేని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తెరచాటు బంధం కొనసాగిస్తూ, వారు స్థానికంగా తమ నేతలను ఇబ్బందిపెడుతున్నా, తన అవసరార్ధ రాజకీయం కోసం దానిని పట్టించుకోకపోవడం కనిపిస్తోంది. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు పరిశీలిస్తే.. రాష్ట్రాలలో ప్రముఖులు ఎవరెన్ని ముఠాలు కట్టినా, అంతిమంగా వారంతా తనకు విధేయులుగా ఉండేలా చూసుకునేది. ఇప్పుడు బీజేపీ మాత్రం.. బీజేపీయేతర పార్టీలు-ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల్లో తన సొంత పార్టీ నేతలను ఎంత వేధించినప్పటికీ పట్టించుకోకుండా.. అంతిమంగా ఆయా పార్టీలు- సీఎంలు, తనకు విధేయులుగా ఉండేలా చాలన్నట్లు భావిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు ఇదే చెబుతున్నాయి.