రామయ్యా.. ఎంత అమాయకుడివయ్యా?

883

ఐఏఎస్ సంఘం ఉందనుకుంటున్నారు పాపం
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఆశ మంచిదే. కానీ అత్యాశ పనికిరాదు. ఏపీలో ఐఏఎస్‌ల సంఘం ఉందా? లేదా? అని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేవెత్తిన సందేహం చూస్తే, వర్ల రామయ్య ఎంత అమాయకుడోనన్న విషయం అర్ధమవుతుంది. పాపం ఆయన ఇంకా సతె్తకాలపు రోజుల్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. అంటే రామయ్య రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల సంఘం ఉన్నట్లుగానే భావిస్తున్నట్లున్నారు. ఒకరకంగా ఆయన.. తమ సంఘం పనిచేస్తుందా లేదా అని, చేయి గిల్లుకునే అధికారులలో ఒకింత నమ్మకం కలిగించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహారంపై ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించకపోవడం, ఒకవేళ కోర్టు ఆదేశాలతో నిమ్మగడ్డ రమేష్ మళ్లీ వచ్చినా,  ‘బొచ్చు పీకుతాడా’ అని తెలుగుభాషకు వన్నె తెస్తున్న మంత్రి కొడాలి నాని తిట్టిపోసినప్పుడు కూడా, సంఘం నోటికి బట్టలు కట్టుకుని మూగనోము పట్టడం  వర్ల రామయ్య కోపానికి కారణం కావచ్చు. అసలు ఎల్వీ సుబ్రమణ్యం అనే సీనియర్ అధికారిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఉత్తి పుణ్యానికి, అకారణంగా తొలగించినప్పుడే నోరు మెదపని ఐఏఎస్ అధికారుల సంఘం.. ఇప్పుడు ఆఫ్టరాల్,  తీసేసిన తహసీల్దార్‌తో సమానమైన నిమ్మగడ్డనుద్దేశించి మంత్రి బొచ్చు పీకుతాడా అని తిడితే, స్పందిస్తుందనుకోవడం అమాయకత్వం. అత్యాశ! అసలు ఐఏఎస్ అధికారుల సంఘం భేటీ అయి ఎంతకాలమయింది? కొత్త సీఎం జగనన్నను కలసిన తర్వాత ఒకే ఒకసారి భేటీ అయింది. అది కూడా జగనన్న ఇచ్చిన విందులోనే కదా?

అసలు ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వంటి పెద్ద పదవిలో ఉన్నవారే, ముళ్ల మీద కూర్చుని పనిచేస్తున్నట్లు సచివాలయ వర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయి. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు.. ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న వారిని కూడా.. చూపుడువేలుతో శాసిస్తున్న ఓ జూనియర్ అధికారి ముందు, ఏడాది క్రితం వరకూ సీఎం పేషీలో చక్రం తిప్పిన సీనియర్ అధికారులు సైతం, చేతులుకట్టుకుని నిలబడుతున్న వైచిత్రి.  పోస్టింగుల కోసం ఆయన చుట్టూ ప్రదక్షణలు చేస్తున్న దుస్థితి. కోర్టులు వరస వెంట వరస వేస్తున్న అక్షింతలు.. తొలుత తగిలేది తమకే అయినప్పటికీ, వాటి కష్టాలపై ఐఏఎస్ సంఘం ఒక్కసారయినా కూర్చుని మేధోమథనం చెందిన దాఖలాలు, భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు.  ఒక్క కలంపోటుతో తొలగింపునకు గురై, మళ్లీ ఢిల్లీ పెద్దల ఆదేశాలతో అక్కడే ప్రతిష్ఠించబడిన మెడ్‌టెక్ బాసు డాక్టర్ జితేందర్ శర్మ.. వీరందరికంటే మొనగాడు కిందే లెక్క. జగన్ జమానాలో తొలగించి, మళ్లీ అదే పోస్టులో పనిచేస్తున్న ఒకే ఒక్కడు ఈ శర్మ మాత్రమే! ఒకప్పుడు పోలీసు ఆఫీసర్‌గా పనిచేసిన వర్ల రామయ్యకు ఇంత చిన్న సూక్ష్మం కూడా తెలియకపోతే ఎలా?

అసలు ఐఏఎస్ అధికారుల సంఘం ఉందనుకోవడం భ్రమే అవుతుంది. వృత్తిపరంగా, తమ ఈతిబాధలు నెమరువేసుకునేందుకు ఏర్పాటయిన ఈ సంఘం, ఎప్పుడూ పెద్ద పనితనం చూపిన దాఖలాలు లేవు. ఏ ప్రభుత్వం ఉన్నా, ఆ ప్రభుత్వాధినేలతో లౌక్యంగా వ్యవహరించడం ఒక్కటే దానికి తెలిసిన విద్య. గతంలో చంద్రబాబు హయాంలో అదే జరిగింది. ఇప్పుడు జగన్ జమానాలోనూ అదే జరుగుతోంది. అయితే, గతంలో ప్రధాన కార్యదర్శి అదే పెద్ద తలకు.. కొద్దో గొప్పో విలువ ఏడ్చేది. వారి సూచనలను ముఖ్యమంత్రులు కూడా గౌరవించేవారు. ఎస్వీ ప్రసాద్, కాకి మాధవరావు వంటి సీనియర్ల హయాంలో ఐఏఎస్ సంఘానికి కొంత విలువ ఉండేది. పోస్టింగుల విషయంలో సంఘం చేసిన సూచనలను వారు గౌరవించేవారు. ఒకవేళ ఆ వాదన వారికి నచ్చకపోతే, నచ్చచెప్పి అధికారులకు న్యాయం చేసిన రోజులూ లేకపోలేదు. అది ఒకప్పటి కథ.

ఆ తర్వాత ఆ సంఘం నామమాత్రావశిష్టంగా మారిందన్నది కొందరు అధికారుల అసంతృప్తి. నిజానికి ఇప్పటికీ ఒక అరడజను మంది ఐఏఎస్ అధికారులకు, జిల్లా కలెక్టర్ పోస్టింగులు ఇవ్వలేదు. దానిని అడిగే దిక్కు లేదు. పాపం కలెక్టర్ పోస్టింగులపై ఆశపెట్టుకుని, రిటైరయిన వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి తరహా ఐఏఎస్ అధికారులంతా ఏ కమిషనరేట్‌లోనో, కార్పొరేషన్లలోనో, డైరక్టర్లుగానో,సీసీఎల్‌ఏలోనో మగ్గిపోయి, అక్కడే రిటైరవుతున్నారు. అయినా వారికి కలెక్టర్ పోస్టింగులు ఇప్పించేందుకు, వారికోసమే ఏర్పాటయిన ఐఏఎస్ సంఘం ఏనాడూ ప్రభుత్వంపై ఒత్తిడి చేసిన దాఖలాలు లేవు. ఎంతసేపటికీ, పాలకుల కనుసన్నలలో ముందువరసలో నిలిచి, తమ పోస్టింగుల కోసం పాకులాడటం తప్ప.. తమ గురించి మాట్లాడిన దాఖలాలు లేవని, కలెక్టర్ పోస్టింగు రాకుండానే రిటైరయిన ఓ అధికారి వాపోయారు. తమ భవిష్యత్తు సీఎంఓ ముఖ్య కార్యదర్శుల దయాధర్మంపైనే ఆధారపడి ఉందని వాపోతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో, పేషీని శాసించిన సతీష్‌చంద్ర.. తనతో పనిచేసిన వారికి, తన కింద పనిచేసిన ఐఏఎస్‌లకు మాత్రమే  కలెక్టర్ పోస్టింగులు ఇప్పించారన్న విమర్శ అప్పట్లో ఉండేది. ఎవరితోనయినా సిఫార్సు చేయించుకోండని.. స్వయంగా ప్రధాన కార్యదర్శులే సూచిస్తున్నారంటే, కలెక్టర్ పోస్టింగులలో చివరకు సీఎస్‌లు కూడా నిమిత్తమాత్రులేనని స్పష్టమవుతోంది.

సరే..  అస్మదీయులకు ఒక విస్తరి, తస్మదీయులకు ఇంకో విస్తరి వేసే విధానం ఎప్పుడూ ఉంది. అది జగన్‌తోనే మొదలుకాలేదు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు చేసిన బదిలీలలో, రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఒకే ఒక్క అధికారి ధనుంజయరెడ్డి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా ఉండేవారు. ఎన్నికల ముందు ఆయనను తప్పించి, టూరిజంలో వేశారు. ఎస్పీ, డీఎస్పీ, సీఐ పోస్టింగులలో కమ్మ వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. దానిని అప్పట్లో వైసీపీ ఆక్షేపించింది. కమ్మ రాజ్యం చేస్తున్నారని ముద్ర వేసింది. దానినే బలంగా ప్రచారం చేసింది. అది ఎన్నికల్లో  వర్కవుటయింది.

మరి ఇప్పుడు జగన్ చేస్తుందీ అదే. కమ్మ వారి స్థానంలో రెడ్లు 70 శాతం వస్తే, మిగిలిన 30 శాతంలో క్రైస్తవులు, దళితులు కనిపిస్తున్నారు. గత ఎన్నికల ముందు బాబు ప్రభుత్వం.. తనకు పనికిరారనుకున్న ధనుంజయరెడ్డి, ఇప్పుడు జగన్ పేషీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. బాబు హయాంలో కీలక పోస్టింగుల్లో పనిచేసిన రెడ్డి వర్గం అధికారులను జగనేమీ తొలగించలేదు. పైగా వారికి మరింత మంచి పోస్టింగులే ఇచ్చారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు పెద్దగా ఆదరణకు నోచుకోని కమ్మ వర్గ అధికారులకు జగన్ మంచి పోస్టింగులే ఇస్తున్నారు. లౌక్యంగా వ్యవహరించే అధికారిగా పేరున్న కృష్ణబాబుకు ప్రాధాన్యం ఇచ్చిన జగన్.. అదే కమ్మ వర్గానికి చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారి, ఏబీ వెంకటేశ్వరరావును మాత్రం వెంటాడుతుండటం మరో వైచిత్రి. ప్రస్తుతం జగన్ పాలనలో, దాదాపు 500 మంది రెడ్డి సామాజికవర్గానికి చెందిన సలహాదారులు, ఐఏఎస్, ఐపిఎస్‌లు.. కలెక్టర్లు, ఎస్పీలు, విభాగాధిపతులు, ఆర్డీఓలు, డీఎస్పీలు పనిచేస్తున్నారని  తెలుగుదేశం ఆరోపణాస్త్రాలు సంధిస్తోంది. గత ఎన్నికల ముందు వైసీపీ ఈ విషయంలో ఏ వ్యూహం అనుసరించిందో, తెలుగుదేశం పార్టీ కూడా ప్రస్తుతం అదే వ్యూహం అమలుచేస్తోంది.