యు.పి  ఎంపీగా ఏపీ భక్తులకు బాసట
కాశీ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు
(మార్తి సుబ్రహ్మణ్యం)

భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఎట్టకేలకు.. ఉత్తరప్రదేశ్  ఎంపీగా ఏపీకి న్యాయం చేశారు. ఏపీకి చెందిన వారయినప్పటికీ, యు.పి కోటాలో ఎంపీ అయిన గుంటుపల్లి.. తన క్రియాశీల రాజకీయాలను యు.పిలో కాకుండా, ఏపీలోనే ఎక్కువగా కొనసాగిస్తున్నారు. ఎవరికైనా తన అవసరం ఉందనుకున్నప్పుడు.. వెంటనే ఆయన ఢిల్లీ నుంచి బెజవాడలో ప్రత్యక్షమయి, ప్రెస్‌మీట్ పెట్టి ‘అనుకున్న లక్ష్యం’ నెరవేర్చి న్యాయం చేస్తుంటారు.

అలాంటి జీవీఎల్.. కరోనా సమయంలో కాశీలో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులను ఆదుకుని, న్యాయం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. కరోనా సమయంలో కాశీలో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన భక్తులు, స్వరాష్ట్రం వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. వారి సమస్యలు తెలుసుకున్న తెలుగువాడైన జీవీఎల్.. యు.పీ ఎంపీగా స్పందించి వారి సమస్యను, అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు.తెలుగువారితోపాటు చిక్కుకున్న ఒడిషా యాత్రికుల సమస్యలూ వివరించారు.  ఫలితంగా 394 మంది భక్తులను ఒడిషా, ఆంధ్రాకు పంపించేందుకు యోగి ప్రభుత్వం అంగీకరించింది. అందుకోసం బస్సులు ఏర్పాటుచేసింది. వారంతా ఇప్పుడు స్వరాష్ట్రాలకు చేరుకున్నారు. నిబంధనల ప్రకారం, వారిని రిలీఫ్ సెంటర్లకు పంపించారు.

ఈ విషయంలో జీవీఎల్.. తన సొంత రాష్ట్రంపై బాగానే ప్రేమ కనబరిచారు. తెలుగు, ఒడిషా భక్తుల సమస్యలు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు.. మార్చి 22 నుంచీ వారికి అక్కడ భోజన, వసతి సౌకర్యం సమకూర్చారు. కాశీ ప్రభుత్వ అధికారులతో నిరంతరం ఫోన్‌లో మాట్లాడి, వారిని భక్తుల వద్దకు పంపించారు. కరోనా కల్లోల సమయంలో జీవీఎల్ చేసిన ఈ సహాయంపై వారంతా కృతజ్ఞతలు ప్రకటించారు. ఈరకంగా ఇతర రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎంపీలుగా ఉండటం మనకు లాభించింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner