11నెలలు..55 అక్షింతలు!

155

ఏపీ సర్కారుకు కోర్టులో ఎదురుదెబ్బలు
ఇంగ్లీషు విద్యపై సుప్రీంకోర్టుకు?
అయినా జగన్ ఫీలవరా?
(మార్తి సుబ్రహ్మణ్యం)

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. 151మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత. ఆ రాష్ట్రంలో సుప్రీంకోర్టు నుంచి సెషన్స్‌కోర్టు వరకూ అన్నీ ఆయనేనన్న భావన అందరిలోనూ ఉంది. ఎవరేమనుకున్నారనే  భయం లేదు. భారీ మెజారిటీ కారణంగా విపక్షాలకు భయపడాల్సిన అవసరం అసలే లేదు. సొంత మీడియా ఉన్నందున, మిగిలిన  మీడియాకు భయపడాల్సిన పనిలేదు. కేంద్రంతో తెరచాటు స్నేహం ఉన్నందున, దానికీ భయపడాల్సిన పనిలేదు. మరి అలాంటి ప్రభుత్వాధినేత తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో.. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అలాగే ఉంటున్నాయి.

రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు ఇస్తున్న వ్యతిరేక తీర్పులు, చేస్తున్న వ్యాఖ్యలను అర్ధం చేసుకుని, ఆయా నిర్ణయాలలో మార్పులు చేసుకునేందుకు సిద్ధంగా లేకపోవడమే, మరిన్ని విమర్శలకు కారణమవుతోంది. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన 11 నెలల కాలంలో.. దాదాపు 55 సార్లు హైకోర్టు ఇచ్చిన వ్యతిరేక తీర్పులు, చేసిన ప్రతికూల వ్యాఖ్యలతో ప్రభుత్వ పరువు పోతోందన్న ఆవేదన అన్ని వర్గాలలో వ్యక్తమవుతోంది. తాజాగా ఇంగ్లీషు విద్యపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును వినమ్రంగా స్వీకరించి, వాటి లోటుపాట్లు సవరించుకోకుండా, మళ్లీ యాధావిధిగానే సుప్రీంకోర్టులో సవాల్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ స్థానిక సంస్థలు వాయిదా వేసిన వైనాన్ని హైకోర్టు సమర్ధించింది. అయితే, దానిని జగన్మోహన్‌రెడ్డి సర్కారు ప్రతిష్ఠగా భావించి, సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. చివరకు సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పునే సమర్ధించింది. దానితో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ పరువు పోయినట్టయింది. నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి నేపథ్యం ఏమిటన్నది పక్కకుపెడితే.. కరోనా వైరస్ సమయంలో, స్థానిక సంస్థ ఎన్నికలు వాయిదా వే స్తూ తీసుకున్న నిర్ణయాన్ని మామూలుగా ఒక ప్రభుత్వ నేతగా అయితే జగన్మోహన్‌రెడ్డి స్వాగతించాలి. నిజంగా, జగన్మోహన్‌రెడ్డి అభీష్టం మేరకు ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించి ఉంటే, ఈపాటికి ఏపీలో కూడా కరోనా మరణమృదంగాలు, పాజిటిల్ కేసులు పెరిగి ఉండేవి. సామాజిక దూరం చెరిగి, వైరస్ విస్తృతంగా చెలరేగేది. దానితో జగన్మోహన్‌రెడ్డి ఎవరైతే తనను అత్యధిక మెజారిటీతో గెలిపించారో, అదే ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి ఉండేది. అది జరగకుండా అడ్డుకున్నందుకు,  జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల కమిషనర్‌కు రుణపడి ఉండాలి.

జగన్ సర్కారుకు నిమ్మగడ్డ మేలే చేశారు..

బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ సబ్బం హరి చెప్పినట్లు.. ఒకరకంగా నిమ్మగడ్డ రమేష్ ప్రభుత్వానికి చాలా మేలు చేశారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి, తిరిగి ఎన్నికలు జరిపించాలని యావత్ ప్రతిపక్షం డిమాండ్ చేసినప్పటికీ, దానిని నిమ్మగ డ్డ అంగీకరించలేదు. ప్రత్యర్ధులను బెదిరించి ఎన్నికలను ఏకగ్రీవం చేసినందున, మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి, అక్కడ కూడా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని విపక్షాలు చేసిన డిమాండ్‌ను నిమ్మగడ్డ త్రోసిపుచ్చారు. అక్కడ మినహా, మళ్లీ ఎన్నికలు జరిపించాలని నిర్ణయించారు. అంటే, నిమ్మగడ్డ రమేష్ ..ప్రభుత్వంలో ఉన్న వైసీపీకి మేలు చేసినట్లుగానే భావించక తప్పదు. అయినా అనవసర ప్రతిష్టకు వెళ్లి, నిమ్మగడ్డపై వేటు వేయడమే విమర్శలకు దారితీసింది. నిజానికి కరోనా ప్రభావం వల్ల రాజ్యసభ ఎన్నికలతోపాటు, మూడు రాష్ట్రాల్లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారు. తొలుత పారాసిట్‌మల్‌తో కరోనా తగ్గుతుందని, ఇట్స్ కమ్ టు గోస్ అని తేలిగ్గా మాట్లాడిన జగన్మోహన్‌రెడ్డి, తర్వాత నిరంతరం దానిపై సమీక్షలు నిర్వహించాల్సి వస్తోంది. అంటే కరోనా ప్రమాదాన్ని ఆయన అంగీకరించినట్లుగానే భావించాల్సి ఉంది. యావత్ ప్రపంచం కరోనా ప్రత్యామ్నాయంపై కుస్తీలు పడుతుంటే, జగన్మోహన్‌రెడ్డి మాత్రం నిమ్మగడ్డను తొలగించడంపైనే ఆలోచించడం ఆయనను అభిమానించే వారిని సైతం విస్మయపరిచింది.

ఇంగ్లీషు విద్యలోనూ అంతే..

ఇంగ్లీషు మీడియంలో నిర్బంధ విద్యను, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ విషయంలో ఆయన  చివరకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కూడా, బహిరంగసభలో వ్యక్తిగతంగా విమర్శించడం చర్చనీయాశమయింది. చివరకు ఇప్పుడు రాష్ట్ర ైెహ కోర్టు కూడా, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. దానిపై విపక్షం శాసనసభలో చేసిన సవరణలు పరిగణనలోకి తీసుకుని, ఉత్తర్వుల్లో చేర్చి ఉంటే ఆయన సర్కారుకు ఈ నగుబాటు తప్పిఉండేది. అయితే, హైకోర్టు ఇచ్చిన తీర్పులను సద్విమర్శగా తీసుకునే ఆత్మవిమర్శ చేసుకుని, సవరించుకునే బదులు, మళ్లీ దానిపై సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఆ తీర్పులు..  జగన్ తనకు వ్యతిరేకం  కాదనుకుంటున్నారా?

అయితే ఈ 11 నెలల కాలంలో వచ్చిన 55 వ్యతిరేక తీర్పులు, వ్యాఖ్యలన్నీ తనకు వ్యక్తిగతంగా వచ్చిన అప్రతిష్ఠగా  జగన్మోహన్‌రెడ్డి ఏమాత్రం భావిస్తున్న సూచనలు కనిపించడంలేదు. అవన్నీ అవకేట్ జనరల్‌కు వ్యతిరేకంగానో, ఆయా ప్రభుత్వ శాఖలకు వ్యతిరేకంగానో, సీఎస్ లేదా డీజీపీకి వ్యతిరేకంగా వచ్చిన తీర్పులుగానే భావిస్తున్నట్లు కనిపిస్తోంది. సహజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తే, దానిని ప్రధాని లేదా ముఖ్యమంత్రులు.. తమ పాలనపై వ్యతిరేకంగా వచ్చిన తీర్పులుగానో భావిస్తుంటారు. అందుకే గత ంలో ప్రైవేటు బస్సుల విషయంలో నీలం సంజీవరెడ్డి, మెడికల్ కాలేజీలపై వచ్చిన వ్యతిరేక తీర్పునకు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ,  తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎక్కడో జరిగిన రైలు దుర్ఘటనకు లాల్‌బహుదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. కానీ, ఈ కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా, నైతిక బాధ్యత అనే అంశాన్ని మర్చిపోతున్నారు. అది ఒక్క జగన్మోహన్‌రెడ్డి ఒక్కరికే కాదు. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో,  డజన్ల మంది భక్తుల ప్రాణాలు పోయిన సందర్భంలో రాజీనామా చేయని, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకూ ఈ సూత్రం వర్తిస్తుంది.

జగన్ సర్కారుకు హైకోర్టులో అన్నీ ఎదురుదెబ్బలే..

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు,  హైకోర్టులో వరస వెంట వరస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలకమైన నిర్ణయాలపై  కూడా, హైకోర్టులో అక్షింతలు పడుతున్నాయి. చివరకు డీజీపీ కూడా హైకోర్టుకు రెండు సార్లు స్వయంగా హాజరుకావల్సిన దురదృష్టకర పరిస్థితి ఏర్పడింది. ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వేసిన కేసులు ఇప్పటివరకూ సంచలనం సృష్టిస్తున్నాయి. విధానమండలి రద్దుకు వ్యతిరేకంగా గళం విప్పిన జంధ్యాల.. తాజాగా నిమ్మగడ్డ తొలగింపుపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు వేసిన కేసులోనూ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదిస్తున్నారు. గత 11 నెలలో జగన్మోహన్‌రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పులు, చేసిన వ్యాఖ్యల వివరాలివి… కోర్టు తీర్పులూ.. ఖాతరు చేయరా?

4 COMMENTS

  1. […] ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయితీలకు వైసీపీ రంగులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని తొలగించాలని ఆదేశించింది. దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ‘దేశంలో ప్రభుత్వ కార్యాలయాలకు కాషాయరంగు వేస్తే ఊరుకుంటారా?’ అని అక్షింతలు వేసింది. మళ్లీ ఇదే  అంశంపై కోర్టు తాజాగా.. ప్రభుత్వం ఇచ్చిన 623 జీఓను కోర్టు రద్దుచేసింది. ప్రస్తుతం ఉన్న మూడు రంగులకు అదనంగా వేస్తున్న రంగు పార్టీది కాదన్న ప్రభుత్వ వివరణపై సంతృప్తి చెందలేదు.  సుప్రీంకోర్టు-హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను, ప్రభుత్వం పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని కోర్టు ధిక్కారం కింద సుమోటోగా కేసు తీసుకుంటున్నామని స్పష్టం చేయడం.. జగన్మోహన్‌రెడ్డి సర్కారు దూకుడుకు కళ్లెం వేసినట్టయింది. తెలుగు మీడియంపై హైకోర్టు జగన్ సర్కారు దూకుడుకు ముకుతాడు వేసినా, మరో మార్గంలో జగన్ సర్కారు తన పంతం నెరవేర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు.. న్యాయవ్యవస్థను సవాల్ చేసేలా ఉన్నాయన్న విమర్శలకు గురవుతోంది.ఇదికూడా చదవండి.. 11నెలలు..55 అక్షింతలు!  […]

  2. […] రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయగా, సుప్రీం కూడా హైకోర్టు తీర్పునే ఖరారు చేసింది. ఇక తెలుగు మీడియం, పంచాయితీలకు వైసీపీ రంగుల విషయంలో కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా.. దానికి మరికొన్ని సవరణలు చేసి ఇచ్చిన  ఉత్తర్వుపై కోర్టు కన్నెర్ర చేసింది. రంగుల విషయంలో సుప్రీంలో కూడా చుక్కెదురయింది. ఇలా ఒకటి కాదు.. సుమారు 60 సందర్భాల్లో కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా, జగన్ సర్కారులో మార్పు రాకపోవడం సహజంగానే అన్ని వర్గాల్లోనూ ఆయన తీరు చర్చనీయాంశమయింది. ఈవిధంగా ఒక్క ఏడాదిలో 60 సందర్భాల్లో అక్షింతలు వేయించుకున్న దాఖలాలు ఏ రాష్ట్రంలోనూ కనిపించవు. ఇది కూడా చదవండి.. 11నెలలు..55 అక్షింతలు! […]

  3. […] కానీ, చర్చల పేరిట రచ్చ చేసే చానెళ్లలో ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో కోర్టు తీర్పులపై చర్చించాలన్నా, కథనాలు రాయాలన్న మీడియా భయపడేది. తీర్పు వరకూ పరిమితమయ్యేది. ఎడిటర్లు కూడా కోర్టుకు వ్యతిరేకంగా కథనాలు రాస్తే, దాన్ని చెత్తబుట్టలో విసిరేసేవారు. కోర్టుంటే భయం-గౌరవమే దానికి కారణం! ఇప్పుడు ఎవరి పార్టీ మీడియా వారికి ఉన్నందున, చానెళ్లలో తీర్పులపై చర్చలు జరిపే ధైర్యం చేస్తున్నాయి. ఆ ప్రకారం,  ఒక చానెల్‌లో జరిగిన చర్చలో పాల్గొన్న ఓ వైసీపేయుడు.. సోషల్‌మీడియాలో పోస్టింగులు పెట్టిన తమ పార్టీ వారంతా నిరక్షరాస్యులు కాబట్టి, వారి అజ్ఞానాన్ని పెద్ద మనసుతో క్షమించి విడిచిపెట్టాలని కోరతామని సెలవివ్వడం విభ్రమ కలిగించింది. కోర్టులను తిట్టిపోసిన సదరు సోషల్‌మీడియా విప్లవకారులు, చదువుకోని చిరంజీవులు కాబట్టి.. వారు చెప్పే క్షమాపణలు మహదానందంతో అందుకుని, వారిని విడిచిపెట్టమన్నది ఆయన గారి వాదన. తెల్లవాడు దేశం విడిచిపోతూ మనకు విడిచిపెట్టిన ‘సారీ’ అనే పదం, ఇలాంటివాటికీ ఉపయోగించుకోవచ్చని సదరు వైసీపేయుడు నిరూపించాడు. ఇది కూడా చదవండి.. 11నెలలు..55 అక్షింతలు! […]

  4. Thanks for sharing superb informations. Your site is so cool. I’m impressed by the details that you have on this blog. It reveals how nicely you perceive this subject. Bookmarked this web page, will come back for more articles. You, my pal, ROCK! I found just the info I already searched all over the place and simply could not come across. What an ideal web-site.