నిమ్మగడ్డ లేఖపై విచారణకు విజయసాయి డిమాండ్
డీజీపీ సవాంగ్‌కు విజయసాయి లేఖ
అది నేనే రాశానన్న నిమ్మగడ్డ రమేష్
గతంలోనే ధృవీకరించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
నిమ్మగడ్డ లేఖతో ఇరకాటంలో వైసీపీ
కిషన్‌రెడ్డిని కూడా అనుమానించడంపై కమలం కన్నెర్ర
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి. ప్రెస్‌మీట్‌లో ఏదైనా ఒక విషయం వెల్లడించారంటే, దానికి వెనుక అధికారులిచ్చే సమాచారం, వివరణ కచ్చితంగా ఉంటుంది. కానీ, అలాంటి కేంద్రమంత్రి ధృవీకరణపై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ, వైసీపీ ఎంపీ డీజీపీకి ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమయింది. పైగా, సదరు కేంద్రమంత్రి నిర్ధారించిన అంశానికి సంబంధించిన లేఖ, తానే రాశానని ఓ మాజీ అధికారి తాజాగా వెల్లడించిన వైనంతో.. వైసీపీ ఇరకాటంలో పడిన వైనం ఆసక్తికరంగా మారింది.

తన ప్రాణాలకు భద్రత లేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు సంతృప్తికరంగా లేకపోవడం, కరోనా వైరస్ తీవ్రంగా ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశానని, ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నాడు కేంద్ర హోం శాఖకు ఓ లేఖ రాశారు. తన ప్రాణాలకు ప్రమాదం ఉన్నందున, తాను హైదరాబాద్ నుంచే విధులు నిర్వహించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కూడా ఆయన అభ్యర్ధించారు. దానితో కేంద్ర హోం శాఖ స్పందించి, విజయవాడలోని ఆయన కార్యాలయానికి సీఆర్‌పీఫ్ భద్రత పెంచింది. అయితే, నిమ్మగడ్డ పదవీ విరమణ వయసు తగ్గిస్తూ, జగన్ సర్కారు ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ అంశం ఇప్పుడు హైకోర్టులో విచారణ దశలో ఉంది. కాగా.. నాడు నిమ్మగ డ్డ కేంద్రహోం శాఖకు రాసిన లేఖలో.. ఆయన పెట్టిన సంతకాల్లో తేడా ఉన్నందున, దానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయసాయిరెడ్డి తాజాగా, డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. అందులో టీడీపీ ఎంపీ కనకమేడల రవీందర్, టీడీ జనార్దన్‌రావు, వర్ల రామయ్య కుట్ర ఉందని ఆరోపించారు. ఆ లేఖను ఫోరెన్సిక్‌కు పంపించి, ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అవును.. నేనే రాశా.. అయితే ఏంటట?

కాగా, కొన్ని గంటల తేడాలోనే దానిపై స్పందించిన మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్.. ఆ లేఖ తాను రాసిందేనని, ఆ విషయాన్ని కేంద్రహోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి కూడా ధృవీకరించారని మీడియాకు విడుదల చేసిన లేఖలో స్పష్టం చేశారు. తన అధికార పరిమితులకు లోబడి ఆ లేఖ రాసినందున, అందులో మూడో వ్యక్తికి ఏం సంబంధమని రమేష్ ప్రశ్నించారు. నిజానికి, ఈ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కూడా మీడియా ముందు ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. నిమ్మగడ్డ రమేష్ ఆ లేఖ రాసినట్లు హోంశాఖ సెక్రటరీ తనకు చెప్పారని, ఒక ఐఏఎస్ అధికారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని కూడా, మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే.

అయితే, నిమ్మగడ్డను తప్పించిన కేసు హైకోర్టులో విచారణ దశలో ఉన్న నేపథ్యంలో.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆ లేఖలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ సంతకంపై అనుమానం వ్యక్తం చేస్తూ, డీజీపీకి లేఖ రాయడం, కొన్ని గంటల తేడాలోనే.. ఆ లేఖ తానే రాశానని నిమ్మగ డ్డ వెల్లడించడంతో, వైసీపీ ఇరుకునపడినట్టయింది. నిజానికి, ఈ లేఖ లీకయిన తర్వాత వైసీపీ నేతలు కూడా.. ఆ లేఖ రమేష్ రాయలేదని, కావాలనే టీడీపీ నేతలు సృష్టించారని దుయ్యబట్టారు.

కమలదళం కన్నెర్ర..

అయితే ఇప్పుడు ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీకి రాసిన లేఖ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని అనుమానించేలా ఉందన్న చర్చ తెరపైకి రావడం ఆసక్తికలిగిస్తోంది. ఆ లేఖను రమేష్ రాశారని స్వయంగా కిషన్‌రెడ్డి చెప్పినప్పటికీ, విజయసాయిరెడ్డి మళ్లీ డీజీపీకి ఆ లేఖపై విచారణకు డిమాండ్ చేయడమంటే.. తమ పార్టీకి చెందిన మంత్రిని అవమానించడం, అనుమానించడమేనని బీజేపీ విరుచుకుపడుతోంది. ‘ఆ లేఖ నిమ్మగడ్డ రాశారని కేంద్రమంత్రి కి షన్‌రెడ్డి గారు మీడియాకు స్పష్టం చేశారు. అయినా మళ్లీ విజయసాయిరెడ్డి దానిపై డీజీపీకి లేఖ రాశారంటే, వైసీపీ నేతలు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గారిని కూడా అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారని అర్ధమవుతోంది.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారంలో మా పార్టీ మొదటి నుంచీ ఒకే వైఖరికి కట్టుబడి ఉంది. దీనిపై మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, గవర్నర్‌కు ఎన్నోసార్లు లేఖలు కూడా రాశార’ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విల్సన్ స్పష్టం చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని అవమానించి, అనుమానించినందుకు విజయసాయిరెడ్డి, క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner