ఎమ్మెల్యే మధు ఏమైనా..కనగరాజా ఏంటి?

172

అందుకే పాపం వెనక్కి పంపించేశారు
(మార్తి సుబ్రహ్మణ్యం)

మినహాయింపులలో అనేక రకాలుంటాయి. అవి అధికార పార్టీకి ఒకరకంగా, ప్రతిపక్షాలకు మరోరకంగా కనిపిస్తుంటాయి. అయితే, అధికారపార్టీ నాయకులకు కూడా.. ప్రభుత్వంలో పైస్థాయివారికి దగ్గరగా ఉండేవారికి మాత్రమే,  మరికొన్ని ప్రత్యేక మినహాయింపులుంటాయి. అధికార పార్టీ కదా అని, ఏదంటే అది చేస్తామంటే కుదరదు. అందుకే తెలివైన పోలీసులు.. సదరు అధికార పార్టీ నేతల స్థాయి ఏమిటో తెలుసుకున్న తర్వాతనే, వారికి ఇవ్వాల్సిన విలువను నిర్ణయిస్తుంటారు. ఈ సూక్ష్మం తెలుసుకోలేక, పాపం చాలామంది అధికారపార్టీ నాయకులు.. ముందు అనవసరంగా ఆవేశపడి, ఆనక నాలిక్కరుచుకుంటారు.

మొన్నీ మధ్య నెల్లూరు జిల్లాలో, వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బియ్యం పంపిణీ చేసే వ్యవహారాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దానికి నిరసనగా ఆయన ధర్నా నిర్వహించారు. రెడ్డిగారు, అధికారుల తత్వం తెలుసుకోలేకపోవడమే దీనికి కారణం. నిజానికి చాలామంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంకా బియ్యం, మాస్కులు  సామూహిక పంపిణీ చేస్తూనే ఉన్నారు. కానీ వారిపై ఎక్కడా పోలీసులు కేసులు నమోదు చేయలేదు. మరి నల్లపురెడ్డి ఒక్కరిపైనే, ఎందుకు కేసులు పెట్టారన్నది తత్వానికి సంబంధించిన అంశం. ఇది కూడా చదవండి.. ‘  సచివులు..సార్లకు ఓ రూలు! సామాన్యులకు.. ఓ రూలా సారూ?

తాజాగా చిత్తూరు జిల్లా సరిహద్దుల వద్ద, ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్.. బెంగళూరు నుంచి 36 మంది అనుచరులను ఆంధ్రా సరిహద్దుల్లోకి తీసుకువచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే వారిని మదనపల్లె  పోలీసులు చెక్‌పోస్టు వద్ద నిలిపివేయడతంతో ఎమ్మెల్యేగారికి ఎక్కడో కాలింది. ‘వైసీపీ ఎమ్మెల్యేను నన్నే అడ్డుకుంటారా? మీ సంగతి చూస్తా’నని కారాలు, మిరియాలు నూరారు. అయినా సరే, మేమేమీ చేయలేమని పోలీసులు చెప్పేశారు. ఎమ్మెల్యే గారు డీఎస్పీకి ఫోన్ చేసి, తన హోదా గుర్తు చేశారు. స్వయంగా డీఎస్పీనే వచ్చి… లాక్
డౌన్ నిబంధనలు ప్రభుత్వమే పెట్టింది కాబట్టి, దానిని పాటించాలని లౌక్యంగా చెప్పడంతో.. చేసేది లేక ఎమ్మెల్యే గారు, తన అనుచరులను వెనక్కి తీసుకుని వెళ్లవలసి వచ్చింది.

పాపం సదరు ఎమ్మెల్యే గారు, ఈ విషయంలో తనను తాను ఎన్నికల కమిషనర్ కనగరాజ్‌నో, విజయసాయిరెడ్డినో, మంత్రి ఆదిమూలం సురేష్‌తోనో పోల్చుకుని ఉంటారు. ప్రభుత్వంలో నెంబర్‌టూ విజయసాయిరెడ్డి అంటే జిల్లాలే దాటి వస్తూ, పోతున్నారు. అది వేరే విషయం. కానీ, కనగరాజ్, మంత్రి సురేష్ ఏకంగా రాష్ట్ర సరిహద్దులనే దాటి వచ్చారు. వారిని అనుమతించిన పోలీసులు, తనను మాత్రం ఎందుకు అనుమతించరన్న ధైర్యంతో, ఎమ్మెల్యే మధు యాదవ్ బహుశా ఈ సాహసయాత్రకు బయలుదేరి ఉండవచ్చు. ఇది కూడా చదవండి.. రైతులకు నోటీసులు సరే.. ఆ ఉల్లం‘ఘనుల’ మాటేమిటి?    కానీ వాళ్ల ముగ్గురూ అధికారకేంద్రానికి గజాల దూరంలో ఉన్నందున,  ఎన్ని రాష్ట్రాల సరిహద్దులయినా దాటిరావచ్చు. కానీ,  ఎమ్మెల్యే గారు మాత్రం అధికార కేంద్రానికి, వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. అద్గదీ అసలు సంగతి! ఫర్వాలేదు. ఇప్పటికయినా అనుభవమయింది కాబట్టి, ఇకపై తత్వం సులభంగానే అర్ధమవుతుంది లెండి!! ఇది కూడా చదవండి..కనగరాజ్‌పై ఆరోపణలు అన్యాయం కదూ?!