మాటలు కలిసిన శుభవేళ… 

496

మోదీకి బాబు ఫోన్ యత్నం
తిరిగి బాబుకు మోదీ ఫోన్ 
సీబీఎన్ ఫౌండేషన్ సిఫార్సులపై చర్చ
రెడ్, ఆరంజ్, గ్రీన్‌జోన్ల సిఫార్సు సీబీఎన్ ఫౌండేషన్‌దే
          (మార్తి సుబ్రహ్మణ్యం)

ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు.. ప్రధాని మోదీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఫోన్ చేశారు. తెలుగుదేశంతో రాజకీయంగా విడాకులు తీసుకున్న చాలాకాలానికి, మోదీ నుంచి వచ్చిన పలకరింపు ఆ పార్టీ వారికి పులకరింతగానే  చెప్పాలి.  కరోనా కష్టకాలంలో సలహా ఇచ్చేందుకు.. ముందు చంద్రబాబునాయుడు ప్రధాని కార్యాలయానికి ఫోన్ ద్వారా ప్రయత్నించడం, తర్వాత ఆయన స్పందించి తిరిగి,  చంద్రబాబుకు మంగళవారం ఉదయం  ఫోన్ చేయడం జరిగిపోయింది. ఇదీ వారిద్దరి మధ్య, మాటలు కలసిన సందర్భం.

కరోనాపై తీసుకోవలసిన చర్యల గురించి ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ, దేశంలోని విపక్ష నేతలకు ఫోన్ చేసి సలహాలు తీసుకున్నారు. ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్, స్టాలిన్‌తో కూడా ఫోన్ చేసి మాట్లాడారు. అయితే, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాత్రం ఫోన్ చేయకపోవడం మాత్రం చర్చనీయాంశమయింది. స్టాలిన్‌తో కూడా మాట్లాడిన మోదీ, ఆయన కంటే సీనియర్ అయిన తమ నాయకుడితో మాట్లాడక పోవడమేమిటని  తమ్ముళ్లు  ఆవేదన చెందారు. కానీ, చంద్రబాబు-మోదీ మళ్లీ మాట్లాడుకోవడంతో ఇప్పుడు ఖుషీ అవుతున్నారట. అది వేరే విషయం.

ఇంతకూ ఏం జరిగిందంటే.. సీబీఎన్ ఫౌండే షన్ తరఫున గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్‌ను తనపేరిట చంద్రబాబు నాయుడు ఏర్పాటుచేశారు. కరోనా వైరస్ వ్యాప్తిపై అందులో అధ్యయనం చేస్తున్నారు. పరస్పర విజ్ఞానం, శాస్త్ర సాంకేతికత ద్వారా అధ్యయనం చేస్తున్నారు. వర్చ్యువల్ సమావేశాల ద్వారా నిపుణులు, సాంకేతిక వేత్తలు, శాస్త్రవేత్తలో చర్చిస్తున్నారు. వారు ఇచ్చిన సలహాలు, సూచనలను క్రోడీకరించి.. ఏప్రిల్ 10న చంద్రబాబు,  ప్రధానికి ఓ లేఖ రాశారు. అందులో.. కరోనా టెస్టులు పెంచడంతోపాటు, కరోనా రోగులను వేరు చేసి ప్రత్యేక చికిత్స చేయాలని సూచించారు. 14 రోజులు ఆ ప్రాంతంలో ఒక్క కేసు కూడా రాకపోతే, ఆ ఏరియాను లాక్‌డౌన్ నుంచి మినహాయించాలని కోరారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి.. వైరస్ తీవ్రతను బట్టి ఎక్కడిక్కడ, దేనికి దానికి కొన్ని నిబంధనలు పెట్టాలని సూచించారు. రెడ్‌జోన్‌లో విధిగా లాక్‌డౌన్ అమలుచేయాలని, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లో ఉండాల్సిన సడలింపులపై చంద్రబాబు ప్రధానికి రాసిన లేఖలో వివరించారు. అవన్నీ ప్రపంచంలోని ప్రముఖ శాస్త్రవేత్తలు, డాక్టర్లు సీబీఎన్ ఫౌండషన్‌కు ఇచ్చిన సూచనలే కావడం ప్రస్తావనార్హం.

 

ఏమిటీ సీబీఎన్ ఫౌండేషన్?

హటాత్తుగా వచ్చే ప్రకృతి వైపరీత్యాలు, ఆర్ధికరంగంలో వచ్చే ఆటుపోట్లు, విజ్ఞానపరంగా మానవులు ఎదుర్కొనే వివిధ సమస్యలపై చర్చించి, దానికి పరిష్కారమార్గం అన్వేషించేందుకు చంద్రబాబునాయుడు ఈ సీబీఎన్ ఫౌండేషన్ ఏర్పాటుచేశారు. అందుకోసం లబ్ధప్రతిష్ఠులైన కొందరు శాస్త్రవేత్త, ఆర్ధిక నిపుణులతో నిరంతరం చర్చించి, సలహాలు తీసుకుంటారు. వీరంతా జాతీయ, అంతర్జాతీయ విజ్ఞానసంస్థల్లో పనిచేస్తున్న వారే. కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో, ఆ సమస్యకు పరిష్కార మార్గం కోసం ఈ శాస్త్రవేత్తలతో చంద్రబాబునాయుడు, గత పదిహేనురోజుల నుంచి స్వయంగా వీడియోకాన్ఫరెన్సు ద్వారా మాట్లాడుతున్నారు. యుఎస్, యు.కె, సింగపూర్, అరేబియన్ దేశాలతోపాటు, దేశానికి చెందిన ప్రముఖ డాక్టర్లు, సైంటిస్టులతో చంద్రబాబు, ఆయన బృందం రెండురోజులకోసారి వీడియో కాన్ఫరెన్సు ద్వారా చర్చిస్తున్నారు. రెండురోజుల క్రితం 2వేల మంది అభిప్రాయాలు సేకరించారు. సాధారణంగా ప్రతిరోజు వందమంది నిపుణుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని,  వారు చేసిన సూచనలను నోట్ చేసుకుంటున్నారు. ఆఫీడ్‌బ్యాక్‌ను నోట్ చేసుకుంటున్న ఫౌండేషన్ నిర్వహకులు దానిని ఓ నివేదికగా రూపొందించి, చంద్రబాబుకు ఇస్తున్నారు.  వాటినే ఆయన ప్రధాని మోదీకి వివరించారు. సీబీఎన్ ఫౌండేషన్ ఈవిధంగా జరుపుతున్న శోధన, అభిప్రాయ సేకరణలో లాక్‌డౌన్‌కు సంబంధించి వచ్చిన.. రెడ్-ఆరంజ్-గ్రీన్ జోన్‌ల ప్రతిపాదనలే, చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి 10వ తేదీన లేఖ రూపంలో పంపించారు. ఫలితంగా ఇప్పుడు దానినే,  అమలుచేసేందుకు మోదీ సర్కారు సిద్ధమవుతోంది.

బాబు అలా ముందుకుపోతున్నారు…

అధికారం ఉన్నా, లేకపోయినా ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చునే అలవాటు లేని చంద్రబాబునాయుడు.. ఈ కరోనా సమయంలో, తన ఖాళీ సమయాన్ని ఈవిధంగా శాస్త్రవేత్తలు, డాక్టర్లతో పంచుకుని, ఆ ఫలితాలను  కేంద్రానికి నివేదించడం అభినందనీయమే. కాగా, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఠక్కర్, మరో మాజీ ఐఏఎస్ అధికారి సత్యనారాయణ సమన్వయం చేస్తున్న ఈ ఫౌండేషన్‌లో.. మాజీ ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు, డాక్టర్లు 20 మంది వరకూ పనిచేస్తున్నారు. నిజానికి ఇది ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులను అధ్యయం చేసి, వాటికి తగిన ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి, ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు  ఏర్పాటయిన ఫౌండేషన్‌గా చెబుతున్నారు. అయితే, కరోనా వంటి అంతర్జాతీయ విపత్తు వచ్చినందున, ప్రస్తుతం దానిని  తాత్కాలికంగా పక్కనపెట్టి.. ప్రపంచంలో అత్యుత్తమైన సీఐఎస్‌ఐఆర్, ఐఐసిటి మాజీ డైరక్టర్లు, సైంటిస్టులు, డాక్టర్లతో నేరుగా వీడియో కాన్ఫరెన్సుల ద్వారా.. కరోనా ప్రత్యామ్నాయ చర్యలపై సలహా తీసుకుంటున్నారు. వారిచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను కేంద్రానికి నివేదిస్తున్నారు.
కాగా కరోనా నేపథ్యంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు-సవాళ్లపై చర్చించేందుకు.. ఎల్లుండి అమెరికాకు చెందిన వ్యాపారవేత్తలతో సీబీఎన్ ఫౌండేషన్  వీడియోకాన్ఫరెన్సు నిర్వహించనుంది. దీనికి పెద్ద సంఖ్యలో అక్కడి వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు. అక్కడ ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక స్థితిగతులపై చర్చించనున్నారు.  వివిధ శాఖల్లో పనిచేసిన  మాజీ ఏఐఎస్ కె.వి సత్యనారాయణ.. ఈ కార్యక్రమాలను, శాస్త్రవేత్తలు, డాక్టర్లను  సమన్వయం చేస్తున్నారు. ఈరకంగా ఉద్యోగపరంగా రిటైరయినప్పటికీ, చాలామంది మాదిరిగా ఇంట్లో కూర్చోకుండా..  సామాజిక బాధ్యత నెరవేరుస్తూ, సమాజానికి  సేవలు అందిస్తున్న ఈ మాజీ అధికారులను అభినందించాల్సిందే.