కనగరాజ్‌పై ఆరోపణలు అన్యాయం కదూ?!

509

(మార్తి సుబ్రహ్మణ్యం)

కరోనా విపత్తు సమయంలో కూడా ఒక ఉన్నతి పదవి కోసం.. తన వయసును కూడా లెక్కచేయకుండా.. వైరస్ వృద్ధులపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందన్న హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా,  క్వారంటైన్ వంటి లంపటాలను అధిగమించి.. రాష్ట్ర సరిహద్దును కూడా దాటి వచ్చి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఓ వృద్ధుడిపై, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు దారుణం. బాధాకరం. వాటిని ఖండించాల్సిందే.

ఎందుకంటే… రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి పాపం ఆయన కోరుకున్నది కాదు. ప్రభువు సేవలో తరిస్తూ, ఢిల్లీలో ప్రాక్టీసు చేసుకుంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏరి కోరి, ఎక్కడో రాష్ట్రం అవతల ఉన్న మాజీ న్యాయమూర్తిని, ఏ ‘బాదరాయణ సంబంధం లేకుండానే’ ఆ పదవి ఇచ్చారు. అప్పటికీ సోషల్ మీడియాలో కొందరు దుర్మార్గులు ‘అరబిందో ఫార్మాలింకులు’ వార్తలు పోగేశారు. అయినా.. తనకు మేలు చేసిన వ్యక్తులకు ఎవరైనా కృతజ్ఞులయి ఉంటారు. అది మానవ నైజం. దానికి ఎవరూ అతీతులు కాదు. మరిలాంటప్పుడు.. జగనన్న కోరుకున్నట్లు, వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి, కనగరాజ్ ప్రయత్నించడంలో తప్పేమిటిన్నది బుద్ధిజీవుల ప్రశ్న!

అయినా అసలు కనగరాజ్‌ను ఏరి కోరి అన్ని వేల కిలోమీటర్ల నుంచి తెప్పించుకున్నదే, కాగల కార్యం నెరవేర్చడానికాయె! ఇది కూడా చదవండి.. సచివులు..సార్లకు ఓ రూలు! సామాన్యులకు.. ఓ రూలా సారూ? ’ ఈ చిన్న సూక్ష్మం కూడా  గ్రహించకుండా.. కరోనా సమయంలోనూ కొత్త కమిషనర్ కనగరాజ్, ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడటం దారుణమని, ప్రతిపక్షాలు ఆడిపోసుకోవడమే అసలైన దారుణం!  అందులో ఆయన తప్పేమిటి? బాధ్యతలు స్వీకరించిన తర్వాత, తాను వచ్చిన పని పూర్తి చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికలకు సిద్ధం కావాలని అధికారులను అప్రమత్తం చేశారు. మరి జగనన్న కోరుకున్నదీ అదే కదా?! దుర్మార్గుడైన నిమ్మగడ్డ రమేష్, తన కోరికను చెరిపేసి ఎన్నికలు వాయిదా వేసినందుకే కదా.. రాజ్యాంగం గురించి బాగా తెలిసిన కనగరాజ్‌ను ఆ పదవిలో నియమించింది? సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ 65 సంవత్సరాలయినప్పటికీ, ఎనిమిది పదుల కనగరాజ్‌ను ఏరికోరి మరీ నియమించుకుంది? అయినా.. నియమం ప్రకారం, కనగరాజ్ తన పని తాను ప్రారంభిస్తే..చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ, రామకృష్ణ లాంటి ప్రతిపక్షనేతలకు ఇబ్బంది ఏమిటన్నది వైసీపేయుల ప్రశ్న. ఇది కూడా చదవండి.. రైతులకు నోటీసులు సరే.. ఆ ఉల్లం‘ఘనుల’ మాటేమిటి? 

మేలోగా రాజకీయ లక్ష్యాలు పూర్తి చేసి, నిశ్చింతంగా ఉండాలన్న జగనన్న కలలను.. ముందు నిమ్మగడ్డ కల్లలు చేయగా, తర్వాత మోదీ రూపంలో కరోనా ధ్వంసం చేసింది. ఫలితంగా మే 3 వరకూ కనగరాజ్ ఖాళీగా కూర్చోవాలా ఏమిటి? ఆలోగా, ఎన్నికల వ్యవహారంపై దృష్టి సారిస్తే తప్పేమిటింట? అసలు అధికారులు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా? లేదా? అని తెలుసుకోవాలంటే, వారితో భేటీ వేయాలి కదా అన్నది వైసీపీ నేతల లాజిక్కు! లాక్‌డౌన్ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు కాబట్టి.. ఇప్పటిదాకా ఖాళీగా ఉన్న అధికారులకు బహుపరాక్ చెప్పాలన్నదే కనగరాజ్ గారి కవిహృదయం కావచ్చు. దాన్ని కూడా అర్ధంచేసుకోకుండా.. ఆక్షేపించి, రంధ్రాన్వేషణ చేస్తే ఎలా?

కనగరాజ్ వంటి నిష్పక్షపాత, నీతి, నిజాయితీ మూర్తీభవించిన మాజీ న్యాయమూర్తికి ఈవిధంగా పక్షపాతం ఆపాదిస్తే ఆ ఏసుప్రభువు శపిస్తారు! అప్పటికీ కనకరాజ్ వంటి దళితుడిని, ఒక ఉన్నతమైన పదవిలో కూర్చోబెడితే ప్రతిపక్షాలు చూడలేకపోతున్నారని, వైసీపీ దళిత నేతలు ఇప్పటికే కళ్లెర్ర కూడా చేశారు. తమిళనాడు నుంచి వచ్చిన కనగరాజ్‌ను క్వారంటైన్ ఎందుకు చేయలేదన్న, విపక్షాల మతిలేని విమర్శలకు సమాధాంగా.. ఆరకంగా ఎదురుదాడి మొదలుపెట్టారు.

ఏదేమైనా.. కనగరాజ్ ఎంతో కష్టపడి తమిళనాడు నుంచి వచ్చినా, కాగలకార్యం నెరవేర్చేందుకు కరోనా అడ్డం వచ్చింది!  ఈ కరోనా కల్లోల తీరం దాటిన వెనువెంటనే, ఎన్నికలు జరిపించి.. తనవంతు పాత్ర పోషిస్తారన్న నమ్మకం అందరికీ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు!

2 COMMENTS

  1. […] కానీ అదే ఉత్సాహం, అదే చిత్తశుద్ధి, అదే అంకితభావం, అదే నిర్మొహమాటం.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీవీఐపిల విషయంలో ఎందుకు చూపించరన్నది బుద్ధిజీవుల ప్రశ్న. ఇటీవలే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించడానికి మాజీ న్యాయమూర్తి కనగరాజ్ తమిళనాడు నుంచి విజయవాడకు వచ్చారు. ఆయన అంబులెన్స్‌లో విజయవాడకు వచ్చారని, చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సరే.. ఆయన ఆకాశమార్గం ద్వారా వచ్చినా, జలమార్గం ద్వారా వచ్చినా, భూమార్గం ద్వారా వచ్చినా.. విజయవాడ పోలీసులు ఇప్పుడు బయట అడ్డదిడ్డంగా లెక్కలేకుండా తిరుగుతున్న వారిని, లాక్‌డౌన్ నిబంధన ఉల్లంఘించినందుకు  కేసులు పెట్టి, వాహనాలు సీజ్ చేస్తున్నారు. మరి అదేమాదిరిగానే.. కనగరాజ్‌పై లాక్‌డౌన్ ఉల్లంఘన కింద కేసు పెట్టి, ఆయన ప్రయాణించిన వాహనాన్ని సీజ్ చేయాలి కదా? మరి అనంతపురం పోలీసులు చూపించిన ఉత్సాహాన్ని ముందు నెల్లూరు పోలీసులు, తర్వాత విజయవాడ పోలీసులయినా ఎందుకు చూపించలేదన్నది ప్రశ్న. ఇదికూడా చదవండి.. కనగరాజ్‌పై ఆరోపణలు అన్యాయం కదూ?! […]

  2. […] పాపం సదరు ఎమ్మెల్యే గారు, ఈ విషయంలో తనను తాను ఎన్నికల కమిషనర్ కనగరాజ్‌నో, విజయసాయిరెడ్డినో, మంత్రి ఆదిమూలం సురేష్‌తోనో పోల్చుకుని ఉంటారు. ప్రభుత్వంలో నెంబర్‌టూ విజయసాయిరెడ్డి అంటే జిల్లాలే దాటి వస్తూ, పోతున్నారు. అది వేరే విషయం. కానీ, కనగరాజ్, మంత్రి సురేష్ ఏకంగా రాష్ట్ర సరిహద్దులనే దాటి వచ్చారు. వారిని అనుమతించిన పోలీసులు, తనను మాత్రం ఎందుకు అనుమతించరన్న ధైర్యంతో, ఎమ్మెల్యే మధు యాదవ్ బహుశా ఈ సాహసయాత్రకు బయలుదేరి ఉండవచ్చు. ఇది కూడా చదవండి.. రైతులకు నోటీసులు సరే.. ఆ ఉల్లం‘ఘనుల’ మాటేమిటి?    కానీ వాళ్ల ముగ్గురూ అధికారకేంద్రానికి గజాల దూరంలో ఉన్నందున,  ఎన్ని రాష్ట్రాల సరిహద్దులయినా దాటిరావచ్చు. కానీ,  ఎమ్మెల్యే గారు మాత్రం అధికార కేంద్రానికి, వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. అద్గదీ అసలు సంగతి! ఫర్వాలేదు. ఇప్పటికయినా అనుభవమయింది కాబట్టి, ఇకపై తత్వం సులభంగానే అర్ధమవుతుంది లెండి!! ఇది కూడా చదవండి… కనగరాజ్‌పై ఆరోపణలు అన్యాయం కదూ?! […]