లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం

151

కొవిడ్-19ను కట్టడి చేసేందుకు మరికొన్ని వారాలు లాక్‌డౌన్ పొడిగించాలంటూ దేశ వ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు చేసిన డిమాండ్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రకటించారు.  దీంతో మరో 19 రోజుల పాటు దేశంలో లాక్‌డౌన్‌లోనే కొనసాగనుంది. ప్రధాని మోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ మేరకు ప్రకటించారు. ఇప్పటి వరకు దేశ ప్రజలు లాక్‌డౌన్ అమలు కోసం సహకరించినందుకు శిరసు వంచి నమస్కరిస్తున్నానంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘ కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. లాక్‌డౌన్ కష్టాలు తట్టుకుని ప్రతిఒక్కరూ దేశాన్ని కాపాడుకుంటున్నారు. దేశ ప్రజలు ఎన్నికష్టాలు ఎదుర్కొంటున్నారో నేను అర్థం చేసుకోగలను. దేశం కోసం ప్రజలు సైనికుల్లా పనిచేస్తున్నారు. కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. కరోనాపై భారత్ బలంగా పోరాడుతోంది. ఎన్నో కష్టాలు పడి భారత్‌ను రక్షించారు. కరోనాపై పోరాటంలో దేశం మొత్తం ఒక్కతాటిపై ఉంది. అందుకు దేశ ప్రజలకు ధన్యవాదాలు…’’ అని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు.దేశంలోకి ఒక్క కరోనా కేసు రాక ముందే దేశంలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేశామనీ..  కరోనా మహమ్మారిగా మారక ముందే చర్యలు చేపట్టామని ప్రధాని గుర్తుచేశారు.  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళ అర్పించిన ఆయన… భారత ప్రజలంతా సామూహిక బలాన్ని ప్రదర్శించడమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు. ‘‘కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇతర దేశాలతో పోల్చితే మన దేశం కరోనా కట్టడిలో ముందుంది. 21 రోజుల లాక్‌డౌన్‌ను దేశం సమర్థంగా అమలు చేసింది. ఇతర దేశాల్లో మన కంటే 20, 30 శాతం ఎక్కువ కేసులు ఉన్నాయి…’’ అని ప్రధాని పేర్కొన్నారు.