ఆర్‌బీఐవన్నీ.. ఉత్తి ‘కోత’లే!

605

గవర్నర్ చెప్పినా ఆగని ఈఎంఐ కోతలు
జీతాల నుంచి కోసివేస్తున్న బ్యాంకులు
వేతనజీవుల వెతలు
(మార్తి సుబ్రహ్మణ్యం)

కరోనా నేపథ్యంలో మరో మూడునెలల పాటు.. బ్యాంకుల నుంచి తీసుకున్న  రుణ వాయిదాలు, చెల్లించనక్కర్లేదన్న రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలను బ్యాంకులు వెక్కిరిస్తున్నాయి. బ్యాంకుల ద్వారా వేతనాలు తీసుకునే ఉద్యోగుల ఖాతాల నుంచి,   వాయిదాలు యధావిధిగానే  మినహాయించుకుంటున్నాయి. ఓ వైపు మూడు నెలల పాటు మారిటోరియం విధిస్తున్నట్లు ఆర్‌బీఐ ఆదేశించినా, బ్యాంకులు మాత్రం యధావిధిగా కిస్తీలు మినహాయించుకోవడంతో, వేతన జీవులు ఖంగుతింటున్నారు.

కరోనా సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇళ్లలోనే ఉంటున్నారు.  అందువల్ల, బ్యాంకుల ద్వారా వారు అంతకుముందు తీసుకున్న వివిధ రకాల రుణాలను, మూడునెలల పాటు చెల్లించనవసరం లేకుండా మారిటోరియం విధిస్తున్నట్లు, ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. అయితే, ఈనెల వేతనాలు అందుకున్న ఉద్యోగులు తమ బ్యాంక్ బ్యాలెన్సు చూసి హతాశులయ్యారు. అందులో.. ప్రతినెల మాదిరిగానే, ఈ నెలలో కూడా తమ ఈఐఎం కోత విధించినట్లు కనిపించింది. ఆరకంగా ప్రభుత్వం చెల్లించిన సగం జీతంలో.. కొంత శాతం ఈఎంఐకు పోగా, మిగిలిన డబ్బుతో ఈ కష్టకాలంలో ఎలా బతకాలని వేతన జీవులు దిగాలు పడుతున్నారు. ప్రైవేటు ఉద్యోగులది మరో గోస.

దీనిపై కోతలకు గురైన వేతనజీవులు,  బ్యాంకు అధికారులను ఫోన్‌లో సంప్రదించారు. ‘మీకు ఈఎంఐ కట్ కాకుండా ఉండాలంటే, బ్యాంకుకు వచ్చి ఒక ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది.  లేకపోతే ఆన్‌లైన్‌లో ఉన్న ఫారం పూర్తి చేయండ’న్న సమాధానం వస్తోంది. మరికొన్ని బ్యాంకులు మాత్రం, మేనేజర్లకు సెల్‌ఫోన్ నుంచి, తమ ఈఎంఐ కట్ చేయవద్దని ఎస్సెమ్మెస్ ఇస్తే చాలని చెప్పాయి. దానితో పాపం  వేలాదిమంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు నింపారు. అయినా సరే జీతంలో కోతలు తప్పడం లేదు. కోతలకు గురైన వారంతా, అవిశ్రాంతంగా కస్టమర్ కేర్ నెంబర్లకు ఫోన్లు చేస్తున్నా.. దానికి సమాధానం చెప్పే దిక్కు లేదు. ఇక లాక్‌డౌన్ కారణంగా బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించిన ప్రభుత్వం.. బ్యాంకులకు వెళ్లి, ఫారం ఎలా ఇవ్వాలని ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ, ఇళ్లలో కూర్చుంటున్నారు.

ప్రైవేటు ఉద్యోగులు, చిన్న చితకా వ్యాపారాలు చేసుకునే వారికి ఈ కోతల వ్యవహారం, శరాఘాతంగా పరిణమించింది. మూడునెలల పాటు ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేకపోయినా, తర్వాత నాలుగవ నెల నుంచి తప్పనిసరిగా కట్టవలసి ఉంటుంది. లేకపోతే వడ్డీ కూడా చెల్లించక తప్పదని వేతనజీవులకు తెలుసు. కానీ, ఈ క్లిష్ట పరిస్థితిలో ఈఎంఐ మిగులు, రోజువారీ ఖర్చులకు పనికివస్తుందన్న వారి ఆశలు ఆవిరయిపోయాయి. ఆరకంగా ఆర్‌బీఐవన్నీ ఉత్తి కోతలేనని తేలిపోయింది.