రైతులకు నోటీసులు సరే.. ఆ ఉల్లం‘ఘనుల’ మాటేమిటి?

595

క్వారంటైన్‌కు వెళ్లకుండానే కనగరాజ్ గవర్నర్‌ను కలుస్తారా?
అసలు కనగరాజ్‌ను గవర్నర్ ఎలా అనుమతించారు?
అమరావతిలో అంతా ‘అతి’ చిత్రాలే
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఎవరి ఇళ్లలో వారు ఉంటూ, మూతులకు మాస్కులు కట్టుకుని జై అమరావతి నినాదాలు చేసిన రైతులకు పోలీసులు నోటీసులిచ్చారు. దీనితో, అమరావతిలో ‘అతి’ రాజ్యమేలుతోందన్న విషయం మరోసారి స్పష్టమయింది. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ నిబంధన అమలులో ఉన్నందున.. ఆవిధంగా నినాదాలు చేయడం నేరమని పేర్కొంటూ, తుళ్లూరు పోలీసులు రైతులకు నోటీసులు జారీ చేశారు. అయితే, తమ మానసిక ఆవేదన ప్రభుత్వానికి తెలియచేసేందుకే.. నిబంధనల ప్రకారం మాస్కులు కట్టుకుని, సామాజికదూరం పాటిస్తూనే తమ ఇళ్లలో ఉండి నిరసన ప్రకటిస్తున్నామని రైతులు, ఆ నోటీసుకు సమాధానం ఇచ్చారు. కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నంతవరకూ, తాము నిరసన కార్యక్రమాలు వాయిదా వేసుకుంటున్నామని ప్రకటించారు. అసలు కరోనా కల్లోల సమయంలో కూడా,  రైతులు ఆందోళన కొనసాగించడం ఒక ‘అతి’ అయితే.. ఇంకేమీ పనులే లేనట్లు, పోలీసులు వారికి నోటీసులివ్వడం మరో ‘అతి చర్య’గా కనిపిస్తుంది.  ఇది కూడా చదవండి..’ అబ్బే.. ఇదేం అమరావ ‘అతి’?

అమరావతి రైతులు సామాజిక దూరం పాటిస్తున్నారా? లేదా? లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అన్న విషయంపై ‘అతి’శ్రద్ధ చూపిస్తున్న పోలీసులు… సీఎం నివాసానికి, ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వస్తున్న ప్రముఖులు, ప్రజాప్రతినిధులను అదే నిబంధనల ప్రకారం అడ్డగించి, వారికి నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదన్నది ప్రశ్న. తమిళనాడు నుంచి నాలుగురోజుల క్రితమే వచ్చి, ఎన్నికల సంఘం కమిషనర్‌గా పదవీ బాధ్యత స్వీకరించిన కనగరాజ్‌కు.. ఇంకా  ఎందుకు నోటీసులివ్వలేదన్న ప్రశ్నకు ఇప్పటివరకూ జవాబు లేదు. ఆయన కూడా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి, రాష్ట్ర సరిహద్దు దాటి వచ్చారు. నిజానికి విజయవాడ కమిషనరేట్ పరిథిలో, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై ప్రతిరోజూ కేసులు నమోదు చేస్తున్నారు.

ఆయన విజయవాడకు వచ్చి పదవీప్రమాణం చేసిన తర్వాత.. విశాఖ నుంచి ఎంపి విజయసాయిరెడ్డి కూడా వచ్చి కనగరాజ్‌ను అభినందించారు. మంత్రి ఆదిమూలం సురేష్ హైదరాబాద్ వెళ్లి, వచ్చినప్పుడు ఆయనకు నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు. మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న సందర్భాలలో, సామాజికదూరం పాటించడం లేదని అనేక వీడియోలు స్పష్టం చేస్తున్నాయి. మరి అమరావతి రైతులకు ఇచ్చినట్లే, పోలీసులు వారికీ నోటీసులు జారీ చేసి ఉంటే.. వారి చిత్తశుద్ధి-అంకితభావం, వృత్తిపట్ల నిబద్ధత రుజవయి ఉండేది. అయితే, ఇలాంటి ప్రముఖులకు స్వయంగా పోలీసు ఉన్నతాధికారులే సరిహద్దుల వరకూ ఎస్కార్టుగా వెళుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజం నారాయణుడికెరుక?!

మరి కనగరాజ్ ఎలా వచ్చారు?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన కనగరాజ్, తమిళ నాడు నుంచి విజయవాడకు ఎలా వచ్చారన్న చర్చ తీవ్రస్థాయిలో జరుగుతోంది. చెన్నైలో ఉన్న కనగరాజ్ విజయవాడకు రావాలంటే, రాష్ట్ర సరిహద్దులో ఉన్న తడ చెక్‌పోస్టును దాటి రావలసి ఉంటుంది. అక్కడ కమర్షియల్‌టాక్స్, ఆర్టీఏ శాశ్వత చెక్‌పోస్టులుంటాయి. ఆ తర్వాత బోలెడన్ని టోల్‌గేట్లు కూడా ఉన్నాయి. వాటిని దాటి, ప్రకాశం జిల్లా సరిహద్దుకు రావలసి ఉంది. అక్కడ కూడా చాలా చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. వాటిని దాటి గుంటూరు జిల్లా మీదుగా, విజయవాడకు రావలసి ఉంటుంది. అయితే, ఇక్కడ గమనించవలసి విషయం ఏమిటంటే.. ప్రతి చెక్‌పోస్టు వద్ద రాకపోకలకు సంబంధించి అన్నీ రికార్డు చేస్తుంటారు. ఆ ప్రకారంగా, కనగరాజ్ రాకకు సంబంధించిన అంశాలన్నీ రికార్డు అయి తీరాలి. లేకపోతే వారు నిబంధనలు ఉల్లంఘించినట్లే లెక్క. ఒకవేళ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఉంటే, అది కూడా నమోదు చేసి తీరాలి.  మరి ప్రభుత్వం ఆయన కు ఎప్పుడు అనుమతి ఇచ్చింది? ఆమేరకు ఆయన విజయవాడకు ఎప్పుడు వచ్చారన్నది తేలాల్చి ఉంది. దీనిపై, సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా సమాధానం ఇచ్చి తీరాల్సి ఉంటుంది.

కనగరాజ్‌ను గవర్నర్ ఎలా అనుమతించారు?

ఇదంతా ఒక ఎత్తయితే, తమిళనాడు నుంచి విజయవాడకు వచ్చిన వయోవృద్ధుడైన కనగరాజ్.. లాక్‌డౌన్ నిబంధన ప్రకారం 14 రోజులు క్వారంటైన్‌లో కచ్చితంగా ఉండి తీరాలి. ఆ ప్రకారంగా ఆయన ఈ నెల 25 వరకూ క్వారంటైన్ నుంచి బయటకు రావాలి. కానీ అలాంటిదేమీ లేకుండానే, ఏకంగా ప్రమాణస్వీకారం చేసి, గవర్నర్‌ను కలవడం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే గవర్నర్ కూడా వృద్ధుడే కాబట్టి! కరోనా వైరస్ చిన్నపిల్లలు, వృద్ధులపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని వైద్యులు, ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అందుకే క్వారంటైన్‌కు వెళ్లకుండా వచ్చిన కనగరాజ్, మరో వృద్ధుడైన గవర్నర్‌ను కలవడం కలకలం రేపుతోంది. క్వారంటైన్‌కు వెళ్లకుండా, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన కనగరాజ్‌పై కేసు పెట్టాల్సిన పోలీసులు, ఆయన వెంట ఉండటం  ఆందోళన కలిగించే మరో అంశం.

3 COMMENTS

  1. […] అయినా అసలు కనగరాజ్‌ను ఏరి కోరి అన్ని వేల కిలోమీటర్ల నుంచి తెప్పించుకున్నదే, కాగల కార్యం నెరవేర్చడానికాయె! ఇది కూడా చదవండి.. ‘ సచివులు..సార్లకు ఓ రూలు! సామాన్యులకు.. ఓ రూలా సారూ? ’ ఈ చిన్న సూక్ష్మం కూడా  గ్రహించకుండా.. కరోనా సమయంలోనూ కొత్త కమిషనర్ కనగరాజ్, ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడటం దారుణమని, ప్రతిపక్షాలు ఆడిపోసుకోవడమే అసలైన దారుణం!  అందులో ఆయన తప్పేమిటి? బాధ్యతలు స్వీకరించిన తర్వాత, తాను వచ్చిన పని పూర్తి చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికలకు సిద్ధం కావాలని అధికారులను అప్రమత్తం చేశారు. మరి జగనన్న కోరుకున్నదీ అదే కదా?! దుర్మార్గుడైన నిమ్మగడ్డ రమేష్, తన కోరికను చెరిపేసి ఎన్నికలు వాయిదా వేసినందుకే కదా.. రాజ్యాంగం గురించి బాగా తెలిసిన కనగరాజ్‌ను ఆ పదవిలో నియమించింది? సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ 65 సంవత్సరాలయినప్పటికీ, ఎనిమిది పదుల కనగరాజ్‌ను ఏరికోరి మరీ నియమించుకుంది? అయినా.. నియమం ప్రకారం, కనగరాజ్ తన పని తాను ప్రారంభిస్తే..చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ, రామకృష్ణ లాంటి ప్రతిపక్షనేతలకు ఇబ్బంది ఏమిటన్నది వైసీపేయుల ప్రశ్న. ఇది కూడా చదవండి.. రైతులకు నోటీసులు సరే.. ఆ ఉల్లం‘ఘనుల’ మ…  […]

  2. […] సరే.. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ తమిళనాడు వెళ్లినట్లు చెబుతున్నారు. అంటే ఆయన మళ్లీ ఇక్కడకు రావలసిందే. మరి రావాలంటే ఎలా? కనీసం ఈసారి వచ్చినప్పుడైనా ఆయనను క్వారంటైన్‌లో ఉంచుతారా? అనంతపురం పోలీసులు విష్ణువర్దన్‌రెడ్డి విషయంలో చూపిన ఉత్సాహం నెల్లూరు పోలీసులు చూపిస్తారా? అన్నది ప్రశ్న. ఎందుకంటే కనగరాజ్ నెల్లూరు సరిహద్దుల మీదుగానే విజయవాడకు రావాలి కాబట్టి! ఇది కూడా చదవండి.. రైతులకు నోటీసులు సరే.. ఆ ఉల్లం‘ఘనుల’ మ… […]