కరోనా కష్ట కాలంలో కక్షా రాజకీయాలా?

424

– ఏపీ బీజేపీ నేత సాయి కృష్ణ

ప్రపంచం మొత్తం కరోనా కబంధ హస్తాలలో విలవిలలాడుతూ నలిగిపోతుంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, పాలక వైసీపీ కక్ష రాజకీయాలకు పాల్పడుతోందని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కోట శాయి కృష్ణ ఆరోపించారు.
సోమవారం విజయవాడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశం లో శాయి కృష్ణ మాట్లాడుతూ..
దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేయడం ద్వారా ఒక సాహసోపేత నిర్ణయం తీసుకొని ప్రజలను ప్రాణాలను కాపాడారు. ప్రపంచం మొత్తం ఈ సాహసోపేత నిర్ణయాన్ని కీర్తించిన విషయం గమనార్హం.

ప్రజల ప్రాణాలు మరియు ఆర్ధిక లాభాలు రెండింటి మధ్య ప్రాధాన్యం ఎంచుకోవలసిన సమయంలో ప్రధాని ప్రజల ప్రాణాలకే అత్యధిక ప్రాముఖ్యత మరియు ప్రాధాన్యం ఇచ్చారు అని ఆయన అన్నారు. దీనికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ లో పాలక వైసీపీ ప్రజారోగ్య భద్రతను గాలికొదిలి రాజకీయ అంశాలు, కక్ష రాజకీయాలకు ప్రథమ ప్రాధాన్యాన్ని ఇవ్వటం దురదృష్టకరం.

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకునే స్థానిక ఎన్నికలు వాయిదా వేయడం ద్వారా రమేష్ కుమార్ ప్రజల ప్రాణాలను కాపాడారు. దీనిని కూడా రాజకీయం చేసి, ఎన్నికల కమీషనర్ కు కులాన్ని ఆపాదించి, తన పదవికి ఉన్న హుందాతనాన్ని దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడంపై బీజేపీ గతంలోనే అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం విదితమే. ఎన్నికల వాయిదాను జీర్ణించుకోలేని అధికార పక్షం వ్యక్తిగత ప్రతీకార చర్యలకు తెరలేపి .. రాజ్యాంగానికి విరుద్దంగా తొలగించారు.

ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ ను పదవినుంచి తొలగించిన విధానాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. నూతనంగా నియమించబడిన అధికారి నియామక ప్రకటన వెలువడిన అరగంటలో ఎలా ప్రమాణ స్వీకారం చేశారు? రాష్ట్ర సరిహద్దులు ఎలా దాటి రాగలిగారు? ఒక రిటైర్డ్ న్యాయమూర్తి అయి ఉండి.. పరీక్షలు లేకుండా ఎలా ప్రమాణ స్వీకారం చేశారు? రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రం ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘిస్తే కంచే చేను మేసినట్లు కాదా?

ఎపిలో కరోనా కేసులు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతుంది. కరోనా కేసులలో కేంద్రం లెక్కలకు, రాష్ట్రం లెక్కలకు పొంతన ఉండటం లేదు. కేంద్రానికి ఒక లెఖ్ఖ, పత్రికలకు విడుదల చేస్తున్న బులెటిన్ లలో ఒక లెఖ్ఖ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ, క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవ తీవ్రతను తక్కువ చేసి చూపించి లాక్ డౌన్ ఎత్తివేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగించాలని కోరితే.. మన సిఎం మాత్రం జోన్ లవారీగా విభజిస్తాం, పరిమిత లాక్ డౌన్ అమలు చేస్తాం అంటూ ప్రజారోగ్యం తో చెలగాటం ఆడుతున్నారు. కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ప్రజలకు వాస్తవ సంఖ్యలు తెలియజేయాల్సిన బాధ్యత, తద్వారా ప్రజలలో కరోనా వ్యాప్తి తీవ్రత, తీసుకోవలసిన చర్యల పట్ల అవగాహన కలిగించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని ఆయన ప్రశ్నించారు.

ఎటువంటి సడలింపు లేకుండా మన రాష్ట్రంలో కూడా ఏప్రిల్ 30వరకు కఠిన లాక్ డౌన్ అమలు చేయాలని, ప్రజారోగ్య పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, రాజకీయ కక్షతో తీసుకునే నిర్ణయాలను విడనాడాలని, కేంద్రం ఎప్పటికప్పుడు ఇస్తున్న మార్గదర్శకాలను పాటించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నదని శాయి కృష్ణ అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం, బీజేపీ మైనార్టీ మార్చా జాతీయ కార్యదర్శి షేక్ బాజి, రాష్ట్ర బీజేపీ మీడియా కన్వీనర్ వుల్లురి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.