కరోనాపై యుద్ధంలో తెలుగు రాష్ట్రాల మంత్రులు

708

ఢిల్లీ నుంచి సమీక్షిస్తున్న కేంద్రమంత్రులు నిర్మల, కిషన్‌రెడ్డి
తెలంగాణలో కేటీఆర్, ఈటల, హరీష్, తలసాని
రాజధానిలో తలసాని నిరంతర పర్యటనలు
ఏపీలో ఆళ్ల నాని, పెద్దిరెడ్డి, కన్నబాబు, మేకపాటి, వెల్లంపల్లి
సాయంలో ముందున్న రెండు రాష్ట్రాల ఎమ్మెల్యేలు
(మార్తి సుబ్రహ్మణ్యం)

కరోనా యుద్ధక్షేత్రంలో వైద్యులు ముందు వరసలో నిలబడగా.. పోలీసులు, జనం రోడ్డెక్కకుండా నిలువరిస్తూ వైరస్ విస్తరణ నివారణకు కృషి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల అవిశ్రాంతంగా పనిచేస్తున్న వైనం అందరి అభినందనలు అందుకుంటున్నారు.

అటు మంత్రులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా యుద్ధంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కొందరు మంత్రులు కరోనా కాలంలో చాలా చురుకుగా వ్యవహరిస్తూ, ప్రజల ప్రశంసలు పొందుతున్నారు. చాలామంది సొంత ఖర్చులతో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు. నిత్యం వివిధ కారణాలతో విమర్శలు ఎదుర్కొనే రాజకీయ నేతలు, జాతివిపత్తు సమయంలో పేదలకు వ్యక్తిగత సాయం అందిస్తూ,  అభినందనలు అందుకోవడం విశేషం.

అధికారులతో నిర్మల ఫోన్ సమీక్షలు

ఏపీకి ఇన్చార్జిగా ఉన్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, కరోనా సమయంలో తీసుకుంటున్న చర్యలపై అధికారులతో ఫోన్ ద్వారా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రులలో జరుగుతున్న వైద్యం, అక్కడ వైద్యులకు కిట్ల అందుబాటు, సౌకర్యాలు, అవసరాలపై ఆరా తీస్తున్నారు. కేంద్రం నుంచి ఏం కావాలో అడిగి తెలుసుకుంటున్నారు. అటు పార్టీ నేతలతో కూడా వైద్య పరిస్థితి, కార్యకర్తలు చేస్తున్న సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

కంట్రోల్‌రూమ్‌లో  కిషన్‌రెడ్డి బిజీ బిజీ..

కరోనా కల్లోల సమయంలో కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి, ఢిల్లీలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌రూమ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎక్కడ వలస కార్మికులు చిక్కుకుపోయినా, వారికి సహాయం అందేలా ఆదేశిస్తున్నారు. ఆ మేరకు అధికార యంత్రాంగం-పార్టీ నేతల ద్వారా నిరంతరం సమాచారం తెప్పించుకుంటున్నారు. ఆయన కార్యదర్శులు కూడా, ఈ విషయంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు.  జిల్లా-రాష్ట్ర బీజేపీ నేతలతో, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా.. కరోనా సాయంపై టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. ఎంతమంది కార్యకర్తలు, ఒక్కొక్కరూ ఐదుగురు పేదలకు ఆహారపొట్లాల పంపిణీ చేస్తున్నారని అడిగి తెలుసుకుంటున్నారు.

కేటీఆర్ కనుసన్నలలో..


తెలంగాణలో మంత్రి కేటీఆర్ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో చిక్కుకున్న తమ వారికి సాయం చేయాలంటూ, వేల సంఖ్యలో వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న ట్వీట్లకు ఆయన శరవేగంగా స్పందిస్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు పంపిస్తూ, తీసుకున్న చర్యలను వాకబు చేస్తున్నారు. అవి పరిష్కారం కావడంతో,  ఆయన దృష్టికి మరిన్ని సమస్యలు వస్తున్నాయి.  పారిశుధ్య పరిస్థితిపై నిరంతరం సమీక్షిస్తున్న కేటీఆర్, హైదరాబాద్ సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ముఖ్యంగా వలస కూలీలు, 5 రూపాయల ఉచిత భోజనంపై దృష్టి సారిస్తుండటంతో.. నగరంలో 5 రూపాయలకు దొరికే భోజనం తినే వారి సంఖ్య పెరిగింది. అయితే, ఈ సమయంలో దానిని కూడా ఉచితంగా అందిస్తుండటం ఓ విశేషం.

ఈటల కృషి భేష్..

వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా అలుపెరగకుండా పనిచేస్తున్నారు. ఆయన నిరంతరం ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా సేవను పర్యవేక్షిస్తున్నారు. వైద్య అధికారులు, వైద్యులతో మాట్లాడుతున్నారు. జిల్లా అధికారులతో ప్రతి రోజూ మూడుసార్లు టెలీకాన్ఫరెన్సు నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో బులిటెన్లు, జిల్లాలలోని ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. రాష్ట్ర-జాతీయ మీడియా కూడా, ఈటల కృషిని ప్రశంసిస్తుండటం విశేషం.

మాస్టర్ అవతారమెత్తిన హరీష్

ఆర్ధిక మంత్రి హరీష్‌రావు స్వయంగా గ్రామాలకు వెళ్లి, ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. కరోనా గురించి వారికెంతవరకూ తెలుసన్న విషయాన్ని వాకబు చేస్తున్నారు. ప్రభుత్వ సాయం అందుతున్న తీరును విచారిస్తున్నారు. వ్యవసాయం, గ్రామాభివృద్ధి, స్ధానిక పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నారు. వ్యక్తిగతంగా పేద, మధ్య తరగతి వర్గాల వారికి బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. మరికొందరికి ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఆయన వలస కూలీలను ఆపి మరీ, వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న దృశ్యాలు,  సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

దటీజ్.. తలసాని!

ఇక హైదరాబాద్ నగరానికి చెందిన మరో సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, కరోనా సమయంలో రోజులో ముప్పావు భాగం నగరంలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా సమీక్షించడానికే పరిమితమవుతున్నారు. ఇటీవలే అమీర్‌పేట వంటి ప్రాంతాల్లో ఏపీకి చెందిన విద్యార్ధులు, ఉద్యోగులున్న హాస్టళ్లను ఖాళీ చేయించారు. దానితో వారంతా ఏపీకి వెళ్లేందుకు ప్రయత్నించగా, వారిని ఆంధ్రాకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే, వారిని వెళ్లగొట్టిన హాస్టల్ యజమానులు, పోలీసులతో సమావేశం నిర్వహించడం ద్వారా, గూడు సమస్యను పరిష్కరించారు. అక్కడే ఐదు రూపాయల భోజనాన్ని ఉచితంగా ఏర్పాటుచేయించడంతో వారంతా కృతజ్ఞతలు చెప్పారు.  ఇక కరోనా సమయంలో మార్కెట్లలో.. నిత్యావసర వస్తువులు ఎక్కువ ధరకు అమ్ముతున్నారన్న ఫిర్యాదుతో, మార్కెట్లకు వెళ్లి వాకబు చేశారు. బోర్డుపై ధరలు రాయాలని ఆదేశించారు. ఇక మాల్స్‌లో అమ్ముతున్న ధరలపైనా, ఆయన స్వయంగా తనిఖీలు నిర్వహించారు.

సీఎం సహాయ నిధికి 7 కోట్లు సమీకరణ..

ఇక కరోనా సమయంలో, తన నియోజకవర్గం, నగరంలో ఉన్న ప్రముఖులు, సినీ నటులు, వ్యాపారవేత్తలతో తనకున్న సంబంధాలను..  ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చేందుకు వినియోగిస్తున్న మంత్రులలో తలసాని మొదటి వరసలో నిలిచారు. ఆరకంగా ఆయన ఒక్క హైదరాబాద్  నగరం నుంచే.. వివిధ వర్గాల వ్యాపారులతో,  దాదాపు 7 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇప్పించడం ద్వారా, తన సామాజిక చైతన్యాన్ని ప్రదర్శించారు. అటు వ్యాపారులు, సంఘాలు కూడా ఆ మేరకు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం విశేషం. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు వారితో విరాళాలు ఇప్పిస్తున్నారు.

ఇవన్నీ ఒక ఎత్తయితే.. తన నియోజకవర్గంలోని మధ్యతరగతి వర్గాలు, విలేకరులకు నిత్యావసర వస్తువులు సొంత ఖర్చుతో పంపిణీ చేస్తూ, అందరి ప్రశంసలు పొందుతున్నారు. దాదాపు 200 మంది విలేకరులకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యంతోపాటు.. మరో 25 కిలోల కందిపప్పు, చింతపండు, ఆయిల్, పంచదార, గోధుమలు మొత్తం 50 కిలోలు అందించారు. మధ్య తరగతి ప్రజలు నివసించే ప్రాంతాలతోపాటు, తోపుడుబండ్లు, పాన్‌షాపులపై ఆధారపడి జీవించే పేదలకు, సొంత ఖర్చుతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. తెలంగాణలో అటు కరోనాపై ప్రభుత్వపరమైన పర్యవేక్షణ, ఇటు ఇబ్బందులు పడుతున్న మధ్య తరగతి వర్గానికి, సొంత ఖర్చుతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న ఏకైక మంత్రిగా నిలిచారు. ఏపీ విద్యార్ధులను ఖాళీ చేయించిన హాస్టల్ యజమానులతో కూడా సీఎం రిలీప్‌ఫండ్‌కు నిధులు ఇప్పించడం మరో విశేషం.

కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి కూడా పేదలను ఆదుకోవడంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు.  అగర్వాల్ సమాజ్ సహకారంతో..  హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని వేలాది మంది పేద బ్రాహ్మణులకు ఆయన బియ్యం అందిస్తున్నారు. గుళ్లు మూతపడటం, అపర కర్మలు లేకపోవడంతో, వాటిపై ఆధారపడి జీవనం సాగించే పేద బ్రాహ్మణులకు..  వివిధ దేవాలయాలకు ఆయనే స్వయంగా వెళ్లి, బియ్యం పంపిణీ చేస్తున్నారు. అత్యంత నిరుపేదలకు ధన సహాయం చేస్తున్నారు.
వీరు సైతం..

మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాసగౌడ్, నిరంజన్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, మాగంటి గోపీనాధ్, మాధవరం కృష్ణారావు, సాయన్న, మైనంపల్లి హన్మంతరావు, ముఠా గోపాల్, సుధీర్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మహబూబ్‌నగర్‌లో టీడీపీ నేత కొత్తకోట దయాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, అరవిందకుమార్‌గౌడ్, సాయిబాబా తదితరులు కూడా తమ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్యేలు సహాయ కార్యక్రమాల్లో ముందున్నారు.

కమలదళం బిజీ బిజీ..

తెలంగాణ రాష్ట్ర  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇప్పటికే తన ఎంపీ ల్యాడ్స్‌ను కలెక్టర్‌కు ఇచ్చారు. కరోనా సమయంలో, ఆయన కూడా వ్యక్తిగతంగా పేదలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. పార్టీ ఆదేశం మేరకు.. ఒక్కో కార్యకర్త, ఐదుగురు పేదలకు భోజనం పెట్టే కార్యక్రమాన్ని రోజూ సమీక్షిస్తున్నారు. ప్రధాని సహాయ నిధికి విరాళాలు ఇచ్చేలా ప్రోత్సహించే పనిలో ఉన్నారు. ప్రతిరోజూ జిల్లా అధ్యక్షులు, నేతలతో టెలీకాన్ఫరెన్సు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్న కరోనా వైద్యంపై, జిల్లా అధ్యక్షుల ద్వారా ఆరా తీస్తున్నారు. మరో ఎంపి అర్వింద్ కూడా, సొంత ఖర్చులతో పేదలు-మధ్య తరగతి వారికి నిత్యావసర వస్తువులు, ధన సహాయం చేస్తున్నారు.  బీజేపీ అగ్రనేతలు డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, రామచందర్‌రావు, సంకినేని వెంకటేశ్వరరావు, డికె అరుణ, గరికపాటి మోహన్‌రావు, చాడా సురేష్‌రెడ్డి వంటి ప్రముఖులు.. సొంత ఖర్చులతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ఇక నగరంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు, నగర నేతలు సహాయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్, వెంకటరమణి, సుభాష్‌చందర్‌జీ,  వెంకటరెడ్డి, శ్యాంసుందర్‌గౌడ్, భవారీలాల్ వర్మ, రవిప్రసాద్‌గౌడ్, సతీష్‌గౌడ్, మేకల సారంగపాణి తదితరులు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నగరంలో వైద్య, పోలీసు సిబ్బందికి సేవలు అందిస్తున్న వారిలో,  బీజేపీ నేతలే ముందుండటం విశేషం.

ఆంధ్రాలోనూ అదే ఆసక్తి…

ఇక ఆంధ్రప్రదేశ్‌లో తొలుత కరోనా సమయంలో మంత్రులు పెద్దగా కనిపించలేదు. తర్వాత కొందరు మంత్రులు చురుకుగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నియోజకవర్గంలో,  పేదలకు సొంత ఖర్చులతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో కోవిడ్ కేసుల పర్యవేక్షణ లో బిజీగా వ్యవహరిస్తున్నారు. స్వతహాగా దానగుణం ఎక్కువగా ఉండే ఆయన, కరోనా సమయంలోనూ తన దాతృత్వాన్ని కొనసాగిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ చాలా చురుకుగా పనిచేస్తున్నారు. మంత్రి అనిల్‌కుమార్ అయితే స్వయంగా కరోనా పరీక్షలు చేయించుకుని, తిరిగి ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. వార్డుల్లోకి వెళ్లి ఆరోగ్య హెచ్చరికలు చేస్తున్నారు. ఆయన కూడా సొంత డబ్బుతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితులను స్వయంగా సమీక్షిస్తున్నారు.

మేకపాటి రూటే వేరు..

అదే జిల్లాకు చెందిన మరో మంత్రి, మేకపాటి గౌతంరెడ్డి తన సొంత ఖర్చుతో.. వేల సంఖ్యలో మాస్కులు-శానిటైజర్లు తెప్పించి,  పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఆత్మకూరు ఆర్డీఓకు 10 వేల 3-ఫ్లై మాస్కులు, 10 వేల శానిటైజర్లు అందించారు. గత వారమే 10 వేల ఎన్-99 మాస్కులను కలెక్టర్‌కు అందించారు. వచ్చేవారం మరో 20 వేల మాస్కులు, 10 వేల శానిటైజర్లు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. తన శాఖలో వేగంగా వ్యవహరిస్తున్న మేకపాటి, సేవా కార్యక్రమాల్లోనూ అంతే వేగంగా పనిచేస్తుండటం విశేషం.

వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని, నిరంతరం వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు అందుతున్న మాస్కులు, గౌన్లు, గ్లౌజులపై ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. రోజుకు మూడుసార్లు జిల్లా వైద్యశాఖాధికారులతో టెలీ కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు.

వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు కూడా చురుకుగా వ్యవహరిస్తున్నారు. కరోనా ప్రమాదాన్ని స్వయంగా ప్రజలను కలసి వివరిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయనే వివరిస్తున్నారు. నియోజకవర్గంలో పేదలు, రోజువారీ వేతనాలపై ఆధారపడే వారికి, సొంత ఖర్చులతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తూ, అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. విశాఖకు చెందిన మరో మంత్రి అవంతి శ్రీనివాస్ పేదలకు సాయంలో ముందున్నారు. వారికి ఆయన స్వయంగా నిత్యావసర వస్తువులతోపాటు, మాస్కులు అందిస్తున్నారు.

విజయవాడకు చెందిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా, వ్యక్తిగత ఖర్చుతో పేదలకు ప్రతిరోజూ నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. రోజూ ఉదయం స్కూటర్‌పై వార్డుల్లో పర్యటిస్తూ, ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. మరికొంతమందికి ఆర్ధిక సాయం కూడా అందిస్తున్నారు. మరో సీనియర్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా, ప్రతిరోజూ పేదలు, పేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులు సొంత ఖర్చుతో అందిస్తున్నారు.  ఆర్ధిక సాయం చేస్తున్నారు.

కరోనా సమయంలో కమలదళం..

ఇక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. కరోనా సమయంలో పేదలు, మధ్య తరగతి వర్గాలను ఆదుకునేందుకు, తన పార్టీ నేతలను పరుగులు పెట్టిస్తున్నారు. ఒక్కో కార్యకర్త ప్రతి రోజూ ఐదుగురికి భోజనం పెట్టించేలా చూస్తున్నారు. ఆ మేరకు ఆయన ఫోన్ ద్వారా జిల్లాల వారీగా, వాటి ఏర్పాట్లు, వివరాలు సమీక్షిస్తున్నారు. అదేవిధంగా ప్రధాని సహాయ నిధికి విరాళాలిచ్చేందుకు కార్యకర్తలతోపాటు, వివిధ వర్గాల వారిని ప్రోత్సహించే పనిలో ఉన్నారు. వీటితోపాటు, తన పార్టీ జిల్లా అధ్యక్షుల ద్వారా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా సేవల గురించి వాకబు చేస్తున్నారు. స్వయంగా ఆయన గుంటూరు నగరంలో పేద వారి కోసం ప్రత్యేకంగా భోజనం తయారు చేసి, వాటిని ఆహారపొట్లాల రూపంలో అందిస్తున్నారు.

రోజా, రజనీ టాప్..

వీరుకాకుండా.. పలువురు ఎమ్మెల్యే, ఎంపీలు కూడా పేదలను ఆదుకోవడంలో ముందున్నారు. వీరిలో నగరి ఎమ్మెల్యే రోజా, చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీ అగ్రస్థానంలో ఉన్నారు. ఎమ్మెల్యే రోజా తన సొంత ఖర్చుతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి మరీ ఆహారం, నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. కడు పేదలకు ఆర్ధిక సాయం చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రమాదం గురించి వార్డులోకి వెళ్లి వివరిస్తున్నారు. జనతాకర్ఫ్యూ నుంచి ఇప్పటివరకూ.. నగరిలో సామాన్యుడు తిండికి ఇబ్బందిలేకుండా ఉన్నార ంటే, దానికి కారణం రోజానేనని స్థానికులు చెబుతున్నారు. అంటే ఆమె ఏ స్ధాయిలో పనిచేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
ఇక చిలకలూరి పేట ఎమ్మెల్యే  రజనీ..  దాదాపు తన సొంత ఖర్చుతోనే సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తు, అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆమె చాలామందికి ఆర్ధిక సహాయం కూడా చేస్తుండటం విశేషం. తోపుడు బండ్లు, రిక్షాలను ఆపి మరీ.. వారికి డ బ్బు, నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. నియోజకవర్గంలో రోజువారీ ఆదాయంపై జీవించే వారికి, ఆమె ధనసహాయం కూడా చేస్తుండటం విశేషం. ఇటీవలే విలేకరులకు సైతం ఆమె నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

ఎంపీలు కూడా..

ఎంపి రఘురామకృష్ణంరాజు కూడా సొంత ఖర్చులుతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ఎంపి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎంపి మేకపాటి  కూడా స్వంత ఖర్చులతో పేదలకు సాయం చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ కోన  రఘుపతి బాపట్లలో దాదాపు తన సొంత ఖర్చులతో పేదలకు నిత్యావసర, ఆర్ధిక సహాయం అందిస్తున్నారు.  సతె్తనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, విశాఖ ఎమ్మెలే గంటా శ్రీనివాసరావు, నెల్లూరులో ఎమ్మెల్సీ బీద రవిచంద్, మాజీ మంత్రి బీద మస్తాన్‌రావు, దాడి వీరభద్రరావు తదితరులు కూడా సొంత ఖర్చులు, తమ ట్రస్టుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ప్రకాశంలో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తమ సొంత ఖర్చుతో తమ నియోజకవర్గాల్లో బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. పేద కార్యకర్తలకు ఆర్ధిక సహాయం కూడా చేస్తూ, అందరి అభినందనలు అందుకుంటున్నారు.

గుంటూరు నగరంలో టీడీపీ సీనియర్ నేత, బ్రాహ్మణ సంఘం- రాష్ట్ర అయ్యప్పసేవా సంఘం రాష్ట్ర నేత శిరిపురపు శ్రీధర్ నాయకత్వంతో వరసగా ప్రతిరోజూ అన్నదానం చేస్తున్నారు. యాచకులతోపాటు, శ్మశానంలో జీవించే కాటికాపరులకు ఆహారపొట్లాలు అందచేస్తున్నారు. రాష్ట్రంలో ఈవిధంగా శ్మశానంలో కాటికాపరులకు సైతం సాయం చేస్తుండటం ఇదే తొలిసారి.

1 COMMENT