గవర్నర్‌పై కేంద్రానికి కమలదళం ఫిర్యాదు?

107

లేఖ రాసిన తర్వాత కూడా ఆర్డినెన్స్‌పై ఆమోదమా?
అంత అత్యవసరం లేకున్నా ఆమోదం ఎందుకు?
పార్టీ ఆమోదం తీసుకున్నా ఫలితం సున్నా
కమలదళాలను గవర్నర్ ఖాతరు చేయడం లేదా?
ఏపీ బీజేపీ నేతల విస్మయం
       ( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్‌పై ఆ రాష్ట్ర కమలదళాలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయా? ఆయన తీరుపై అసంతృప్తితో ఉన్నాయా?.. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ పనితీరుపై తాము చేస్తున్న ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్న తీరుపై సీనియర్లు పెదవి విరుస్తున్నారా?.. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు వారికి రుచించడం లేదా?.. దీనికి  బీజేపీ అవుననే సమాధానం ఇస్తున్నాయి.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తొలగింపునకు సంబంధించి, జారీ చేసిన ఆర్డినెన్స్ రాష్ట్ర బీజేపీ వర్గాలకు మింగుడుపడకుండా ఉంది. రాష్ట్ర నాయకులు దీనికి సంబంధించి,  గవర్నర్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంశంపై ఓవైపు తాము  మొదటి నుంచీ సీరియస్‌గా పోరాడుతుంటే, గవర్నర్ మాత్రం అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడాన్ని, బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ప్రభుత్వం చేసిన సిఫార్సును.. ఎలాంటి కొర్రీలు వేయకుండా, ఆమోదించి ఆర్డినెన్స్ రూపంలో విడుదల చేయడంపై, బీజేపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

సహజంగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీకి చెందిన వారిని గవర్నర్లుగా నియమిస్తుంటారు. ఈ సంప్రదాయం కొన్ని దశాబ్దాల నుంచీ కొనసాగుతోంది. ఆ ప్రకారంగా.. రాష్ట్రాల్లో అధికారంలో లేని ‘కేంద్ర అధికారపార్టీ’, సహజంగా అక్కడ తన పార్టీ ఉనికి కోసం, గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించుకుంటుంది. అందుకే ఆనాటి నుంచీ ఈనాటి వరకూ, ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు- గవర్నర్ల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, గవర్నర్‌గా ఉన్న కుముద్‌బెన్ జోషి, రాష్ట్రంలో సమాంతర వ్యవస్థ నడిపారు. రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించేవారు. ఎన్టీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను వెనక్కి పంపించేవారు. గవర్నర్‌గా పనిచేసిన రామ్‌లాల్ అయితే, ఏకంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేయడం దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, తాను అధికారంలోకి లేని రాష్ట్రాల ముఖ్యమంత్రులను బలహీనపరచడానికి,  గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించుకుంది. అందుకే ఎన్టీఆర్.. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్లు కేంద్రం ఏజెంట్లని ఆరోపించారు. తమిళనాడులో జయలలిత సీఎంగా ఉన్నప్పుడు, గవర్నర్‌గా పనిచేసిన చెన్నారెడ్డి కూడా అనేక ఆర్డినెన్స్‌ను కొర్రీల మీద కొర్రీలు వేసి, వెనక్కి పంపించారు. ఆయన కూడా రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్లు నిర్వహించేవారు. ఆ సందర్భంలో జయలలిత-చెన్నారెడ్డి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, గవర్నర్‌గా ఉన్న రంగరాజన్ ఓ ఆర్డినెన్స్‌ను వెనక్కిపంపించారు. అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, మళ్లీ ఇక ఆర్డినెన్స్ ఎందుకని ప్రశ్నించారు.

రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, గవర్నర్ నరసింహన్ ఆయన ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా వ్యవహరించారన్న వ్యాఖ్యలు  వినిపించేవి. తెలంగాణలో కేసీఆర్, రెండోసారి సీఎం అయిన తర్వాత తీసుకున్న కొన్ని నిర్ణయాలను కూడా, నరసింహన్ వెనక్కి పంపించినా.. వ్యక్తిగతంగా వారిద్దరికీ సఖ్యత, సమన్వయమే ఉండేది. ఇక లెఫ్టినెంట్ గవర్నర్లు ఉన్న పాండిచ్చేరి, ఢిల్లీలో వారు సీఎంలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూనే ఉండటం వివాదానికి కారణమవుతోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా, సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు.

ఇక పాండిచ్చేరిలో సీఎం నారాయణస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ తీసుకుంటున్న నిర్ణయాలు, నడుపుతున్న సమాంతర వ్యవస్థ వివాదం సృష్టిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి అసలు బలం లేకపోయినా, గవర్నర్ల సాయంతో విపక్షఎమ్మెల్యేలను చీల్చి, గవర్నర్ల ద్వారా ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తోందని విపక్షాలు ఇప్పటికీ దుయ్యబడుతూనే ఉన్నాయి. అంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా, ఆయా రాష్ట్రాల గవర్నర్లు వ్యవహరిస్తున్నారని అర్ధమవుతోంది.

మళ్లీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షం. దానికి విధానమండలిలో తప్ప, విధానసభలో ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు మండలి రద్దుకు జగన్ సర్కారు సిఫార్సు చేశారు కాబట్టి, ఆ అవకాశం కూడా లేదు. కానీ, ఏపీలో బీజేపీ బలమైన పోరాటాలే చేస్తోంది. అమరావతిని రాజధాని నుంచి తరలింపును నిరసిస్తూ,  తొలుత టీడీపీ  పోరాటం ప్రారంభించినప్పటికీ.. బీజేపీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగిన తర్వాతనే, ఆ ఉద్యమానికి ప్రాధాన్యం లభించించింది. దాదాపు రెండు దశాబ్దాలు మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత, ఏపీలో బీజేపీ పనితీరు విధానమే మారిపోయింది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, ఆయన సీఎం జగన్‌కు తరచూ లేఖలు రాస్తున్నారు.

గతంలో హరిబాబు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, దానికి తెలుగు బీజేపీ అనే ముద్ర, విమర్శలుండేవి. ఓ జాతీయ నేత ఆలోచనల ప్రకారమే, ఆయన పార్టీని నడిపారన్న ఆరోపణలు సొంత పార్టీలోనే ఉండేవి. కానీ, కన్నా అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో గ్రామస్థాయి వరకూ పర్యటనలు, సభలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా.. అంతబలం లేకపోయినప్పటికీ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి పోటీగా, ప్రజా ఉద్యమాలు నిర్మిస్తుండటం అధికార వైసీపీకి మింగుడుపడటం లేదు. చాలా సందర్భాల్లో టీడీపీ కంటే బలమైన విమర్శలు, ఉద్యమాలతో బీజేపీ అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అమరాతిలోనే రాజధానిని ఉంచాలన్న డిమాండ్‌ను, తీర్మానంగా మార్చడం బట్టి.. దానికి కేంద్ర పార్టీ మద్దతు ఉందని స్పష్టమయింది.

నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలోనూ, బీజేపీ రాష్ట్ర కమిటీ జగన్ ప్రభుత్వ తీరును బలంగానే ఎండగడుతోంది. మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్‌ను కలసి డిమాండ్ చేసింది. తమ పార్టీ కార్యకర్తవపై వైసీపీ నేతల దాడులను ఫొటోలతో సహా ఫిర్యాదు చేసింది. అయితే, రాష్ట్ర ఎన్నికల కమినషర్ వాటిపై స్పందించి, ఐఏఎస్, ఐపిఎస్, డీఎస్పీలపై బదిలీ వేటు వేసింది. ఈ క్రమంలో, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై సీఎం జగన్ చేసిన విమర్శలను బీజేపీ  ఖండించింది. తాజాగా ఆయన పదవీకాలాన్ని కుదించడంపైనా కమలదళం కన్నెర్ర చేసింది. ఆర్డినెన్స్ ఇవ్వవద్దని కోరుతూ, గవర్నర్‌కు లేఖ రాసింది. అయితే, బీజేపీ లేఖ అందిన తర్వాత కూడా గవర్నర్.. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఆర్డినెన్స్ జారీ చేయడంతో బీజేపీ నేతలు బిత్తరపోవలసి వచ్చింది.

సహజంగా భారతీయ జనతా పార్టీలో.. రాష్ట్రానికి సంబంధించి, పార్టీపరంగా చేసే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలను కేంద్ర పార్టీ నాయకత్వం, ఇన్చార్జులుగా ఉండే కేంద్రమంత్రులకు  ముందుగా సమాచారం ఇస్తుంది. వాటి ఆమోదం పొందిన తర్వాతనే, కార్యాచరణ ప్రారంభిస్తుంది. అదేవిధంగా.. ఏపీ బీజేపీ శాఖ, లాక్‌డౌన్ కొనసాగించాలని, నిమ్మగడ్డ రమేష్ తొలగింపును వ్యతిరేకించాలని విధాన నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు రెండురోజుల క్రితమే, రాష్ట్ర నాయకులు కేంద్ర పార్టీతో చర్చించడం కూడా జరిగింది. ఆ తర్వాతనే ఎస్‌ఈసీ మార్పుపై రాష్ట్ర శాఖ గవర్నర్‌కు లేఖ రాసింది. జగన్ ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని వాదించింది.

అయితే కేవలం రెండు గంటల వ్యవధిలోనే.. తన వద్దకు ప్రభుత్వం వచ్చిన దస్త్రంపై, సాధారణంగా వ్యవహరించే తీరుకు భిన్నంగా.. ఎలాంటి కొర్రీలు వేయకుండానే, ఆమోదించడం బీజేపీ వర్గాలను ఖంగుతినిపించింది. నిబంధనల ప్రకారం.. గవర్నర్ ఆర్డినెన్స్‌పై సంతకం చేయకుండా, వివరణ అడగవచ్చు. అయినా, ఒకసారి సంతకం చేయకపోతే, మంత్రివర్గం మరోసారి దానిని గవర్నర్‌కు పంపితే, దానిని ఆమోదించవలసి ఉంటుంది. అయితే, ఎస్‌ఈసీ పదవీకాలం కుదిస్తూ, హైకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్‌పై.. గవర్నర్ కనీసం ప్రభుత్వాన్ని వివరణ కూడా కోరకుండా, రెండు గంటల్లోనే సంతకం చేయడంపై కమలదళాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అత్యవసర పరిస్థితిలో, అసెంబ్లీ సమావేశం కాని రోజుల్లోనే ఆర్డినెన్స్ జారీ చేస్తారని గుర్తుచేస్తున్నారు. కరోనాపై దేశమంతా చర్చిస్తుంటే, అంత అత్యవసరం కాని ఎస్‌ఈసీపై ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.  ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా రాసిన లేఖను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

కేంద్రానికి ఫిర్యాదు?

కాగా, రాష్ట్రంలో గవర్నర్ తీరుపై రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో వివిధ అంశాలు, సమస్యలపై భారతీయ జనతా పార్టీ విధానం స్పష్టంగా తెలిసినప్పటికీ, గవర్నర్ తీసుకుంటున్న నిర్ణయాలు తమకు ఇబ్బందికరంగా పరిణమించాయని పార్టీ నేతలు కేంద్రానికి నిన్న ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై తాము చేసిన ఎలాంటి ఫిర్యాదులపైనా, ఆయన స్పందించడం లేదని వారు కేంద్రానికి వివరించినట్లు సమాచారం. ప్రధానంగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సంబంధించి తమ వైఖరి తెలిసి కూడా, గవర్నర్ ఆర్డినెన్స్‌ను ఆమోదించడాన్ని వారు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎస్‌ఈసీకి సంబంధించి తాము గతంలో గవర్నర్‌కు వినతిపత్రం కూడా ఇచ్చామని గుర్తు చేశారు. మరి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

గవర్నర్ తీరుపై టీడీపీ నేతల విసుర్లు…

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపున కు సంబంధించి, గవ ర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా విరుచుకుపడుతోంది. దానిపై ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గవర్నర్ తీరును విమర్శించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని బాబు వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు కూడా నిమ్మగడ్డ నిర్ణయాన్ని సమర్ధిస్తే, గవర్నర్ మాత్రం ఆయన తొలగింపును గంట కూడా ఆపలేకపోయారని సోమిరెడ్డి విమర్శించారు. నిమ్మగడ్డను భయపెట్టినట్లు జగన్ గవర్నర్‌ను కూడా భయపెట్టారా అని ప్రశ్నించారు. ప్రథమపౌరుడిగా మంచి నిర్ణయాలు, ఎందుకు తీసుకోలేకపోతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. దీనిని గవర్నర్ నివృతి చేయాలని డిమాండ్ చేశారు