సచివులు..సార్లకు ఓ రూలు! సామాన్యులకు.. ఓ రూలా సారూ?

480

సామాన్యులు మాత్రం క్వారంటైన్లు, ఐసోలేషన్‌వార్డుల్లోనా?
మంత్రి ఆదిమూలపు, ఎస్‌ఈసీ కనగరాజ్, పద్మా జనార్దన్‌రెడ్డిని క్వారంటైన్‌కు పంపించరా?
కనగరాజ్ తమిళనాడు నుంచి ఎలా వచ్చారు?
బాబు వస్తే క్వారంటైన్‌కు పంపిస్తామన్న మంత్రి మోపిదేవి
క్వారంటైన్ కట్టుదాటుతున్న ప్రముఖులు
ఏపీలో  మినహాయింపుల వింత
(మార్తి సుబ్రహ్మణ్యం)

రూలంటే రూలే. అది ఒకరి విషయంలో ఒకలా.. మరొకరి విషయంలో మరోలా ఉండదు. ఉండకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అన్నీ వింతలు, విడ్డూరాలే! సరిహద్దులు దాటిన సామాన్యులను, నిర్మొహమాటంగా క్వారంటైన్లకు వెళ్లాల్సిందేనని సెలవిచ్చిన సీఎం జగన్మోహర్‌రెడ్డి.. అదే మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలపై మాత్రం కరుణచూపుతున్న వైచిత్రి.
కరోనా కల్లోలంలో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు, చాలామంది ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయ నిధికి, వారి స్థాయిలో విరాళాలు ఇస్తున్నారు. సమాజం వారికి ఎంతో ఇచ్చినందున, తిరిగి ఎంతో కొంత సమాజానికి ఇవ్వడం అభినందించదగ్గదే. అయితే, వారెన్ని కోట్లు ఇచ్చినప్పటికీ, కొన్ని నిబంధనలు పాటించి తీరాల్సిందే. కోట్లు ఇస్తున్నారని వారికి మినహాయింపులు ఇవ్వడం కూడా తప్పును ప్రోత్సహించినట్లే లెక్క!

సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఇస్తున్నారు. వారిలో హైదరాబాద్‌లో ఉన్న వారే ఎక్కువ. హైదరాబాద్‌లో ఉన్న నిబంధనల ప్రకారం, వారు స్వయంగా వచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు విరాళాలు ఇచ్చి వెళుతున్నారు. మరికొంతమంది మంత్రి తలసాని ద్వారా వచ్చి, వారిద్దరికీ చెక్కులు ఇచ్చి వెళుతున్నారు. మిగిలినవారిలో ఎక్కువమంది ఆర్‌టిజీఎస్ ద్వారా, ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు పంపిస్తున్నారు. సీఎం, మంత్రులకు విరాళాలు ఇచ్చేవారంతా స్థానికంగానే హైదరామాద్‌లోనే ఉంటున్నందున, వారితో పెద్దగా ఇబ్బందేమీ ఉండవు.

కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇలాంటివి, భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదు. కరోనా వైరస్‌తో ఉన్న ప్రమాదం దృష్ట్యా.. సరిహద్దులు మూసేశారు. ఆ ప్రకారంగా ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు. ఒకవేళ అటు ఇటు రాష్ట్రాల పోలీసులు అనుమతి ఇచ్చినా, దానిని మరో రాష్ట్ర పోలీసులు అనుమతించని ఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ, ఈ నిబంధనలు మంత్రులు, అధికారులు, అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు మాత్రం వర్తించకపోవడమే విమర్శలకు దారితీస్తోంది.

గతంలో హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు, విద్యార్ధులు, తెలంగాణ పోలీసుల అనుమతిపత్రాలు తీసుకునిమరీ,  ఏపీకి వెళ్లేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్ హాస్టల్ యజమానులు వారిని ఖాళీ చేయించడమే దానికి కారణం. అయితే, దానిని ఆంధ్రా సరిహద్దు ప్రాంతమయిన, గరికపాడు చెక్‌పోస్టు వద్ద వారందరినీ ఏపీ పోలీసులు నిలిపివేశారు. తెలంగాణ సర్కారు అనుమతి ఇచ్చినా తాము ఆంధ్రాలోకి అడుగుపెట్టనీయమని ఖరాఖండీగా చెప్పారు. దానితో కొన్ని వందల మంది అర్ధరాత్రి వరకూ పడిగాపులు కాశారు. డీజీపీ గౌతం సవాంగ్ సైతం ఎవరినీ రాష్ట్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. చివరాఖరకు.. 14 రోజులు క్వారంటైన్‌లో ఉండేందుకు అంగీకరిస్తే, వారిని ఏపీలోకి అనుమతిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు అంగీకరించిన వారిని, నూజివీడు త్రిపుల్ ఐటీలో ఉన్న క్వారంటైన్‌కు తరలించారు. ఆ మరుసటిరోజు సీఎం జగన్మోహన్‌రెడ్డి కూడా.. ఏపీకి వచ్చేవారంతా క్వారంటైన్‌లో ఉండేందుకు అంగీకరిస్తే, వారిని అనుమతిస్తామని ప్రకటించారు.

గత రెండు రెండురోజుల క్రితమే తెలంగాణలో, క్వారంటైన్ పూర్తి చేసుకున్న  ఏపీకి చెందిన వారిని.. తెలంగాణ ప్రభుత్వమే బస్సు ఏర్పాటుచేసి, ఏపీకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే, వారిని కూడా గరికపాడు వద్ద నిలిపివేసి, మళ్లీ వెనక్కిపంపించారు. జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు సైకిల్‌పై వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడును.. నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ, ఆయనను అరెస్టు చేశారు. ఇప్పటికీ అనేకమంది ఆంధ్రాప్రాంత వాసులు, హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆంధ్రా సర్కారు తిప్పికొడుతోంది. చాలామంది తెలంగాణ వాసులు, ఆంధ్రాలో ఇరుకున్నప్పటికీ, వారిని కూడా హైదరాబాద్ పంపించటం లేదు. ఈవిధంగా సామాన్యుల విషయంలో నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్న జగన్మోహన్‌రెడ్డి సర్కారు, మంత్రులు, వీఐపీల విషయంలో మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది.

మంత్రి మోపిదేవి వెంకట రమణ ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై చేసిన వ్యాఖ్య సంచలనం సృష్టించింది. ఆయన ఒకవేళ ఏపీకి వస్తే,  ఆయనను కూడా క్వారంటైన్‌లో ఉంచుతామని ప్రకటించారు. దీన్నిబట్టి బయట రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో, జగన్మోహ్‌రెడ్డి ఏ వైఖరితో ఉందో స్పష్టమవుతోంది. కానీ, ఇటీవల మేఘా కంపెనీ అధినేత కృష్ణారెడ్డి హైదరాబాద్ నుంచి తాడేపల్లి వచ్చి, స్వయంగా జగన్‌కు చెక్కు అందించి వెళ్లారు. కరోనా నిబంధనలు ఉన్న సమయంలో, అసలు ఆయనను ఏపీ సరిహద్దులోకి ఎలా అనుమతించారు? మోపిదేవి చెప్పినట్లు… ఆయనను క్వారంటైన్‌కు పంపించకుండా, హైదరాబాద్‌కు ఎలా పంపించారన్న ప్రశ్నలకు ఎవరివద్దా జవాబు లేదు. ఇదికూడా చదవండి… కృష్ణారెడ్డి ‘మేఘా’లలో వెళ్లారా? రోడ్డు మార్గంలో వెళ్లారా?

అదేవిధంగా గత రెండు రోజుల నుంచి హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామివేత్తలు, తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి చెక్కులు ఇచ్చి వెళుతున్న దృశ్యాలు మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. అయినా వారిని ఆపడం గానీ, వచ్చిన తర్వాత జగన్మోహన్‌రెడ్డి చెప్పినట్లే.. క్వారంటైన్‌కు పంపించకపోవడం గానీ విస్మయం కలిగిస్తోంది. తాజాగా మంత్రి ఆదిమూలపు సురేష్ హైదరాబాద్‌లో రెండు రోజులు ఉండటమే కాదు, లేక్‌వ్యూ గెస్‌హౌస్‌లో ప్రెస్‌మీట్ కూడా నిర్వహించి, ఏపీకి వెళ్లారు. మరి మోపిదేవి చెప్పినట్లు.. ఇప్పుడు మంత్రి ఆదిమూలపు సురేష్ క్వారంటైన్‌లోనే ఉండాలి. మరి ఆయన అక్కడే ఉన్నారా? అన్నది ప్రశ్న.  నిబంధనల ప్రకారం వలస కూలీలను కూడా క్వారంటైన్‌లో పెడుతుంటే, వీరికి మాత్రం రెడ్‌కార్పెట్ వేసి ఆహ్వానించడం, రాజమార్గంలోనే పంపించటం బట్టి.. డబ్బున్న వారికి నిబంధనలు వర్తించవన్నది స్పష్టమవుతోంది.

కనగరాజ్‌కు క్వారంటైన్ వర్తించదా?

కరోనా వైరస్ వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది కాబట్టి.. వారిని బయటకు రావద్దని ప్రభుత్వాలు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ, శనివారం విజయవాడలో రాష్ట్ర ఎన్నికల సంఘ కమిషనర్‌గా పదవీబాధ్యతలు చేపట్టిన, 74 ఏళ్ల మాజీ న్యాయమూర్తి కనగరాజ్‌ను, చెన్నై నుంచి ఏ మార్గంలో అనుమతించారు? ఏవిధంగా అనుమతించారు? అన్న ప్రశ్నలు తెరపైకొచ్చాయి. నిబంధనల ప్రకారమైతే చెన్నై నుంచి వచ్చిన ఆయన   14 రోజుల క్వారంటైన్‌లో ఉండి తీరాలి. మరి ఆయన క్వారంటైన్‌లో ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు? ఎప్పుడు ఉన్నారు? అన్న ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. చివరకు పదవీబాధ్యతలు స్వీకరించే సమయంలో,  కనగరాజ్ కనీసం మాస్కు కూడా కట్టుకోకపోవడం మరో వివాదంగా మారింది.

దానిపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శలు కురిపించారు.  మాస్కులు లేకపోతే వెయ్యిరూపాయలు జరిమానా విధిస్తామని, ఇటీవలే కలెక్టర్లు హెచ్చరించారు. మరి ఆ ప్రకారంగా, కనగరాజ్‌కూ వెయ్యి రూపాయల జరిమానా విధించాలి కదా? ‘విజయవాడలో లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వారిపై కేసులు పెడుతున్నారు. ఆ లెక్కన కనగరాజ్‌పైనా కేసు నమోదు చేయాలి. ఆయన తమిళనాడు సరిహద్దుల నుంచి ఎలా వచ్చారు? లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించినట్లు కనిపిస్తూనే ఉన్నా ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయలేదు? వలస కూలీలను పట్టుకువచ్చి క్వారంటైన్‌లో పెడుతున్న ప్రభుత్వం, తమిళనాడు నుంచి వచ్చిన కనగరాజ్‌ను ఎందుకు క్వారంటైన్‌లో పెట్టలేదు. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు ఎలా అనుమతించార’ని టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

తెగిపోయిన  ని‘బంధనాలు’..

నిన్నటివరకూ విశాఖలో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపి విజయసాయిరెడ్డి కూడా, కనగరాజ్ ప్రమాణస్వీకారం కోసం విజయవాడ వచ్చి, ఎన్నికల కార్యాలయంలో ఉన్న కనగరాజ్‌ను కలవడం మీడియాలో కూడా దర్శనమిచ్చింది. మరి విశాఖ నుంచి విజయవాడకు రావాలంటే రెండు, మూడు జిల్లాలు దాటాల్సి ఉంటుంది. అక్కడ పోలీసు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ఉంటాయి. కరోనా ప్రభావంతో ఇప్పుడు జిల్లా సరిహద్దులు కూడా మూసివేశారు. మరి ఆయనను అన్ని జిల్లాలు దాటి, విజయవాడకు ఎలా అనుమతించారన్నది ప్రశ్న.

ఇక  ఏపీసీపీడీసీఎల్ ఎండి పద్మా జనార్దన్‌రెడ్డి, గురువారం హైదరాబాద్‌కు వాహనంలో వెళ్లడం ఆ శాఖలో చర్చనీయాంశమయింది. ఇంత క్లిష్ట పరిస్థితిలో విద్యుత్‌శాఖ సమస్యలను పర్యవేక్షించాల్సిన ఆయన, దానిని వదిలేసి అర్ధంతరంగా హైదరాబాద్ వెళ్లడానికి అనుమతించిన వైనంపై, ఆ శాఖలో చర్చ జరుగుతోంది. ఆయన ఉన్నతాధికారుల అనుమతితో సరిహద్దు దాటారా? లేక స్థానిక శాఖ అధికారులు పోలీసులను మేనేజ్ చేసి, సరిహద్దులు దాటించారా? అన్న చర్చ జరుగుతోంది.  కాగా,  తమకు సోమవారం సమావేశం ఉందని, సీపీడీసీఎల్‌కు టారిఫ్ ఇంకా ఖరారు చేయనందున, దానిపై చర్చించేందుకు వచ్చానని ఆయన ‘సూర్య’కు చెప్పారు. అయితే, సోమవారం సమావేశం ఉందని చెప్పిన ఆయన, గురువారమే హైదరాబాద్ వెళ్లడం ప్రస్తావనార్హం. నిజానికి ఆ శాఖలో పనిచేసే ఉన్నతాధికారులు, హైదరాబాద్ వెళ్లేందుకు చాలారోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఉన్న వారి కుటుంబసభ్యులతో, కనీసం ఒకరోజయినా గడిపిరావాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, సరిహద్దులు మూసివేయడంతో అది సాధ్యం కావడం లేదు. కానీ, ఎండికి మాత్రం సమావేశానికి ముందుగానే అనుమతి ఇవ్వడం విశేషం.

అన్నీ మూసుకుపోయినా..

నిజానికి.. ఈ సమయంలో విమానాలు, బస్సులు తిరగడం లేదు. కొన్ని ప్రత్యేక అనుమతులతో ఔషధాలు, నిత్యావసర వస్తువులు చేరవేసేందుకు కార్గో విమానాలకు తప్ప, ప్రత్యేక విమానాలకూ అనుమతి లేదు. పౌరవిమానయాన శాఖ కూడా ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. రాష్ట్ర సరిహద్దులు మూసేశారు కాబట్టి, వ్యక్తిగత వాహనాలకు ఎలాగూ అనుమతి లేదు.  గ్రామాల్లో కూడా, బయటవారెవరూ తమ గ్రామాల్లోకి రావడానికి వీల్లేదని కంచెలు కట్టేశారు. కాబట్టి, గ్రామాల గుండా వెళ్లడం కూడా అసాధ్యం. మరి ఇన్ని దారులు మూసుకుపోయినప్పుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వీపీఐలు ఏవిధంగా విజయవాడ తాడేపల్లికి, హైదరాబాద్‌కు వెళ్లి వస్తున్నారన్నది ప్రశ్న.