కేసీఆర్ అవునందే.. సింగిరెడ్డి కాదనిలే!

47

మంత్రుల మాటలకు అర్ధాలు వేరులే
బత్తాయి రాజధాని మార్కెట్‌కు రానట్టే
రాజధానికి తరలించాలన్న సీఎం కేసీఆర్
అసాధ్యమని మంత్రి సింగిరెడ్డి స్పష్టీకరణ
కేంద్రమే చూసుకోవాలని వింత వాదన
కేసీఆర్ ఆదేశాలన్నీ ఉత్తుత్తివేనన్న భాజపా
              (మార్తి సుబ్రహ్మణ్యం)

ముఖ్యమంత్రి మాట శిలాశాసనం. అందులోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ చెబితే అది అక్షరరూపం దాల్చి, ఆగమేఘాలపై అమలుకావలసిందే. కానీ.. మంత్రి గారు మాత్రం, ఆయన ఆదేశాలకు విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. బత్తాయిపై సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు కుదిరేపని కాదన్నట్లుగా సాగిన మంత్రి సింగిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

అసలేం జరిగిందంటే.. తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ, మహ బూబ్‌నగర్ జిల్లాల్లో అధికంగా పండించే బత్తాయిలకు  బోలెడంత డిమాండ్ ఉంది. అయితే ఎగుమతులపై నిషేధం ఉండటం, ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా కొనుగోలు చేయకపోవడంతో రైతు కుదేలవుతున్నాడు. దీనిపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, బీజేపీ నేత డి.కె.అరుణ కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. బత్తాయి కష్టాలపై మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి.

దానితో స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో పండించిన బత్తాయిని ఎగుమతి చేయవద్దని ఆదేశించారు. హైదరాబాద్ ప్రజలకు అది రోగనిరోధక శక్తి పెంచుతుంది కాబట్టి, నల్లగొండ, మహ బూబ్‌నగర్ జిల్లాల్లో ఉత్తత్తి అయిన బత్తాయిని,  గ్రేటర్ హైదరాబాద్‌కు సరఫరా చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎందుకంటే బత్తాయి, నిమ్మలో రోగనిరోధక శక్తి పెంచే సి విటమన్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి దూరదృష్టితోనే కేసీఆర్ ఈ ఆదేశాలు ఇచ్చినట్లు కనిపిస్తోంది. దీనితో బత్తాయి పండించే రైతులలో, పోయిన ప్రాణం లేచివచ్చినట్లయింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ఆదేశించినందున, ఇక తమకు ఎలాంటి సమస్యలూ ఉండవని రైతులు ఆశించారు. ఆప్రకారంగా కనీసం, తమ పంటకు నాగపూర్ మార్కెట్ స్థాయిలోనయినా రేటు వస్తుందని భావించారు. నిజానికి ఈ సీజన్‌లో టన్నుకు 40 వేల రూపాయలు వస్తుంది. కానీ తాజా పరిస్థితుల వల్ల అది 30 వేలకు పడిపోయింది. అయినా సరే, వాటిని కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వడ ంతో, ఇప్పటివరకూ రైతాంగం ఆయన హామీపైనే ఆశలు పెట్టుకున్నారు.

అయితే, తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు, ఆశయాలకు పూర్తి విరుద్ధంగా ఉండటంతో..  రైతులు మళ్లీ నిరాశలో కూరుకుపోయారు. తాము పండించిన బత్తాయిని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయక, అటు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు పర్మిట్లూ ఇప్పించకపోతే తమ పెట్టుబడులు, జీవనోపాథి ఏం కావాలని తెలంగాణ బత్తాయి రైతాంగం తలపట్టుకుంది. బత్తాయి సరఫరాపై కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు పరిశీలించామని, అయితే అది కష్టమని మంత్రి సింగిరెడ్డి తేల్చేశారు. ఈ పరిస్థితిలో రైతుల నుంచి బత్తాయి ప్రొక్యూర్‌మెంట్ చేసి హైదరాబాద్‌లో అమ్మడం కుదిరేపని కాదని స్పష్టం చేశారు.  పైగా అది కేంద్ర ప్రభుత్వ పరిథిలోని అంశమని, నెపం కేంద్రంపై నెట్టివేయడం మరో ఆశ్చర్యం. దీనితో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలకే విలువలేకపోతే ఎలా? ఇది ఎలాంటి సంకేతాలకు దారితీస్తుంది? ప్రతిపక్షాలకు ఎలాంటి అస్త్రాలు అందిస్తుందన్న  ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించి..  ఇప్పటికే ఉత్తర భారతదేశం, పక్కనున్న ఏపీ, కర్నాటక రాష్ట్రాలకు ఎగుమతులకు పర్మిట్లు ఇప్పిస్తే.. బత్తాయి రైతాంగం కొద్ది నష్టాలతోనయినా, బయటపడుతుందని రైతు సంఘాలు చెబుతున్నాయి.  ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలకే దిక్కు లేకపోతే, ఇక మిగిలిన వారి సంగతేమిటన్న చర్చ ఈ సందర్భంగా తెరపైకొచ్చింది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతుల కోసం పర్మిట్లు ఇస్తామన్న మంత్రి మాటను,  రైతు సంఘాలు గుర్తు చేస్తున్నాయి. బత్తాయికి మిగిలిన రాష్ట్రాల్లో బోలెడంత డిమాండ్ ఉంటే, ఎగుమతులకు పర్మిట్లు ఇవ్వకుండా.. అదంతా ఉత్తరాది మార్కెట్‌పై ఆధారపడిన అంశమని చెప్పడం, పూర్తిగా కేంద్రప్రభుత్వ పరిథిలోని అంశమంటూ,  బంతిని కేంద్రం కోర్టు వైపు నెట్టడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఎక్కడ పంటను అక్కడ మార్కెట్ కల్పించకుండా, ఈ అవరోధాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

సీఎం ఆదేశానికి  విలువ ఇంతేనా?: సంకినేని

ముఖ్యమంత్రి ఇస్తున్న ఆదేశాలు, చేస్తున్న ప్రకటనల్లో ఏమాత్రం పస, విలువ లేదన్న విషయం మంత్రి సింగిరెడ్డి మాటల్లో తేలిపోయిందని తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. బత్తాయిని ఇక్కడే అమ్మడం ద్వారా, సి విటమన్ మన రాష్ట్ర ప్రజలకు అందించవచ్చన్నది ముఖ్యమంత్రి ఉద్దేశంగా కనిపిస్తున్నప్పటికీ, దానిని ఆచరణలో చూపించడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. అసలు ప్రభుత్వమే రవాణా వ్యవస్థను చేపడితే ఇలాంటి సమస్యలు ఉండవన్నారు. అరటికి మార్కెట్ లేక, వరంగల్ వంటి జిల్లాల్లో చెట్లపైనే ఎండిపోతున్న విషాదాన్ని చూస్తూ కూడా, ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు ఉండటం భావ్యం కాదన్నారు. అయినా అసలు నిత్యావసర వస్తువులు, కూరగాయల రవాణాపై దేశవ్యాప్తంగా ఎలాంటి నిషేధం లేనప్పుడు.. బత్తాయిని హైదరాబాద్ మార్కెట్‌కు తీసుకువెళ్లడానికి, వచ్చిన ఇబ్బందులేమిటని సంకినేని ప్రశ్నించారు.  నల్లగొండ, పాలమూరు బత్తాయికి ఉన్న డిమాండ్ గురించి చిన్నపిల్లవాడు కూడా చెబుతాడ ని, అలాంటిది ఇతర రాష్ట్రాలకు పర్మిట్లు ఇచ్చి రైతులను ఆదుకోవడం కేసీఆర్ ప్రభుత్వానికి చేతకావడం లేదని దుయ్యబట్టారు. హైదరాబాద్ మార్కెట్‌కు తరలించాలని  కేసీఆర్ ఆదేశాలిస్తే, అది అసాధ్యమని స్వయంగా సంబంధిత మంత్రి స్పష్టం చేశారంటే.. సీఎం కేసీఆర్ ఈవిధంగా ఇంకా ఎన్న అంశాలపై ఉత్తుత్తి ఆదేశాలు, హామీలు ఇస్తున్నారో ప్రజలు గ్రహించాలన్నారు.

రాష్ట్రంలో పండిన బత్తాయికి, కేంద్రానికి సంబంధం ఏమిటని, బత్తాయిలు ఒక ప్రాంత ప్రజలే వాడతారా? అని ప్రశ్నించారు. ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ బత్తాయి వాడతారని, రోగులు తప్పనిసరిగా వినియోగిస్తారని గుర్తు చేశారు. బోడిగుండుకు, మోకాలుకూ ముడిపెడుతున్న ప్రభుత్వ మతిలేని విధానాల వల్ల, రెండు జిల్లాల బత్తాయి రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బత్తాయి రైతులకు ఏం జరిగినా, అందుకు కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని సంకినేని స్పష్టం చేశారు.