జగన్ ఆ అవమానం సహించలేకపోతున్నారా?
అందుకే నిమ్మగడ్డ రమేష్ పదవికి ఎసరు
 ఆర్డినెన్స్‌పై వెంటనే గవర్నర్ ఆమోదం
కోర్టుల్లో చెల్లదంటున్న న్యాయనిపుణులు
కుదరదన్న బాబు, కన్నా,  రామకృష్ణ
రాజ్యాంగవిరుద్ధమని గవర్నర్‌కు కన్నా లేఖ
                (మార్తి సుబ్రహ్మణ్యం)

దేశమంతా కరోనా వైరస్ నివారణలో తలమునకలయింది. వైరస్ విస్తరించకుండా చేపట్టవలసిన చర్యలపై, కేంద్రం కంటిమీదకునుకు లేకుండా పనిచేస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకూ, అందరూ కరోనా మహమ్మారిని ఎలా తరిమివేయాలన్నదానిపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అటు  కరోనా అనుమానితులకు చికిత్స అందించేందుకు, వైద్యులు యుద్ధక్షేత్రంలో ముందుండి అహోరాత్రులు కృషి చేస్తున్నారు. లాక్‌డౌన్ అమలు కోసం, పోలీసులు సిపాయిల మాదిరిగా పనిచేస్తున్నారు. పారిశుధ్యపనివారు, నర్సులు తమ కర్తవ్య నిర్వహణలో మునిగిపోయారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రం.. ఈ క్లిష్ట సమయంలో కూడా,  స్థానిక సంస్థలు పూర్తి చేయాలన్న తన కోరికను భగ్నం చేసిన, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ను ఎలా తొలగించాలి? తమకు కావలసిన వారిని ఎంతమందిని  సలహాదారులుగా నియమించాలి? కరోనాపై కేంద్రం ఇచ్చిన వెయ్యిరూపాయల సాయాన్ని, తన సర్కారు సాయం ఖాతాలో ఎలా వేసుకోవాలన్న ఆలోచనలో నిమగ్నమయినట్లు ఆయన చర్యలు స్పష్టం చేస్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ మార్చి 15న ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై జగన్మోహ న్‌రెడ్డి సర్కారు ఏప్రిల్ 10న ప్రతీకారం తీర్చుకుంది. ఆయన పదవీకాలాన్ని మూడేళ్లకు కుదించడం ద్వారా, నిమ్మగడ్డపై వేటు వేసింది. ఆమేరకు ఆర్డినెన్స్ ఇవ్వాలన్న జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ కోరికను గవర్నర్ వెంటనే తీర్చడం, రాష్ట్ర న్యాయశాఖ ఆమోదం తెలపడం, ఆ ప్రకారంగా నిబంధనల ప్రకారం, నిమ్మగడ్డ పదవీకాలం ముగిసినట్లు  పంచాయితీరాజ్‌శాఖ జిఓ 31, న్యాయశాఖ 617,618 ఉత్తర్వులి ఆదేశాలివ్వడం చకచకా జరిగిపోయింది. ఇందులో ఎక్కడా తొలగిస్తున్నామన్న పదం లేకుండా జాగ్రత్త పడటం విశేషం.  చివరకు దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు గవ్నరర్‌కు లేఖ రాసినా,  ఫలితం లేకుండా పోయింది. అయితే, దీనిని కోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఆ అవమానం మర్చిపోలేకపోతున్నారా?

కరోనా పాజిటివ్ కేసులు ఓవైపు… దాని మరణాల తీవ్రత మరోవైపు పెరుగుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ను, ఏవిధంగా ఆ పదవి నుంచి తొలగించాలన్న ప్రయత్నాల్లో బిజీగా ఉండటం విస్మయపరుస్తోంది. దీన్నిబట్టి.. జగన్మోహన్‌రెడ్డి తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోతున్నారని, ఎన్నికలు నిలిపివేయడంతోపాటు, తాను నియమించిన ఎస్పీ, కలెక్టర్, డీఎస్పీలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వేటు వేయడాన్ని, నెలరోజులు దాటుతున్నా జీర్ణించుకోలేకపోతున్నారన్నది స్పష్టమయింది. తనను అవమానించిన వారిని ఆయన వదిలిపెట్టరన్న సంకేతం కూడా ఇచ్చింది.

నిబంధనలు ఏమంటున్నాయి?

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ స్థానంలో, ఒక హైకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమించాలని, ప్రస్తుతం ఉన్న ఆరేళ్ల పదవీకాలాన్ని మూడేళ్లకు కుదించేలా ఆర్డినెన్స్ ఇవ్వాలని కోరుతూ, జగన్ సర్కారు తాజాగా గవర్నర్‌కు ప్రతిపాదన పంపించడం సంచలనం సృష్టిస్తోంది. కరోనా కారణంగా, స్థానిక సంస్థల ఎన్నిక లు వాయిదా వేస్తూ నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న నిర్ణయంపై, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి భగ్గుమన్నారు. ఎప్పుడూ మీడియాతో మాట్లాడని ఆయన, హటాత్తుగా ప్రెస్‌మీట్ ఏర్పాటుచేసి.. నిమ్మగడ్డను విమర్శిస్తూ, ఆయనకు కులాన్ని ఆపాదించేలా బహిరంగంగానే విరుచుకుపడ్డారు. సీఎం నేనా? ఆయనా? అని హుంకరించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని కూడా సీఎం మనసెరిగి, నిమ్మగడ్డకు లేఖ రాశారు. రాష్ట్రంలో మరో నాలుగువారాలు కరోనా వైరస్ ప్రభావం ఉండే అవకాశం లేనందున, స్థానిక సంస్థల నిర్వహణకు అనుమతించాలని లేఖలో కోరారు. ఈ మధ్యలో ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ని హుటాహుటిన పిలిపించి, నిమ్మగడ్డను ఎలా సాగనంపాలో మంతనాలు జరిపారు.

జగన్మోహన్‌రెడ్డి మనోభావాలకు అనుగుణంగానే.. స్పీకర్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకూ నిమ్మగడ్డను.. వాడు, వీడు అని సంబోధిస్తూ విమర్శలు కురిపించారు. ఓ ఎమ్మెల్యే అయితే లోఫర్ అని కూడా తూలనాడారు. ఇంకో ఎమ్మెల్యే కులగజ్జి వెధవ అని తిట్టిపోస్తూ,  నిమ్మగడ్డకు కులాన్ని ఆపాదించారు.
హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ చెప్పినా…
స్థానిక సంస్ధల ఎన్నికల వాయిదాపై, నిమ్మగడ్డ నిర్ణయాన్ని హైకోర్టు కూడా సమర్ధించింది. అయినా సరే.. పగ, ప్రతీకారంతో రగిలిపోతున్న జగన్మోహన్‌రెడ్డి సర్కారు, సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ కూడా నిమ్మగడ్డ నిర్ణయానికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. విచిత్రంగా రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ నిమ్మగడ్డ నిర్ణయాన్ని స్వాగతించాయి. నిమ్మగడ్డ అధికారం తగ్గిస్తూ మరో ఇద్దరిని కమిషనర్లుగా నియమించే ఆలోచన కూడా చేసినా, ఎందుకో దానిని అమలుచేయలేదు. చివరాఖరకు ఆ హోదా స్థానంలో హైకోర్టు మాజీ జడ్జిని నియమించి, మూడేళ్ల పదవీకాలానికి పరిమితం చేసేలా ఆర్డినెన్స్ ఇవ్వాలని గవర్నర్‌ను కోరగా, మూడేళ్ల పదవీకాల పరిమితిని కుదిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు.

నిమ్మగడ్డ లేఖతో కలకలం

కాగా, తనకు రక్షణ లేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవంటూ నిమ్మగడ్డ, కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపింది. తొలుత దానిని వైసీపీ ఫేక్ లెటర్‌గా యాగీ చేసింది. తర్వాత కేంద్రహోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, ఆయన లేఖ రాసిన మాట వాస్తవమేనని వెల్లడించడంతో వైసీపీ వర్గాలు తెల్లముఖం వేయాల్సి వచ్చింది. నిమ్మగడ్డ లేఖ తర్వాత, ఆయనతోపాటు, బెజవాడలోని ఆయన ఆఫీసుకు భద్రత పెంచారు. తాను హైదరాబాద్‌లోనే ఉంటూ విధులు నిర్వర్తిస్తానని నిమ్మగడ్డ లేఖలో పేర్కొన్న నేపథ్యంలో, ఆ విషయాన్ని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్.. తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఇదీ జగన్ వర్సెస్ నిమ్మగడ్డ వ్యవహారంలో జరిగిన సంఘటనలు.
చెల్లదంటున్న న్యాయనిపుణులు
అయితే.. జగన్ ప్రయత్నాల ఫలితంగా వచ్చిన ఆర్డినెన్స్  రాజ్యాంగపరంగా చెల్లుబాటు కావని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా, అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్లుగా హైకోర్టు మాజీ న్యాయమూర్తులు లేరని గుర్తు చేస్తున్నారు.  జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం గవర్నర్‌కు చేసిన ఈ సిఫార్సు, ఇచ్చిన ఆర్డినెన్స్ కూడా,  రాజ్యాంగవిరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయవాది గల్లా సతీష్ వ్యాఖ్యానించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 1951లో ఏర్పడిన ఈ చట్టంలో.. సెక్షన్ 19 ఏ ప్రకారం, కేంద్ర ఎన్నికల కమిషనర్ తన విధులు నిర్వహించుకునేందుకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్లను నియమించిదని చెప్పారు. ఆ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో నియమించబడిన సదరు రాష్ట్ర ఎన్నికల కమిషనర్, విధిగా అఖిలభారత సర్వీసుకు చెందిన వారై ఉండాలని చట్టం పేర్కొందని వివరించారు. సెక్షన్ 146 (బి) ప్రకారం..  సదరు అధికారి తన విధులను ఎక్కడనుంచయినా నిర్వర్తించుకునే అధికారం కూడా ఉందని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం ఆరేళ్లు లేదా 65 సంవత్సరాలుగా నిర్దేశించారని వివరించారు. ఒకవేళ ఆయనను తొలగించాలంటే, కేంద్ర ఎన్నికల కమిషన్ లేదా లోక్‌సభకు ఆ అధికారం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఆయనను తొలగించకుండా, పదవీకాలం తగ్గిస్తూ సిఫార్సు చేసినందున.. రాజ్యాంగం ప్రకారం, అది కూడా చెల్లదని స్పష్టం చేశారు. దీనిపై గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చినా చెల్లదని, ఆ అధికారం కేవలం సీఈసీకే ఉందని చెప్పారు. ఆరేళ్ల ఎన్నికల సంఘం కమిషనర్ల పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించాలంటే, రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. ఎవరైతే నియమిస్తారో, వారే తొలగించాల్సి ఉంటుందన్నారు.  హైకోర్టు మాజీ న్యాయమూర్తులు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్లుగా దేశంలో ఎక్కడా లేరని, చట్టంలో కూడా ఆవిధంగా లేదని గల్లా సతీష్ వివరించారు.

ఆర్డినెన్స్‌కు ఇది సందర్భమా?

దేశం మొత్తం కరోనా కల్లోలంలో మునిగి, దాని నుంచి ఎలా తప్పించుకోవాలని ఆరాటపడుతున్న సమయంలో.. నిమ్మగడ్డ వ్యవహారంపై దృష్టి సారించడాన్ని,  అన్ని వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. అసలు లాక్‌డౌన్ ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. స్వయంగా ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ కొనసాగించాలని కేంద్రాన్ని కోరింది. అంటే కరోనా తీవ్రత, వైరస్ ప్రభావం ఏ స్ధాయిలో ఉందో స్పష్టమవుతూనే ఉంది. ఈ విపత్తు సమయంలో, సర్వశక్తులూ దానిపైనే కేంద్రీకరించాల్సింది పోయి, వ్యక్తిగత కక్షలకు, ప్రతిష్టకు వెళ్లడాన్ని ప్రతిపక్షాలు నిరసిస్తున్నాయి. దీన్నిబట్టి.. జగన్ ప్రభుత్వం తనను వ్యతిరేకించేవారిని, సమయం సందర్భం లేకుండా వెంటాడుతోందన్న విషయం స్పష్టమవుతోందంటున్నారు. అసెంబ్లీ పంపిన బిల్లును వెనక్కి పంపినందుకు, కౌన్సిల్‌ను కూడా రద్దు చేశారని గుర్తు చేస్తున్నారు.

ఇదేం పద్ధతి?: విపక్షం

కాగా జాతి విపత్తు సమయంలో కూడా.. తనను వ్యతిరేకించిన వారిని తొలగించడం, కావలసిన వారికి పదవులిస్తూ ఉత్తర్వులిస్తున్న ప్రభుత్వాన్ని ఇక్కడే చూస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ఆర్డినెన్స్ ద్వారా, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని జగన్ రుజువుచేశారన్నారు. జగన్ తీరు చూస్తుంటే హైకోర్టును కూడా రద్దు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఇంతటి అరాచకాలు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై పోలీసు కేసులు పెడుతున్నారని, కిట్లు లేవని చెప్పినందుకు నిమ్మగడ్డ రమేష్‌ను సాధించేందుకు, జగన్ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆరేళ్ల పదవీకాలం నిర్దేశాన్ని ఇప్పుడు మార్చడం కుదరదన్నారు. దీనిపై తాము గవర్నర్‌కు లేఖ రాశామన్నారు. కరోనాపై దేశమంతా యుద్ధం చేస్తుంటే, జగన్ మాత్రం తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపైనే ఎక్కువ దృష్టి సారించడం దురదృష్టకరమన్నారు. ఈ శ్రద్ధ పాలనపై పెట్టాలని కన్నా సూచించారు.

ఆర్డినెన్స్‌పై తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు కూడా విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రక్రియ సగంలో ఆగి ఉన్న సమయంలో, దొడ్డిదారిన ఎస్‌ఈసీని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు ఈ-మెయిల్ ద్వారా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని సెక్షన్ 243 (కె) ప్రకారం,  2016లో ఆరేళ్ల పదవీకాలానికి నిమ్మగడ్డ నియమింపబడ్డారని గుర్తు చేశారు. ఎలాంటి నిబంధనయినా కమిషనర్ పదవీకాలం ముగిసిన తర్వాతనే చేయాలని, ఈలోగా ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని బాబు  కోరారు.
జగన్ కక్షసాధింపు, ఫ్యాక్షనిస్టు మనస్తత్వం మరోసారి బయటపడిందని, తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు విరుచుకుపడ్డారు. జగన్ ప్రయత్నాలు కోర్టులో చెల్లవని స్పష్టం చేశారు. కరోనా సమయంలో కూడా కక్ష సాధింపు చర్యలేమిటని నిలదీశారు. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ కూడా, ఎస్‌ఈసీ విషయంలో జగన్ ప్రయత్నాలను ఖండించారు. గవర్నర్ ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదన్నారు. గవర్నర్ ఆర్డినెన్స్ దురదృష్టకరమని, ప్రజాస్వామ్యానికి ఇదో గాయమన్నారు.

By admin

One thought on “కరోనా కల్లోలం లోనూ నిమ్మగడ్డ ఆలోచనలేనా?”
  1. […] ఇంకా.. లిక్కరు, భూముల కొనుగోలులో అవినీతి, నిమ్మగడ్డతో పోరాటం అంశాలనూ ప్రస్తావించిన ఉండవల్లిని, వైసీపీ నేతలు మనసారా అభినందిస్తున్నారు. ప్రధానంగా నిమ్మగడ్డ వ్యవహారంపై ఉండవల్లి చెప్పిన లాజిక్కును వైసీపీ నేతలు సమర్ధిస్తున్నారు. ‘నిమ్మగడ్డను ఆ స్థానంలో ఉంచితే పోయేదేముంది? ఆయన కమిషనర్‌గా ఉంటే ఏం చేయగలరు? ఆ స్థానంలో చంద్రబాబును పెట్టినా ఏం చేయగలరు? కలెక్టర్లు, ఎస్పీలకు ఆర్డర్లిస్తారు. ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉంది. అలాంటప్పుడు అధికారులు మీ మాట వింటారా? నిమ్మగడ్డ వింటారా? అయినా అసలు నేరుగా జగనే ఆయన మీద విమర్శలు చేయడం ఏమిట’ని ఉండవల్లి సంధించిన ప్రశ్న. పైగా.. ‘అంతా ఎల్వీ సుబ్రమణ్యం మాదిరిగా గోవిందా అనుకుని అంతా దేవుడే చూసుకుంటారనుకోరు. నిమ్మగడ్డలుంటారు. ఏబీ వెంకటేశ్వరరావులుంటారు. వాళ్లు పాలించారు. వాళ్లకు దన్ను ఉంది’ అని.. అందరూ ఎల్వీ సుబ్రమణ్యం మాదిరిగా మౌనంగా ఉండరన్న  ఓ హెచ్చరిక సంకేతం పంపించారు.ఇది కూడా చదవండి: కరోనా కల్లోలం లోనూ నిమ్మగడ్డ ఆలోచనలే… […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner