వైద్యో.. నారాయణా … ‘హరీ’మంటున్నారు!

73

ఏపీలో వైద్యులకే రక్షణ పరికరాల కరవు
వైద్యం చేయలేమని చేతులెత్తేస్తున్న వైద్యులు
విధుల్లోకి రమ్మని బుజ్జగిస్తున్న కలెక్టర్లు
ప్రైవేటు డాక్టర్లదీ అదే దారి
కిట్లు లేవని చెప్పినందుకు డాక్టర్‌పై వేటు
తెలంగాణ దారిలోనే ఏపీ జూనియర్ డాక్టర్లు
దెబ్బతింటున్న వైద్యుల ఆత్మస్థైర్యం
        (మార్తి సుబ్రహ్మణ్యం)

ఎవరైనా మాస్కులు లేకుండా బయటకు వస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని గుంటూరు జిల్లా కలెక్టర్  హెచ్చరించారు. కానీ, నర్సీపట్నంలో ఓ డాక్టర్.. తమకు మాస్కులు కూడా ఇవ్వడం లేదని  గోడు వెళ్లబోసుకుంటే, అంబులెన్స్‌లో ఉత్తర్వులు పంపి మరీ ఆయనను సస్పెండ్ చేశారు. మరోవైపు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో, రక్షణ పరికరాలు లేకుండా తాము వైద్య చేయలేమని వైద్యులు విధులు బహిష్కరించారు. కర్నూలు సర్కారు ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. కరోనా యుద్ధక్షేత్రంలో, ముందువరసలో నిలబడి యుద్ధం చేస్తున్న వైద్య సైనికుల కష్టాలివి.

తమ ప్రాణాలనే పణంగా పెట్టి, రోగులకు ప్రాణం పోసే వైద్యులే త గిన రక్షణ కవచాలు లేక హరీమంటున్న పరిస్థితి నెలకొంది. ఫలితంగా వారి మనోస్ధైర్యం దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా అనుమానితులకు వైద్యసేవలందిస్తున్న పలువురు వైద్యులు, నర్సులు ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లలో ఉంటున్న దారుణ పరిస్థితి నెలకొంది. వైద్యులు, నర్సులు, క్షేత్రస్ధాయిలో పర్యటనలు చేసే ఉన్నతాధికారులకు ఇవ్వాల్సిన ఎన్-95 మాస్కులు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల వద్ద కనిపిస్తుండటం వైద్యులకు ఆగ్రహం కలిగిస్తోంది. ఎన్-95 పెట్టుకుని తిరుగుతున్న అధికారపార్టీ నేతల వీడియోలు, ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, గ్లౌజులు, గౌన్లు కరోనా అనుమానితులకు వైద్యసేవలందించే వారికి మాత్రమే కాదు. వైద్యులు, నర్సులందరికీ అవసరం. కానీ, నర్సీపట్నంలో కిట్లు లేవని చెప్పిన డాక్టర్ సుధాకర్ మత్తు డాక్టర్ అయినందున, ఆయనకు కిట్లు అవసరం లేదన్న వాదన తెరపైకి తీసుకురావడాన్ని వైద్యులు ఆక్షేపిస్తున్నారు. ఇదికూడా చదవండి..’  కరోనాపై నిజాలు చెబుతున్నారా?

ప్రైవేటు వైద్యులు కూడా సేవలందించాలని ఆదేశిస్తూ, జగన్మోహన్‌రెడ్డి సర్కారు తీసుకువచ్చిన ఎస్మా చట్టాన్ని వైద్యులు పెద్దగా ఖాతరు చేస్తున్నట్లు లేదు. అనంతపురం, కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు లేకుండా తాము వైద్యం చేయలేమని, ఇప్పటికే ప్రభుత్వ వైద్యులు విధులకు దూరంగా ఉంటున్నారు. వారితో కలెక్టర్లు చర్చలు జరిపి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. వైద్యులకు కిట్లు ఎందుకు అందుబాటులో ఉంచలేదని అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, వారి స్థానంలో వైద్యం చేసేందుకు ప్రైవేటు వైద్యులు నిరాకరిస్తున్నారు. తమను అరెస్టు చేసినా ఫర్వాలేదంటున్నారు. మొత్తం భారం తమపైన వేస్తే కుదరదని, ముందు ప్రభుత్వ వైద్యులతో పనిచేయించాలని మెలిక పెడుతున్నారు.

కర్నూలు ప్రభుత్వాసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా ఎందుకు మార్చలేదని, రాష్ట్రంలో దానికొక్కటే ఎందుకు మినహాయింపు ఇచ్చారని, ప్రైవేటు వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికి నలుగురు వైద్యులకు వైరస్ సోకడమే వారి ఆందోళనకు అసలు కారణంగా కనిపిస్తోంది. పైగా, కరోనా చికిత్సతో ఎలాంటి సంబంధం లేని కార్డియాలజిస్టులు, సైకాలజిస్టులు, ఆర్ధోపెడీషియన్లను కూడా రావాలని ఇస్తున్న ఆదేశాలపై నిరసన వ్యక్తమవుతోంది.

అయితే మెడ్‌టెక్ జోన్, కాకినాడ సెజ్ నుంచి కరోనా కిట్లు ఆసుపత్రులకు పంపించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. కానీ, ఆ ఉత్పత్తి పూర్తయి, అవి ఆసుపత్రులకు చేరేవరకూ తాము కిట్లు లేకుండా, ఎలా వైద్యపరీక్షలు నిర్వహించాలని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సంఘం ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేయగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ డాక్టర్ల సంఘం కూడా అదే బాట పట్టింది. వైద్యులకు రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం వల్ల, అనంతపురంలో ఇద్దరు వైద్యులు, ఇద్దరు నర్సులకు వైరస్ సోకిందని సంఘం రాష్ట్ర అధ్య్యక్షుడు డాక్టర్ ఎన్.దీప్‌చంద్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని, సరైన కిట్లు సరఫరా చేయకపోతే, ఇలాంటి కేసులు మరిన్ని పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలో వైద్యులు రక్షణ కిట్లు కావాలని ఎంతోకాలం నుంచి అడుగుతున్నా, ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను, ఆయన స్వయంగా తన వీడియోలో స్పష్టం చేశారు. ఇలాంటి ఆందోళన వ్యక్తం చేసిన నర్సీపట్నం డాక్టర్‌ను సస్పెండ్ చేసినట్లే.. మరి ఈయనపైనా ప్రభుత్వం చర్యల కొరడా ఝళిపిస్తుందో చూడాలి.

ఏపీలో కరోనా అనుమానిత కేసులు పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ వైద్యులు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉంటే, మంత్రులు మాత్రం అన్ని కిట్లు పంపిణీ చేస్తున్నామని వాదించడం.. ఎల్లో మీడియా కావాలనే బురద చల్లుతూ, వైద్యుల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తోందని మంత్రులు ఎదురుదాడి చేస్తుండటం  విస్మయం కలిగిస్తోంది. ఇది కూడా చదవండి.. ‘ మీడియా పై మరకలు మామూలే!

పైగా తమ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, ఆందోళన వ్యక్తం చేసిన వైద్యుల సమస్యలు పరిష్కరించే బదులు, వారికి రాజకీయ పార్టీల రంగు పూయడం వెగటు కలిగిస్తోంది. అసలు వైద్యుల వద్ద ఉండాల్సిన ఎన్-95 మాస్కులు అధికారపార్టీ నేతల వద్దకు ఎలా చేరాయని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.