మీడియా పై మరకలు మామూలే!

917

మీడియా కోణం అప్పుడూ అదే..
కేసీఆర్ నుంచి జగన్ వరకూ..
గతంలో మీడియా మైండ్‌సెట్ మారాలన్న బాబు
విపక్షంలో సహాయ కార్యకమ్రాలపై జగన్ విమర్శలు
ఇప్పుడు విపక్షం విమర్శలను సహించలేని పరిస్థితి
విపక్షంలో ఉంటే విమర్శలు  ఓ హక్కు
అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ప్రజాద్రోహులు
అందుకు మీడియా అజెండాలూ  ఒక కారణమే
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏమిటీ మకిలి-వెకిలి రాతలు? ఇవి మనకు అవసరం లేదు. అవి ప్రజాద్రోహులు. దేశద్రోహులు. ఇలా రాసిన వాళ్లకు కరోనా రావాలని శపిస్తున్నా. మిమ్మల్ని వదలిపెట్టను. ఏం ప్రశ్నలేస్తావయా? ఏ పేపర్ నీది? ఇదేనా నీ పత్రిక ఇచ్చిన ట్రైనింగ్?. మీరు కూడా ఇలా రాసే వారిని ప్రశ్నించాలి’- ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఓ విలేకరి వేసిన ప్రశ్న.. ఓ పత్రిక రాసిన కథనంపైనా విరుచుకుపడిన తీరిది.
ఈ ఎల్లో మీడియా తీరు ఎంత దారుణంగా ఉందంటే, లేనిపోనివి రాస్తున్నారు. కొన్ని పత్రికలు ఇంకా చంద్రబాబుకు భజన చేస్తున్నాయి.అవాస్తవాలు రాస్తు, ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయి.కరోనా సమయంలో కూడా విషం చిమ్ముతున్నాయి’- ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు ఇటీవలి కాలంలో చేసిన విమర్శలు.
మీ మైండ్‌సెట్ కూడా మారాలి. ఎన్నికల సమయంలో రాజకీయాలు మాట్లాడాలి. ఇప్పుడు అభివృద్ధి గురించి ఆలోచించాలి’- సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలివి.

తెలుగురాష్ట్రాల్లో మీడియా పట్ల పాలకులు, రాజకీయ పార్టీల ధోరణి ఇది. గత కొన్నేళ్ల నుంచి ఈ వైఖరి మామూలుగా
మారిపోయింది. చిన్నా చితకా రాజకీయ నేత నుంచి, ముఖ్యమంత్రుల వరకూ మీడియాపై ఒంటికాలితో లేవడం
సాధారణమయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక వైఖరి. అవే పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు భిన్నమైన ధోరణి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు తమ జన్మహక్కని ప్రతిపక్షాలు భావిస్తాయి. ప్రభుత్వాలు సరిగా పాలించడం లేదని
భావిస్తుంటాయి. తమ ఆందోళనలు, సర్కారుపై తాము చేసే విమర్శలకు స్థానం కల్పించని మీడియాపై నిర్మొహమాటంగా కులం-
ప్రాంత ముద్ర వేస్తాయి. మీడియాపై అప్పటి ప్రభుత్వం దాడి చేస్తే, ప్రతిపక్షంగా దానిని ఖండిస్తాయి. రాష్ట్రంలో పత్రికాస్వామ్యం
మంట కలుస్తుందని యాగీ చేస్తాయి.

అధికారంలోకి వస్తే మారుతున్న గళాలు..

అదే విపక్షాలు అధికారంలోకి వస్తే.. తమపై విమర్శలు చేసే, అదే మీడియా చుట్టూ ముళ్లకంచెలు వేస్తాయి. ప్రతిపక్షాలను
అణచివేసేందుకు ప్రయత్నిస్తాయి. పాలనపై వ్యతిరేక కథనాలు, లేదా వార్తలు రాస్తే.. వారికి పార్టీల ముద్ర వేస్తాయి. ఎల్లో
మీడియా.. బ్లూ మీడియా.. పింక్ మీడియా.. ఇంకా ఎన్నో ముద్రలు! సమస్యలు వచ్చినప్పుడు వాస్తవాలు ప్రభుత్వ దృష్టికి
తీసుకువెళితే, వాటిపై కన్నెర్ర చేస్తాయి. ప్రకటనలు ఆపడం ద్వారా, ఆర్ధికంగా దెబ్బతీయాలని చూస్తాయి. ఇది కొన్నేళ్ల నుంచీ
కనిపిస్తున్న దృశ్యాలు. ఇవన్నీ జర్నలిస్టుల అనుభవంలోకి వస్తున్నవే!

సొంత మీడియా రాకతో మారిన కోణం

ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రభుత్వం, ప్రతి అంశాన్నీ.. మీడియా తమ కళ్ల నుంచి చూడాలని కోరుకుంటాయి. తమ ఆలోచనల
ప్రకారం ఉండాలని ఆశిస్తుంటాయి. అనుకూలంగా వస్తే పొగడ్తలు, వ్యతిరేకంగా రాస్తే శాపనార్ధాలు, గిట్టని మీడియాను
బహిష్కరించడం,  గత పదిహేను-ఇరవై సంవత్సరాల  నుంచి తెలుగునాటలో చూస్తున్నదే. ఏపీలో అయితే, ఇలాంటి బహిష్కరణ
పర్వాలు ఇంకా కొనసాగుతున్నాయి.  ఓ పదేళ్ల నుంచి ఈ పైత్యం మరింత పెరిగింది. రాజకీయ పార్టీలే సొంత చానెళ్లు, సొంత
పత్రికలు పెట్టుకోవడంతో..  మొత్తం మీడియా స్వాభావిక స్వరూపమే, సమూలంగా మారిపోయింది. జర్నలిస్టుల ఆలోచనా ధోరణి
కూడా ఉద్యోగ అవసరార్ధం, దానికి అనుగుణంగానే కనిపించడంలో ఆశ్చర్యం లేదు. దానితో సహజంగానే పాఠకుడు కూడా, ఏది
నిజమైన వార్త అని కనుక్కోవడం కష్టమయింది. అది వేరే కథ!

కేసీఆర్ ప్రెస్‌మీట్లలో..

గత కొద్దిరోజుల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కరోనాపై తరచూ ప్రెస్‌మీట్లు నిర్వహిస్తున్నారు. నిజంగా ఆయన దానిపై నిరంతర సమీక్ష నిర్వహిస్తున్నారు.  సహజంగా ఆయన తనకు అవసరం ఉంటే తప్ప, ఎప్పుడో గానీ మీడియాతో మాట్లాడరు. ఉద్యమంలో ఉన్నప్పుడు అదే కేసీఆర్, మీడియాతో తరచూ మాట్లాడేవారు. అది వేరే విషయం. కరోనాపై తాము ఏ స్థాయిలో యుద్ధం చేస్తున్నామో చెబుతున్న క్రమంలో..  ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్వారంటైన్లు, ఐసోలేషన్ వార్డుల్లో ఉన్న సౌకర్యాలు, వారికి చికిత్స చేస్తున్న వైద్యుల మనోభావాలు, వారి అసౌకర్యాలు, వలస కూలీల జీవన విధానం, బియ్యం పంపిణీపై విపక్షాల విమర్శల వంటి అంశాలు దొర్లాయి. వాటిని ప్రస్తావించిన జర్నలిస్టులపై ‘సారీ’ అంటూనే, కేసీఆర్ అగ్గిరాముడవటం టీవీల్లో అంతా చూశారు.

కేసీఆర్ కోపానికి కారణం అదే అయినా…

ముఖ్యమంత్రిగా  కేసీఆర్ అసహనం, ఆగ్రహానికి కారణం ఉండవచ్చు. కరోనా కల్లోల సమయంలో తన సర్కారు ఇంత
కష్టపడుతుంటే, సహకరించాల్సింది పోయి ప్రభుత్వ వైఫల్యాలు ప్రస్తావించడం,  ఆయన మనసుకు కష్టం కలిగించి ఉండవచ్చు.
ఆయనే చెప్పినట్లు.. ఏర్పాట్లలో నాలుగు తక్కువైనా దానిని తక్కువ చేసి చూపించాలని  పాలకుడిగా భావించి ఉండవచ్చు. కానీ,
మీడియా కోణం ఆవిధంగా ఉండదని గ్రహించకపోవడమే ఇక్కడ సమస్యకు కారణం. దేశంలో ఎన్నెన్నో ప్రకృతి వైపరీత్యాలు
వచ్చాయి. వస్తున్నాయి. కరువు, తుపాను సమయంలో ప్రజలకు జరిగిన నష్టం, ప్రభుత్వం బాధితులకు ఇచ్చే నష్టపరిహారం వారికి
సక్రమంగా అందుతుందా? లేదా? ఆ సమయంలో ఎన్ని అవకతవకలు జరిగాయో, వెలికితీసిన చరిత్ర మీడియాది. దానితో
పాలకులు కూడా మేల్కొని, లోటుపాట్లను సవరించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.

మీడియా కోణం అప్పుడూ అదే..

చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హైదరాబాద్ నగరంలో తొలిసారి రికార్డు స్ధాయిలో కురిసిన భారీ వర్షాలకు, కార్లు కూడా కాలువల్లో కొట్టుకుపోయాయి. ఆ తర్వాత బాధితులకు బియ్యం పంపిణీలో జరిగిన అక్రమాలను, ఇదే మీడియా బట్టబయలు చేసింది. నాటి సీఎల్‌పి నాయకుడు పి.జనార్దన్‌రెడ్డి, స్వయంగా టాంక్‌బండ్ వద్దకు వచ్చి వైశ్రాయ్ హోటల్ వద్ద వరద ఉధృతిని చూసి, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. ఆ సమయంలో తెలుగుదేశం ప్రముఖులుగా ఉన్న తలసాని శ్రీనివాసయాదవ్, కృష్ణాయాదవ్, సాయన్న, తీగల కృష్ఠారెడ్డి తదితరులు వరద ప్రాంతాల్లో వర్షంలో తడుస్తూనే పరిస్థితి సమీక్షించారు. ప్రభుత్వం కాలనీలకు పడవలు కూడా ఏర్పాటు చేసి, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసింది. తలసాని శ్రీనివాసయాదవ్ అయితే..  కొన్ని ప్రాంతాల్లో మోకాలు ఎత్తుపైన వచ్చిన నీటిలోనే నడుచుకుంటూ, బాధితులున్న నివాసాలకు వెళ్లారు. అయినా మీడియా, విపక్షం నుంచి ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా, ప్రభుత్వంపై ఈ విమర్శలేమిటని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, మంత్రులు గానీ.. ఇప్పటి కేసీఆర్ మాదిరిగా, మీడియాపై విరుచుకుపడలేదు. అప్పుడు ఇదే కేసీఆర్,  అదే బాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీలోనే ఉన్నారు.

తిత్లీ.. హుద్‌హుద్ తుపాన్ల సమయంలోనూ..

ఇదే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హుద్‌హుద్, తిత్లీ తుపాన్లు వచ్చాయి. అప్పుడు ఆయన స్వయంగా విశాఖలోనే బైఠాయించి, దగ్గరుండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారు. శ్రీకాకుళం వెళ్లి తిత్లీ బాధితులను పరామర్శించారు. అప్పుడు కూడా మీడియా.. సహాయ చర్యల్లో బాబు సర్కారు విఫలమయిందని, సహాయ కార్యక్రమాల్లో అవినీతి జరిగిందని విపక్షమైన వైసీపీతో జతకలిపింది. ఆ సమయంలో సహాయ కార్యక్రమాలపై వ్యతిరేక  కథనాలు రాస్తున్న మీడియాను బాబు తిట్టిపోసిన దాఖలాలు లేవు.  బాబు సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో విలయతాండవం చేసింది. అప్పుడు కూడా మీడియా అనేక ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రాసింది. రైతుల ఆత్మహత్యను ఎత్తిచూపింది.

గతంలో మీడియా మైండ్‌సెట్ మారాలన్న బాబు

చంద్రబాబు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన కీర్తి ప్రతిష్ఠలను జాతీయ, అంతర్జాతీయ మీడియా కొనియాడేవి. అయితే, రాష్ట్రంలో మీడియా మాత్రం తన పాలనపై విమర్శల పరంపర కొనసాగించటం, ఆయనకు నచ్చేదికాదు. వాటిపై  చిరాకు పడేవారు. మీడియా మైండ్‌సెట్ మారాలని క్లాసు ఇచ్చారు. ఏపీలో తన పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే చేరికను సమర్థించిన బాబు.. తెలంగాణలో మాత్రం, తెలుగుదేశం ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరితే, సంతలో పశువుల్లా వారిని కొన్నారంటూ విరుచుకుపడ్డారు. మీడియా దీనిని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.

అప్పట్లో వార్త పత్రిక మినహా,  పత్రికలన్నీ బాబు సర్కారుకు సహకరించేవి. అయితే, బాబు జాతీయ స్ధాయి రాజకీయాల్లో ప్రభావం
చూపినప్పుడు కూడా, తనపై వ్యతిరేకంగా రాసిన జర్నలిస్టులను గానీ, మీడియా సంస్ధలను గానీ విమర్శించేవారు కాదు.
ఇప్పటిమాదిరిగా ఎదురుదాడి చేసేవారు కాదు. మరీ శృతిమించుతున్నారనుకున్నప్పుడే, యాజమాన్యాలతో మాట్లాడేవారు.
దక్కన్‌క్రానికల్, ఆంధ్రభూమి పత్రికలు తనపై నిరంతరం వ్యతిరేక కథనాలు రాసినా, దాని యజమానులు వచ్చినపుడు మాత్రం
మర్యాదపూర్వకంగా కలిసేవారు. పవన్ కల్యాణ్‌తో ఆ సంస్థ ఉద్యోగుల వివాదం తలెత్తిన సందర్భంలో, స్వయంగా బాబు-సోమిరెడ్డి
ఆ సమస్యను పరిష్కరించారు.

వార్త పత్రిక తనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, తెలుగుదేశం వ్యవహారాలు చూసే ఆ జర్నలిస్టుతో అందరితోపాటే మాట్లాడేవారు.
ఆంధ్రభూమి జర్నలిస్టు విషయంలోనూ అంతే వ్యవహరించేవారు. ఎటొచ్చీ, రాష్ట్రం విడిపోయిన తర్వాతనే ఆయన వైఖరి
మారిందన్న వ్యాఖ్యలు వినిపించాయి. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును, ఉద్యోగం నుంచి తొలగించేలా ఒత్తిడి
చేశారన్న విమర్శ ఉంది.  ఇప్పటివరకూ ఉన్న రాజకీయ నాయకులలో, జర్నలిస్టులకు విలువ, గౌరవం ఇచ్చే అతికొద్దిమంది
నేతల్లో, చంద్రబాబు ఒకరుగా చెప్పక తప్పదు.

కేసీఆర్ నాడు అలా.. నేడు ఇలా..

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్పించారు. స్పీకర్ వారిపై అనర్హత వేటు వేయకుండా,  నాన్చుడు ధోరణి ప్రదర్శించారు. దానిపై నాడు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఇలాంటి చర్యలను మీరు కూడా సహించకూడదని మీడియాతో అన్నారు. అప్పట్లో కేసీఆర్‌కు ఇప్పటిమాదిరిగా పార్టీపరంగా సొంత పత్రిక, చానెల్ లేదు. ఆంధ్రోళ్ల మీడియా అని తిట్టిపోసేవారు. ఉద్యమ కాలంలో ఆ వార్తలకు ప్రాధాన్యం ఇవ్వని మీడియాపై కన్నెర్ర చేసేవారు. ఆ తర్వాత అవే మీడియా సంస్థలు చాలావరకూ కేసీఆర్ కనుసన్నలలో నడుస్తున్నాయి. కాంట్రాక్టర్లదీ అదే దారి. అది వేరే విషయం!

కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత,కాంగ్రెస్-తెలుగుదేశం ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్‌లో చేర్చుకున్నప్పుడు, కొన్ని మీడియా సంస్థలు దానిపై విమర్శలు చేస్తే ఆయన ఆగ్రహించారు. ప్రభుత్వ విధానాలు నచ్చి చేరితే, ఏమిటీ రాతలని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది తనతో టచ్‌లో ఉన్నారని పీసీసీ చీఫ్‌గా పనిచేసిన  పొన్నాల లక్ష్మయ్య చెప్పినప్పుడు, మీరు కూడా ఇలాంటి వాటిని ఖండించాలని కేసీఆర్ మీడియానుద్దేశించి వ్యాఖ్యానించిన రోజులున్నాయి. ఇప్పుడేమో, కరోనా సమయంలో క్షేత్రస్థాయి వార్తలు ప్రచురిస్తున్న మీడియాకు, కరోనా రావాలని శపిస్తున్నారు.

వైఎస్‌తో..  ఆరంభం!

రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతికి ప్రకటనలు నిలిపివేశారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి కోర్టుకు వెళ్లి ప్రకటనలు తెచ్చుకుంది. ఆయన  ‘ఆ రెండు పత్రిక’లని ఈనాడు, ఆంధ్రజ్యోతిని నేరుగానే నిందించేవారు. కారణం అవి తెలుగుదేశం పార్టీకి మానసిక మద్దతుదారులు కావడమే!  ఆ సమయంలో అనేక కుంభకోణాలని, అవి వెలుగులోకి తీసుకురావడం దానికి మరో  కారణం. రాష్ట్రంలోని ప్రధాన మీడియా సంస్థలన్నీ కమ్మ సామాజికవర్గానికి చెందినవి కావడం వల్ల, అవి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నందున, తానే తన కుమారుడు జగన్‌తో సాక్షి పత్రిక, చానెల్ పెట్టించారు. ఆ తర్వాత వైఎస్ వైఖరిలో కొంత మార్పు వచ్చినప్పటికీ, జర్నలిస్టులతో మాత్రం  సత్సంబంధాలనే కొనసాగించారు. ఈనాడు, జ్యోతిపై మాత్రం అప్పుడప్పుడూ వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. ‘ఈటీవీలు, ఆ టీవీలను నమ్ముకుంటే మేం అధికారంలోకి వచ్చేవాళ్లమా’ అని వ్యాఖ్యానించేవారు. ఆ తర్వాత సాక్షి.. కాంగ్రెస్ ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు చేసేది. వైఎస్ తన పార్టీని చీల్చినప్పటికీ, ఆయన కుమారుడు జగన్‌తో కేసీఆర్ సఖ్యతగా ఉండటం మరో విశేషం. దానికి కారణం శత్రువు శత్రువు మిత్రుడన్న ఫిలాసఫీ కావచ్చు.

ఏపీలో నాడు జగన్.. నేడు బాబు

ఏపీలో జగన్ విపక్షనేతగా ఉన్నప్పుడు,  తుపాన్లు వచ్చిన సందర్భాల్లో బాబు సర్కారు వైఫల్యంపై జగన్, ఆయన పార్టీ నేతలు విరుచుకుపడేవారు. ఆ సమయంలో జగన్ పక్క జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్నారు. అయినా వెళ్లి బాధితులను పరామర్శించలేదు. దానిని తెలుగుదేశం నేతలు తప్పుపట్టారు. తాజా కరోనా నేపథ్యంలో వైద్యులకు కిట్లు, మాస్కులు ఇవ్వడం లేదని, మరణాల సంఖ్యలో నిజాలు చెప్పడం లేదని బాబు, ఆయన పార్టీ నేతలు జగన్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు దానిని జగన్, ఆయన సహచరులు సహించలేకపోతున్నారు.

ఇప్పుడు కరోనా కల్లోల సమయంలో కూడా బాబు రాజకీయాలు చేస్తున్నారని, చిన్న చిన్న లోపాలు కూడా పెద్దవి చేస్తున్నారని వైసీపీ నేతలు ఆక్రోశిస్తున్నారు. బాబు హైదరాబాద్‌కు పారిపోయి, అక్కడ కూర్చుని విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు. వెయ్యిరూపాయల సాయంపై టీడీపీ, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు మనుషులేనా అని మంత్రులు, ఆయా పార్టీలపై కన్నెర్ర చేస్తున్నారు. గతంలో ప్రతిపక్షంగా తాను పోషించిన పాత్రనే, ఇప్పుడు తెలుగుదేశం పోషిస్తోందని వైసీపీ గ్రహించలేకపోవడమే అమాయకత్వం.

మీడియా కథనాలను నిజం చేసిన డాక్టర్ల ప్రకటన

ఇక మళ్లీ తెలంగాణలోకి వస్తే..  వైద్యులకు రక్షణేదీ అని ఆంధ్రజ్యోతి రాసిన కథనం కేసీఆర్ కోపానికి కారణమయింది. సరే
‘వెలుగు’ పత్రిక ఎలాగూ విపక్షానికి చెందినది కాబట్టి, ఆ కథనాల ముచ్చట సరేసరి.  అయితే, విచిత్రంగా తెలంగాణ జూనియర్
డాక్టర్ల సంఘం అసోసియేషన్.. తమకు సరైన కిట్లు, ఎన్-95 మాస్కులు, ఫేస్‌షీల్డులు, హ్యాండ్ శానిటైజర్ల కొరత ఉందని, ఈ
విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ, లోటుపాట్లు ఉన్నమాట నిజమేనని అధ్యక్షుడు విష్ణు
ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అందుకే ప్రమాదంలో ఉన్న తమకు సేఫ్టీగేర్లు అవసరమన్నారు. కరోనా యుద్ధక్షేత్రంలో ఉన్న
వైద్యులే, క్వారంటైన్లకు వెళితే వైద్య వ్యవ స్ధ ప్రమాద ంలో పడుతుందని, స్వయంగా విడుదల చేసిన ప్రకటనలో ఆందోళన
వ్యక్తం చేశారు. అందుకే పరికరాల కొనుగోలు కోసం విరాళాలు ఇవ్వాలని ఆయన వేడుకున్నారు. ఒకరకంగా ఇది కేసీఆర్
మీడియాపై చేసిన హెచ్చరికలకు, వైద్యసంఘం ఇచ్చిన పరోక్ష జవాబు. అదొక్కటే కాదు, తమ రక్షణకు సంబంధించి, మీడియా
కథనాలు నిజమేనని నేరుగా ఇచ్చిన సర్టిఫికెట్. మరోరకంగా వైద్యుల ప్రకటన.. విపక్షాలకు, ధైర్యంగా పోరాడే జర్నలిస్టు
సంఘాలకు ఒక అస్త్రం.

మరి జూనియర్ డాక్టర్ల సంఘాన్ని ఏం చేస్తారు?

ఆ ప్రకారంగా.. ‘వైద్యులకేదీ రక్షణ’ అని ‘ఆంధ్రజ్యోతి’లో రాసిన కథనం నిజమేనని, జూనియర్ డాక్టర్ల సంఘం రాసిన లేఖనే
రుజువుచేస్తుంది కదా? మరి వారిని కూడా మీ వైద్యం అవసరం లేదని, మీడియాను అన్నట్లు  అనలేరు కదా? మీడియాలో వచ్చే
కథ నాలు అబద్ధమైతే, కల్పితమైతే, వారిపై చర్యలు తీసుకునే  అధికారం, అవకాశం ప్రభుత్వాలకు ఎప్పుడూ ఉంటుంది.
మీడియా అంటే చట్టానికి అతీతమైనదేమీకాదు. జర్నలిస్టులకు ప్రత్యేక హక్కులంటూ ఏమీ ఉండవు. వారలా భ్రమిస్తే
అమాయకులకిందే లెక్క. అయితే.. వాస్తవాలు వెల్లడించినప్పుడు, అందులో తప్పులను సవరించుకునేందుకు వచ్చిన అవకాశంగా
భావించడం పాలకుల ధర్మం. ఉదాహరణకు విదేశాల్లో భారతీయుల సమస్యలపై జాతీయ మీడియా సంస్థలు రాసే కథనాలకు,
స్వయంగా విదేశాంగ మంత్రులే స్పందిస్తారు. దివంగత సుష్మాస్వరాజ్, అలాంటి ఎన్నో సమస్యలను పరిష్కరించారే తప్ప.. మీరు
కావాలని వారి సమస్యలను రాస్తున్నారని, ఏనాడూ మీడియాను నిందించలేదు. శపించలేదు. మీడియా వారి సమస్యలను
వెలుగులోకి తెచ్చినందుకే, ప్రవాస భారతీయుల సమస్యలు పరిష్కారం అయ్యాయి.

ఢిల్లీ బాధితులపై కేసీఆర్ సానుకూల స్పందన

ఉదాహరణకు ఢిల్లీలో చిక్కుకుపోయిన తెలుగువారి కష్టాల గురించి, ఇదే మీడియా వెలుగులోకి తెచ్చింది. ఆంధ్రజ్యోతి కూడా వారి కష్టాలు వెలుగులోకి తెచ్చింది కదా? అప్పుడు ఏపీ క ంటే ముందుగా స్పందించి, వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు రంగంలోకి దిగింది తెలంగాణ ప్రభుత్వమే కదా? వలస కూలీల బాధల గురించి, మీడియా వెలుగులోకి తెచ్చిన తర్వాతనే కదా.. వారికి ప్రభుత్వ సహాయం పెంచింది? మరి ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఒక్క కరోనా గురించి రాసినప్పుడే, దానిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా,  ఎందుకు విచక్షణ కోల్పోతుందన్నది ప్రశ్న. మీడియా ప్రశ్నలు, కథనాలను సద్విమర్శలుగా స్వీకరించకుండా, అనవసర ప్రతిష్ఠకు వెళ్లడం తగదు. పాలకపక్షానికి సొంత మీడియాతోపాటు, ప్రగాఢంగా ప్రేమించి సహకరించే మరికొన్ని మీడియా ‘అనుబంధ’సంస్థలున్నందున.. వారి మాదిరిగానే, మిగిలిన మీడియా సంస్థలూ తన ఆలోచనల ప్రకారం నడవాలని అభిలషించడం ఆహ్వానించదగ్గది కాదు.  ‘అడ్డమైన రాతలు రాసేవారికి మాత్రమే’ హెచ్చరికలు చేస్తున్నానని చెప్పినప్పటికీ.. మిగిలిన మీడియా సంస్థలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పడమే,  కేసీఆర్ కవి హృదయం కామోసు!

మీడియా యాజమాన్యాలే దీనికి కారణమా?

అసలు మీడియా సంస్థలు ఎప్పుైడె తే విశ్వసనీయత కోల్పోయాయో, పత్రికాస్వేచ్ఛ జర్నలిస్టుల నుంచి యాజమాన్యాల చేతిలోకి
ఎప్పుడైతే వెళ్లిందో, అప్పుడే ఈ దురవస్థ మొదలయింది. దానికి కారణం పాలకుల ప్రాపకం, వ్యాపార ప్రయోజనాల కోసం
యాజమాన్యాలు దిగజారడమే.  ఇందిరాగాంధీ అంతటి నియంతను సవాల్ చేసి, నిలదొక్కుకున్న పత్రికలు ఆనాడు ఉండేవి.
ఇప్పుడు తమ వ్యాపార ప్రయోజనాల కోసం పాలకులకు సలహాదారులుగా, రాజగురువులుగా, అనుసంధానకర్తలుగా మారాలన్న
పోటీ, తాపత్రయమే కనిపిస్తోంది. ఒకరిని హత్య చేసేందుకు సుపారీ తీసుకున్నట్లు.. ఒక రాజకీయ పార్టీని మానసికంగా,
నైతికంగా దెబ్బతీసేందుకు మీడియా సంస్థలు, మరొకరి నుంచి తీసుకుంటున్న ఈ  ‘పొలిటికల్ సుపారీ’లే పత్రికాస్వామ్యాన్ని
భ్రష్ఠు పట్టిస్తున్నాయన్నది మనం మనుషులం అన్నంత నిజం. ఇందులో సర్య్కులేషన్, టీఆర్‌పీ రేటింగ్ వంటి స్థాయి బేధం
తప్ప, ఎవరూ మినహాయింపు కాదు.

రాధాకృష్ణ నాడు అలా.. నేడు ఇలా!

రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్ సర్కారును ఎదిరించి, నిలబడిన మీడియా సంస్థగా ఆంధ్రజ్యోతి కీర్తిప్రతిష్ఠలు సంపాదించింది. నిజంగా దానిని నడిపే రాధాకృష్ణకు మొండిధైర్యం ఎక్కువ. ఆ ఒక్క విషయంలో ఆయనను ఎవరైనా అభినందించి తీరాల్సిందే. ఆయన ఎవరితోనయినా పోరాడగలరు. ఎవరితోనయినా సర్దుకుపోగలరు. పోరాడిన వారితోనూ కలసి నడవగలరు. ఓ సందర్భంలో టీఆర్‌ఎస్ అధికార మీడియా ‘నమస్తే తెలంగాణ’ దానిపైనా, దాని యజమాని రాధాకృష్ణపైనా అనేక కథనాలు ప్రచురించింది. రాధాకృష్ణ కూడా తన సచ్చీలత,  నిజాయితీ గురించి ఆదివారం నాటి కాలమ్‌లో ఎదురుదాడి చేసేవారు. కానీ, కేసీఆర్ నిర్వహించిన ఆయత చండీయాగానికి హాజరైన తర్వాత.. అదే ఆంధ్రజ్యోతి వైఖరిలో పూర్తి మార్పు వచ్చింది. అది కేసీఆర్‌ను పొగిడే వరకూ వెళ్లింది. దాని దృష్టి బీజేపీ, నరేంద్రమోదీ పాలనపై మళ్లింది.

అది మొన్నటి ఎన్నికల ముందు, అంటే కాంగ్రెస్-తెలుగుదేశం కూటమి పోటీ చేసే ముందు వరకూ కొనసాగింది. మళ్లీ కేసీఆర్‌తో వైరం మొదటికే వచ్చి, ఇప్పటివరకూ కొనసాగుతోంది. మరి అదెంత కాలమో తెలియదు! గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ, నరేంద్రమోదీ సర్కారును దునుమాడిన వైనాన్ని, ఏపీ-తెలంగాణ బీజేపీ నేతలు అప్పుడే ఖండించారు. ఏపీ శాసనమండలిలో అయితే, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆంధ్రజ్యోతిపై, సభాహక్కుల తీర్మానం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అసలు బీజేపీతో కలసి నడిస్తే తెలుగుదేశం కూడా మునిగిపోతుందని, దేశవ్యాప్తంగా నరేంద్రమోదీ వ్యతిరేక పవనాలు వీస్తున్నందున, కమలంతో దోస్తీ కటీఫ్ చెప్పకపోతే తెలుగుదేశం కూడా మునిగిపోతుందని.. రాధాకృష్ణ తన వారాంతపు కాలమ్‌లో హితబోధ చేశారు. ఇప్పుడు మళ్లీ అదే ‘ఆంధ్రజ్యోతి’ మోదీ సర్కారును భుజానకెత్తుకోవడం, ఎన్నికల ముందు వ్యతిరేకించిన అదే అమిత్‌షాతో రాధాకృష్ణ భేటీలు వేయటం మరో వింత. ఎందుకీ అవసరార్ధ ‘అక్షర’రాయ‘బేర’ రాజకీయాలు? పాలకులకు మీడియా అంటే చులనక కావడానికి, విలువలేకుండా పోవడానికీ  ఇలాంటి అవకాశ, అవసరార్ధ చర్యలే కదా కారణం? కాదంటారా?!

3 COMMENTS

  1. […] కరోనా కేంద్రంగా  ఆంధ్రాలో అధికార-ప్రతిపక్షాల మధ్య మీడియా వారథిగా  రాజకీయ సమరం సాగుతోంది. అది చివరకు మైండ్‌గేమ్ దిశగా సాగుతోంది. ఏపీలో ఏ పార్టీకి అనుకూలంగా, కులాల వారీగా విడిపోయి చానెళ్లు నడుస్తున్నాయన్నది.. మనం మనుషులం అన్నం నిజం. దానితో సర్కారు అనుకూల మీడియా మినహా, దానిని వ్యతిరేకించే మీడియా సంస్థలు, సహజంగానే క్షేత్రస్థాయి వాస్తవాలు బయటపెడుతున్నాయి. దానిని అధికారంలో ఉన్న వారు జీర్ణించుకోలేకపోతున్నారన్నది నిజం! పోనీ నిజమేమిటో.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిరిగా, స్వయంగా సీఎం జగన్ గారినే అడిగి తెలుసుకోవాలనుకుంటే.. ఆయనేమో చేయవలసిన ప్రసంగం చేసేసి, స్టెనోకు చెప్పినట్లు.. చెప్పాల్సింది చెప్పేసి, కుర్చీ వెనక్కి నెట్టి వెళ్లిపోతారాయె! పోనీ రికార్డు చేసిన ఆ వీడియో ప్రసంగంలోనయినా స్పష్టత ఉందా అంటే, అందులోనూ నిమిషాలకు నిమిషాలు ఎడిట్ చేస్తున్నారాయె!! మరి నిజం చెప్పేదెవరు? వీటికి జవాబు క్షేత్ర స్థాయిలోనే కదా వచ్చేది? అదే పనిచేస్తున్న జర్నలిస్టులపై, ఈ కేసుల బనాయింపు ఎందుకన్నది మెడపై తల ఉన్న ఎవరికైనా వచ్చే ప్రశ్న! ఇది కూడా చదవండి.. మీడియా పై మరకలు మామూలే! […]