కమలదళాల డిమాండ్  తీర్చిన ఒవైసీ

476

తన ఆసుపత్రులను ఐసోలేషన్ మార్పునకు సై
ప్రధానిపై విమర్శలకు బండి సంజయ్, సంకినేని, రఘునందన్‌రావు  సవాల్
ఎట్టకేలకు అంగీకరించిన ఒవైసీ
       (మార్తి సుబ్రహ్మణ్యం)

కరోనాపై సమరానికి సంఘీభావ సూచికగా ప్రధాని నరేంద్రమోదీ ఇస్తున్న పిలుపును, ఎద్దేవా చేసిన మజ్లిస్ అధినేత అసదుద్దున్ ఒవైసీ.. ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీ నేతల డిమాండ్లను అమలు చేశారు. రాష్ట్రాలకు ఏమీ సాయం చేయకుండా చప్పట్లు కొట్టాలని, దీపాలు వెలిగించాలనడం ఏమిటని ఇటీవల అసద్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కాదు ఈ దేశం. ప్రధాని జిమ్మిక్కులు మానుకోవాలి. వలస కార్మికులు తిండీ తిప్పలు లేకుండా, కాలినడకన వెళుతుంటే వెలుగులు ఎక్కడ? ప్రధాని సాయంత్రం పూట టీవీల ముందుకు వస్తున్న ప్రతిసారీ  పేదలు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం సాయం చేస్తున్నారో చెప్పాలి. కరోనాను మతానికి ముడిపెట్టవద్దు. జమాత్ ప్రభుత్వాలకు సహకరిస్తోంది. ముస్లింలంతా ప్రభుత్వానికి సహకరిస్తా’రని ఒవైసీ చెప్పారు.

దానితో, తెలంగాణ కమలదళాలు ఆయనపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డాయి. తెలంగాణ  భాజపా దళపతి బండి సంజయ్, మాజీ అధ్యక్షుడు డాక్టర్ కోవా లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, అధికార ప్రతినిధి రఘునందన్‌రావు దీనిపై ఒవైసీని ఇరుకున పడే ప్రశ్నలు సంధించడం ఆసక్తి కలిగించింది. చివరకు ఏపీ భాజపా ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి కూడా ఒవైసీ ఆసుపత్రులు ఈ సమయంలో క్వారంటైన్లు, ఐసోలేషన్ వార్డులుగా ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.

ఒవైసీకి ముస్లిముల పట్ల నిజంగా అంత చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నట్టయితే.. పాతబస్తీలో ఉన్న తమ ఆసుపత్రులను, తన సొంత మతం వారి కోసం  క్వారంటైన్లు, ఐసోలేషన్‌వార్డులుగా ఎందుకు ప్రకటించలేదన్న ప్రశ్నాస్త్రాలు సంధించారు. నిజంగా అసద్‌కు మైనారిటీల పట్ల ప్రేమ ఉంటే, ముందు ఆపని చేయాలని చాలారోజుల క్రితమే సవాల్ విసిరారు.  రెండోసారి ప్రధానిని విమర్శించినప్పుడు కూడా బండి సంజయ్ ఇలాంటి సవాలే విసిరారు. పాతబస్తీలో వందలాది మంది మైనారిటీలు కరోనా బారిన పడుతుంటే, వారిని ఆదుకునేందుకు ఒవైసీ తమ ఆసుపత్రులను ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వడం లేదని సంజయ్ నిలదీశారు.  మైనారిటీలకు చెందిన కొన్ని వర్గాలు కూడా.. బీజేపీ నేతల డిమాండ్ సమంజసమేనని భావించడం ఓ విశేషం. బీజేపీ నేతల డిమాండ్‌పై చర్చ కూడా జరిగింది.

అయినప్పటికీ, మొన్నటి వరకూ దానిపై ఒవైసీ నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే హటాత్తుగా మంగళవారం ఒవైసీ చేసిన ట్వీట్.. బీజేపీ నేతల డిమాండ్ నెరవేరినట్టయింది. కరోనా అనుమానితులకు వైద్యం చేసేందుకు దక్కన్ మెడికల్ కాలేజీ, ఆస్రా, ఒవైసీ ఆసుపత్రుల సేవలు వాడుకోవాలని మంత్రి కేటీఆర్‌కు సూచించానని ఒవైసీ ట్వీట్ చేశారు. ‘ఒవైసీ కనీసం ఇన్నిరోజుల తర్వాయినా స్పందించడం మంచిదే. ప్రధానిని విమర్శించేముందు తామేం చేస్తున్నామో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ముందు మీ ఆసుపత్రులను రోగుల కోసం ఇవ్వమని మేం ఒక రాజకీయ పార్టీగా డిమాండ్ చేశాం. మా అధ్యక్షుడు బండి సంజయ్ సహా మేమంతా అందుకే సవాల్ చేశాం. ఒకవేళ మేం డిమాండ్ చేయకపోతే, అసద్ దాని గురించి ఇప్పటివరకూ ఆలోచించేవారు కాదేమో. ఈ కనువిప్పు ఆయనకు 18రోజుల క్రితమే కలిగి ఉంటే, వందలమంది రోగులకు ఊరట కలిగేద’ని భాజపా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే  సంకినేని వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. మొత్తానికి కమలదళాలు..  ఒవైసీ ఆసుపత్రుల విషయంలో చేసిన సవాళ్లు బాగానే పనిచేశాయి.

1 COMMENT

  1. […] భారతీయ జనతా పార్టీ తెలంగాణ దళపతిగా వచ్చిన ఎంపి సంజయ్‌కుమార్ ముందు రాష్ట్ర కమిటీ ఏర్పాటు సవాలుగా నిలిచింది. ఇప్పటివరకూ బీజేపై పడిన ‘హైదరాబాద్ పార్టీ’ ముద్రను తొలగించటం ఆయనకు పెద్ద సవాలు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకూ గ్రామీణ ప్రాంతాల నుంచి అధ్యక్షులయిన వారి సంఖ్య అత్యల్పం. తెలంగాణలో చెన్నమనేని విద్యాసాగర్‌రావు తర్వాత, మరెవరూ రాష్ట్ర అధ్యక్షులు కాలేకపోయారు. ఇంద్రసేనారెడ్డి అధ్యక్షుడయినప్పటికీ, ఆయన రాజకీయ నేపథ్యం కూడా హైదరాబాద్ జిల్లాలోని మలక్‌పేట నియోజకవర్గమే. మళ్లీ సుదీర్ఘ విరామానంతరం.. కరీంనగర్ జిల్లాకు చెందిన సాగర్జీ తర్వాత, అదే జిల్లా నుంచి బండి సంజయ్‌కుమార్‌కు పగ్గాలివ్వడం ద్వారా.. బీజేపీ గ్రామీణ ప్రాంతాల వారినీ గుర్తిస్తుందన్న సంకేత ం పంపింది. ఇది కూడా చదవండి.. కమలదళాల డిమాండ్  తీర్చిన ఒవైసీ […]